Pages - Menu

Pages

15, మే 2013, బుధవారం

సెక్స్ స్కాండల్స్ - రాహు కుజ శుక్రుల పాత్ర

భారత నేవీలో భార్యలను మార్చుకునే తతంగం (వైఫ్ స్వాపింగ్) నడుస్తోంది రక్షించమంటూ నేవీ అధికారుల భార్యలు న్యాయం కోసం పోరాడటం బయటకి వింతగా కనిపించినా,ఇలాంటివి హైసొసైటీ సర్కిళ్లలో కొన్నిచోట్ల సర్వ సాధారణమని చాలా ఏళ్ళనుంచీ వార్తలున్నాయి.కొన్నికొన్ని హై సర్కిళ్లలో జాకెట్ల పండుగలు జరుగుతాయని నేను ఇరవైఏళ్ళ క్రితమే చాలా నికార్సైన సమాచారాన్ని,అందులో పాల్గొన్న వ్యక్తి నుంచే విన్నాను.

తన సహచర అధికారులతోనూ ఉన్నత అధికారులతోనూ గడపమంటూ తన భర్తే తనను హింసిస్తున్నాడని ఒక యువతి మొరపెట్టుకోవడంతో ఈ ఉదంతాలన్నీ ఒకటొకటీ బయటకొస్తున్నాయి.వైశాఖపాడ్యమి గురించి నేను వ్రాసిన పోస్ట్ లో మహిళల పైన ఇలాంటి దురాగతాలు ఇంకా జరుగుతాయని వ్రాశాను.అవి ప్రతిరోజూ నిజం అవుతూ ఉండటం చూడవచ్చు.

భారతసమాజం బయటకి కనిపించేటంత మంచిదేమీ కాదు.ఇదొక కుళ్ళి పోయిన మేడిపండు.ఇక్కడ ఆడవారినీ మంచివాళ్ళని చెప్పలేం.మగవారినీ మంచివాళ్ళని చెప్పలేం.అలాగని చెడ్డవారనీ చెప్పలేం.కాకపోతే నీతులు చెప్పేవారందరూ నీతులు ఆచరించరన్నది నగ్నసత్యం.నీతులు చెప్పనివారిలో చాలామంది వాటిని ఆచరించేవారు ఉంటారన్నదీ నిజమే. బయటకు చాలా పద్దతిగా కనిపించే వారిలోకూడా చాలా లొసుగులు ముఖ్యంగా సెక్స్ విషయంలో ఉంటాయన్నది కూడా సత్యమే.అంత మాత్రం చేత వారందరినీ పూర్తిగా చెడ్డవారుగా ముద్రవెయ్యడం కూడా శుద్ధతప్పు అన్నదీ మళ్ళీ నిజమే.మన సమాజంలో ఇదమిద్ధంగా దేన్నీ ఖచ్చితంగా నిర్ధారించి 'ఇదీ' అంటూ చెప్పలేం.అందుకేనేమో వైవిధ్యాన్ని చూడాలంటే ఇండియా రండి అంటూ విదేశీ విద్యార్ధులను ఒక మంత్రిగారు ఆహ్వానిస్తున్నారు.

మన సమాజం ఒక 'సెక్సువల్లీ రిప్రేస్ద్ సొసైటీ' అని సైకాలజిష్టులూ సామాజిక శాస్త్రవేత్తలూ ఎప్పుడో తేల్చి పడేశారు. మన దేశంలో టూరిజం కోసం వచ్చిన విదేశీ టూరిస్టులకు ఆయా దేశాలు ఎలాంటి జాగ్రత్తలు చెబుతాయో మనం తెలుసుకుంటే సిగ్గుతో చచ్చిపోతాం.ప్రపంచదేశాల దృష్టిలో మన ఇమేజి ఇంత బాగుందా అని.

నేనొక సారి ఒక రైల్లో ప్రయాణిస్తున్నాను. నా ఎదురుగా ఒక విదేశీ జంట కూచుని ఉన్నారు.అందులో అమ్మాయి ఒక నిక్కరు వేసుకుని ఉన్నది.కాని కాళ్ళు కనిపించకుండా దుప్పటి ఒకటి కప్పుకుని కూచుని ఉన్నది. ఏసీ  కోచ్ అయినా పెద్దచలిగా ఏమీ లేదు.చాలాసేపటి ప్రయాణంలో మేం స్నేహితులమయ్యాం.ఆ చనువుతో ఆమెను ఒక ప్రశ్న అడిగాను. 

