Pages - Menu

Pages

17, డిసెంబర్ 2013, మంగళవారం

సాధారణ జీవితంలో...

సాధారణ జీవితంలో 
సమున్నత సత్యం అందివచ్చింది

నీటి చెలమలో నీలాకాశం
నింగి స్వర్గాన్ని నేలకు తెచ్చింది

అనుక్షణికపు అల్పత్వంలో
అమరత్వం అవధులు దాటింది

నేను వెదికే నిత్యసత్యం
నా చుట్టూ నిలచి నవ్వింది

12, డిసెంబర్ 2013, గురువారం

పిచ్చి నాకు-మందు నీకు

పోయినవారం ఒకరోజున మధ్యాన్నంపూట ఏదో పనిమీద మార్కెట్లో ఉన్నాను.పనిచూసుకుని ఇంటికి బయలుదేరుతుంటే పరిచయస్తుడు ఒకాయన ఎదురయ్యాడు.

కుశలప్రశ్నలు గట్రా అయ్యాక 'సామవేదం షణ్ముఖశర్మగారు లలితా సహస్ర నామముల మీద ప్రవచనాలు ఇస్తున్నారు.రాకూడదూ?' అని అడిగాడు.

నేను నవ్వి ఊరుకున్నాను.సామవేదంగారు గతవారంగా గుంటూర్లో ప్రవచనాలు ఇస్తున్నారని నాకు తెలుసు.

పరిచయస్తుడు ప్రతి ప్రవచనానికీ ఉపన్యాసానికీ ముందువరసలో ఉంటాడు. గుంటూరు కాక తిరుపతీ,హైదరాబాద్ వంటి ఇతర ఊళ్లకు కూడా అటువంటి ఏవైనా పెద్ద కార్యక్రమాలకు వెళ్ళివస్తూ ఉంటాడు.మంచివాడే కాని పాపం కొంచం చాదస్తుడు.

'శర్మగారు చాలా బాగా చెప్తారు.'అన్నాడు.

'తెలుసు.తిరుపతిలో ఒకసారి విన్నాను' అన్నాను.

'మరి మన ఊళ్ళో కార్యక్రమం జరుగుతుంటే మనం వెళ్ళకపోతే ఎలా?' అన్నాడు.

'మీరు వెళ్తున్నారు కదా' అన్నాను.

'నేనెలాగూ వెళతాను.మీరు కూడా రండి.చాలాబాగా చెప్తున్నారు.లలితా సహస్ర నామముల గురించి ఎన్నో విషయాలు.' అన్నాడు.

'ఏం చెప్పారు?' అడిగాను.

'చాలా చెబుతున్నారు.వింటే మీకే అర్ధమౌతుంది' అన్నాడు.

నవ్వితే బాగుండదని ఊరుకున్నాను.

'ఎన్నాళ్ళ నుంచి మీరు ఈ కార్యక్రమాలు వింటున్నారు?' అడిగాను

'గుర్తులేదుగాని చాలా ఏళ్లనుంచి వెళుతూనే ఉన్నాను.అదలా ఉంచండి. సాయంత్రం వస్తున్నారా మరి?' అడిగాడు.

ఏదో ఒకటి చెప్పేవరకూ ఊరుకునేలా లేడు.

'నేను చిన్నప్పుడు బాగానే చదువుకున్నాను.ప్రస్తుతం వయోజన విద్య అవసరం లేదు' అన్నాను.

ఆయనకు అర్ధం కాలేదు.

'తెలుసు సార్.నేనుకూడా ఎమ్మే బీయీడీ చేశాను.అయితే దానికీ దీనికీ సంబంధం ఏముంది?అది మామూలు విద్య.ఇది ఆధ్యాత్మికం.మనం చదువుకున్న చదువు వేరు.ఇది వేరు' అన్నాడు.

నాకు నవ్వొచ్చింది.ఈసారి బయటకే నవ్వేశాను.

'నవ్వడం కాదు.మీలాంటి వాళ్ళు కూడా రాకపోతే ఎలా? ఇలా ఎవరికి వారు ఊరుకోబట్టే మన హిందూధర్మం ఇలా క్షీణిస్తున్నది.మనధర్మం గురించి మనమతం గురించి మనం తెలుసుకోవాలి.అలా తెలుసుకోవాలంటే ఇలాంటి ఉపన్యాసాలు వింటూ ఉండాలి.' అన్నాడు.

వదిలేటట్టు లేడనిపించింది.

చుట్టూ చూశాను.ఒక మంచి హోటల్ దగ్గరలోనే కనిపించింది.అక్కడ భోజనం బాగుంటుంది.

'సరే.అలాగే చేద్దాం.ఆ హోటల్లో భోజనం చేస్తూ మాట్లాడుకుందామా?' అడిగాను.

'నేను ఇప్పుడే భోజనం చేసి ఇంట్లోంచి బయల్దేరాను.కావాలంటే మీ తోడుగా కూచుంటాను.కాని తినను.' చెప్పాడు.

'అలా తినకుండా ఎవరైనా తోడు కూచుంటే నాకు బాగుండదు.మీరూ నాతో పాటు భోజనం చెయ్యాలి.మధ్యలో లేస్తే ఊరుకోను.నాతో బాటు సుష్టుగా తినాలి.' చెప్పాను.

'లేదండి.ఇప్పుడే అరగంట కూడా కాలేదు.చెయ్యలేను' చెప్పాడు.

'అయినా సరే పరవాలేదు.తినొచ్చు.ఇంకా బలమొస్తుంది.ఈ వయసులో మీకు బలం చాలా అవసరం.' చెప్పాను.

అతను వింతగా చూచాడు.

'సారీ సార్.నావల్ల కాదు.తిన్నది అరగాలిగా మళ్ళీ తినాలంటే.ఇపుడే అరగంట కూడా కాలేదు.' అన్నాడు.

'ఇంట్లో తినడానికీ హోటల్లో తినడానికీ సంబంధం ఏముంది?ఇంటి తిండి వేరు.హోటల్ తిండి వేరు.ఇప్పుడే తింటే మాత్రం ఏం?మళ్ళీ తినొచ్చు.ఏం పరవాలేదు.అదే అరిగిపోతుంది. పరవాలేదు రండి' అంటూ అతని చెయ్యి పట్టుకుని హోటల్లోకి దారితీశాను.

అతను ఆగిపోయి వింతగా చూస్తున్నాడు.

'ఏంటి అలా చూస్తున్నారు? నా మాటలు అర్ధం కాలేదా?' అడిగాను.

అతను మెల్లిగా చెయ్యి విడిపించుకుని అనుమానంగా చూస్తున్నాడు.

నేనూ ఆగిపోయి 'మీ ప్రశ్నలకు మీరే సమాధానాలు ఇచ్చారు'. అన్నాను నవ్వుతూ.

'ప్రశ్నలేంటి?నేనేం అడిగాను?జవాబులేమిచ్చాను?ఏంటి సార్ ఇదంతా?' అన్నాడు ఇబ్బందిగా చూస్తూ.

'ఏం లేదు.నాకీ మధ్యన కొంచం పిచ్చెక్కింది.కాని మందు మాత్రం మీకే అవసరం.మీరు మందేసుకుంటే నాకు తగ్గిపోతుంది.ఒకవేళ అప్పటికీ నాకు తగ్గకపోతే సామవేదంగారికి కూడా మీచేత్తో ఒక డోస్ వెయ్యండి.అప్పుడు గ్యారంటీగా సరిపోతుంది.వస్తా'అంటూ అతన్నక్కడే ఒదిలేసి వెనక్కు తిరిగి చూడకుండా నాదారిన నేను ఇంటికి బయలుదేరాను.

4, డిసెంబర్ 2013, బుధవారం

రాష్ట్రాల విభజనకు ఒక మంచి పరిష్కారం

ప్రత్యేకరాష్ట్రాల ఏర్పాటుకోసం చాలా రాష్ట్రాలలో ఉద్యమాలు జరుగుతున్నాయి.ఇవ్వాలని కొందరూ ఒద్దని కొందరూ ఒకటే గొడవ చేస్తున్నారు.నా దృష్టిలో అసలు ఇదొక సమస్య కానేకాదు.

అసలు ఇంత సింపుల్ విషయానికి ఇంత చర్చా,గొడవా,గోలా అవసరమా అని నాకెప్పటినుంచో ఒక పెద్దసందేహం.వీళ్ళందరూ ఎందుకింత గొడవ పడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు.విడగొట్టుకునే చిత్తశుద్ధి ఉండాలే గాని దీనికి పరిష్కారం చాలా తేలిక.పల్లెల్లో అన్నదమ్ములు ఎలా విడిపోతున్నారు?ఇదీ అంతే.మనం ఎక్కడికి పోతున్నాం?ఇదే దేశంలో ఉంటాం కదా.విభజన వల్ల నష్టం ఏముంది?

