నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

16, ఏప్రిల్ 2013, మంగళవారం

మళ్ళీ వచ్చింది చేటుకాలం

ఎవరైనా కొద్దిగా పరిశీలనా శక్తి ఉన్నవారికి ఒక విషయం గోచరిస్తుంది.గత నాలుగైదు రోజుల ముందుకూ ఇప్పటికీ ప్రపంచ సంఘటనల తీరులో మార్పులు కనిపిస్తున్నాయి.ఎక్కడ చూచినా మళ్ళీ ప్రమాదాలు,ప్రాణ నష్టాలు,దుర్ఘటనలు ఎక్కువౌతున్నాయి.ఎందుకిలా జరుగుతున్నాయో ఎవరైనా ఆలోచించారా?

మనిషి జీవితంలోనైనా,సమాజంలోనైనా,కారణం లేకుండా ఏదీ జరగదు. ప్రపంచంలో కాకతాళీయం అంటూ ఏదీ లేదు.అన్నీ కార్యకారణ సంబంధంతో ముడిపడి ఉన్నవే.అసలు విషయం ఏమిటంటే, ప్రపంచాన్ని కలవరపరిచే చేటుకాలం ప్రస్తుతం మళ్ళీ మొదలైంది. అదేమిటో తెలియాలంటే ప్రస్తుతం ఖగోళంలో నడుస్తున్న ఒక చిన్న గ్రహస్తితిని గమనిస్తే చాలు.

ప్రస్తుతం రాహుశనులకు ఎదురుగా కుజకేతువుల స్తితి మొదలైంది.వీరికి తోడుగా శుక్రుడు సూర్యుడూ కూడా మేషరాశిలోనే ప్రస్తుతం ఉన్నారు.వీరిలో శుక్రుడు మొన్న 11 తేదీన మేషం లోకి ప్రవేశిస్తే కుజుడు 13 తేదీన మేషరాశిలోకి వచ్చాడు.శుక్రుడు మే నాల్గవ తేదీవరకూ మేషరాశిలో సంచరిస్తాడు.ఈ క్రమంలో ఈ నెల 28 న ఖచ్చితంగా కేతువుతో ఒకే డిగ్రీ మీదకు వస్తున్నాడు.25 న పౌర్ణమి అవుతున్నది.ఇకపోతే కుజుడు మే 23 వరకూ మేషరాశి సంచారం ఉంటుంది.ఈ క్రమంలో మే 12 న కుజకేతువుల ఖచ్చితమైన కంజంక్షన్ ఉన్నది.మే 9 న అమావాస్య వస్తున్నది.

ఇన్ని చెడు సమయాలు ఒకేసారి కలిసికట్టుగా దాడి చేసినట్లు రావడం వెనుక ఒక నిగూఢమైన విశ్వప్రణాళిక ఉన్నది.ఈ గ్రహస్తితులన్నీ గమనిస్తే కొన్ని విషయాలు అర్ధమౌతాయి. అవేమిటంటే,ప్రస్తుతం ప్రజలు ఎంతో శ్రద్ధగా పోగు చేసుకుంటున్న పాపకర్మని ప్రక్షాళన చేసే కార్యక్రమం మళ్ళీ మొదలైంది.గ్రహాలు అదే పనిలో ఇప్పుడు మళ్ళీ బిజీగా ఉన్నాయి.

ఏప్రియల్ 11 నుంచి మే 23 వరకూ ఉన్న దాదాపు నలభై రోజుల సమయం చాలా చెడు ప్రభావాన్ని కలిగి ఉండబోతున్నది.మామూలుగా రాహుశనుల కలయిక మంచిది కాదనీ ఇది శపితయోగమనీ ఇంతకు ముందే అనేక ఉదాహరణలతో నిరూపించాను.దీనికి సమానమైన ప్రభావం కలిగినదే కుజకేతువుల సంయోగం.దీనిని అతిశక్తి యోగం అని పిలవవచ్చు.అది కూడా ఖచ్చితంగా రాహుశనులకు సమసప్తకంలో ఉన్నదంటే అది సృష్టించే విధ్వంసం ఎలా ఉంటుందో ఊహించవచ్చు.

