నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

2, డిసెంబర్ 2013, సోమవారం

లూయీ బ్రెయిలీ జాతకం-అంధత్వయోగాలు

మొన్న అంధుల ఆశ్రమానికి వెళ్ళినప్పుడు లూయీ బ్రెయిలీ జాతకం పరిశీలిద్దామని తోచింది. ఎందరిలాగానో  అతను కూడా గుడ్డివాడైనా తన ఖర్మను తిట్టుకుంటూ కూర్చోకుండా బ్రెయిలీ లిపిని తయారు చేసి తద్వారా నేడు లక్షలాది అంధులకు వెలుగును ప్రసాదించాడు.అందుకే అతని జాతకంలో ఏ గ్రహస్తితి ఈ యోగాన్ని ఇచ్చిందో చూద్దామని అనుకున్నాను.

లూయీ బ్రెయిలీ 4-1-1809 న ఫ్రాన్స్ లో కూవ్రే అనే ఊళ్ళో పుట్టినాడు.స్విస్ ఎఫిమెరిస్ వారి ఆస్ట్రో డేటాబాంక్ ప్రకారం జనన సమయం ఉదయం నాలుగు గంటలు.ఆ సమయానికి వచ్చె జాతకచక్రం ఇక్కడ చూడవచ్చు.

జాతకంలో రెండూ పన్నెండూ భావాలు కళ్ళకు సూచికలు.సూర్యచంద్రులు నేత్రాలకు సహజకారకులు.సహజరాశి చక్రంలో ఈ భావాధిపతులైన గురుశుక్రులు కూడా నేత్రాలకు కారకులే.ఇప్పుడు బ్రెయిలీ జాతకం ఏమంటున్నదో చూద్దాం.

ఇతని జాతకం చూడగానే స్ఫురించే విషయం లగ్నంలో రాహువూ,లగ్నానికి గల పాపార్గళమూ.ఇది 'నేత్రహీనయోగం' అనబడుతుంది.చాలా లగ్నాలకు పాపార్గళం ఉంటుంది.అది వింతకాదు.మేషానికీ తులకూ పాపార్గళం ఉండటం ఒక ప్రత్యేకత.అప్పుడు ఆ రెండు పాపగ్రహాల సప్తమదృష్టి వల్ల సప్తమానికి కూడా పాపార్గళం ఉంటుంది.ఈ రెంటిలో మళ్ళీ తులకు ఈ స్తితి ఉంటే అది మరీ ప్రత్యేకత అవుతుంది.ఎందుకు?

మేషానికి ఈ స్థితి ఉంటే తుల సహజసప్తమం కనుక దోషం లగ్నానికీ సప్తమానికీ పంచబడుతుంది.అదే తులకు ఉంటే,రెండూ లగ్నాలే అవుతాయి గనుక లగ్నదోషం రెండింతలు అవుతుంది.అదీ భేదం.ఈ విధమైన సూక్ష్మపరిశీలన జ్యోతిష్యశాస్త్ర విద్యార్ధికి చాలా అవసరం.

ప్రస్తుతజాతకంలో లగ్నమైన తులవల్ల సహజలగ్నానికి కూడా ఆదోషం పట్టింది.జాతకలగ్నమూ సహజలగ్నమూ కూడా దోషాన్ని సంతరించు కున్నాయి.కనుక తలకూ కళ్ళకూ ప్రమాదం ఖచ్చితంగా ఉన్నదని జాతకం చూడగానే తెలుస్తుంది.చిన్నప్పుడు ఆయా దోషపూరిత దశలు గనక నడిస్తే,ఆ ప్రమాదం ఆయా వయస్సుల్లో ఖచ్చితంగా జరుగుతుంది.ఇతను బుధ నక్షత్రంలోనే జన్మించాడు గనుక చిన్నప్పుడు అదేదశ జరుగుతుంది. ఇక కళ్ళు ఎలా మిగులుతాయి?బుధుడు ఈ లగ్నానికి మంచివాడే.అయితే దోషం ఎలా వచ్చిందో ఇప్పుడు వివరిస్తాను. 

