Pages - Menu

Pages

22, జులై 2013, సోమవారం

కల్యాణానంద భారతీస్వామి స్మృతులు- 10 (యక్షప్రశ్నలు-ఆఖరిభాగం)

'సరేనండి.మీ సమయం చాలా వృధా అయింది ఈరోజు' అన్నాడాయన తనుకూడా లేస్తూ.

ఒక్కసారి ఆయనవైపు చూచాను.

'వృధా అవుతోంది అనుకుంటే అసలిక్కడ కూచునేవాడినే కాను.మంచి విషయాలు మాట్లాడుకున్న సమయం వృధా ఎలా అవుతుంది?పైగా మీరు స్వచ్చమైన బ్రాహ్మణులనిపించారు.'అన్నాను.

'ఎందుకని అలా అన్నారు?'అడిగాడు నవ్వుతూ.

'అంతేమరి.మిగతా అందరిలాగా మీరుకూడా రియల్ ఎస్టేట్ గురించీ,పైరవీల గురించీ,తెల్లవారేసరికి ఎవర్ని ఎలా ముంచి కోట్లు సంపాదించాలి అన్న విషయం గురించీ,మన కులంవాడు ఏ పదవిలో ఉన్నాడు వాడిని ఎలా పట్టుకుని అడ్డమైన మన పనులన్నీ ఎలా చేయించుకోవాలి అన్న విషయం గురించీ,కుళ్ళు రాజకీయాల గురించీ ఒక్కసారి కూడా మాట్లాడలేదు కదా. పూర్తిగా స్వచ్చమైన ఆధ్యాత్మికం గురించే మీరు మాట్లాడారు.విన్నారు.కనుక మీరు నిజమైన బ్రాహ్మణులే సందేహం లేదు.' అన్నాను నవ్వుతూ.

ఆయన కూడా నవ్వేశాడు.

'ఎంత సంపాదించినా చివరికి ఏముంది శర్మగారు?మనశ్శాంతిగా బ్రతకడమేగా ప్రధానం.ఉంటానికీ తింటానికీ ఉన్నది.ఆరోగ్యం బాగానే ఉన్నది.బాధ్యతలు లేవు.ఇంకేంకావాలి చెప్పండి.తను నాకంటే ముందుగానే అమ్మను చేరుకుంది.శ్రీమాతను ధ్యానిస్తూ అమ్మనుంచి పిలుపుకోసం ఎదురుచూస్తూ నేనిలా కాలం వెళ్ళదీస్తున్నాను.ఈ జన్మకి ఇది చాలు.నేను తృప్తిగా హాయిగా ఉన్నాను.' అన్నాడాయన.

మౌనంగా తల పంకించాను.

'మనదేశపు నిజమైన సంపద ఇదేనండి.ఈ తృప్తి ఎంత ధనం సంపాదించినా రాదు.ఆత్మానందమే నిజమైన ఆనందం అని చెప్పిన ఘనత ఈ దేశపు సొంతం.ఇలా శ్రీవిద్య గురించి మాట్లాడుకుంటూ కూచుంటే తెల్లవారుతుంది కాని మన చర్చ అయిపోదు.ఇందులో విషయం అంత ఉన్నది.ఆ సంగతి అలా ఉంచండి. బయలుదేరే ముందు, నన్ను ఎప్పటినుంచో వేధిస్తున్న కొన్ని ప్రశ్నలు అడుగుతాను.మీకు తెలిస్తే చెప్పండి.లేదంటే ఆలోచించి మళ్ళీ ఈసారి నేను వచ్చినపుడు చెప్పగలరా?' అడిగాను.

'ప్రయత్నిస్తాను.అయినా మీకు కూడా సందేహాలున్నవా?' అడిగాడాయన.

'భలేవారే.నేనేమీ సర్వజ్నుడిని కాను.నాకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి.ఈ సందర్భంలో శ్రీరామక్రిష్ణులు ఎప్పుడూ అనేమాట ఒకటి గుర్తుకు వస్తున్నది.As long as I live,so long do I learn' అని ఆయన తరచుగా అనేవారు.అంతటి మహనీయుడే ఆమాట అంటే ఇక మనమెంత?మన జ్ఞానమెంత? సరేగాని సందేహాలు వినండి.'

