నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

19, సెప్టెంబర్ 2013, గురువారం

సద్గురు ప్రణవానంద ఆశ్రమం


సద్గురు ప్రణవానందస్వామి
నేను నంద్యాల పట్టణానికి పోతే అక్కడికి పోయిన పని ముగిసినాక వీలైనప్పుడల్లా దర్శించే స్థలాలు రెండున్నాయి.ఒకటి సద్గురు త్యాగరాజ స్వామి ఆలయం.రెండవది సద్గురు ప్రణవానందస్వామి సమాధి ఉన్న ఆశ్రమం.చాలామందికి తెలిసిన విషయం ఏమంటే తమిళనాడు లోని తిరువయ్యారు లో త్యాగరాజస్వామి సమాధీ ఆలయమూ ఉన్నవి.కాని మన ఆంధ్రదేశంలో త్యాగరాజస్వామికి ఆలయం ఒక్క నంద్యాలలోనే ఉన్నది.ఆ వివరాలు ఇంకొక పోస్ట్ లో వ్రాస్తాను. ప్రస్తుతానికి సద్గురు ప్రణవానందుల ఆశ్రమం గురించి.



నంద్యాల నుంచి మహానందికి వెళ్ళే దారిలో బుక్కాపురం అని ఒకగ్రామం వస్తుంది.ఆ గ్రామ పొలిమేరలలో దారిపక్కనే ఒక పెద్ద ఊడలు దిగిన మర్రిచెట్టూ దాని పక్కనే పాతకాలంనాటి ఒక ఆశ్రమమూ కనిపిస్తాయి. చాలామందికి తెలియని విషయం ఏమంటే,అది ఒక సద్గురుస్థానం అనీ,నిజమైన వేదాంతీ మహనీయుడూ అయిన ప్రణవానందస్వామి అక్కడే నివసించి సమాధి అయ్యారనీ ఎక్కువమందికి తెలియదు.


నేను గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగినప్పటికీ నాకు రాయలసీమ అంటేనే ఇష్టం.దానికి కారణం రాయలసీమలో ఉన్న ఆధ్యాత్మిక తరంగాలే. సర్కార్ జిల్లాల వాతావరణం కలుషితం అయినంతగా రాయలసీమ కాలేదు.పైగా, రాయలసీమలో ఆధ్యాత్మిక వాతావరణం సర్కార్ జిల్లాలలో కంటే చాలాహెచ్చు.ఇప్పటికీ ఎన్నో నిజమైన సాధు సాంప్రదాయాలు రాయలసీమలో ఉన్నాయి.వాటిలో ఒకటి శ్రీమదుమామహేశ్వర గురుపీఠం.ఎందఱో యోగులు,అవధూతలు, మహానీయులు ఇప్పటికీ రాయలసీమ మారుమూల పల్లెలలో కూడా మనకు కనిపిస్తారు.అయితే వారిని గుర్తించగలిగే ప్రజ్ఞ మనలో ఉండాలి.


ప్రణవానందస్వాములకు ముందు వీరి పరంపర నాకు తెలియదు.కాని ప్రణవానందస్వామి తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ రాయలసీమలో స్థిరపడి బుక్కాపురంలో సమాధి అయ్యారు.ఆయన శిష్యుడైన సద్గురు సదానందస్వామి గుంతకల్లు దగ్గర ఉన్న గంజిగుంట అనే గ్రామంలో ఆశ్రమం నిర్మించుకుని అందులోనే నిర్యాణం చెందారు.వారి సమాధి అక్కడ ఉన్నది. ఆయన శిష్యుడైన శంకరానందగిరి స్వామి ఉరవకొండ దగ్గర ఉన్న లత్తవరం అనేగ్రామంలో సమాధి చెందారు.వీరు ముగ్గురూ నిజమైన వేదాంతులు. మహనీయులు.సద్గురువులు.

వీరిలో శంకరానందగిరిస్వామిని దర్శించే భాగ్యం నాకు కలిగింది.1984 లో నేను గుంతకల్లులో ఉన్నప్పుడు తిలక్ నగర్లో ఉన్న వారి ఆశ్రమాన్ని తరచూ దర్శించేవాడిని.ఆయన అక్కడకు తరచుగా వచ్చేవారు.

ఒకసారి మా అమ్మగారితో స్వామి దర్శనానికి వెళ్లాను.అప్పుడు మా అమ్మగారు స్వామిని ఒక ప్రశ్న అడిగారు.

'పెద్దవయసు కావడంతో కాళ్ళనొప్పుల వల్ల స్థిరంగా ఆసనంలో కూర్చుని ఎక్కువసేపు జపధ్యానాలు చెయ్యలేకపోతున్నాను.దీనికి మార్గం ఏదైనా చెప్పండి స్వామీ' అన్నారు.

