Pages - Menu

Pages

31, మే 2013, శుక్రవారం

సముద్ర ఘోష

నింగీ నేలా కొండా కోనా చెట్టూ పిట్టా నదీ కడలీ నా నేస్తాలు.అవి నాతో మాట్లాడతాయి.తమ భావాలను నాతో చెప్పుకుంటాయి.మేం ఒకళ్ళ ఊసులను ఒకళ్ళతో చెప్పుకుంటాం.బాధలను కలబోసుకుంటాం.కలసి పయనం సాగిస్తాం.మా స్నేహం మచ్చలేనిది.మాయామర్మం ఎరుగనిది.కల్మషపు చేదును తెలియనిది.విశ్వాసం లేని మనుషులకంటే ప్రకృతి ఎంతో మంచి స్నేహితురాలు.

మొన్నొక రోజున ఏకాంతవాసంలో భాగంగా కడలి ఒడ్డున కొన్ని గంటలు మౌనంగా గడిపాను.తను నాతో ఎన్నో ఊసులు చెప్పింది.మనసు విప్పి మాట్లాడింది.తన వేదనను నాతో పంచుకుంది.ఆ భావాలు మీరూ వినండి.

కెరటాల ఘోష విని 
బెదరు వారేగాని 
నే జెప్పు ఊసులను 
వినెడు వారేరి?

కాళ్ళు తడిసిన క్షణమే 
కలవరమ్మే గాని 
నాలోని లోతులు 
తెలియువారేరి?

స్నానమాడగ దలచు 
సందేహులే గాని 
నాలోకి నడువగల
సాహసులు ఏరి?

వట్టి మాటలు జెప్పు 
వదరుబోతులె గాని 
వరుణ నగరము జేరు 
విబుధులేరి?

ఒడ్డునే కూచుండి 
ఒగిమాటలే గాని 
ఓర్పుతో లోతులను 
చేరువారేరి?

నావైపు చూచుచు 
నిలుచువారేగాని 
నాలోన చేరంగ 
వచ్చువారేరి?

నను తాకి కాసేపు 
మరలి పోవుటె గాని 
నిత్యమూ నాదరిని
నిలచువారేరి?

వారి భాషలలోన 
వాదమ్ములేగాని
నా నిత్యఘోషను 
ఎన్నువారేరి?

కౌతుకమ్ముగ నన్ను 
కాలదన్నుటే గాని 
కనరాని లోతులను 
కలియువారేరి?

కల్లోల కడలి యని 
కటువు మాటలె గాని 
నా కనుల లోతులను 
కాంచువారేరి?

ఉప్పు నీరనుచు నను 
తప్పులెన్నుటే గాని
ఒక్కటే రుచి యన్న 
వేత్తలేరి?

రంగులేదని నాకు
రచ్చ చేయుటే గాని
అంబరపు నీలాల 
అరయువారేరి?

పగలంతయును ఒట్టి 
పలకరింపులే గాని 
రాత్రిళ్ళు నాతోడు 
నిలచువారేరి?

ఎగసి పడు కెరటాల 
నెత్తి చూపుటయే గాని 
చెలువంపు కట్టను
తలచువారేరి?

ఒడ్డునే కూర్చుండి 
వెడలి పోవుటయేగాని
నా ఒడిని ననుజేరి 
నవ్వువారేరి?

గుడ్డిగవ్వల చూచి 
గంతులాటే గాని 
నాలోని రత్నాల 
వెదుకువారేరి?

ఇసుకలో కూచుండి 
ఇచ్చకాలేగాని 
సత్యమౌ సంపదల  
సాధకులు ఏరి?

నను గాంచి నిట్టూర్చి 
తేరిచూచుట యేగాని  
నా హృదయవేదనను
తెలియువారేరి?

మౌన ఘోష యటంచు 
మాటలనుటే గాని 
నా మనసు నాలించు 
నా మిత్రులేరి?

ఒకరి కన్నులలోకి 
ఒకరు చూచుటె గాని 
నా కనుల నీలాలు 
తుడుచువారేరి?

డొల్ల ప్రేమల చూపు 
లొల్లి మాటలె గాని 
నా ప్రేమ నగరాన 
నడచువారేరి?

పైపైన ననుజూచి 
పరవశించుట యేగాని 
నా ఆత్మ లోనన్ను 
పొందువారేరి?