'మీరేం అనుకోకపోతే ఒక మాట అడుగుతాను? మీరెందుకు అలా దుప్పటి కప్పుకున్నారు? మీరు మామూలుగా అలా చెయ్యరు కదా?'

దానికి ఆ అమ్మాయి నవ్వి ఇలా చెప్పింది.

'నిజమే.ఇలా చెయ్యడం మా అలవాటు కాదు.కాని ఏం చెయ్యను?మీ ఇండియన్స్ అసహ్యంగా 'స్టేరింగ్' చేస్తారు. ప్రతివాడూ జన్మలో ఎప్పుడూ  కాళ్ళను చూడనట్లు గుడ్లప్పగించి అలా నావైపు చూస్తూనే ఉన్నాడు.మేం కేరళ నుంచి డిల్లీ వెళుతున్నాం.ఎన్ని గంటలు ప్రయాణం చెయ్యాలో చూడండి? ఈ హింస భరించలేక ఇలా దుప్పటి కప్పుకుని కూచున్నాను'

ఆ అమ్మాయి చెప్పింది నిజమే. ఆ కోచ్ లో చాలామంది పనున్నా లేకున్నా అటూఇటూ మా పైనుంచి ఊరకే తిరగడమూ,మాటిమాటికీ అటూఇటూ పోతూ ఆ అమ్మాయిని గుడ్లప్పగించి చూడటమూ నేనూ గమనించాను. తను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నట్లయితే ఆమె గతి ఏమయ్యేదో అని నాకనిపించింది.

'ఆడది అర్ధరాత్రి పూట ఒంటరిగా ధైర్యంగా నడవగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు' అని గాంధీ భావించారు. నడవడం వరకూ బాగానే ఉంది.కాని ఆ తర్వాత ఏమి జరుగుతుందన్నదే ప్రశ్న. ఆ అమ్మాయి అదృష్టం బాగుంటే ఆమె శవం బంధువులకు దొరుకుతుంది.లేకుంటే అదీ దొరకదు. ఈ మధ్య ఒక కొ-ఎడ్ కాలేజీ ప్రిన్సిపల్ కొందరు అమ్మాయిల తల్లిదండ్రులతో ఇలా అన్నాడు. 'మీ అమ్మాయిలను డిల్లీలో జరుగుతున్న ఫలానా సెమినార్ కు పంపారంటే వాళ్ళు కన్యలుగా తిరిగి వస్తారని నేను గ్యారంటీ ఇవ్వలేను.తర్వాత మీ ఇష్టం.' ఇది విన్న తర్వాత కూడా కొందరు అమ్మాయిలు పట్టుబట్టి ఆ టూర్ కు వెళ్లి వచ్చారు.తల్లి దండ్రులూ ఒప్పుకుని పంపించారు. నేను నిజాలే వ్రాస్తున్నాను.ఏమీ ఎగ్జాగరేట్ చెయ్యడం లేదు.

అమ్మాయిలను సప్లై చేసి కాంట్రాక్టులు సాధించుకున్న కాంట్రాక్టర్లు కొందరు నాకు తెలుసు. తన భార్యను ఇతరులతో గడపమని ప్రోత్సహించే భర్తలు కూడా కొందరు నాకు తెలుసు.తమ భార్యలను తీసికెళ్ళి ఇతరులకు అప్పగించే భర్తలు కూడా నాకు తెలుసు.ఆ భార్యలు కూడా ఆ విషయాన్ని అదేదో పెద్ద తప్పుగా ఏమీ భావించరు. వాళ్ళ ఆలోచనా విధానాలు వేరు.మళ్ళీ వాళ్ళను 'పతిత' అనో 'తిరుగుబోతు' అనో అంటే అదొక పెద్ద పొరపాటు అవుతుంది. మామూలు మనుషులకంటే చాలాసార్లు వాళ్ళలో ఎంతో మంచితనం ఉంటుంది.అలాంటి వారిలో ఇతరమైన ఉన్నత వ్యక్తిత్వవిలువలు ఉండటం నేను చాలాసార్లు గమనించాను.

