నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

19, ఏప్రిల్ 2013, శుక్రవారం

రామ రావణ జాతకాలు

ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రామ రావణ జాతకాలను ఒకసారి పరిశీలిద్దాం.

వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణం లో శ్రీరాముని జనన వివరాలనూ ఆ సమయంలో ఉన్న గ్రహ స్తితులనూ చక్కగా నిర్దుష్టంగా వివరించాడు.ఆ గ్రహస్తితులు కొన్నివేల ఏళ్ళకు గాని ఖగోళంలో రావు.నవీన సాఫ్ట్ వేర్ లు ఉపయోగించి ఆ గ్రహస్తితులు ఖగోళంలో ఎప్పుడు ఉన్నాయో చూస్తె ఆ సమయం BC 5000 ప్రాంతంలోనూ మళ్ళీ BC 7000 ప్రాంతం లోనూ కనిపిస్తున్నది.అంటే రామాయణకాలం ఈరెంటిలో ఏదో ఒకటి అయి ఉండవచ్చు.అయితే సాంప్రదాయ యుగాల లెక్కకూ ఈ లెక్కకూ పొంతన కుదరదు.'యుగం' అనే పదం యొక్క అర్ధాలు అనేకచోట్ల రకరకాలుగా ఇవ్వబడ్డాయి గనుకా,మహాయుగాలు వేరు,మామూలు యుగాలు వేరు గనుకా కొద్దిగా ఆలోచించి చూస్తె లెక్క సరిగానే సరిపోతుంది.స్వామి యుక్తేశ్వర్ గిరిగారు తన Holy science పుస్తకంలో ఇచ్చిన యుగాల లెక్కలు చాలావరకు శాస్త్రీయంగా ఉన్నట్లు కనిపిస్తుంది.ప్రస్తుతం మన ఉద్దేశ్యం యుగాల లెక్కలు చూడటం కాదుగనుక ఆ విషయం పక్కన ఉంచుదాం.

శ్రీరామచంద్రుని జాతకం అందరికీ తెలిసినదే.ఆయన జాతక చక్రంలోని గ్రహస్తితులు ఇలా ఉన్నాయి.


లగ్నం :కటకం,గురువు,చంద్రుడు.
రవి:మేషం
బుధుడు:వృషభం
కుజుడు:మకరం
శుక్రుడు:మీనం
శని:తుల
రాహుకేతువులు:ధనూ మిధునాలు 




రావణుని జాతకంలో గ్రహస్తితులు ఎలా ఉన్నాయో ఎవరికీ తెలియవు.వాల్మీకి మహర్షి కూడా ఆ వివరాలు ఎక్కడా ఇచ్చినట్లు కనిపించదు.కాని తమిళనాడులో కొంతమంది రావణుని జాతక చక్రాన్ని చూపిస్తారు.అలాగే ఉత్తరభారతదేశంలో కూడా కొంతమంది రావణుని పూజించే ప్రజలున్నారు.వారు అప్పట్లో లంకానగరం నుండి వచ్చి ఉత్తరభారతంలో స్తిరపడిన కుటుంబాల వారు.వారిప్పటికీ రావణుడినే వారి రాజుగా ఆరాధిస్తారు.వారి పండుగలు కూడా మిగతావారికంటే విభిన్నంగా ఉంటాయి.వారివద్ద కూడా రావణుని జాతకచక్రం లభిస్తుంది.పండిట్ గోపేష్ కుమార్ ఓజా గారిచ్చిన వివరాలను బట్టి రావణుని జాతకంలో గ్రహస్తితులు ఈ విధంగా ఉన్నాయి.

లగ్నం:మేషం,సూర్యుడు.
చంద్రుడు:కటకం 
కుజుడు:మకరం
బుధుడు:వృషభం 
గురువు:కటకం
శుక్రుడు:మీనం
వక్రశని:తుల
రాహుకేతులు:మిధున ధనుస్సులు


అవతార పురుషుల జాతకాలలో ఒక అంశం స్పష్టంగా కనిపిస్తుంది.వారి జాతకాలలోని నవగ్రహాలలో సాధ్యమైనన్ని గ్రహాలు ఉచ్ఛస్తితిలో ఉంటాయి.ఈ ఒక్క అంశాన్ని బట్టి అది భగవంతుని అవతారమా కాదా అన్న విషయం చెప్పవచ్చు.మనకు తెలిసిన మహాపురుషులలో ఒక్క శ్రీరామక్రిష్ణుని జాతకంలో మాత్రమే ఇటువంటి గ్రహస్తితులు కనిపిస్తాయి.కనుక ఆయన దైవం యొక్క అవతారం అన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. మనకు తెలిసిన మిగతా మహాపురుషుల జాతకాలలో ఈ స్తితులు లేవు.వారి భక్తులు అనుచరులు వారిని ఎంతో గొప్పగా దేవుని అవతారాలుగా భావించవచ్చు గాక,కాని వాస్తవం వేరుగా ఉంటుంది.చివరకు తమను తాము అవతారంగా ప్రకటించుకున్న మెహర్ బాబా,సత్యసాయిబాబాల జాతకాలలో కూడా అవతార పురుషుల స్థాయిని సూచించే గ్రహస్తితులు లేవు.


