Pages - Menu

Pages

25, జూన్ 2013, మంగళవారం

కల్యాణానంద భారతీస్వామి స్మృతులు-3

ఈ రోజుల్లో ప్రతిచోటా ఆడవారు లలితాసహస్ర నామావళి పారాయణం చెయ్యడం మనం చూస్తున్నాం.మగవారు కూడా చాలామంది ఈ స్తోత్రం నిత్యం చదువుతారు.కాని ఒక యాభై ఏళ్ళు వెనక్కు వెళ్ళి చూస్తే,అప్పుడు లలితను గాని ఖడ్గమాలను గాని త్రిశతిని గాని పారాయణం చెయ్యాలంటే ప్రజలు భయపడేవారు.అమ్మవారు ఉగ్రస్వరూపిణి అని తేడావస్తే మాడు పగులు తుందని,నెత్తి అణుస్తుందని,బలి కోరుతుందనీ అనేక భయాలు ప్రచారంలో ఉండేవి.

ఎవరైనా ఇంట్లో ఈ పారాయణాదులు చేస్తుంటే వద్దని పెద్దవాళ్ళు ఆపించేవారు.నేడు చాలా సర్వసాధారణంగా మనం చేస్తున్న లలితా పారాయణ ఒకప్పుడు శిష్టులచే నిషేధించబడినదన్న విషయం చాలామందికి తెలియదు.ఎందుకంటే ఇది తంత్రశాస్త్రానికి సంబంధించిన స్తోత్రం.తంత్రం అనే పేరు వినగానే చాలామంది భయపడతారు.మరి కొందరు అసహ్యించుకుంటారు.అదలా ఉంచితే, లలితాసహస్రనామాలు తంత్రశాస్త్రానికి సంబంధించినవని చాలామందికి తెలియదు.

అలాంటి అజ్ఞాన పరిస్థితులు సమాజంలో ఉన్న సమయంలో స్వామివారు అలాంటి భయాలు పెట్టుకోవద్దని ప్రజలకు వివరించి అందరిచేతా ముఖ్యంగా స్త్రీలచేత ఈ పారాయణాలు మొదలుపెట్టి చేయించారు.అమ్మవారు ఉగ్ర రూపిణి కాదనీ శాంతస్వరూపిణి అనీ సకలలోకాలకూ మాత గనుక తల్లి పిల్లలను ఏమీ చెయ్యదనీ వివరించి ప్రచారంలో ఉన్న దురూహలను మూఢ నమ్మకాలనూ పోగొట్టారు.

నేడు ఎక్కడ చూచినా స్త్రీల బృందాలు లలితాపారాయణం,ఖడ్గమాలా పారాయణం చేస్తున్నాయంటే దానికి కల్యాణానంద భారతీస్వాముల రివల్యూషనరీ అప్రోచ్ ముఖ్యకారణం.ఈ విషయం కూడా నేడు చాలామందికి తెలియదు.

అయితే ఒక్క విషయం గమనించాలి.గురూపదేశ పూర్వకంగా ఒక ఉపాసన చెయ్యడం వేరు.అది ఒక పద్ధతిగా సాగుతుంది.అయితే గురువు నిజంగా సిద్ధశక్తి కలిగినవాడై ఉండాలి.కాని అలాంటివాళ్ళు సామాన్యంగా దొరకరు. ఒకవేళ అలాంటివారు ఉన్నాకూడా,ఎవరిని బడితే వారిని శిష్యులుగా ఒప్పుకోరు,స్వీకరించరు.ఇకపోతే,గురువు లేకుండా ఊరకే స్తోత్ర పారాయణాలు చెయ్యడం వేరు.ఇది పామర పధ్ధతి.కాని ఇదీ మంచిదే.ప్రతి మనిషికీ దైవాన్ని చేరాలన్న తపన ఉంటుంది.వారికి తగిన మార్గం వారికి చూపాలి.అసలేమీ చెయ్యకుండా ఊరకే ఉండటం కంటే ఏదో ఒకటి చెయ్యడం మేలుకదా.

రహస్యాలు రహస్యాలు అంటూ కొందరు దుష్ట బ్రాహ్మణులు అన్నింటినీ దాచిపెట్టడం వల్లే నేడు హిందువులు దిక్కులేక ఇతర మతాల్లోకి మారే పరిస్థితులు వచ్చాయి అనడంలో కొంతనిజం ఉన్నది.నిజం చెప్పాలంటే నేడు బ్రాహ్మణ కుటుంబాల లో కంటే ఇతరకులాలలోనే ఆధ్యాత్మికత అంటే ఎక్కువ ఆసక్తీ శ్రద్ధా కనిపిస్తు న్నాయి.

రాజులలో,కమ్మవారిలో,రెడ్డికులంలో,దళితకులాలలో నిజమైన శ్రదాసక్తు లున్నవారు,ఆధ్యాత్మికాన్ని గురించి తెలుసుకోవాలని తపన ఉన్నవారు, మార్గం చూపిస్తే అనుసరించడానికి సిద్ధంగా ఉన్నవారు ఎందఱో నాకు తెలుసు.కాని వారికి సరియైన మార్గం చూపేవారు లేరు.ఇదీ మనకు పట్టిన దురవస్థ.