లగ్నంలో రాహువూ యురేనస్సూ ఒకే బిందువు మీద స్వాతీనక్షత్రం నాలుగో పాదంలో ఉన్నారు.ఇది నవాంశలో గురువుదైన మోక్షరాశి,మీనరాశి అవుతుంది.కనుక ఇతను గతజన్మలో ఆధ్యాత్మికంగా మహనీయులైన వారికి ఆకతాయితనంతో ద్రోహం చెయ్యడంవల్ల ఈజన్మలో కళ్ళు పోగొట్టుకున్నాడని తెలుస్తున్నది.

పాతతరంలో పల్లెటూళ్ళలో ఉన్నవారికి కొన్ని సామెతలు గుర్తుంటాయి. ఎవరైనా ఏదైనా ఘోరమైన తప్పు చేస్తుంటే -'ఒరే వద్దురా కళ్ళు పోతాయిరా' అని పెద్దలు హెచ్చరించేవారు.ప్రకృతిలో ఏపనికి ఏశిక్ష పడుతుందో పాతకాలంవారికి అతి మామూలుగా తెలిసిపోయేది.ఆ విషయాలు సామెతలుగా వాడుకమాటలుగా నిత్యజీవితంలో కలసిమెలసి ఉండేవి. ఇప్పటివారికి అవి తెలియను కూడా తెలియవు.ఇదొక దౌర్భాగ్యం.తెలిసినా ఎవరూ ఆగమంటే ఆగరు.ఇది ఇంకొక మహాదౌర్భాగ్యం.

ఈ లగ్నానికి సూర్యుడు బాధకుడు.కనుక నేత్రదోషం ఉన్నది.ద్వాదశాదిపతి అయిన బుధుడు బాధకుడైన సూర్యునితో కలసి దోషాన్ని పంచుకోవడమే గాక మారకశక్తి కలిగిన కేతువు యొక్క నక్షత్రంలో ఉన్నాడు.కనుక ఇతని ఎడమ కంటికి గండం స్పష్టంగా కనిపిస్తున్నది.

అదీగాక ఈ లగ్నానికి ప్రబలదోషీ మారకుడూ అయిన కుజుడు ద్వాదశంలో నేత్రకారకుడైన చంద్రుని నక్షత్రంలో కూర్చుని ఉన్నాడు.సూర్యుడు కుడికంటికీ చంద్రుడు ఎడమకంటికీ సూచకులనేది జగమెరిగిన జ్యోతిష్య సూత్రం.కనుక ఎడమకంటికి ప్రమాదాన్ని సూచిస్తున్నాడు.లగ్నానికి ఇరువైపులా ఉన్న శనికుజులవల్ల ఈ జాతకానికి లగ్నపాపార్గళదోషం పట్టింది.తద్వారా ముఖానికి ప్రమాదం జరుగుతుందన్న సూచన ఉన్నది.

ఇతను మూడేళ్ళ వయస్సులో ఉండగా తండ్రి పనిముట్లతో ఆడుకుంటూ కంటి దగ్గర ఒక అట్టముక్కలాంటి దానిని పెట్టుకుని దానిలోకి ఒక మేకును గుచ్చాలని ప్రయత్నించాడు.ఆ ప్రయత్నంలో మేకు అట్టముక్కను చీల్చుకుని ఇతని కంటిలో దిగబడింది.ఈ సంఘటన బుధ/శుక్ర దశలోగాని బుధ/కేతు దశలోగాని జరిగింది.బుధుడు ఏ విధంగా ఎడమకంటిని సూచిస్తున్నాడో,ఏ విధంగా దోషాన్ని సంతరించుకున్నాడో పైన వివరించాను.కేతువు మారకుడు.శుక్రుడైతే లగ్నదోష పూరితుడైనాడు.

సూర్యుని బాధకాదిపత్యం వల్ల తండ్రికి చెందిన పనిముట్ల వల్లే ఇతని కన్ను పోయింది.భయంకరమైన లగ్నదోషంవల్ల తన కన్ను తానే పోడుచుకునే స్తితి కల్పించబడింది.క్రమేణా కన్ను సెప్టిక్ అయి అది రెండవ కంటికి కూడా సోకి ఇతనికి రెండు కళ్ళూ పోయాయి.రెండవ కన్ను ఎందుకు పోయిందో చూద్దాం.