నిర్మించుకోవడం మనకు ఎలాగూ తెలియదు.ఆ సంగతి లోకానికి ఎప్పుడో తెలుసు.సరిగ్గా విడగొట్టుకోవడం కూడా మనకు చాతకాదని ఇప్పుడు తెలుస్తోంది.మన తెలివి తెల్లవారినట్టే ఉన్నది.తెలుగుజాతి మనది అని పాడుకోటం తప్ప మనకు తెలిసినది శూన్యం అని దీన్నిబట్టి చక్కగా తెలుస్తోంది.

మాట్లాడే భాషలో యాసను బట్టీ,ప్రాంతీయ సంస్కృతిని బట్టీ ఒక్కొక్క రాష్ట్రం ఏర్పడితే బాగుంటుంది అన్న భావన ఇప్పుడు వినిపిస్తున్నది.తద్వారా ప్రగతి కూడా వేగంగా ఉంటుంది అని అంటున్నారు.అది నిజమే కావచ్చు. ఇప్పుడు తెలంగాణా ఇస్తే ముందుముందు ప్రత్యెకరాష్ట్రాల ఉద్యమాలు ప్రతి రాష్ట్రంలోనూ ఇంకా ఉధృతం కావచ్చు అని కొందరంటున్నారు.అప్పుడు ఏం చెయ్యాలి?అంటే,దీనికి నా దగ్గర ఒక మంచి పరిష్కారం ఉన్నది.

మనకు స్వతంత్రం రావడానికి ముందు 562 రాజ్యాలు(princely states)మనదేశంలో ఉండేవి.మళ్ళీ ఆ రోజుల్లోకి పోయి దేశాన్ని చిన్నచిన్న ముక్కలుగా విభజించుకుంటే సరి.అయిపాయె.అభివృద్ధి శరవేగంగా ఉంటుంది.ఒకవేళ అభివృద్ధి ఉన్నా లేకున్నా జనాభా అభివృద్ధి ఎలాగూ ఉండనే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు.

ప్రస్తుతం మనకు 671 జిల్లాలున్నాయిట.ఒకపని చేస్తే పోతుంది.ప్రతి జిల్లానూ ఒక రాష్ట్రంగా డిక్లేర్ చేసేస్తే అభివృద్ధి శరవేగంతో ఏం ఖర్మ,రాకెట్ వేగంతో ముందుకు పోతుంది.అయితే రాకెట్ కూలిపోయినట్లు అదికూడా ఏ సముద్రంలోనో కూలిపోవచ్చు అంటే మళ్ళీ నెగటివ్ యాటిట్యూడ్ అని కొందరు అనవచ్చు.ఎవరేమనుకున్నా రాకెట్లు అప్పుడప్పుడూ కూలిపోవడం వాస్తవమే గనుక ఈ వాదనను కాదనలేం.

మన దేశంలో ప్రతిజిల్లాకూ భాషలో యాస బిన్నంగా ఉంటుంది.ఒకే భాష మాట్లాడే ఒకేరాష్ట్రంలో కూడా జిల్లాజిల్లాకూ యాస మారుతుంది. ప్రాంతీయంగా ఆహారపు అలవాట్లూ మారతాయి.కడప జిల్లాలో తినే ఆహారం కరీంనగర్లో తినరు.ప్రకాశం జిల్లాలో తినే ఆహారం గోదావరి జిల్లాలో తినరు.ప్రతి జిల్లాకూ తెలుగుభాష మాట్లాడే తీరూ యాసా తేడాగా ఉంటాయి.అలాగే ప్రతి రాష్ట్రంలోనూ పరిస్తితి చక్కనైన ప్రాంతీయభేదాలతో ఇలాగే భిన్నభిన్నాలుగా ఉంటుంది.కనుక ప్రతిజిల్లానూ ఒక రాష్ట్రంగా విడగోట్టుకుంటే తప్ప మనదేశం ఎప్పటికీ ప్రగతిని సాధించలేదు.వేగంగా ముందుకు పోలేదు అనేది సింపుల్ లాజిక్.

ఈ వేగంగా ముందుకు పోయె ప్రక్రియలోకూడా దిశతప్పి ఏ సముద్రంలోకో పోయే అవకాశం కూడా ఉంటుంది.దానికి తగ్గట్టు మన దేశానికి మూడు వైపులా సముద్రం ఎలాగూ ఉన్నది.మన అభివృద్ధిని ఊహించేనేమో ప్రకృతి ఈ వరాన్ని ఎప్పుడో మన దేశానికిచ్చింది.ఎవరికి దగ్గరగా ఉన్న సముద్రంలోకి వారు అభివృద్ధి చెందుతూ వేగంగా ముందుకు పోవచ్చు. మునిగీపోవచ్చు.అక్కడకూడా తేడాలొస్తే సముద్రాన్ని కూడా తడికెలతో 671 ముక్కలుగా విభజించుకుని ఎవరి రేవులో వాళ్ళు మునిగిపోవచ్చు.

మరి ఏ సముద్రమూ లేని ఉత్తరాదివాళ్ళు ఏం జెయ్యాలి? అనే సందేహం కొందరు తెలివితక్కువ దద్దమ్మలకు రావచ్చు.వారి అజ్ఞానానికి జాలిపడుతూ దానికీ ఒక పరిష్కారం సూచిస్తున్నాను.వాళ్ళంతా హిమాలయాల మీదికెక్కి అవతలివైపునున్న చైనాలోకి అభివృద్ధి చెందవచ్చు(దూకొచ్చు).

ఉంకొంతమంది మేదావులకు ఉంకొక సందేహం రావచ్చు.జిల్లాలో కూడా తాలూకాకీ తాలూకాకీ మళ్ళీ తేడాలున్నాయి.జాగ్రత్తగా గమనిస్తే భాషలోనూ యాసలోనూ తిండిలోనూ గుడ్డలు కట్టుకునే తీరులోనూ ఆ తేడాలు అర్ధమౌతాయి.కనుక ప్రతి తాలూకానీ ఒక రాష్ట్రంగా ఎందుకు డిక్లేర్ చెయ్యకూడదు?

అబ్బ! భలే అయిడియా వచ్చింది.అలాగే చేసుకుందాం.ఇబ్బంది లేదు.మన దేశంలో ప్రస్తుతం 5500+ తాలూకాలున్నాయి.వాటినన్నింటినీ రాష్ట్రాలుగా డిక్లేర్ చేసుకుందాం.అప్పుడు అభివృద్ధి ఇంకా అనూహ్యంగా పెరిగిపోతుంది. ఆ అభివృద్ధి కూడా చాలకపోతే ప్రస్తుతం ఉన్న 6,30,000+ పల్లెలనే రాష్ట్రాలు అనుకుంటే ఇంకా బాగుంటుంది.అంతమంది ముఖ్యమంత్రులూ, అంతంతమంది ఇతర మంత్రులూ...ఎంత బాగుంటుందో?

అప్పుడు దేశంలో ప్రతి వంద ఇళ్ళకొక ముఖ్యమంత్రీ,ఇంటికొక మంత్రీ ఉన్నా ఆశ్చర్యం లేదు.ఇక ప్రతి ఇంటినుంచీ కలెక్టర్లూ ఎస్పీలూ ఇతర సివిల్ సర్వేంట్లూ చెప్పాల్సిన పనేలేదు.కుప్పలు తెప్పలుగా ఉంటారు.ఎక్కడ చూచినా మంత్రులే ఎక్కడ చూచినా సివిల్ సర్వెంట్లే.ఎక్కడ చూచినా కాంట్రాక్టులే.ప్రతి వీధిలోనూ అభివృద్ధి పనులే.అద్భుతమైన ప్రగతి ఉంటుంది. గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం అప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది.ఆ రకంగా పాపం ఆయన కలనూ నిజం చేసినవాళ్ళం అవుతాం.

ఇంకాకూడా చాలకపోతే ప్రతి ఇంటినీ ఒక రాష్ట్రంగా అనుకుంటే ఇంకా బాగుంటుంది.ఈ అవుడియాకి తిరుగే లేదు.ఇంటింటికీ ఒక ప్రభుత్వం ఉంటుంది.యజమాని ముఖ్యమంత్రి కావచ్చు.ఇల్లాలు ఆర్ధికమంత్రి ఎలాగూ అవుతుంది.మిగిలిన పోస్ట్ లను వీలును బట్టి నామినేట్ చేసుకోవచ్చు.

ఇక ఒకటే ప్రగతి.ఎక్కడ చూచినా దేశం కళకళలాడుతూ ఉంటుంది.ఎవరి బడ్జెట్ వారిదే.ఎవరి కేటాయింపులు వారికే.ఎవరి ప్రగతి వారిదే.చదువు అక్కర్లేదు.పేదరికం ఉండనే ఉండదు.అందరూ హాయిగా ప్రభుత్వనిధులు బొక్కుతూ కూచోవచ్చు.ప్రతి ఇంటినుంచీ ఎవడోఒకడు ఏదో పదవిలో ఉంటాడు గనుక నిరుద్యోగసమస్య రాత్రికిరాత్రి పరిష్కారం అయిపోతుంది.