ఆ విషయం అలా ఉంచితే,ప్రస్తుత రామ రావణ జాతకాలు కరెక్టే అనుకుంటే వీటిల్లో కొన్ని విచిత్రమైన విషయాలు కనిపిస్తాయి.
  • ఇద్దరి జాతకాలలోనూ అయిదుగ్రహాలు ఉచ్ఛ స్తితిలో ఉన్నాయి.అవి-సూర్య,కుజ,గురు,శుక్ర,శనులు.
  • రావణుని జాతకం కూడా శ్రీరాముని జాతకం లాగే చాలా శక్తివంతంగా ఉన్నది.శ్రీరామునితో వైరం పెట్టుకునేవాడు అంతటి శక్తిశాలి అయి ఉండక తప్పదు.హనుమంతుడు లంకా నగరంలో ప్రవేశించి సభలో రావణుని చూచినప్పుడు అతని తేజస్సుకూ బలానికీ విభవానికీ  ముగ్డుడైనాడని రామాయణం అంటుంది.
  • గ్రహాలన్నీ దాదాపుగా ఇరువురికీ సమానమైన శక్తిలో ఉన్నాయి.
  • కుజుడు ఇద్దరి జాతకంలోనూ ఉచ్ఛ స్తితిలో ఉన్నాడు.వీరిద్దరూ యుద్దవిద్యలో సమఉజ్జీలే.రావణుడు కూడా శ్రీరామునివలె శస్త్రాస్త్ర విద్యలలో అజేయుడు.వరసంపన్నుడు.తపోబలం కలిగినవాడు.
  • కాని రాహుకేతువుల స్తితులు మాత్రం తారుమారు అయ్యాయి. రావణుని జాతకంలో రాహుకేతువులు ఉచ్ఛస్తితిలో ఉండగా శ్రీరామునికి అవి నీచస్తితిలో ఉన్నాయి.ఇదే అసలైన వింత. రాహుకేతువులు కాలస్వరూపాలు.అవి ఉచ్ఛస్తితిలో ఉంటె కాలం బాగా కలిసి వస్తుంది.లేకుంటే కలిసిరాక అనేక చిక్కులు చికాకులు పెడుతుంది.రావణుని జీవితం బతికినన్ని రోజులూ పట్టిందల్లా బంగారంగా నడిచింది.శ్రీరాముని జీవితం అంతా కష్టాలే.కనుక ఈ గ్రహస్తితి నిజమే కావచ్చు.
  • రావణునికి శని ఉచ్ఛస్తితిలో ఉన్నప్పటికీ వక్ర స్తితిలో ఉన్నాడు. ఇలాంటి వారి జాతకాలలో శని వారికి ముందుగా మహోన్నత స్తితిని ఇచ్చి తర్వాత ఒక్కసారిగా పతనం గావిస్తాడు.వారి ఉన్నతి కూడా వక్రమార్గంలో చేరుకున్నదే అయి ఉంటుంది.కాని శ్రీరాముని జాతకంలో అలా లేదు. అక్కడ శని వక్రస్తితి లేదు.కనుక ఆయన జీవితం అంతా ధర్మానుసారం గడిపాడు.కష్టాలు ఎదురైనా ధర్మాన్ని తప్పకుండా జీవితం సాగించాడు.
  • ఇకపోతే ముఖ్యమైన అంశం లగ్నం.రావణుని లగ్నం మేషం అయింది.లగ్నాధిపతి కుజుడు దశమంలో ఉచ్ఛస్తితివల్ల మహా భూమండలానికి రాజు అయ్యాడు.కాని అదంతా హింసతో సంపాదించాడు.మొండి పట్టుదలా,ఏది ఏమైనా తాననుకున్నది సాగాలనే అహమూ ఇక్కడ కనిపిస్తాయి.కుజుడు సోదరకారకుడు కనుక తన సోదరుడైన కుబేరుని చావగొట్టి లంకా నగరాన్ని ఆక్రమించాడు.
  • లగ్నంలో పంచమాదిపతి సూర్యుని ఉచ్ఛస్తితి వల్ల వేదవేదాన్గాలలో మహాపాండిత్యం వచ్చింది.రావణుడు జ్యోతిశ్శాస్త్రంలో మహాపండితుడు. ఆయన వ్రాసిన 'రావణసంహిత' అనే ఉద్గ్రంధం ఒకటి ఉన్నదని అంటారు గాని అది ప్రస్తుతం ఎక్కడా లభించడం లేదు.ఆ పేరుతో దొరికే పుస్తకాలు అసలైనవి కావు.నకిలీలు. 