భర్తకు ఇతర ఆడవాళ్ళతో సంబంధాలున్నాయని తెలిసినా నోరుమూసుకుని ఉండే భార్యలు చాలామంది పాతకాలంలో ఉండేవారు. ఇప్పుడు తమ భార్యలకు ఇతర సంబంధాలున్నాయని తెల్సినా కిమ్మనకుండా ఊరుకుంటున్న భర్తలుకూడా చాలామంది ఉండటాన్ని చూస్తున్నాం. 'పెళ్ళికాకముందు తను ఎలా ఉందో నాకనవసరం.ఇప్పుడు సరిగ్గా ఉంటె చాలు' అని నేటి తరం యువకులు చాలామంది భావిస్తున్నారు.కొన్ని చోట్ల ఇంకొక అడుగు ముందుకేసి,ఇద్దరికీ ఇతర సంబంధాలున్నా కలిసిమెలిసి సంసారం చేస్తున్న మోడరన్ జంటలనూ నేడు మనం చూస్తున్నాం. ఇవన్నీ,దిగజారుతున్న విలువలనుకోవాలా,లేక మారుతున్న ఆలోచనా ధోరణులనుకోవాలా,లేక విశాలహృదయాలనుకోవాలా,లేక బీటలు వారుతున్న సమాజపు గోడలనుకోవాలా మనకు తెలియదు. 

ఇరవై అయిదేళ్ళ ఏళ్ళ క్రితం నాకొక స్నేహితుడు ఉండేవాడు.అతనొకరోజున పూటుగా తాగి వాంతి చేసుకుని అందులోనే పడి దొర్లి స్పృహ తెలీని స్తితిలో ఉన్నాడు. అతని భార్య ముక్కు మూసుకుని బయటకు వచ్చి బంధువుల ఇళ్ళకు వెళ్ళిపోయింది.ఆ ఇంటి పక్కనే ఒక యువతి ఉండేది. ఆమె అప్పట్లోనే బాంబే వెళ్లి నెలా రెన్నెళ్ళు ఉండి మళ్ళీ తిరిగి వస్తూ ఉండేది.ఆమె అక్కడ ఏమి చేసేదో అందరూ చెప్పుకుని చెవులు కొరుక్కునేవారు.ఆమెకు సమాజంలో మంచి పేరేమీ లేదు.మర్యాదస్తులు ఆమెను తమ ఇళ్ళకు పిలిచేవారు కారు.ఆమె మా ఫ్రెండ్ పక్క పోర్షన్లో ఉండేది. ఆరోజున, కట్టుకున్న భార్య ముక్కుమూసుకుని బయటకు వెళ్ళిపోతే, ఈమె ముందుకొచ్చి బక్కేట్లతో నీళ్ళు తెచ్చి ఇతన్ని కడగటమే కాక, తన చేతులతో ఆ నేలమీద ఉన్న వాంతినంతా కడిగి శుభ్రం చేసింది. మర్నాడు పొద్దున్న ఇతని భార్య ఏమీ జరగనట్లు తిరిగి వచ్చింది. ఈమెకూ ఇతనికీ ఎదో ఉందనీ అందుకే ఆమె ఆ చండాలం అంతా కడిగి శుభ్రం చేసిందనీ అందరూ గుసగుసలు అనుకున్నారు.వారిద్దరి మధ్య అలాంటిదేమీ లేదన్న నిజం నాకు తెలుసు. స్వచ్చమైన మానవతా దృక్పథంతో మాత్రమె ఆమె అలా చేసింది.

దీనికి భిన్నంగా ఇంకొక ఉదాహరణ చెప్తాను.ఇదీ నిజంగా జరిగిన సంఘటనే. ఒక స్త్రీ ప్రాణం పోయిన తన పిల్లవాణ్ణి ఒళ్ళో పెట్టుకుని నిస్సహాయ స్తితిలో ఉన్నది.భర్త ఊరిలో లేడు.వాళ్ళు ఒక అద్దె ఇంటిలో ఉన్నారు. ఆ ఇంటి యజమానీ అతని భార్యా గొప్ప భక్తులుగా సంఘంలో చలామణీ అవుతూ ఉంటారు.ఎప్పుడూ బొట్లు పెట్టుకుని శుభ్రమైన వస్త్రాలు వేసుకుని శుచిగా ఉండి నీతులు చెబుతూ ఉంటారు.వాళ్ళు ఒక గుడి కూడా కట్టించారు. శవం ఇంట్లో ఉంటె ఇల్లు మైల పడుతుందంటూ ఆరోజున అలాంటి నిస్సహాయ స్తితిలో ఉన్న ఆమెను  వెంటనే ఖాళీ చెయ్యమని గోలగోల చేసారు. కనీసం భర్త వచ్చేవరకూ ఆగమన్నా వారు వినిపించుకోలేదు.