అయితే ఒక్కటే సమస్య మిగులుతుంది.ఇంతమంది ప్రజాప్రతినిధులు కూర్చునే సభ ఎక్కడ కట్టాలి?ఎలా కట్టాలి?అంత పెద్ద కాంట్రాక్ట్ ఎవరికి ఇవ్వాలి? అదే అసలైన పెద్ద సమస్య అయి కూచుంటుంది.

దానికీ నాదగ్గిర ఒక పరిష్కారం ఉన్నది.పూర్వకాలంలోని కురుక్షేత్రయుద్ధం లాగా ప్రతి ఏడాదీ ఒక దేశవ్యాప్త యుద్ధం పెట్టుకుంటే అందులో అంతిమంగా ఎవరు గెలిస్తే,వారు ఆ కాంట్రాక్ట్ చేజిక్కించుకోవచ్చు.అయితే దీంట్లో ఉంకో సమస్యుంది.సభ జరిగేటప్పుడు వీళ్ళు ఇసుకతో కట్టిన భవనం ఎలాగూ కూలిపోతుంది గాబట్టి ప్రతినిధులలో చాలా పోస్ట్ లు ఆటోమేటిగ్గా ఖాళీ అవుతాయి.అప్పుడెలా?

అసలు ఇదొక సమస్య కానేకాదు.ప్రతిసారీ శీతాకాల సమావేశాల తర్వాత వేసంకాలంలో మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ ఇచ్చి సభాభవనం కట్టుకుంటూ ఉంటే సరిపోతుంది.మళ్ళీ శీతాకాలంలో అది కూలిపోవడం.వేసంకాలంలో కట్టుకోవడం.ప్రతేడాదీ ఒక కాంట్రాక్ట్ కురుక్షేత్రం పెట్టుకోవడం.సింపుల్.భలేగా ఉంటుంది.ఇలా ఒకపదేళ్లు గడిచేసరికి జనాభా కూడా బాగా తగ్గుతుంది.మన జనాభా మనమే తగ్గించుకుంటున్నాం గనుక పాకిస్తాన్ చైనాలతో విరోధం కూడా తగ్గుతుంది.తద్వారా ఉపఖండంలో శాంతి నెలకొంటుంది.తద్వారా ప్రపంచశాంతికీ మనం దోహదం చేసినవాళ్ళమౌతాం.మన ప్రగతీ బ్రహ్మాండంగా ఉంటుంది.దేశం ప్రగతి చెందాలంటే మనల్ని మనం ఇట్టా ఇబజించుకోడమే మారగం.

ప్రస్తుతం మన దేశంలో 6,30,000+ పల్లెలున్నాయిట.అర్జంటుగా మన దేశాన్ని 6,30,000+ రాష్ట్రాలుగా విభజించుకుందాం.మన దేశం త్వరగా ముందుకు పోవాలంటే ఇదొక్కటే మార్గం.అందరూ కలసి త్వరగా ముందుకు రండి.ఈ అభివృద్ధి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. స్వర్ణభారతాన్ని నిర్మించుకుందాం.

చర్చిల్ మహాశయుడు ఒక మాటన్నాడు.'భారతదేశంలో నాయకులు అందరూ గడ్డిబొమ్మలు(men of straw). ఇప్పుడుగనుక మనం స్వతంత్రం ఇస్తే నిమిషాల్లో దేశాన్ని ముక్కలు చెక్కలు చేసుకోగల సమర్ధులు' అని విన్స్టన్ చర్చిల్ ఎప్పుడో చెప్పాడు.అంత పెద్దాయన అప్పుడే చెప్పినప్పుడు మనం కనీసం ఇప్పుడైనా చెయ్యకపోతే ఎలా?ఆయన ఆత్మ క్షోభించదూ?

అందుకే కదలండి ముందుకు.నడవండి విందుకు.అదుగో ప్రగతి ఎలా పిలుస్తోందో చూడండి.ఏందీ?ఇంత జెప్పినా గూడా ఇందులో పెగతి యాడా గనబట్టం లేదా?అయితే మీకు దుట్టిదోసం ఉన్నట్టే.నేనేం జైలేను.మిమ్మల్ని నేం బాజైలేను బాబోయ్.ఇక మీ కర్మ.

కాలజ్ఞానం -21

డిసెంబర్ 3 నుంచి 15 వరకూ ఉన్న ఒక గ్రహస్తితి వల్ల రాష్ట్ర పరిస్తితి మరింత దురదృష్టకరమైన పీటముడిగా మారుతుంది.రాజకీయపరిస్తితి ఇంకా దిగజారుతూ పోతుంది.డిసెంబర్ 9 న నాయకత్వం సందిగ్ధపరిస్థితిలో పడుతుంది.నాయకులు ప్రజలపైనే కుట్ర చేస్తున్నారా అన్న అనుమానం ప్రజలలో బలపడుతుంది.15 వ తేదీ దగ్గరకు వచ్చేకొద్దీ ఆవేశాలు ఎక్కువౌతాయి.సంయమనం కోల్పోయిన నాయకులు రకరకాల ప్రకటనలతో ప్రజలను గందరగోళంలోకి ప్రవేశపెడతారు.ఆ తర్వాత ఏం జరుగుతుందో మళ్ళీ చూద్దాం.

2, డిసెంబర్ 2013, సోమవారం

లూయీ బ్రెయిలీ జాతకం-అంధత్వయోగాలు

మొన్న అంధుల ఆశ్రమానికి వెళ్ళినప్పుడు లూయీ బ్రెయిలీ జాతకం పరిశీలిద్దామని తోచింది. ఎందరిలాగానో  అతను కూడా గుడ్డివాడైనా తన ఖర్మను తిట్టుకుంటూ కూర్చోకుండా బ్రెయిలీ లిపిని తయారు చేసి తద్వారా నేడు లక్షలాది అంధులకు వెలుగును ప్రసాదించాడు.అందుకే అతని జాతకంలో ఏ గ్రహస్తితి ఈ యోగాన్ని ఇచ్చిందో చూద్దామని అనుకున్నాను.

లూయీ బ్రెయిలీ 4-1-1809 న ఫ్రాన్స్ లో కూవ్రే అనే ఊళ్ళో పుట్టినాడు.స్విస్ ఎఫిమెరిస్ వారి ఆస్ట్రో డేటాబాంక్ ప్రకారం జనన సమయం ఉదయం నాలుగు గంటలు.ఆ సమయానికి వచ్చె జాతకచక్రం ఇక్కడ చూడవచ్చు.

జాతకంలో రెండూ పన్నెండూ భావాలు కళ్ళకు సూచికలు.సూర్యచంద్రులు నేత్రాలకు సహజకారకులు.సహజరాశి చక్రంలో ఈ భావాధిపతులైన గురుశుక్రులు కూడా నేత్రాలకు కారకులే.ఇప్పుడు బ్రెయిలీ జాతకం ఏమంటున్నదో చూద్దాం.

ఇతని జాతకం చూడగానే స్ఫురించే విషయం లగ్నంలో రాహువూ,లగ్నానికి గల పాపార్గళమూ.ఇది 'నేత్రహీనయోగం' అనబడుతుంది.చాలా లగ్నాలకు పాపార్గళం ఉంటుంది.అది వింతకాదు.మేషానికీ తులకూ పాపార్గళం ఉండటం ఒక ప్రత్యేకత.అప్పుడు ఆ రెండు పాపగ్రహాల సప్తమదృష్టి వల్ల సప్తమానికి కూడా పాపార్గళం ఉంటుంది.ఈ రెంటిలో మళ్ళీ తులకు ఈ స్తితి ఉంటే అది మరీ ప్రత్యేకత అవుతుంది.ఎందుకు?

మేషానికి ఈ స్థితి ఉంటే తుల సహజసప్తమం కనుక దోషం లగ్నానికీ సప్తమానికీ పంచబడుతుంది.అదే తులకు ఉంటే,రెండూ లగ్నాలే అవుతాయి గనుక లగ్నదోషం రెండింతలు అవుతుంది.అదీ భేదం.ఈ విధమైన సూక్ష్మపరిశీలన జ్యోతిష్యశాస్త్ర విద్యార్ధికి చాలా అవసరం.

ప్రస్తుతజాతకంలో లగ్నమైన తులవల్ల సహజలగ్నానికి కూడా ఆదోషం పట్టింది.జాతకలగ్నమూ సహజలగ్నమూ కూడా దోషాన్ని సంతరించు కున్నాయి.కనుక తలకూ కళ్ళకూ ప్రమాదం ఖచ్చితంగా ఉన్నదని జాతకం చూడగానే తెలుస్తుంది.చిన్నప్పుడు ఆయా దోషపూరిత దశలు గనక నడిస్తే,ఆ ప్రమాదం ఆయా వయస్సుల్లో ఖచ్చితంగా జరుగుతుంది.ఇతను బుధ నక్షత్రంలోనే జన్మించాడు గనుక చిన్నప్పుడు అదేదశ జరుగుతుంది. ఇక కళ్ళు ఎలా మిగులుతాయి?బుధుడు ఈ లగ్నానికి మంచివాడే.అయితే దోషం ఎలా వచ్చిందో ఇప్పుడు వివరిస్తాను. 