  • శ్రీరాముని జాతకంలో లగ్నం కర్కాటకం అయింది.దశమంలో సూర్యుని ఉచ్ఛస్తితివల్ల పూర్వీకుల నుంచి వచ్చిన రాచరికం ఆయన్ను వరించింది.సూర్యుడు పితృకారకుడు కదా.అదీగాక ధర్మపరులైన చక్రవర్తుల వంశంలో పుట్టాడని దీనివల్ల సంకేతం ఉన్నది.
  • అంతేగాక లగ్నంలోని గజకేసరీ యోగం వల్ల దయార్ద్ర హృదయమూ క్షమాగుణమూ ధర్మతత్పరతా కనిపిస్తున్నాయి.
  • రావణుని జాతకంలో సప్తమాధిపతిగా శుక్రుడు ద్వాదశంలో ద్విస్వభావ రాశిలో ఉచ్ఛ స్తితివల్ల,లగ్నాదిపతికి ఉపచయస్తాన స్తితివల్లా కనిపించిన అందగత్తెనల్లా చెరపట్టి తెచ్చుకునేవాడు.చివరకు వావీవరసలు మరచి రంభను కూడా బలాత్కరించాడని,తత్ఫలితంగా శాపానికి గురయ్యాడనీ గాధ ఉన్నది.
  • శ్రీరాముని జాతకంలో సప్తమాధిపతి శని చతుర్దంలో ఉచ్ఛస్తితిలో ఉన్నాడు.గజకేసరీ యోగంలో ఉన్న లగ్నాదిపతికి కేంద్రస్థానంలో ఉన్నాడు.కనుక ధర్మం కోసం తనంతట తానుగా సంసారసుఖం వదులుకుని అడవుల పాలయ్యాడు.జీవితమంతా ధర్మం కోసం నానా కష్టాలు అనుభవించాడు.
  • శ్రీరామునికి బుధుడు లాభస్తానంలో ఉన్నాడు.కనుక ఆయన బుద్ధి పెడమార్గం పట్టలేదు.రావణుని లగ్నానికి బుధుడు మంచివాడు కాదు.పైగా మారక స్తానంలో ఉన్నాడు.కనుక పెడబుద్ధి ఎక్కువై చావు దాకా తెచ్చుకున్నాడు.
  • రావణునికి తృతీయంలోని రాహువు వల్ల శక్తివంతులైన క్రూరులైన సోదరులున్నారు.శ్రీరామునికి తృతీయాదిపతి లాభస్థానస్తితి వల్ల తనకు అనుకూలురైన మంచి సోదరులున్నారు.
  • రావణునికి పంచమాదిపతి సూర్యుడు లగ్నంలో ఉచ్ఛ స్తితివల్ల మహా పరాక్రమశాలి అయిన మేఘనాధుడు జన్మించాడు.శ్రీరామునికి పంచమాదిపతి కుజుని సప్తమ ఉచ్ఛస్తితివల్ల తేజోవంతులైన పుత్రులున్నప్పటికీ వారికి దూరంగా ఉండవలసి వచ్చింది.
  • రావణునికి లగ్నం ఉచ్ఛ సూర్యునితో కూడి శుక్ర బుధుల చేత అర్గళమై ఉన్నది. కుజ దృష్టిని కలిగి ఉన్నది.కనుక ఆయన మనస్సు అతికామం తోనూ,రాజసదర్పంతోనూ,అహంతోనూ,విద్యానైపుణ్యంతోనూ,మేధా సంపత్తితోనూ పదిరకాల దారులలో లాగబడుతూ అనుక్షణం సతమత మయ్యేది.అందుకే బహుశా ఆయనకు దశకంటుడు అని పేరొచ్చింది. శ్రీరాముని లగ్నంలో అటువంటి బాధలేవీ లేకుండా గజకేసరీ యోగం వల్ల దయ,ధర్మం,సత్యసంధత మొదలైన సద్గుణాలతో నిండి ఉండేది.
ఇద్దరికీ దాదాపు ఒకే రకమైన గ్రహస్తితులున్నప్పటికీ స్వల్ప తేడాలవల్ల వీరిద్దరి జాతకాలలో ఎంత భిన్నత్వం వచ్చిందో పరిశీలిస్తే అద్భుతంగా ఉంటుంది.రావణుడు కూడా అన్నింట్లో శ్రీరామునితో సమఉజ్జీ అయినప్పటికీ ఆయనకున్న స్త్రీవ్యామోహం వల్ల పతనమయ్యాడు.శ్రీరాముని జాతకంలో ఇటువంటి దుర్గుణాలు కనిపించవు.ఈ కోణాలు వారివారి జాతకాలలో చక్కగా ప్రతిబింబిస్తున్నాయి. ఈ విధంగా రామరావణ జాతకాలు పరిశీలిస్తే అనేక ఆసక్తికర అంశాలు మనకు దర్శనమిస్తాయి.