  • బిందువు శివుడని తంత్రాలలో కొన్నిచోట్ల ఉన్నది.అదే బిందువు లలితా పరమేశ్వరి అనికూడా తంత్రాలలో కొన్నిచోట్ల ఉన్నది.ఏది కరెక్ట్? ఇద్దరూ ఒకటే అనిమాత్రం నాకు చెప్పకండి.ఆ విషయం నాకు తెలుసు.ఇద్దరూ ఒకటే అయితే ఒకచోట ఒకరనీ ఇంకొకచోట ఇంకొకరనీ ఎందుకు చెప్పబడింది?
  • శ్రీచక్రం గీచే విధానం ఒక్కొక్కచోట ఒక్కొక్క విధంగా ఉన్నది.ఆయా చక్రాలలో రేఖలూ కోణాలూ తేడాలుగా ఉంటాయి.ఈ తేడాలు ఎందుకు వచ్చాయి?
  • సృష్టి సంహార చక్రాల భావనలో ఆకారాలలో రకరకాల భేదాలు ఎందుకు వచ్చాయి?వాటి అర్ధాలు ఏమిటి?త్రికోణాలు ఉండే తీరునుబట్టి కొందరు ఈ భేదాలు గ్రహిస్తారు.చక్రాన్ని గీచే తీరును బట్టి ఇంకొందరు ఈ భేదాన్ని గ్రహిస్తారు.వీటిలో ఏది నిజం?
  • యోగసంప్రదాయంలో స్వాదిష్టానం జలతత్వం అంటారు.శంకరులు సౌందర్య లహరిలో 'మహీం మూలాధారే కమపి మణిపురే..'అన్న శ్లోకంలో 'హుతవహం స్థితం స్వాధిష్టానే',-- అంటే స్వాధిష్టానం అగ్నితత్వం అన్నారు.ఈ రెంటిలో ఏది కరెక్ట్? ఈ భేదం ఎందుచేత వచ్చింది?మహాద్వైతి అయిన శంకరులకు యోగసంప్రదాయం తెలియదని అనుకోలేము.మరి యోగులకు శ్రీవిద్యా సాంప్రదాయం తెలియదని అనుకోవాలా?
  • శ్రీవిద్యకు ఆదిగురువు మన్మధుడని హయగ్రీవుడని దక్షిణామూర్తి అని రకరకాల పుస్తకాలలో రకరకాలుగా చెబుతారు.ఏది సరైనది?
  • పరశురామ కల్పసూత్రం చెప్పిన పరశురాముణ్ణి శ్రీవిద్యా ప్రవర్తకులైన పన్నెండుమందిలో ఒకనిగా ఎందుకు లెక్కించలేదు?అంటే కల్పసూత్రం నిజమైనది కాదా?కాని దానిని చదివితే అలా అనిపించదు. పరశురాముడు అవతారమూర్తి కూడా అయ్యాడు.మరి ఆయన్ను శ్రీవిద్యోపాసకులలో ఎందుకు చేర్చలేదు?
  • శ్రీచక్రదళాలలో బీజాక్షరాలు ఉండాలని కొందరూ,ఉండకూడదని కొందరూ అంటారు.ఉంటే ఏమిటి? ఉండకపోతే ఏమిటి?ఈ భేదాలు ఎందుచేత వచ్చాయి?
  • ఒకటే అయిన శ్రీవిద్యా సాంప్రదాయంలో గురువుకూ గురువుకూ భిన్న పద్ధతులు ఎందుకు ఉన్నాయి? వీరిలో ఎవరు సరియైనవారు? ఎవరు కాదు?
  • అన్ని కులాలవారికీ వర్ణాలవారికీ తంత్రాన్ని ఉపదేశం చెయ్యవచ్చు కదా. వేదాధ్యయనార్హత అందరికీ లేదు గనుకనే తంత్రములు అందుకోసం అందరి కోసం పుట్టాయి.మరి శ్రీవిద్యాతంత్రాన్ని కూడా మళ్ళీ కులాలవారీగా ఎవరు విభజించారు?ఎందుకు విభజించారు?
  • పంచదశీ షోడశీ మంత్రాలను కులంతో సంబంధం లేకుండా అందరికీ ఉపదేశం ఇవ్వవచ్చునా? ఇవ్వకూడదా? దీనికి ఏదైనా మూలప్రమాణం ఉన్నదా?
  • షోడశీ మంత్రంలో చివరలో చేర్చే పదహారవ బీజాక్షరంలో సంప్రదాయాన్ని అనుసరించి భేదాలున్నాయి కదా?ఈ భేదాలు ఎందుకు వచ్చాయి?వీటిలో ఏది సరియైనది?
  • షోడశీమంత్రమే భోగాన్నీ మోక్షాన్నీ రెంటినీ ఇవ్వగలిగి ఉండగా అది చాలక మళ్ళీ మహాషోడశి అనీ,మహావిద్య అనీ,శుద్ధ విద్య అనీ రకరకాల మంత్రాలను సంపుటీకరించి ఎందుకు తయారు చెయ్యవలసి వచ్చింది? ఈ పని చేసినది ఎవరు?
  • బాలా మంత్రాన్ని ఉపాసించి తరించినవారు ఎందఱో ఉన్నారు.అలాగే మహాషోడశీ మంత్రాన్ని ఏళ్ల తరబడి జపిస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లూ ఉన్నారు కొందరు.దీనికి కారణం ఏమిటి?
  • క్షుద్ర లోహాలనుంచి బంగారాన్ని తయారు చేసే రసవాద రహస్యాలు శ్రీచక్రంలో నిగూడంగా దాగి ఉన్నాయని అవి మహామంత్రవేత్తలకు మాత్రమె తెలుస్తాయనీ కొందరి నుంచి నేను విన్నాను.అవి మీకు తెలుసా?అలా తయారు చేద్దామని నాకేమీ కుతూహలం లేదు.ఊరకే జిజ్ఞాస కొద్దీ అడుగుతున్నాను.