లగ్నంలో రాహువూ యురేనస్సూ ఒకే బిందువు మీద స్వాతీనక్షత్రం నాలుగో పాదంలో ఉన్నారు.ఇది నవాంశలో గురువుదైన మోక్షరాశి,మీనరాశి అవుతుంది.కనుక ఇతను గతజన్మలో ఆధ్యాత్మికంగా మహనీయులైన వారికి ఆకతాయితనంతో ద్రోహం చెయ్యడంవల్ల ఈజన్మలో కళ్ళు పోగొట్టుకున్నాడని తెలుస్తున్నది.

పాతతరంలో పల్లెటూళ్ళలో ఉన్నవారికి కొన్ని సామెతలు గుర్తుంటాయి. ఎవరైనా ఏదైనా ఘోరమైన తప్పు చేస్తుంటే -'ఒరే వద్దురా కళ్ళు పోతాయిరా' అని పెద్దలు హెచ్చరించేవారు.ప్రకృతిలో ఏపనికి ఏశిక్ష పడుతుందో పాతకాలంవారికి అతి మామూలుగా తెలిసిపోయేది.ఆ విషయాలు సామెతలుగా వాడుకమాటలుగా నిత్యజీవితంలో కలసిమెలసి ఉండేవి. ఇప్పటివారికి అవి తెలియను కూడా తెలియవు.ఇదొక దౌర్భాగ్యం.తెలిసినా ఎవరూ ఆగమంటే ఆగరు.ఇది ఇంకొక మహాదౌర్భాగ్యం.

ఈ లగ్నానికి సూర్యుడు బాధకుడు.కనుక నేత్రదోషం ఉన్నది.ద్వాదశాదిపతి అయిన బుధుడు బాధకుడైన సూర్యునితో కలసి దోషాన్ని పంచుకోవడమే గాక మారకశక్తి కలిగిన కేతువు యొక్క నక్షత్రంలో ఉన్నాడు.కనుక ఇతని ఎడమ కంటికి గండం స్పష్టంగా కనిపిస్తున్నది.

అదీగాక ఈ లగ్నానికి ప్రబలదోషీ మారకుడూ అయిన కుజుడు ద్వాదశంలో నేత్రకారకుడైన చంద్రుని నక్షత్రంలో కూర్చుని ఉన్నాడు.సూర్యుడు కుడికంటికీ చంద్రుడు ఎడమకంటికీ సూచకులనేది జగమెరిగిన జ్యోతిష్య సూత్రం.కనుక ఎడమకంటికి ప్రమాదాన్ని సూచిస్తున్నాడు.లగ్నానికి ఇరువైపులా ఉన్న శనికుజులవల్ల ఈ జాతకానికి లగ్నపాపార్గళదోషం పట్టింది.తద్వారా ముఖానికి ప్రమాదం జరుగుతుందన్న సూచన ఉన్నది.

ఇతను మూడేళ్ళ వయస్సులో ఉండగా తండ్రి పనిముట్లతో ఆడుకుంటూ కంటి దగ్గర ఒక అట్టముక్కలాంటి దానిని పెట్టుకుని దానిలోకి ఒక మేకును గుచ్చాలని ప్రయత్నించాడు.ఆ ప్రయత్నంలో మేకు అట్టముక్కను చీల్చుకుని ఇతని కంటిలో దిగబడింది.ఈ సంఘటన బుధ/శుక్ర దశలోగాని బుధ/కేతు దశలోగాని జరిగింది.బుధుడు ఏ విధంగా ఎడమకంటిని సూచిస్తున్నాడో,ఏ విధంగా దోషాన్ని సంతరించుకున్నాడో పైన వివరించాను.కేతువు మారకుడు.శుక్రుడైతే లగ్నదోష పూరితుడైనాడు.

సూర్యుని బాధకాదిపత్యం వల్ల తండ్రికి చెందిన పనిముట్ల వల్లే ఇతని కన్ను పోయింది.భయంకరమైన లగ్నదోషంవల్ల తన కన్ను తానే పోడుచుకునే స్తితి కల్పించబడింది.క్రమేణా కన్ను సెప్టిక్ అయి అది రెండవ కంటికి కూడా సోకి ఇతనికి రెండు కళ్ళూ పోయాయి.రెండవ కన్ను ఎందుకు పోయిందో చూద్దాం.

కుడికంటిని సూచించే వృశ్చికంలో శని కూర్చుని ఉన్నాడు.శని ఈ లగ్నానికి మంచివాడే.అయితే మారకస్థానంలో ఉండటం ఇతని మంచితనాన్ని పాడు చేసింది.కుజుని ఇంటిలో శని స్తిమితంగా ఉండలేడు.పైగా నెప్ట్యూన్ కి అతిదగ్గరగా ఉన్నాడు.కనుక దోషపూరితుడైనాడు.

సహజరాశిచక్రంలో ప్రధమం కేతుగ్రస్తమైంది.కేతువు యమాధిష్టితమైన భరణీ నక్షత్రంలో ఉన్నాడు.అది లగ్నాధిపతి నక్షత్రంకూడా అయింది.కనుక ముఖానికీ కంటికీ గండం సూచితం అవుతున్నది.ద్వితీయాదిపతి అయిన శుక్రుడు బుధనక్షత్రంలో ఉన్న చంద్రునిచే చూడబడుతున్నాడు.

ఇక ద్వాదశాదిపతి అయిన గురువు శనిరాశిలో ఉంటూ రాహుదృష్టిలో ఉన్నాడు.ఇది పైన వివరించిన పూర్వకర్మను సూచిస్తున్నది.దీనికి దోహకంగా లగ్నం శనికుజ దృష్టులతో పాపార్గళ దోషానికి లోనైంది.

మారకుడైన కుజుడు నవాంశలో నీచస్థితిలో ఉండి దారుణమైన పాపత్వాన్ని సంతరించుకుని ఉన్నాడు.అందుకే తనచేతితో తన కంటినే పొడుచుకునేటట్లు చేశాడు.అదికూడా ఎడమకంటికి అధిపతి అయిన బుధునితో కలసి ఉండటం వల్ల ఎడమకంటికే ప్రమాదం వచ్చింది.

ఆ సమయానికి గోచారకుజుడు లగ్నంలోకి వచ్చాడు.రాహువు ద్వాదశంలోకి పోయినాడు.శని యధావిధిగా రెండింట ఉన్నాడు.ఇక కళ్ళుపోక ఏమి జరుగుతుంది?రాహువూ కుజుడూ శనీ ఇలా మూడుస్థానాలనూ ఆక్రమిస్తే ఇదికాక ఇంకేమి జరుగుతుందో జ్యోతిష్యవేత్తలకు వివరించపనిలేదు.

అయితే లగ్నాధిపతి శుక్రుడు చతుర్దంలో మిత్రస్థానంలో ఉండటంవల్ల గుడ్డివాడైనా బాగా చదువుకోగలిగాడు.బ్రెయిలీలిపిని సృష్టించి ఎందరికో మేలు చెయ్యగలిగాడు.దానికి దశమంలోని పూర్ణచంద్రుడూ అతనిపైన గల శుక్రదృష్టీ కారణాలు.

శుక్రుడు ఆత్మకారకుడు.కారకాంశ కన్య.అక్కడనుంచి తృతీయమూ అష్టమమూ దెబ్బ తినడంవల్ల మధ్యాయుష్కుడై 6-1-1852 న సూర్య/చంద్ర/శని/కేతు దశలో 43 ఏళ్లకే మరణించాడు.సూర్యచంద్రులకుగల దోషాన్ని పైనే వివరించాను.శనికేతువులిద్దరూ మారకస్థానంలో ఉన్నారు.వీరిలో కేతువు కుజున్ని సూచిస్తున్నాడు.కనుక ఈ సమయంలో మరణించాడు.

ఇతని కళ్ళు పోవడానికి ఏ గ్రహయోగాలు కారణం అయ్యాయో మరణానికీ అవే యోగాలు కారణం అయ్యాయి.అంటే పూర్వజన్మ పాపం ఇతన్ని జీవితమంతా వెంటాడుతూనే ఉందనీ మధ్యాయుష్క మరణాన్నికూడా అదే తెచ్చిందనీ తెలుస్తున్నది.

ఈ లగ్నానికి మంచివాడుకాని గురువు షష్టాధిపతిగా పంచమంలో ఉండటం చూస్తే ఇతనికి పూర్వకర్మ బాగాలేదని తెలుస్తుంది.పైగా నవమాధిపతి అయిన బుధునికి ఇంత దోషం ఆపాదించబడటం కూడా దీనినే సూచిస్తుంది. పై గ్రహస్తితులనుబట్టి ఆపాపం ఏమిటో తేలికగా ఊహించవచ్చు.కాని అలాంటివి వ్రాయడమూ చదవడమూ మంచిదికాదు.అవి వినడానికి అంత బాగుండవు కూడా.కనుక వ్రాయడం లేదు.

