Pages - Menu

Pages

23, ఏప్రిల్ 2013, మంగళవారం

రత్నగర్భ

మన దేశం రత్నగర్భ

అందుకే...
ఇక్కడ 
రత్నాల్లాంటి పసిపాపలక్కూడా  
గర్భాదానం అవుతుంది 

అందుకే... 
రత్నాలన్నీ 
మ్యూజియాల్లో చేరి 
రాళ్ళు మాత్రం 
సమాజంలో మిగిలాయి

మన దేశం 
అతి ప్రాచీనమైనది 
అందుకే...
ప్రాచీన అడివి మనుషులు 
ఎక్కడ చూచినా... 

ఆధ్యాత్మికం మన ప్రాణం 
అందుకే...
మాటల్లోనే గాని చేతల్లో 
ఎక్కడా కనబడదు 
ప్రాణం 

మన దేశం అగ్నిపునీత
అందుకే...
సత్యాన్నీ ధర్మాన్నీ 
సాంప్రదాయాన్నీ  
అగ్నిపాలు చేసి 
పాపాల పుట్టలా మారింది 

మన దేశం భరతమాత
అందుకే...
ప్రతి శకుంతలా 
జనారణ్యంలో పడి ఏడుస్తోంది 
ఎక్కడ చూచినా కాటేసి 
ముఖం చాటేసే దుష్యంతులే

మన దేశం ధరణీజాత  
అందుకే...
మట్టిలో పుట్టి 
మట్టిలో కలిసిపోయింది 
మౌనంగా రోదిస్తూ.. 

మనదేశం నర్తనశాల 
ఇక్కడ భీముళ్ళు లేరు 
అడుగడుగునా తుమ్మముళ్ళే 
అన్నీ చిక్కుముళ్ళే
అందరూ కీచకతమ్ముళ్ళే 

ఇక్కడ అవకాశం 
వెర్రితలలు వేస్తుంది 
అధికారం నిద్రపోతుంది 
అమాయకం బలౌతుంది 
అపరాధం రక్షించబడుతుంది 

ఇక్కడ ఎన్నెన్నో గుళ్ళు  
అడుగడుక్కీ మసీదులు చర్చిలు
ఎక్కడ చూచినా నీతులూ
ధర్మోపన్యాసాలు 
ఆచరణలో మాత్రం 
రాక్షసులూ పిశాచాలు 

తల్లి మంచిదే 
పిల్లలే 
కుక్కమూతిపిందెలు 
తల్లినే 
వీధిన నిలబెట్టి 
అమ్ముకునే తనయులు 

రత్నాల కోసం 
తల్లి గర్భాన్ని కూడా
ఛిద్రం చెయ్యడానికి 
వెనుదియ్యని 
జాతిరత్నాలు 

నిజమే 
ఇలాంటి వాళ్ళని కన్న
మన దేశం 
రత్నగర్భనే ...
కాదన్నదెవరు?