కుడికంటిని సూచించే వృశ్చికంలో శని కూర్చుని ఉన్నాడు.శని ఈ లగ్నానికి మంచివాడే.అయితే మారకస్థానంలో ఉండటం ఇతని మంచితనాన్ని పాడు చేసింది.కుజుని ఇంటిలో శని స్తిమితంగా ఉండలేడు.పైగా నెప్ట్యూన్ కి అతిదగ్గరగా ఉన్నాడు.కనుక దోషపూరితుడైనాడు.

సహజరాశిచక్రంలో ప్రధమం కేతుగ్రస్తమైంది.కేతువు యమాధిష్టితమైన భరణీ నక్షత్రంలో ఉన్నాడు.అది లగ్నాధిపతి నక్షత్రంకూడా అయింది.కనుక ముఖానికీ కంటికీ గండం సూచితం అవుతున్నది.ద్వితీయాదిపతి అయిన శుక్రుడు బుధనక్షత్రంలో ఉన్న చంద్రునిచే చూడబడుతున్నాడు.

ఇక ద్వాదశాదిపతి అయిన గురువు శనిరాశిలో ఉంటూ రాహుదృష్టిలో ఉన్నాడు.ఇది పైన వివరించిన పూర్వకర్మను సూచిస్తున్నది.దీనికి దోహకంగా లగ్నం శనికుజ దృష్టులతో పాపార్గళ దోషానికి లోనైంది.

మారకుడైన కుజుడు నవాంశలో నీచస్థితిలో ఉండి దారుణమైన పాపత్వాన్ని సంతరించుకుని ఉన్నాడు.అందుకే తనచేతితో తన కంటినే పొడుచుకునేటట్లు చేశాడు.అదికూడా ఎడమకంటికి అధిపతి అయిన బుధునితో కలసి ఉండటం వల్ల ఎడమకంటికే ప్రమాదం వచ్చింది.

ఆ సమయానికి గోచారకుజుడు లగ్నంలోకి వచ్చాడు.రాహువు ద్వాదశంలోకి పోయినాడు.శని యధావిధిగా రెండింట ఉన్నాడు.ఇక కళ్ళుపోక ఏమి జరుగుతుంది?రాహువూ కుజుడూ శనీ ఇలా మూడుస్థానాలనూ ఆక్రమిస్తే ఇదికాక ఇంకేమి జరుగుతుందో జ్యోతిష్యవేత్తలకు వివరించపనిలేదు.

అయితే లగ్నాధిపతి శుక్రుడు చతుర్దంలో మిత్రస్థానంలో ఉండటంవల్ల గుడ్డివాడైనా బాగా చదువుకోగలిగాడు.బ్రెయిలీలిపిని సృష్టించి ఎందరికో మేలు చెయ్యగలిగాడు.దానికి దశమంలోని పూర్ణచంద్రుడూ అతనిపైన గల శుక్రదృష్టీ కారణాలు.

శుక్రుడు ఆత్మకారకుడు.కారకాంశ కన్య.అక్కడనుంచి తృతీయమూ అష్టమమూ దెబ్బ తినడంవల్ల మధ్యాయుష్కుడై 6-1-1852 న సూర్య/చంద్ర/శని/కేతు దశలో 43 ఏళ్లకే మరణించాడు.సూర్యచంద్రులకుగల దోషాన్ని పైనే వివరించాను.శనికేతువులిద్దరూ మారకస్థానంలో ఉన్నారు.వీరిలో కేతువు కుజున్ని సూచిస్తున్నాడు.కనుక ఈ సమయంలో మరణించాడు.

ఇతని కళ్ళు పోవడానికి ఏ గ్రహయోగాలు కారణం అయ్యాయో మరణానికీ అవే యోగాలు కారణం అయ్యాయి.అంటే పూర్వజన్మ పాపం ఇతన్ని జీవితమంతా వెంటాడుతూనే ఉందనీ మధ్యాయుష్క మరణాన్నికూడా అదే తెచ్చిందనీ తెలుస్తున్నది.