ఇటువంటి అనలిటికల్ స్కిల్ వల్లే పాతకాలంలో జ్యోతిష్యవేత్తలు ఒకని జాతకం చూడగానే అతని జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పగలిగేవారు.

అయితే,పుట్టిన వెంటనే జాతకం చూచి,ఈ దోషాన్ని గమనించి,పరిహారాలు చేస్తే,ఇలా జరుగకుండా ఉంటుందా? అనే ప్రశ్న తలెత్తుతుంది.పరిహారం చేస్తే దోషం ఉపశమిస్తుందనీ పోతుందనీ భ్రుగు,గర్గ,పరాశరాది మహర్షులు చెప్పినారు.ఒకవేళ చేసిఉంటే ఏమయ్యేది అని ఇప్పుడు ఊహించడం సరికాదు.ఇతని తల్లిదండ్రులకు భారతీయజ్యోతిష్యం తెలిసే అవకాశం లేదు. తెలిసినా పరిహారం చేద్దామని బుద్ధి పుట్టాలి.మోసగాడు కాని జోస్యుడు దొరకాలి.పరిహారం చెయ్యాలి.ఇన్ని చిక్కులను దాటగలిగితే ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది.

కాని అలా జరగకుండా పూర్వకర్మ అడుగడుగునా అడ్డు పడుతుంది. అందులోనూ దోషం బలీయంగా ఉన్నపుడు పరిహారం జరగనివ్వకుండా ప్రకృతిశక్తులు అనుక్షణమూ అడ్డుకుంటాయి.వాటిని దాటి పరిహారం చెయ్యగలిగితే దోషం పోవడం ఖాయం.కానీ అంత శక్తి ఎవరికుంటుంది?

అందుకే,పుట్టిన పన్నెండేళ్ళవరకూ జాతకం చూడరాదు అనేమాట నేను అంతగా హర్షించను.కొందరు జ్యోతిష్కులు ఈమాటను చెబుతారు.కాని ఇది నేను ఒప్పుకోను.ఈలోపలే జరగాల్సిన దారుణం జరిగితే ఇక ఆపైన జాతకం చూచి ఉపయోగం ఏముంటుంది?కనుక శిశువు పుట్టిన వెంటనే జాతకం చూచి బాలారిష్టాలు ఏమైనా ఉంటే దోషపరిహార శాంతులు జరపడం ఉత్తమం.బాలారిష్టం అంటే అర్ధం కూడా అదే.

పూర్వకాలంలో మహారాజులూ చక్రవర్తులూ కూడా ఇదేపని చేసేవారు.వాళ్ళు తెలివితక్కువవారు కారనీ మనకంటే చాలా లౌక్యులనీ,జ్ఞానులనీ,జీవితాన్ని మనకంటే ఎంతో చూచినవారనీ గుర్తుంటే జ్యోతిష్యశాస్త్రాన్ని విమర్శించేవారి నోళ్ళు టక్కున మూతపడతాయి.

ఈవిధంగా ఎన్ని జాతకాలు చూచినా జ్యోతిష్యశాస్త్రం యొక్క అద్భుతమైన మహత్యం మళ్ళీ మళ్ళీ ఋజువౌతూనే ఉంటుంది.కర్మసిద్ధాంతం నిజమే అనేది కూడా ఎన్నిసార్లైనా ఋజువౌతూనే ఉంటుంది.

1, డిసెంబర్ 2013, ఆదివారం

'పంచవటి' సేవా కార్యక్రమాలు మొదలయ్యాయి

పంచవటి సంస్థ నుంచి మేము తలపెట్టిన సేవా కార్యక్రమాలలో భాగంగా నిన్న గుంటూరులోని 'షిర్డీసాయి దీనజన సేవాసమితి' వారికీ 'మాతృశ్రీ వృద్దాశ్రమానికీ' కొంత ధనసహాయం చెయ్యడం జరిగింది.నేనూ,పంచవటి సభ్యుడూ మిత్రుడూ మదన్ కలసి నిన్న ఈ పని చేశాము.

'షిర్డీసాయి దీనజన సేవాసమితి' గుడ్డివారికోసం మొదలుపెట్టబడిన సంస్థ. ఇది 2/13 గుంటూరు బ్రాడీపేటలో ఉన్నది.ఇక్కడ 71 మంది గుడ్డివారు ఉండి చదువుకుంటున్నారు.వీరిలో నలుగురైదుగురు గ్రాడ్యుయేట్లూ,పోస్ట్ గ్రాడ్యుయేట్లూ కూడా ఉన్నారు.ఒకరిద్దరు మానసిక వికలాంగులు కూడా ఉన్నారు.తీరా అక్కడకి వెళ్లేసరికి మిత్రుడు పీ.ఎస్.మూర్తి గారే దాని సెక్రెటరీ అని తెలిసింది.ఆయనేదో రాజకీయ మీటింగ్ లో ఉండటం వల్ల సమయానికి అక్కడకు రాలేకపోయారు.

'మాతృశ్రీ వృద్దాశ్రమం' గుంటూరు శ్రీనగర్లో ఉన్నది.ఇందులో నలుగురు మగవారూ,22 మంది ఆడవారూ ఉన్నారు.అనాధలలో ఎక్కువగా స్త్రీలే ఉంటారు.కారణం-వారికి చదువు లేకపోవడమూ ఆస్తులు లేకపోవడమూ, స్వతంత్రంగా బ్రతికేశక్తి లేకపోవడమూ ఇలా రకరకాలైన కారణాలు ఉంటాయి.వీరిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాదగాధ.అందరూ వృద్ధులే.వీరిలో కొందరు బాగా ముసలివారుగా ఉన్నారు.వారి పనులు వారు చేసుకుంటూ ఆశ్రమాన్ని శుభ్రంగా ఉంచుకుంటూ నిరాడంబరంగా ఒక కుటుంబంలా కలసి ఉంటున్నారు.

కాని అందరి ముఖాల్లోనూ ఏదో నిరాశా నిర్లిప్తతా కనిపిస్తున్నాయి.పెద్ద వయస్సులో 'నావాళ్ళు' అనుకున్నవారి నిరాదరణకు గురవ్వడం చాలా బాధాకరం.ఎంతగా సమయానికి అన్నీ జరుగుతున్నా మనస్సులో ఆ వెలితి వారిని బాధిస్తున్నట్లు కనిపించింది.

నవంబర్ నెలలో ఈ రెండు సంస్థలకూ మాకు చేతనైన ధనసహాయం చెయ్యడం జరిగింది.

27, నవంబర్ 2013, బుధవారం

మాగ్నస్ కాల్సన్ (ప్రపంచ చదరంగ చాంపియన్) జాతకం

మాగ్నస్ కాల్సన్ నేటి వరల్డ్ చెస్ చాంపియన్.చెన్నైలో జరిగిన పోటీలో విశ్వనాధన్ ఆనంద్ ని ఓడించి టైటిల్ గెలుచుకున్నాడు.ఇతని జాతకం ఒకసారి పరిశీలిద్దాం.

ఇతను 30-11-90 న నార్వేలో టాన్స్ బెర్గ్ అనే ఊళ్ళో పుట్టినాడు.జనన సమయం తెలియదు.కనుక విభిన్నములైన నాడీ విధానాలతో ఇతని జాతకాన్ని స్థూలంగా చూద్దాం.

ఇతను శుక్రనక్షత్రంలో శుక్రవారం రోజున పుట్టినాడు.కనుక శుక్రునికి ఇతని జీవితంలో మంచి ప్రాధాన్యత ఉండాలి.పైగా శుక్రుడు అమాత్యకారకుడయ్యాడు.కనుక ఇతని వృత్తిని కూడా శుక్రుడే నిర్ణయిస్తాడు.ఆ శుక్రుడు గూడత్వాన్ని సూచించే వృశ్చికంలో ఉంటూ,వెనుకవైపు సూర్యునీ,ముందు బుధునీ శనినీ కలిగి ఉన్నాడు.అంటే తండ్రి తోడ్పాటుతో,తెలివిని ఉపయోగించి ఆడేఆట అయిన చదరంగం వృత్తిగా కలిగిన వాడౌతాడని గ్రహములు సూచిస్తున్నాయి.

ఇతని జాతకంలో ఆత్మకారకుడు శని అయినాడు.ఆరోజున చంద్రునికి ఆత్మకారకత్వం రాదు.ఇతర గ్రహములు ఆ స్థానమును ఆక్రమించలేవు.కనుక కారకాంశ ధనుస్సు అవుతుంది.శనికి వర్గోత్తమాంశ కలిగింది.రవి కూడా వర్గోత్తమాంశలోనే ఉన్నాడు.ఈ రెంటివల్ల ఇతనికి వృత్తిపరమైన అదృష్టమూ,పేరుప్రఖ్యాతులూ తేలికగా వస్తాయని అర్ధమౌతుంది.చదరంగంలో బాలమేధావి అవడం ఈ రెండుగ్రహాల వరమే.