ఉన్న కొద్దిమంది గురువులూ చెట్టుపేరు చెప్పుకుని కాయలమ్ముకునే వారేగాని నిజమైన సాధనాశక్తి తపశ్శక్తి ఉన్నవారు కారు.మా గురువు ఫలానా అని డప్పు కొట్టుకునేవారే ఎక్కువగాని,ఆ గురుశక్తిని మాటల్లో కాకుండా చేతల్లో చూపేవారు చూపగలవారు ఎక్కడో కోటికొకరు ఉంటారు. నేటి ఆధ్యాత్మిక లోకంలో బోగస్ గురువులే ఎక్కువ.జనులు వేలంవెర్రిగా అనుసరిస్తున్న ప్రసిద్ధ గురువులలో కూడా వారు ప్రచారం చేసుకున్నంత శక్తి లేదని నాకు తెలుసు.

టీ తాగుతూ మౌనంగా ఆలోచనలో ఉన్న నన్ను శర్మగారి స్వరం ఈ లోకంలోకి రప్పించింది.

'మీరు శ్రీవిద్యా దీక్షితులేనా?'

నేనేమీ జవాబు చెప్పలేదు.మౌనంగా చిరునవ్వు నవ్వాను.

'ఏంలేదు.దీక్ష తీసుకొనని వారితో కొన్నికొన్ని రహస్య విషయాలు మాట్లాడకూడదు.అందుకని అడిగాను.'అన్నారాయన.

ఆ విషయం నిజమే కాబట్టి నేనేమీ జవాబు చెప్పలేదు.

'శ్రీవిద్యా సాధన సరిగ్గా చేస్తే ఏం జరుగుతుంది?' ఆయన్ను అడిగాను.

'అమ్మ అన్నీ ఇస్తుంది.సంకల్పసిద్ధి కలుగుతుంది.అంటే అనుకున్నవి జరుగుతాయి.మంచి కవిత్వశక్తి వస్తుంది.ఐశ్వర్యం వస్తుంది.మంచి బుద్ధి ఇస్తుంది.సిద్ధులు కలుగుతాయి.ఒకటేమిటి? మన అర్హతను బట్టి,సాధనను బట్టి అన్నీ వస్తాయని మా గురుదేవులు కల్యాణానంద భారతీస్వామి చెప్పారు.' 

ఈయనకు చిన్న నిదర్శనం చూపుదామని అనిపించింది.కళ్ళు తెరిచి ఆయన్ను చూస్తూనే ఉండి రెండు క్షణాలు మనస్సును కేంద్రీకృతం చేశాను.ఎక్కడినుంచో పైలోకాల్లోంచి జాలువారినట్లు ఒక సంస్కృతశ్లోకం నా మనసులోకి వచ్చి నిలిచింది.

'శర్మగారు.ఒక శ్లోకం చెప్తాను.వింటారా?' అడిగాను.

ఆయన ముఖంలో ఉత్సుకత తొంగిచూచింది.

'చెప్పండి' అన్నారు.

శ్లో|| సహితా మత్యంత ధవళ శ్రీకళా పరయంత్రాం
వివిధాగమేన సురపూజితాత్మ వరమంత్రాం
దహితాఘ సర్వ విరళాత్మరూప ఘనముద్రాం 
మహితోజ్జ్వలాంగ యుతశోభితాత్మ మనువిద్యాం   

అని అప్పటికప్పుడు నా మనోఫలకం పైన ప్రతిఫలించిన శ్లోకాన్ని బయటకు చెప్పాను.

'ఏదీ మళ్ళీ ఒకసారి చెప్పండి.' అడిగారాయన.

మళ్ళీ ఆ శ్లోకాన్ని వల్లించాను.శ్రద్ధగా కళ్ళుమూసుకుని విన్నారాయన.

'శ్రీ చక్రారాధ్య అయిన శ్రీమాతను ఎంత చక్కగా వర్ణించారండీ?చాలా బాగుంది. ఇది ఏ పుస్తకంలోని శ్లోకమండీ? ఎప్పుడూ వినలేదు' అన్నారాయన.

'ఏ పుస్తకంలోదీ కాదు.నా మస్తకంలో నుంచి ఇప్పుడే జాలువారింది' చెప్పాను.

'మీకు సంస్కృతం వచ్చా?' అడిగారాయన.

'రాదు.నేను సంస్కృతం చదువుకోలేదు.' అన్నాను.

ఆయన ఆశ్చర్యపోయారు.

'ఇదెలా సాధ్యం?సంస్కృతం రాని మీ నోటినుంచి ఈ శ్లోకం ఆశువుగా ఎలా వచ్చింది?' అడిగారు చాలా వింతగా చూస్తూ.

'శ్రీవిద్యోపాసన సరిగ్గా చేస్తే ఏమి జరుగుతుందో మీరు గతంలో మీ గురువుగారి నుంచి విన్నారు.ఇప్పుడు ఆ అద్భుతాన్ని మీ కళ్ళెదురుగా చూస్తున్నారు.' అని మాత్రం చెప్పాను.

ఆయన బిత్తరపోయి అలా చూస్తూ ఉండిపోయాడు.

(మిగతాది తర్వాతి భాగంలో)