Pages - Menu

Pages

13, మే 2013, సోమవారం

దిష్టిమేకలు

ఈ మధ్య ఒక మంత్రివర్యులు తమ మీదకు ముంచుకొచ్చిన ఒక ఆపదను తప్పుకోడానికి దిష్టిమేకను బలిచ్చారని విన్నాం.ఈ సంఘటన నిజమో కాదో మనకు తెలియదు.కాని చాలామంది ఉన్నతాధికారులకు, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారికి ఇలాంటి మూఢ నమ్మకాలుంటాయన్నది మాత్రం నిజం.కాకపోతే వారిలో చాలామంది కుహనా స్వాముల,కుహనా జ్యోతిష్కుల మాటలనే నమ్ముతారు.దానికి కారణం వారి స్వార్ధం.అసలైన రేమేడీలు చెప్పేవారు వీరికి నచ్చరు.

పరిహారాల ద్వారా చెడుకర్మను పోగొట్టుకోవచ్చు అన్నది నిజమే.దీనికి శాస్త్ర ప్రమాణం ఉన్నది.కర్మ ఉన్నప్పుడు దానికి ప్రతికర్మ కూడా ఉంటుంది.న్యూటన్ సిద్ధాంతం అదే.కాని ఈ విషయం చాలామందికి సరిగ్గా అర్ధం కాదు.అర్ధం చేసుకుంటే వారివారి వ్యాపారాలు సాగవు కనుక అర్ధం కానట్లు నటిస్తారు.లేదా వారికి తగిన మాయమాటలు చెప్పేవారినే నమ్ముతారు.ఎందుకంటే పద్దతి మార్చుకోమని చెప్పేవారు మనకు నచ్చరు.మన తీరులో మనం కొనసాగుతూ ఉండాలి.మన పనులు చేసిపెట్టే స్వామీజీనో,జ్యోతిష్కుడో మాత్రం మనకు దొరకాలి.ఇదీ మనుషుల వరస. అందుకే లోకం ఇంత దరిద్రంగా ఉన్నది.

పరిహారక్రియలనేవి చేసిన తప్పుకు సిగ్గుపడి పశ్చాత్తాపపడి ఆ పాపాన్ని కడుక్కోవాలని ప్రయత్నించే వారికోసం గాని, అదే తప్పును మళ్ళీమళ్ళీ చేస్తూ ఆ పాపఫలం నుంచి మాత్రం తప్పుకోవాలని చూచేవారికోసం కాదు. అలాంటి వారికి ఆ పాపం వదలకపోగా,పరిహార క్రియలు చెప్పిన  జ్యోతిష్కుడికి కూడా అంటుకుంటుంది.కనుక పరిహారాలనేవి తెలీని మనుషులకు చెప్పరాదు.

నీ పధ్ధతి బాగాలేదు.దానిని ముందు మార్చుకొని సక్రమమైన దారిలో నడవమని ఏ జ్యోతిష్కుడైనా చెబితే అతన్ని చేతగానివాడిగా చూచే లోకం ఇది.అసలు అలా చెప్పే జ్యోతిష్కులు కూడా ప్రస్తుతం మైనారిటీ వర్గంగా ఉన్నారు.ఎవడు ఏ వెధవపని చేసినా ఆ పని సక్సెస్ అయ్యే మార్గం వరకూ చెప్పేవాడే ప్రస్తుతం కరెక్ట్. అంతేగాని ఆ పనిని విమర్శించేవాడూ దానిని సరిదిద్దేవాడూ ప్రస్తుతం ఎవరికీ అవసరం లేదు.ఇదంతా కర్మప్రభావం. అనుభవకాలం ముందున్నపుడు మంచి మాటలు ఎక్కవని పెద్దలు ఊరకే అనలేదు కదా మరి.

మనం చేసిన కర్మ తీరడానికి ఏదో ఒక మూగజీవిని బలివ్వడం అనేది ఒక తప్పుడు విధానం.అవి నిస్సహాయ స్తితిలో ఉన్నాయి గనుక మనం వాటిని పట్టుకొని చంపి బలిస్తున్నాం.అదే అవి మనల్ని పట్టుకుంటే అప్పుడు వాటి అవసరాలకు మనల్ని కూడా అలాగే బలిస్తాయేమో? 