ధనుస్సులో శని,బుధుడు,యురేనస్,నెప్ట్యూన్ లున్నారు.వీరిలో యురేనస్సూ సూర్యుడూ ఖచ్చితమైన ద్విర్ద్వాదశస్థితిలో ఉన్నారు.దీనివల్ల ఉన్నట్టుండి సరియైన అంత:స్ఫురణ కలుగుతుంది.గురువూ నెప్త్యూనూ ఖచ్చితమైన షష్టాష్టక స్థితిలో ఉన్నారు.దీనివల్ల మతాభినివేశమూ అదృష్టమూ ఉంటాయి.

మేషరాశిలోని చంద్రమంగళయోగం వల్ల ఓటమిని అంగీకరించని పట్టుదల ఉంటుంది.శని బుధుల కలయిక వల్ల ఓర్పుగా ఆలోచించి ఆడగల నేర్పు వస్తుంది.గజకేసరీ యోగం అదృష్టాన్నిస్తుంది.

కర్మకారకుడైన శనితో బుధుని కలయికవల్ల ఆలోచనాశక్తితో కూడిన జీవిక ఉంటుందని సూచన ఉన్నది.చంద్రలగ్నాత్ తృతీయాధిపతి కూడా బుధుడే అవడం గమనార్హం.కనుక గంటలు గంటలపాటు స్థిరంగా ఆలోచించి ఓర్పుగా ఎత్తుకు పైఎత్తులు వేసి ఆడవలసిన చదరంగం లో ప్రావీణ్యం కలిగింది.

శనికి వచ్చిన ద్వితీయ తృతీయాధిపత్యములవల్ల,క్రీడలుగాని,రచనలుగాని, సమాజంతో కమ్యూనికేషన్ వల్లగాని ధనార్జన ఉంటుందని తెలుస్తుంది.ఈ మూడూ ఇతని జీవితంలో నిజాలయ్యాయి.

శని వెనుకగా వరుసగా సూర్య,శుక్ర,బుధులు ఉండటం వల్ల,ఇతని వృత్తిలో పేరు ప్రఖ్యాతులూ,విలాస జీవితమూ,తెలివితో కూడిన ఆలోచనాశక్తీ తోడుగా ఉంటాయన్న సూచన ఉన్నది.

శుక్రునికి వచ్చిన అమాత్యకారకత్వంవల్ల,చిన్నప్పుడే మోడలింగ్ చేసే అవకాశాలు వచ్చాయి.ఉత్పత్తులకు ప్రోమోటింగ్ మోడల్ గా అవకాశాలను చదరంగ విజయాలు కలిగించాయి.

ఎంత క్రీడాసామర్ధ్యం ఉన్నప్పటికీ చదరంగం వంటి ఆటలో స్ఫురణశక్తి చాలా ప్రధానం.అటువంటి అంత:స్ఫురణను ఇవ్వడంలో శన్యతీతగ్రహాలకు చాలా ప్రముఖపాత్ర ఉంటుంది.ఆ కోణంలో యురేనస్ నెప్త్యూన్ల పాత్ర స్పష్టంగా కనిపించే మరొక్క జాతకం ఇతనిది.

సరియైన జననసమయం లేకున్నా,నాడీజ్యోతిష్య విధానములు ఉపయోగించడం వల్ల జాతకాన్ని స్థూలంగా చదవవచ్చు.చాలావరకూ జీవిత దిశనూ దశనూ గ్రహించవచ్చు అనడానికి ఇలాంటి జాతకములే ఉదాహరణలు.

23, నవంబర్ 2013, శనివారం

సచిన్ టెండూల్కర్ జాతకం

సచిన్ టెండూల్కర్ మొన్న నవంబర్ 16 న క్రికెట్ నుంచి రిటైరయ్యాడు.ఆ సందర్భంగా అతని జాతకం చూద్దాం.ఇతని జననసమయం కూడా ఖచ్చితమైనది దొరకడం లేదు.ప్రముఖవ్యక్తులు వారి జనన సమయాన్ని దాచి ఉంచుతారు.దానికి రకరకాలైన కారణాలుంటాయి. ఇతను 24-4-1973 న ముంబైలో పుట్టినాడు. జనన సమయాలు మధ్యాన్నం 1 అనీ,2.47 అనీ సాయంత్రం 4.20 అనీ రకరకాలుగా దొరుకుతున్నాయి. వీటిలో ఏది సరియైన సమయమో తేలికగా కనిపెట్టవచ్చు.కొన్ని స్థూలమైన విషయాలద్వారా మాత్రమే దీనిని గమనిద్దాం.

సూర్యుడూ కుజుడూ ఇతని జాతకంలో ఉచ్ఛలో ఉన్నారు.కుజుడు క్రీడలకు దూకుడుతనానికి కారకుడు కనుక క్రికెట్ ఆటలో అంతపేరు సంపాదించాడు. కన్యాలగ్నం అయితే మాత్రమే ఇది సాధ్యం.ఎందుకంటే అప్పుడు మాత్రమే కుజుడు తృతీయాధిపతి అవుతాడు అనే వాదనతో నాకు కొన్ని సందేహాలున్నాయి.కనుక ప్రస్తుతం ఆ విషయం అలా ఉంచుదాం.

సూర్యునివల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులూ, ఆదరణా, విజయ పరంపరలూ కలిగాయి.గురువు నీచలో ఉన్నాడు.కనుక సత్యసాయిబాబాకు భక్తుడయ్యాడు.సత్యసాయిబాబా జాతకంలో కూడా గురువు నీచలో ఉండటం గమనార్హం.కార్మిక్ సిగ్నేచర్స్ ఆ విధంగా పనిచేస్తాయి.

ఇతనిది ప్రేమవివాహం.కర్కాటక కన్యాలగ్నాలకు ఈజాతకం ప్రకారం ప్రేమవివాహం సాధ్యమే.కనుక ఈరెంటిలో ఏదో ఒకటి అయి ఉండాలి.ఇతని భార్య ఇతనికంటె ఆరేళ్ళు పెద్దది.ఈ రెండు లగ్నాలకూ సప్తమదోషం ఉన్నప్పటికీ ఎక్కువగా కర్కాటక లగ్నమే సూచితం అవుతుంది.ఎందుకంటే అప్పుడే సప్తమానికి శని ఆధిపత్యం వస్తుంది.పైగా భార్య డాక్టర్ అయ్యే యోగం కర్కాటక లగ్నానికే ఎక్కువగా ఉన్నది.

కెరీర్ పరంగా చూచినా కన్యాలగ్నం అయితే దశమకేతువు వల్ల కెరీర్ అంత బాగుండదు.అదే కర్కాటకం అయితే దశమంలోని ఉచ్ఛసూర్యుని వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది.కనుక కర్కాటకలగ్నమే సరియైనది అని అనిపిస్తున్నది.అలాంటప్పుడు జననసమయం మద్యాన్నం ఒంటిగంట ప్రాంతం అవుతుంది.అప్పుడు వివాహసమయానికి(24-5-1995) కుజ/గురు/బుధదశ జరిగింది.కుజగురులు సప్తమంలోనూ బుధుడు చంద్రలగ్నాత్ సుఖస్థానం లోనూ ఉండటం చూస్తే ఈ సంఘటన సరిగ్గా సరిపోతుంది.కనుక మధ్యాన్నం ఒంటిగంట సమయమే సరియైనది.

ప్రస్తుతం ఇతను కెరీర్ నుంచి విరమించుకున్నాడు.భారతరత్న బిరుదు కూడా ఇవ్వబడింది.దశాపరంగా పరిశీలిద్దాం.

ప్రస్తుతం ఇతని జాతకంలో రాహు/శుక్ర/గురు/కేతుదశ జరుగుతున్నది. శుక్రునితో కలిసి ఉన్న సూర్యుడు అత్యున్నత పురస్కారం ఇచ్చాడు.శుక్రుడు ఈ లగ్నానికి బాధకుడు,గురువు నీచలోఉండి కుజునికి దోషాన్ని ఆపాదిస్తున్నాడు,కేతువు విడిపోవడాన్ని సూచిస్తాడు.కనుక కెరీర్ ముగిసింది.

ఇతని జాతకంలో కూడా వ్యతిరేక కాలసర్పయోగం ఉందని కొందరు అంటారు. కాని అలాంటియోగం అంటూ అసలు ఏదీలేదని ఇతని అప్రతిహతమైన కెరీర్ వల్ల తెలుస్తున్నది.ఆ పదం కూడా కొందరిసృష్టి మాత్రమేగాని నిజం కాదన్న విషయం కూడా నిజమే.