ఈ దంపతులకూ, పైన చెప్పిన బాంబే వేశ్యకూ మార్కులు వెయ్యమంటే నేను వేశ్యకే నూటికి నూరు మార్కులు వేస్తాను. నా దృష్టిలో ఆ వేశ్యే ఉత్తమురాలు. ఆమె వ్యక్తిగత జీవితం మనకు అనవసరం.ఏ పరిస్తితుల్లో ఆమె ఆపని చేస్తున్నదో అది వేరే కథ.తన తల్లినీ చెల్లెళ్ళనూ పోషించడానికి ఆమె అలా చేసేది. అది తప్పా రైటా అనేది వేరే విషయం. ఆమెకు చెయ్యడానికి ఇంకే పనీ దొరకలేదా అనేది చర్చకు మాత్రమె పనికొచ్చే విషయం.మానవతాదృక్పథం వరకూ ఆలోచిస్తే బైటికి పరమభక్తులుగా నటించిన ఆ ఇంటి యజమానుల కంటే ఈమె మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన ఉత్తమురాలు అని నేను భావిస్తాను.ఈ ఒక్క కోణాన్ని బట్టి మనిషిని పూర్తిగా అంచనా వెయ్యడం తప్పు అనేదే నా భావన.

సంఘం పతితులుగా భావించిన వారిలో అనేక ఉత్తమ వ్యకిత్వ కోణాలు నేను చూచాను.సంఘం చాలా మంచివాళ్ళుగా సర్టిఫికేట్ ఇచ్చిన వారిలో పరమ ఛండాలపు కోణాలూ చూచాను.ఇవన్నీ చూచిన మీదట నేను ఒక అభిప్రాయానికి వచ్చాను.అసలు సమాజానికి ఒక మనిషిని అంచనా వెయ్యడం ఎప్పుడూ తెలీదు.దాని రీడింగ్ ఎప్పుడూ తప్పే. ద్వంద్వనీతిని పక్కన బెట్టి ఒక మనిషిని మనిషిగా చూడటం సమాజానికి ఎప్పటికీ చేతకాదు.కనుక సమాజానికి భయపడటం అనవసరం.పిరికివాళ్ళు మాత్రమే  సమాజానికి విలువిస్తారు.ఆత్మవిశ్వాసం లేనివారు మాత్రమె ఇతరులు ఏమనుకుంటారో అని ప్రతిదానికీ భయపడతారు.వెరసి,మంచి వ్యక్తులే అక్కడక్కడా ఉంటారు కాని మంచి సమాజం అంటూ ఎక్కడా ఉండదు.

ఇదంతా పక్కన ఉంచి,సెక్స్ స్కాండల్స్ కూ గ్రహాలకూ సంబంధాన్ని కొంచం గమనిద్దాం. గత మూడు రోజులుగా నవాంశలో శుక్రుడూ రాహువూ కుజుని రాశి అయిన మేషంలో కలిసి ఉన్నారు.అంటే నక్షత్ర పాదస్థాయిలో వారికి సమ్మేళనం కలిగింది. ఈ సమయంలోనే అనేక సెక్స్ సంబంధిత సంఘటనలు జరగడం జ్యోతిష సూత్రాలను మళ్ళీ ఒక్కసారి రుజువు చేస్తున్నది. అంతేకాదు సెక్స్ సంబంధ స్కాండల్స్ బయట పడిన ప్రతిసారీ ఖగోళంలో రాహు-కుజ-శుక్రుల పాత్ర స్పష్టంగా ఉండటం ఒక విచిత్రం.

నేవీలో బయటపడిన వైఫ్ స్వాపింగ్ కూడా ఇలాటిదే.ఇది ఈరోజున బయట పడవచ్చు.బయటపడని ఎన్నో ఇలాంటివి మన సమాజంలో నిత్యమూ జరుగుతూనే ఉన్నాయి.ప్రపంచం ముందు మనమేదో పెద్ద పవిత్రులలాగా పోజు కొట్టడం పరమ దండగ.ప్రపంచం దృష్టిలో భారత్ ఒక 'సెక్సువల్లీ రిప్రేస్డ్ సొసైటీ' అనేది నగ్నసత్యం. అదే సమయంలో మన సమాజపు విలువలు అతి వేగంగా మారిపోతున్నాయన్నదీ సత్యమే.పాత కాలంలో ఊహించను కూడా ఊహించలేని మానవసంబంధాలు మన మధ్యన ప్రస్తుతం చోటు చేసుకుంటున్నాయన్నది కూడా సత్యమే.