నరమాంస భక్షకులను ఆటవికులుగా రాక్షసులుగా మనం భావిస్తాం.జంతుమాంస భక్షకులను జంతువులు ఎలా భావిస్తాయో ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? మాంసం విషయంలో జంతువుకూ మనిషికీ ఏమిటి తేడా? 

అసలు ఒకరు చేసిన తప్పుకు ఇంకొకరిని బలిచేయడం అనేది స్వార్ధానికి పరాకాష్టగా చెప్పాలి.అలాంటి స్వార్ధపరులకు సలహాలిచ్చే జ్యోతిష్కులు తాంత్రికులకు కూడా భయంకరమైన చెడుకర్మ చుట్టుకుంటుంది.దాని ప్రభావం వెంటనే కనిపించకపోవచ్చు.వారి జీవితంలో ఏదో ఒక రోజున మాత్రం అది ఖచ్చితంగా కనిపిస్తుంది.అందుకనే ఇటువంటి సలహాలిచ్చి, అటువంటి రేమేడీలు చేయించే జ్యోతిష్కుల తాంత్రికుల కుటుంబాలలో (వారికి కుటుంబం అంటూ ఉంటే) ఏదో ఒక దారుణమైన శాపం పట్టి తరతరాలుగా పీడిస్తూ ఉంటుంది.

యజ్ఞయాగాలలో జంతుబలి ఉంటుందని వాటిని అనేకమంది విమర్శిస్తారు.కాని మాంసం తినడం కోసం అదే జంతువులను దారుణంగా చంపడాన్ని మాత్రం వారు ఏమీ అనరు.ఇది ద్వంద్వ నీతి కాకపోతే మరేమిటి?

జిహ్వ చాపల్యానికి ఒక జంతువును చంపి దాని మాంసం తినేవ్యక్తికీ పిశాచానికీ తేడా ఏముంది? దెయ్యాలూ పిశాచాలూ కూడా ఇలాగే మనుషులను పీక్కు తింటాయి.మనుషులు జంతువులను పీక్కు తింటున్నారు.పిశాచాలకూ మనుషులకూ ఇక తేడా ఏముంది?

ఒకరేమో తమ పనులు అవడం కోసమో,తాము చేసిన తప్పు నుండి తప్పుకోవడం కోసమో జంతువులను బలిస్తున్నారు.ఇంకొకరేమో దాని మాంసం తినడం కోసం జంతువులను చంపుతున్నారు.ఎలా అయినా బలి అవుతున్నది మాత్రం మూగజీవాలే.వాటికీ సంఘాలూ,యూనియన్లూ ఉంటే,వాటికి భావవ్యక్తీకరణ ఉంటే మనుషుల్ని ఎంత దరిద్రమైన భాషలో తిట్టేవో?

మొన్నొక రోజున మార్కాపురం అనే ఊరిలో పోతూ ఉండగా యధాలాపంగా ఒక హోటల్ బోర్డు వైపు చూచాను.మామూలుగా కనిపించే చికెన్ ఫ్రై,మటన్ ఫ్రై మొదలైన వాటితో బాటు 'తలకాయ ఫ్రై', 'నెత్తురు ఫ్రై' అంటూ కొన్ని రాక్షసపదాలు ఆబోర్డ్ మీద కనిపించాయి. అదేంటి? అని పక్కనున్న వారిని అడిగాను.దానికి వారిచ్చిన జవాబు నన్ను నిశ్చేష్టున్ని చేసింది. జంతువును చంపినపుడు కారిన రక్తాన్ని ఒక గిన్నెలో పట్టి దానిని బాండీలో పోసి ఉడకబెడతారట.అప్పుడా రక్తం గట్టిపడి హల్వాలాగా అవుతుందట. దానిని స్పూన్ తో తింటారట.ఇదంతా వింటుంటే అప్పుడే టిఫిన్ చేసి వస్తున్నామేమో కడుపులో తిప్పి భళ్ళున వాంతి అయినంత పనైంది. అసలు 'మనిషి' అన్న పదంతో పిలిపించుకోడానికి  మనుషులకు అర్హత ఉందా అని నాకు అనుమానం కలిగింది.