తృతీయంలోని యురేనస్ ప్లూటోలు క్రీడలలో దూకుడును ఇస్తాయి.ఇతని జాతకంలో ఈ రెంటిలో యురేనస్ బాగా బలంగా ఉన్నది.ఎందుకంటే యురేనస్ కుజనక్షత్రంలో ఉండి ఖచ్చితమైన పంచమదృష్టితో ఉచ్ఛకుజుడిని చూస్తున్నది.కనుకనే డోనాల్డ్ బ్రాడ్మన్ కూడా ఇతన్ని మెచ్చుకునే విధంగా విచిత్రంగా టెక్నిక్ నూ దూకుడునూ కలగలిపి ఆడగలిగాడు.

పంచమంలో నెప్ట్యూన్ ప్రేమవివాహాన్ని ఇస్తుంది.ఇతని జాతకంలో ఇదికూడా నిజం కావడం చూడవచ్చు.నెప్ట్యూన్ శనినక్షత్రమైన అనూరాధలో ఉండటం వల్ల తనకంటే పెద్దదైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

యురేనస్ నెప్ట్యూన్ ప్లూటోలను నేనుకూడా మొదట్లో పరిగణించేవాడిని కాను.కాని తర్వాత్తర్వాత నా అభిప్రాయాలు మార్చుకున్నాను.వాటిని కూడా జాతకంలో లెక్కలోకి తీసుకుంటేనే ఎక్కువ క్లారిటీ వస్తుంది అనేమాట నిజమే.

తృతీయంలోని ఘటికాలగ్నం కూడా క్రీడలవల్ల వచ్చే పేరుప్రఖ్యాతులను సూచిస్తున్నది.

ఈ రకంగా జాతకచక్రాన్నిబట్టే జీవితం జరగడం ఎవరి జీవితంలో చూచినా గమనించవచ్చు.ఏరంగంలో ఎంత గొప్పవారైనా గ్రహాలకూ జాతకానికి అతీతులు కారు.కాలేరు.

20, నవంబర్ 2013, బుధవారం

జాబులూ-జవాబులూ

చాలారోజులనుంచీ చిక్కటి వేదాంతవిషయాలను చదివి తలవేడెక్కిన నా అభిమానుల కోసం ఒక చిన్న కామెడీ బ్రేక్.

నాకు చాలా మెయిల్స్ వస్తుంటాయి.వాటిల్లో రకరకాల మెయిల్స్ ఉంటాయి.రకరకాల భాష వాడబడుతూ ఉంటుంది.వాటిలో మెచ్చుకుంటూ వచ్చె మెయిల్స్ ఇక్కడ వ్రాసి ఉపయోగం లేదు.అసలే ఎప్పుడెప్పుడు విమర్శిద్దామా అని కాచుక్కూచున్న నా ఆప్తమిత్రులకు మళ్ళీ స్వోత్కర్షగా కనిపిస్తుంది.కనుక నన్ను విమర్శిస్తూ తిడుతూ బెదిరిస్తూ వచ్చిన కొన్ని మెయిల్స్ నూ వాటికి నేనిచ్చిన జవాబులనూ ఇక్కడ చదవండి.మెయిల్స్ యధాతధంగా ఇవ్వడం లేదు.వాటిని ఎవరు వ్రాశారో ఆ మెయిల్ ఐడిలు కూడా వ్రాయను.వాటిలోని ముఖ్యమైన పాయింట్లు మాత్రమే ఇస్తున్నాను.

నిజాయితీగా అడిగితే ఏ సందేహం అయినా నేను తీరుస్తాను.ఎగతాళిగా అడిగితే అదే ధోరణిలో జవాబు వస్తుంది.బెదిరిస్తే అదే తీరులో వారికీ జవాబు వెళ్తుంది.మంచిగా అడిగితే మహామంచిగా సమాధానం ఇస్తాను.తిక్కగా మెయిల్ ఇస్తే మహాతిక్కగా జవాబు వెళ్తుంది.అడిగేవారు వాడిన భాషను బట్టి నాజవాబు ఉంటుంది.అద్దం మన ముఖాన్నే చూపిస్తుంది.అది గమనించండి.

>>మీకు కోపం చాలా ఎక్కువట కదా?

నా జవాబు:-అయితే మీకొచ్చిన నష్టం ఏంటట?మీకన్నీ తక్కువగా ఉన్నాయా?ముందు మీ సంగతి చూచుకోండి.తర్వాత నా సంగతి ఆలోచిద్దురుగాని.

>>మొదట్లో నువ్వు ఒక మంచి సాధకుడివి అనుకున్నాను.కాదని తర్వాత తెలిసింది.

నా జవాబు:-చాలా త్వరగా నీకు జ్ఞానోదయం అయినందుకు సంతోషం.ఏ పనీ లేకుంటే ఒక పిల్లిని వెతుక్కో.అయినా నీ బోడి సర్టిఫికేట్ ఎవరిక్కావాలి?

>>మన మతానికి వక్రభాష్యం చెబుతూ దాన్ని నవ్వులపాలు చేస్తున్నందుకు నిన్ను ఉరి తియ్యాలి.

నా జవాబు:-దమ్ముంటే వచ్చి ఉరితియ్యి.లేదా నీఅడ్రస్ చెప్పు నేనే వస్తాను. ఎవరు ఏమౌతారో చూద్దాం.

ఇదే ధోరణిలో అడగబడిన ఇంకొక మర్యాద పూర్వకమైన ప్రశ్నకు ఇలా జవాబిచ్చాను.

>>మీరు వ్రాసేవి బాగానే ఉంటాయి.కాని అప్పుడప్పుడూ మీరు కొంచం పెడధోరణిలో మాట్లాడతారు.అక్కడే మనస్సు చివుక్కుమంటుంది.

నా జవాబు:-చూడమ్మా.నా అనుభవాన్నీ,తర్కాన్నీ,మన సనాతన సాహిత్యాన్నీ ఆధారంగా చేసుకుని నేను మాట్లాడతాను.ఊహించి మాట్లాడను.నేను ఎక్కడ పెడగా వ్రాశానో ఆ పాయింట్స్ వ్రాస్తే,ఏ సందర్భంలో నేను అలా వ్రాయవలసి వచ్చిందో,మీకు జవాబు ఇవ్వగలను.తర్కబద్ధమైన మర్యాదపూర్వకమైన చర్చకు నేను ఎప్పుడూ సిద్ధమే.

>>వెంటనే నీ బ్లాగ్ మూసేసి నీ చెత్త వ్రాతలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది.

నా జవాబు:-నీలాంటి జఫ్ఫాగాళ్ళని చాలామందిని చూచాను.నీకూ,నీవెనుక ఉండి ఇలాంటి మెయిల్స్ వ్రాయిస్తున్న పేడివెధవలకూ ఇదే నా చాలెంజ్. నీకు ధైర్యంఉంటే తర్కబద్ధంగా నాతో వాదించి నావాదన తప్పని నిరూపించు. లేదా ఇలాంటి మెయిల్స్ వ్రాయడం ఆపి దాసోహం అని శరణు కోరు.అప్పుడు నిన్ను క్షమిస్తాను.అయినా నాబ్లాగ్ ముయ్యమని ఆజ్ఞాపించడానికి నువ్వెవడివి?

>>నిన్ను అనుసరిస్తున్న నీ గ్రూప్ లోని తెలివితక్కువ సభ్యులందరికీ నా సానుభూతి.

నా జవాబు:-ఏం నాయనా? ఎందుకంత జెలసీ?నిన్ను నా గ్రూప్ లోనుంచి బయటకి తరిమేసిన జ్ఞాపకం నాకు లేదే?అవున్లే పనికిమాలిన డబ్బాగాళ్ళని గుర్తుపెట్టుకునే అలవాటు నాకు లేదు.

>>నీ వ్రాతలు చూస్తుంటే వళ్ళు మండుతోంది.

నా జవాబు:--బక్కెట్ చన్నీళ్ళలో కేజీ ఈనో కలుపుకుని స్నానం చెయ్యి.మంట తగ్గుతుంది.

>>నాయనా ఒక పెద్దవాడిగా సలహా ఇస్తున్నాను.అహంకారం తగ్గించుకో.

నా జవాబు:- నాకు బొడ్డుకోసి పేరుపెట్టింది మీరేకదా తాతగారు? ఆ తప్పు మీదే.అయినా మీకు మీరే పెద్దరికం ఆపాదించుకుంటున్నారెంటి? దీనిని మీ అహంకారం అనుకోవాలా?లేక అజ్ఞానం అనుకోవాలా?

>>రమణమహర్షీ రామక్రిష్ణుడూ పరమశాంతంగా ఉండేవారు.మీకు ఇంత కోపం ఏమిటి?

నా జవాబు:-మీ మెప్పుకోసం వాళ్ళను నేను అనుకరించలేను. అనుసరించగలను.వాళ్ళు చెయ్యాలనుకుని చెయ్యలేకపోయినవి ఇలా నాచేత చేయిస్తున్నారు.మీకందరికీ ఎలా జవాబులు చెప్పాలో వాళ్ళే నా కలలోకి రోజూవచ్చి నేర్పిస్తూ ఉంటారు.