దానికి స్వామి వెంటనే పతంజలి యోగసూత్రాలలో నుంచి ఉదహరిస్తూ-' అమ్మా."స్థిర సుఖమాసనం" అని యోగసూత్రాలలో మహర్షి చెప్పినారు. కనుక పద్మాసనమే కానవసరం లేదు.నీకు శ్రమలేకుండా సుఖంగా ఎక్కువ సేపు కూర్చోనగలిగే ఆసనం ఏదైనా మంచిదే తల్లీ.మనస్సు ఏకాగ్రం కావడం ప్రధానం.'- అని సమాధానం ఇచ్చారు.

అప్పటికి నాకు 20 ఏళ్ళు.నేను అప్పటికే యోగసూత్రాలను అనేకసార్లు తిరగామరగా చదివి ఉండటంచేత వాటిలో చాలాభాగం నాకు కంఠతా వొచ్చు. మా గురువులు చెప్పినది కూడా అదే కావడంతో ఆయన చెప్పిన సమాధానం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది.



శంకరానందగిరి స్వామి ప్రవచనాలను వినే అదృష్టం నాకు కొన్నిసార్లు కలిగింది.అనర్గళమైన ఆయన వాగ్ధాటికి ముగ్దులవని వారు అరుదు.ఆయన మాట్లాడటం మొదలుపెడితే మూడునాలుగు గంటలపాటు వేదాలనుంచీ, ఉపనిషత్తులనుంచీ,బ్రహ్మసూత్రాల నుంచీ,భగవద్గీత నుంచీ,యోగవాసిష్టం నుంచీ,యోగసూత్రాలనుంచీ,పురాణాల నుంచీ ఎన్నోశ్లోకాలను సందర్భానుసారంగా అప్పటికప్పుడు అనర్గళంగా ఉదాహరిస్తూ మధ్యమధ్యలో పిట్టకధలను చెబుతూ వేదాంతబోధ చేసేవారు.

ఆయన కన్నడప్రాంతంలో ఒక మంచి సంపన్నకుటుంబంలో జన్మించారు. చిన్నవయసులోనే వైరాగ్యసంపన్నుడై సన్యాసం స్వీకరించి తపస్సులో కాలం గడిపారు.దశనామీ సాంప్రదాయంలో వీరిది 'గిరి' సాంప్రదాయం.తెలుగు, కన్నడ,ఇంగ్లీషు,హిందీ,సంస్కృత భాషలలో ఆయన అనర్గళంగా మాట్లాడగలిగేవారు.సరస్వతీదేవి ఆయన నోటిలో నివాసం ఉన్నదా అనిపించేది.ఆయన ప్రవచనాలను వినినవారు నిజంగా అదృష్టవంతులే.అంత అద్భుతంగా spell binding గా ఉండేవి ఆయన ఉపన్యాసాలు.అప్పటికీ ఇప్పటికీ నేను ఎందఱో ఉపన్యాసకులను విన్నాను. కాని ఆయనతో సాటిరాగల అద్భుతవక్తలు నాకు ఇప్పటివరకూ కనిపించ లేదు.

ఆయనది ఉత్తపాండిత్యం అనుకుంటే పొరపాటు పడినట్లే.పాండిత్యానికి తోడు ఆయన గొప్పతపస్వి.ఆయనలో పాండిత్యమూ తపస్సూ కలసిమెలసి ఉండేవి.ఆయన మహాజ్ఞాని అని ఆయనను చూస్తేనే అర్ధం అవుతుంది. ఒకనిలో పాండిత్యమూ తపస్సూ కలగలసి ఉంటే అది బంగారానికి సువాసన అబ్బినట్లు అవుతుంది అని శారదామాత అనేవారు.శంకరానందస్వామి అట్టి మహనీయుడు.

అప్పట్లో శంకరానందస్వామీ,గండిక్షేత్రం రామక్రిష్ణానందస్వామీ కలసి ఇచ్చిన గీతోపన్యాసాలు ఆంద్రదేశాన్ని ఉర్రూతలూగించాయి.ఇద్దరు మహా పండితులూ మహావక్తలూ,మహాజ్ఞానులూ కలిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో వాటిని విన్నవారికే ఎరుక.అదృష్టం అంటే వారిదే.వారితో పోలిస్తే నేటి టీవీ ఉపన్యాసకులు చెల్లని రూపాయిలూ పంటికింద రాళ్ళూ అనే చెప్పాలి.