ఈ లగ్నానికి మంచివాడుకాని గురువు షష్టాధిపతిగా పంచమంలో ఉండటం చూస్తే ఇతనికి పూర్వకర్మ బాగాలేదని తెలుస్తుంది.పైగా నవమాధిపతి అయిన బుధునికి ఇంత దోషం ఆపాదించబడటం కూడా దీనినే సూచిస్తుంది. పై గ్రహస్తితులనుబట్టి ఆపాపం ఏమిటో తేలికగా ఊహించవచ్చు.కాని అలాంటివి వ్రాయడమూ చదవడమూ మంచిదికాదు.అవి వినడానికి అంత బాగుండవు కూడా.కనుక వ్రాయడం లేదు.

ఇటువంటి అనలిటికల్ స్కిల్ వల్లే పాతకాలంలో జ్యోతిష్యవేత్తలు ఒకని జాతకం చూడగానే అతని జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పగలిగేవారు.

అయితే,పుట్టిన వెంటనే జాతకం చూచి,ఈ దోషాన్ని గమనించి,పరిహారాలు చేస్తే,ఇలా జరుగకుండా ఉంటుందా? అనే ప్రశ్న తలెత్తుతుంది.పరిహారం చేస్తే దోషం ఉపశమిస్తుందనీ పోతుందనీ భ్రుగు,గర్గ,పరాశరాది మహర్షులు చెప్పినారు.ఒకవేళ చేసిఉంటే ఏమయ్యేది అని ఇప్పుడు ఊహించడం సరికాదు.ఇతని తల్లిదండ్రులకు భారతీయజ్యోతిష్యం తెలిసే అవకాశం లేదు. తెలిసినా పరిహారం చేద్దామని బుద్ధి పుట్టాలి.మోసగాడు కాని జోస్యుడు దొరకాలి.పరిహారం చెయ్యాలి.ఇన్ని చిక్కులను దాటగలిగితే ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది.

కాని అలా జరగకుండా పూర్వకర్మ అడుగడుగునా అడ్డు పడుతుంది. అందులోనూ దోషం బలీయంగా ఉన్నపుడు పరిహారం జరగనివ్వకుండా ప్రకృతిశక్తులు అనుక్షణమూ అడ్డుకుంటాయి.వాటిని దాటి పరిహారం చెయ్యగలిగితే దోషం పోవడం ఖాయం.కానీ అంత శక్తి ఎవరికుంటుంది?

అందుకే,పుట్టిన పన్నెండేళ్ళవరకూ జాతకం చూడరాదు అనేమాట నేను అంతగా హర్షించను.కొందరు జ్యోతిష్కులు ఈమాటను చెబుతారు.కాని ఇది నేను ఒప్పుకోను.ఈలోపలే జరగాల్సిన దారుణం జరిగితే ఇక ఆపైన జాతకం చూచి ఉపయోగం ఏముంటుంది?కనుక శిశువు పుట్టిన వెంటనే జాతకం చూచి బాలారిష్టాలు ఏమైనా ఉంటే దోషపరిహార శాంతులు జరపడం ఉత్తమం.బాలారిష్టం అంటే అర్ధం కూడా అదే.

పూర్వకాలంలో మహారాజులూ చక్రవర్తులూ కూడా ఇదేపని చేసేవారు.వాళ్ళు తెలివితక్కువవారు కారనీ మనకంటే చాలా లౌక్యులనీ,జ్ఞానులనీ,జీవితాన్ని మనకంటే ఎంతో చూచినవారనీ గుర్తుంటే జ్యోతిష్యశాస్త్రాన్ని విమర్శించేవారి నోళ్ళు టక్కున మూతపడతాయి.

ఈవిధంగా ఎన్ని జాతకాలు చూచినా జ్యోతిష్యశాస్త్రం యొక్క అద్భుతమైన మహత్యం మళ్ళీ మళ్ళీ ఋజువౌతూనే ఉంటుంది.కర్మసిద్ధాంతం నిజమే అనేది కూడా ఎన్నిసార్లైనా ఋజువౌతూనే ఉంటుంది.