ఇంకా చాలా సందేహాలు నాకున్నాయి.ప్రస్తుతానికి వీటికి మాత్రం జవాబులు మీకుతెలిస్తే నేను మళ్ళీ వచ్చినపుడు చెప్పండి.మరి నేను వెళ్ళి వస్తాను.' అంటూ లేచి బయటకు వచ్చాను.

'సరేనండి.మంచిది.మళ్ళీ కలుద్దాం' అన్నాడాయన నమస్కారం పెడుతూ.

నేనూ ఆయనకు ప్రతినమస్కారం చేసి బయలుదేరాను.

మెయిన్ రోడ్డును కలిపే ఆ సందులో అక్కడక్కడా మాత్రమే దీపాలు వెలుగుతూ కొంత చీకటీ కొంత వెలుతురూ ప్రసరిస్తూ జీవితంలోని వెలుగుచీకట్లను గుర్తుకు తెస్తున్నాయి.వీధుల్లో జనసంచారం బాగా తగ్గింది. దూరంగా మెయిన్ రోడ్డులో మాత్రం వాహనాలు తిరుగుతూ కనిపిస్తున్నాయి. ఆ వీధంతా నిర్మానుష్యంగా ఉన్నది.మెయిన్ రోడ్ నుంచి ఆటో పట్టుకుని రైల్వే స్టేషన్ చేరాలి.అక్కడేదో రైలెక్కి గుంటూరు చేరుకోవాలి.

అప్పటివరకూ మాట్లాడిన విషయాలు మనసులో తిరుగుతున్నాయి. సాలోచనగా పరిసరాలను గమనిస్తూ మెయిన్ రోడ్ వైపు అడుగులు వేస్తూ తలెత్తి చీకటితో నిండిన ఆకాశం వైపు చూచాను.

నల్లటి ఆకాశంలోనుంచి జగజ్జనని ప్రసన్నవదనంతో నవ్వుతూ నన్ను చూస్తునట్లుగా అనిపించింది.

(అయిపోయింది)