అప్పట్లో ఎన్టీ రామారావు తీసిన 'పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి' సినిమా రిలీజైంది.గుంతకల్లు ప్రసాద్ టాకీస్ లో అది విడుదలైంది.నేను ఆ సినిమా చూడటానికి పోయినరోజే స్వామి కూడా సినిమా చూడటానికి వచ్చారు. హాలు యజమానులు స్వామి శిష్యులు కావడంతో ఆయన్ను ప్రత్యేకంగా బాక్స్ లో కూచోబెట్టి సినిమా చూపించారు.సామాన్యంగా సాంప్రదాయ స్వాములు సినిమాలకు రారు.కొందరేమో 'నేను స్వామీజీని అయ్యుండి సినిమాకి పోవడం ఏమిటి?'అని నామోషీగా అనుకుంటారు.కాని స్వామి అలాంటి భేషజాలు ఏమీ లేకుండా ఒక చిన్నపిల్లవానిలాగా  హాలుకు వచ్చి మరీ ఆ సినిమాను చూచారు.ఆయన మామూలు జ్ఞాని కాదనీ జ్ఞాని స్థాయిని దాటిన విజ్ఞాని అనీ నాకు ఆరోజే అర్ధమైంది.



గంజిగుంటలో స్వామి గురువులైన సదానందయోగీంద్రుల ఆరాధన జరుగుతుంది.1988లో జరిగిన ఆరాధనకు మేము అక్కడున్నాము.ఆరోజున తన గురువుగారి పాదుకలను తలమీద పెట్టుకుని ఎంత భక్తిగా స్వామి మేడమీద తన గదినుంచి కిందకు దిగివచ్చారో ఆ దృశ్యం నాకింకా ఇప్పటికీ కళ్ళముందు మెదులుతుంది.తాను స్వయంగా ఒక జ్ఞాని అయి ఉండీ తన గురువును ఎంతగా గౌరవించేవారో? ఆ దృశ్యం నిజంగా అద్భుతం.



గుంతకల్లులో ఒకసారి బహిరంగసభ జరిగింది.ఎందఱో స్వాములు మహనీయులు ఆసభకు వచ్చినారు.ఎన్నో గొప్ప వేదాన్తోపన్యాసాలు ఇవ్వబడ్డాయి.ఇంతలో ఎక్కడనుంచి వచ్చినదో సభామధ్యంలోకి ఒక ఊరకుక్క ప్రవేశించింది.అందరూ దానిని తరిమి కొడుతున్నారు.అప్పటివరకూ అంతా బ్రహ్మమే అంటూ ఉపన్యాసాలు వినిన భక్తులు అవన్నీ మరచి కుక్కను 'ఛీఛీ' అని అదిలిస్తున్నారు.

శంకరానందస్వామి వేదికపైనుంచి దానిని గమనించి మైకు తీసుకున్నారు. కుక్కవైపు చూస్తూ చేతులు జోడించి 'స్వామీ! మీ దారిన మీరు పోతుంటే వారికి తెలియక మిమ్మల్ని అదిలిస్తున్నారు.వారి అజ్ఞానాన్ని మన్నించి మీదారిన మీరు సుఖంగా వెళ్ళండి' అని మైకులో చెప్పారు.సభ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది.అందరూ తొలగి దారి ఇచ్చారు.ఆ కుక్క తన దారిన తాను బయటకి వెళ్ళిపోయింది.ఈ సంఘటనకు నేనే ప్రత్యక్ష సాక్షిని.

వేదాంతాన్ని చెప్పడమే కాదు ఆచరించి చూపించిన మహాజ్ఞాని శంకరానందగిరిస్వామి.ఆయన గురువు సదానందయోగీంద్రులు.ఆయన గురువు ప్రణవానందస్వామి.



వీరి సాంప్రదాయంలో నాకు నచ్చిన ఇంకొక ముఖ్యవిషయం.వీరి ఆశ్రమాలలోని ఆలయాలలో దేవాలయద్వారానికి పైగా ఇరువైపులా శ్రీరామకృష్ణ వివేకానందుల చిత్రాలు తప్పకుండా ఉంటాయి.స్వామి తన ఉపన్యాసాలలో వీరిని గురించి చెప్పకుండా ఉండరు.వివేకానందులనూ రామకృష్ణులనూ చెప్పకుండా వారి ఉపన్యాసం ముగియదు.



అటువంటి మహనీయులను స్మరిస్తే చాలు.మన పాపాలు పటాపంచలై పోతాయి.మన మనస్సులు పవిత్రమైన భావాలతో నిండిపోతాయి.మనకు కూడా బ్రహ్మావలోకన ధిషణ కలుగుతుంది.

ఈ మధ్య నేను బుక్కాపురం ఆశ్రమానికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటోలను ఇక్కడ చూడవచ్చు.ఆశ్రమం నిర్మానుష్యంగా ఉంటుంది.కాపలాగా ఒక్క మనిషి(అతను కూడా భక్తుడే అయి ఉంటాడు) తప్ప అక్కడ సామాన్యంగా ఎవరూ ఉండరు.నిరాడంబరంగా నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉండే నిజమైన ఆశ్రమం అది.ధ్యానానికి చాలా అనువైన ప్రశాంతమైన ప్రదేశం.