నాది ఉత్తఊహ కాదనీ చేదువాస్తవమేననీ చెప్పడానికి గత కొద్ది రోజులుగా జరుగుతున్న కొన్ని సంఘటనలు గమనిస్తే ఋజువౌతుంది.     

  • కుజుడు 13 తేదీన మేషరాశిలోకి ప్రవేశించి శుక్ర కేతువులతో కలవడం తోనే పాతతరపు మధురగాయకుడు పీబీ శ్రీనివాస్ హటాత్తుగా 14 తేదీన మరణించాడు.శుక్రుడు కళాకారులకు సూచకుడనీ,కుజ కేతువుల సంయోగం వల్ల హటాత్ సంఘటనలు ప్రమాదాలు జరుగుతాయనీ గుర్తుంటే ఈ సంఘటన ఎంత కరెక్ట్ గా జరిగిందో తెలుస్తుంది.భోజనానికి కూచోబోతూ ఆయన 'హటాత్తుగా' చనిపోయాడు. 
  • ఈరోజున పాకిస్తాన్ ఇరాన్ సరిహద్దులో భూకంపం వచ్చి ప్రాణనష్టం జరిగింది.మేషరాశి పాకిస్తాన్ కు సూచిక అని గుర్తుంటే ఇప్పుడు ఇదెందుకు జరిగిందో అదికూడా మంగళవారం నాడు ఎందుకు జరిగిందో అర్ధమౌతుంది.మంగళవారం అంగారకుని ఆధీనంలో ఉంటుంది.ప్రస్తుతం మేషరాశిలో నాలుగు గ్రహాలు శపితయోగ పరిధిలో ఉన్నాయి.
  • ఈ భూకంప ప్రకంపనలు మన దేశాన్ని కూడా ఉత్తరదేశంలో తాకాయి.మన దేశసూచికలైన మకర,వృషభాలకు మేషరాశి చతుర్ధ ద్వాదశ స్థానాలలో ఉన్నదని గమనిస్తే ఇదెందుకు జరిగిందో తెలుస్తుంది. అంగారకునికి భూమిపుత్రుడని పేరున్నది.భూమికి కారకగ్రహం కుజుడే. కుజశనుల పరస్పర దృష్టివల్ల భూకంపాలొస్తాయ న్నది ఎన్నోసార్లు రుజువైన జ్యోతిషసూత్రం.  
  •  బోస్టన్ బాంబు పేలుళ్ళలో ఎంతమంది చనిపోయారో ఎంతమంది గాయపడ్డారో పేపర్లు టీవీలు చెబుతున్నాయి.మళ్ళీ నేను చెప్పక్కర్లేదు.అది కూడా క్రీడల సందర్భంగా జరగడమూ క్రీడలు కుజుని అధీనంలో ఉంటాయనీ గుర్తిస్తే విషయం అర్ధమై చక్కని క్లారిటీ వస్తుంది.
  • ఇదే గాక ప్రముఖులైన మార్గరెట్ దాచర్,ఆర్పీ గోయెంకా మొదలైన దిగ్గజాలు ఇదే సమయంలో చనిపోయారు.వీరిద్దరూ మహామొండి మనుషులనీ,ఈ గుణం కుజుని లక్షణాలలో ఒకటనీ కూడా గుర్తించాలి.
  • చివరిగా బంగారం వెండీ ధరలు ఒక్కసారి పడిపోవడం కూడా ఇదే గ్రహ ప్రభావం అంటే కొందరికి నవ్వు రావచ్చు.కాని ఇది సత్యం.విలువైన లోహాలకు కారకుడైన శుక్రుడు కేతుగ్రస్తుడు కావడమూ,శపితయోగ పరిధిలోకి ప్రవేశించడమే దీని వెనుక ఉన్న అసలైన కారణం.