జంతుమాసం తినాలన్న కోరికను చంపుకోలేక దానికి 'బలి' అనీ 'పరిహారం' అనీ ఏవేవో పేర్లు పెట్టి పబ్బం గడుపుకుంటాడు స్వార్ధపరుడైన మానవుడు. తను తిన్నది చాలక దేవుడికి కూడా బలి అంటే ఇష్టం అని అబద్దాలు చెప్పి దేవుళ్ళకూ మూగజీవాలను బలిస్తుంటారు మూర్ఖులైన మనుషులు.మనిషి స్వార్ధానికి అంతు లేదేమో అని అనిపిస్తుంది.

ఒక జీవిని మనం చంపినపుడు దాని చేతిలో మనం ఎప్పుడో ఒకప్పుడు బలి కాక తప్పదు.ఇది సృష్టి ధర్మం. దీనిని గ్రహించినవారు జిహ్వ చాపల్యం కోసం ఇంకొక జీవిని చంపరు.దాని మాంసం తినరు.కొంతమంది అతితెలివి ఉన్నవారు ఇంకోలా వాదించవచ్చు.'ఏమో? ఇంతకు ముందు జన్మలో ఈ జంతువులన్నీ నన్ను చంపి ఉంటాయి.అందుకే ఇప్పుడు నా చేతిలో చస్తున్నాయి'. అది నిజం అయితే బాగానే ఉంటుంది.కాని ఒకవేళ అలా కాకుండా ఇప్పుడు నువ్వు చేస్తున్నదే కొత్త కర్మ అయితే మాత్రం వచ్చే ఎన్నో జన్మలలో నీవు ఆయా జంతువుల చేతిలో చావక తప్పదు.ఒకవేళ అదే నిజం అయితే అదెంత భయంకరంగా ఉంటుంది? కోళ్ళను తినేవారు వచ్చే ఎన్నో జన్మల్లో మట్టిలో పాకే పురుగులుగా పుట్టి ఆ కోళ్ళ చేత తినబడతారన్న విషయం వారికి తెలుసో లేదో మరి? ఎందుకంటే ప్రకృతి దృష్టిలో ప్రాణం ఒకటే.అది మనిషి ప్రాణమైనా జంతువు ప్రాణం అయినా ప్రకృతి దృష్టిలో భేదం లేదు.క్రియకు ప్రతిక్రియ చూపడమే ప్రకృతికి తెలిసిన ధర్మం.

ఇంకొంతమంది ఇలా అనుకుంటారు.'కర్మసిద్ధాంతం అంతా మిధ్య.ముందేం జరుగుతుందో ఎవరు చూడొచ్చారు? ప్రస్తుతం ఏదో ఒకటి చేసి హాయిగా ఉందాం. తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు'.ప్రస్తుతానికి అలాగే అనిపిస్తుంది.కాని బాధలు పడేటప్పుడు అలా ఉండదు.కాలం కలిసిరాక బాధలు పడేటప్పుడు ఎవరూ ఇదే లాజిక్ ఉపయోగించరు.అప్పుడు కూడా-'ప్రస్తుతానికి హాయిగా బాధలు పడదాం.ముందేం జరుగుతుందో ఎవరు చూడొచ్చారు? ప్రస్తుతానికి ఎంచక్కా బాధలు అనుభవిద్దాం'.-అని మాత్రం ఎవరూ అనుకోరు.అదే విచిత్రం. 

ఏదేమైనా మనుషులు ఒకరు చెబితే వినరు అన్నది నిజం.వారంతట వారికి అనుభవం అయితే తప్ప ఎవరికీ ఏ విషయమూ అర్ధంకాదు.కాని అప్పటికే చాలాసార్లు సమయం మించిపోయి ఉంటుంది.అదే సృష్టి విచిత్రాలలో ఒకటి.ఎవరి ఖర్మను వారు అనుభవించక తప్పదు అన్నది సత్యం.అందుకే ఒకరి సంతోషంలోగాని ఒకరి బాధలోగాని మనం కల్పించుకోవడం అనవసరం అనేది విజ్ఞుల అభిప్రాయం.

'తెలివైనవాడు ఎదుటివాడి బాధలు చూచి తాను ముందే జాగ్రత్త పడతాడు. మధ్యరకం మనిషి ఒకసారి బొక్కబోర్లా పడ్డాక రెండోసారి జాగ్రత్త పడతాడు.మూర్ఖుడు మాత్రం ఎన్నిసార్లు గుణపాఠం జరిగినా ఎన్నటికీ బుద్ధి తెచ్చుకోడు' -అంటాడు కన్ఫ్యూషియస్.