  • ఇక చెదురుమదురుగా ప్రతిచోటా జరుగుతున్న ప్రాణ నష్టం గురించీ దుర్ఘటనల గురించీ నేను చెప్పదలుచుకోలేదు.ఎక్కడ చూచినా రాబోయే నలభై రోజులలో అంతా విధ్వంసమే ఉంటుంది.
  • ముందు ముందు ఇంకా ఎన్నో ప్రమాదకర సంఘటనలు తప్పకుండా జరుగుతాయి.ప్రస్తుతం సూర్యుడు ఉచ్ఛస్తితిలో ఉన్నాడు గనుక కేతువుతో కలిశాడు గనుక ప్రముఖులైన వాళ్ళు ఇంకా కొంతమంది మరణిస్తారు.వాళ్ళు రాజకీయ ప్రముఖులు కావచ్చు.సినీ ప్రముఖులూ,వ్యాపార ప్రముఖులూ కావచ్చు.
  • అలాగే ఈ సమయంలో విమాన ప్రమాదాలూ,వాహన ప్రమాదాలూ,అగ్ని ప్రమాదాలూ ఖచ్చితంగా జరుగుతాయి.
  • ఈ సమయంలో రాజకీయ పరిస్తితులు కూడా గందరగోళం అవుతాయి.
ఈ నలభైరోజుల వ్యవధిలో ముఖ్యమైన ప్రమాద సమయాలు కొన్ని గమనిద్దాం.
  • ఈ నెల 21,22 తేదీలు.
  • ఈనెల 25 వస్తున్న పౌర్ణమి.
  • ఈనెల 28,30 తేదీలు.
  • మే 6.
  • మే 9 నుంచి 14 వరకు.
ఈ రోజుల్లో ఖచ్చితంగా ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం ఉంటుంది.మొండితనం గా వ్యవహరించేవారికీ,పట్టుదలలకు పోయేవారికీ, దురహంకారులకూ, ఆకతాయిలకూ ఈ సమయంలో యాక్సిడెంట్లు,దెబ్బలు తగలడం,కాళ్ళు చేతులు విరగడం,ఆస్పత్రి పాలు గావడం జరుగుతుంది.మరీ చెడు దశలు జరుగుతున్న వారికి ప్రాణాలు కూడా పోవచ్చు.ముఖ్యంగా రోడ్లమీద కార్లలో దూర ప్రయాణాలు చేసేవారు,రాత్రి ప్రయాణాలు చేసేవారు,రాత్రిళ్ళు ఎక్కువ దూరం డ్రైవింగ్ చేసేవారు,రాష్ డ్రైవింగ్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

అయితే ఏప్రియల్ 30 వరకూ గురువు నవాంశలో ఉచ్ఛస్తితివల్ల దైవ బలం ఉన్నవారికి మాత్రం కొంత రక్షణా ఊరటా ఉంటాయి.కాని ఆ తర్వాత మాత్రం గురు అనుగ్రహం తొలగిపోతుంది.

తెలివైన వారు జాగ్రత్తగా ఉండి,మంచి మాటలు విని,పద్దతులు మార్చుకుని,పరిహారాలు పాటించి,ప్రమాదాలనుంచి తప్పుకుంటారు.కాని అహంకారులు మాత్రం అన్నీ తమకే తెలుసనీ విర్రవీగుతూ దేన్నీ లెక్క చెయ్యకుండా ముందుకు దూసుకెళ్ళి ప్రమాదంలో పడతారు.ఇది ఖచ్చితంగా జరగడాన్ని రాబోయే నలభైరోజుల్లో చూడవచ్చు.కర్మప్రక్షాళణా సమయం మళ్ళీ వచ్చింది.కుజ శని రాహు గ్రహాల వేటలో ఎంతమంది బలి కానున్నారో ముందు ముందు చూద్దాం.

తస్మాత్ జాగ్రత.