>>నీకు మార్షల్ ఆర్ట్స్ వచ్చా? ఛా? జోకా?

నా జవాబు:-వచ్చో రాదో మాటల్లో ఎలా తెలుస్తుంది?చేతల్లో చూస్తానంటే నేను సిద్ధమే.ఎరీనా ఎక్కడో చెప్పు.నేనే వస్తాను. అయితే ముందుగా ఒక అంబులెన్స్ సిద్ధం చేసుకో. ఫైట్ మొదలైన అయిదు నిముషాల తర్వాత నాతో మాట్లాడటానికి నీకు చాన్సుండదు.ఎందుకంటే నీవు కోమాలో ఉంటావు మరి.

>>మీ వ్రాతల్లో రానురాను స్వోత్కర్ష ఎక్కువౌతోంది.డబ్బా కొట్టుకోవడం కొంచం తగ్గించండి.

నా జవాబు:-పోనీలేమ్మా. నేను నాడబ్బానే వాయించుకుంటున్నాను.మీలాగా అవినీతి రాజకీయనాయకులదో, మీ అభిమాన చెత్తహీరోలదో,మిమ్మల్ని మోసం చేస్తున్న దొంగగురువులదో డబ్బాలు వాయించడం లేదుకదా.నా అనుభవాలనుంచి నేను వ్రాస్తాను. కనుక నాగురించి నేను చెప్పుకున్నట్లు మీకు అనిపిస్తుంది.దానికి నేనేం చెయ్యను?

>>ఇప్పటికే చాలామంది చార్లటన్స్ గురువులు ఉన్నారు.మళ్ళీ మీరొకరు తయారవుతున్నారు?మాకు ఇలాంటి గురువుల అవసరం లేదు.

నా జవాబు:-నిన్ను నా శిష్యునిగా అంగీకరించే హీనస్థితిలో నేను లేను.నా శిష్యుడు కావాలంటే నీకు చాలా పూర్వజన్మ సుకృతం ఉండాలి.అది లేకుంటే కనీసం నన్ను చూడనుకూడా చూడలేవు.అప్పటిదాకా నీ ప్రస్తుత చార్లటన్ గురువుతో ఒక పనికిమాలిన బఫూన్ లాగా కాలం గడుపు.

>>చూడండి సార్.మీకు కొంచం అహం ఎక్కువేమో నని నా అనుమానం.

నా జవాబు:-అనుమానం ఉండటానికి కూడా అర్హత కావాలమ్మా.నీకు నిజంగా అనుమానం ఉంటే దానిని ఎందుకు నివృత్తి చేసుకోవు?వచ్చి నన్ను కలిసి నాతో మాట్లాడి చూడు.ఎవరో చెప్పిన మాటలు ఎందుకు నమ్ముతావు?వ్రాతలను బట్టి మనిషిని ఎప్పుడూ అంచనా వెయ్యకు.మోసపోతావు.జీసస్ లాగా ఒకచెంపమీద కొడితే రెండోచెంపకూడా చూపించి శిలువ వేయించుకునే సాహసం నేను చెయ్యలేను.మీమెప్పుకోసం నంగివేషాలు వేసి నక్కవినయాలు నటించడం నావల్ల కాదు.

>>ప్రతివారినీ విమర్శించే ముందు నీ స్థాయి ఏమిటో చూసుకో.నీలాంటి అహంకారులకు మహనీయులను విమర్శిచే హక్కెక్కడిది?

నా జవాబు:-ఆత్మాభిమానానికీ అహంకారానికీ తేడా తెలియని నీలాంటి వాజమ్మలకు కూడా నేను జవాబిస్తాను.ఇక్కడే నాకు అహంకారం ఉందో లేదో నీకు తెలియడం లేదా? 

>>సార్.నేనొక సాధకుడను.ఆధ్యాత్మికపధంలో చాలాకాలంనుంచీ ప్రయాణిస్తూ ఎందఱో గురువుల దగ్గర తిరిగాను.కాని నాకు వారివద్ద తృప్తి కలగలేదు.మీ శిష్యునిగా నన్ను స్వీకరించగలరా?

నా జవాబు:-గలను.కాని కొన్నాళ్ళకు నావద్ద కూడా తృప్తికలగక ఇంకొక గురువువద్దకు మీరు వెళ్లరని నమ్మకం ఏమిటి?అసలు మీరు దేనికోసం వెదుకుతున్నారో దానిగురించి సరియైన క్లారిటీ మీకులేదని నాకు అనిపిస్తున్నది.అదీగాక సాధనామార్గంలో నేనుపెట్టే పరీక్షలు మీరు తట్టుకోలేరు.లేదు నేను తట్టుకోగలను అని మీరు అనుకుంటే,ముందు మీకేం కావాలో సరిగ్గా ఆత్మపరిశీలన చేసుకుని,ఒక క్లారిటీ వచ్చినాక నన్ను కలవండి.ఇదీ నా అడ్రస్.

>>దేవుళ్ళనీ గురువులనీ విమర్శిస్తున్నావు?నీవేమైనా శ్రీకృష్ణ పరమాత్ముడవా?

నా జవాబు:-అదేమో తెలియదుగాని,ప్రస్తుతం గోపిక పోస్ట్ లు ఖాళీలేవు. కొన్నాళ్ళ తర్వాత ట్రై చెయ్యి.

>>మీరు షిర్డీ సాయిబాబానీ అయ్యప్పనీ తరచూ విమర్శిస్తారు.ఎందుకని?

నా జవాబు:-పొరపాటు పడుతున్నావమ్మా.నేను వాళ్ళని విమర్శించను.వారి పేరుతో జరుగుతున్న దొంగవ్యాపారాలనూ,సమాజాన్ని మోసం చేస్తున్న దొంగభక్తులనూ విమర్శిస్తాను.ఒక్కసారి స్వచ్చమైన మనస్సుతో మళ్ళీ నేను వ్రాసినవి చదువు.అవి పచ్చినిజాలే అని నీవూ అంగీకరిస్తావు.

>>మీరు అద్వైతం వ్రాస్తున్నారు.మరి అందరినీ విమర్శించడం ఎందుకు?అంతా ఏకస్వరూపమే కదా?

నా జవాబు:--ఈ సంగతి తెలియకనేనా పాపం ఆదిశంకరులు దేశమంతా కాలినడకన తిరిగి అంతమందితో వాదించి చర్చించి అద్వైతాన్ని స్థాపించారు?ఆయన అద్వైతి కారని మీ అభిప్రాయమా? ఆయన ఎన్నివేలమందితో వాదవివాదాలు చేసినారో మీకు తెలుసా?అంతా ఏకమే అని చెప్పిన ఆదిశంకరులు అన్ని వాదాలలో ఎందుకు పాల్గొన్నారు? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి?

(మరికొన్ని జాబులూ-జవాబులూ ఇంకోసారి)

25, అక్టోబర్ 2013, శుక్రవారం

మన్నాడే

నాకు నచ్చిన గాయకులలో మొదటి వరుసలో మొదటిస్థానం మన్నాడే దే.ఆయన నిన్న బెంగుళూర్లో తన 94వ ఏట మరణించాడు. వీరవిద్య లైన మల్లయుద్ధమూ, బాక్సింగులలో ఛాంపియన్ కావాలని కలలుగని కంటిచూపు సహకరించని కారణంగా గాయకుడైన విచిత్ర జీవితం ఈయనది.సహజంగా తనకు దైవమిచ్చిన వరం అయిన మంచి స్వరమూ దానికితోడు మేనమామ కృష్ణచంద్ర డే  గురుత్వమూ,సంగీత కుటుంబంలో జన్మించడమూ ఇవన్నీ కలసి ఈయన్ను అమరగాయకుడిని చేశాయి.

ఈయన గురువు కృష్ణచంద్రడే(కేసీ.డే) పాతతరం వారికి సుపరిచితుడు.ఈయనకు చాలా చిన్నతనంలోనే కంటిచూపు పోయింది. అయినప్పటికీ వందలాది పాటలు పాడడమూ,బాణీలు కట్టడమే గాక 1935 ప్రాంతాలలో సినిమా సంగీతానికి బాణీలు కట్టేవాడు.SD Burman కు ఈయన సంగీతగురువు అంటే ఈయన స్థాయిని అర్ధం చేసుకోవచ్చు. మన్నాడేవంటి గాయకుడు ఈనాడు మనకు లభించాడంటే అది ఈయన పుణ్యమే.కుస్తీ,బాక్సింగ్ వంటి క్రీడలలో తలమునకలుగా ఉన్న ప్రబోధచంద్ర డే(మన్నాడే)ను సంగీతం వైపు తీసుకొచ్చింది ఈయనే.

మన్నాడే జాతకాన్ని మొత్తం స్పృశించడం నా ఉద్దేశ్యం కాదు.ఇందులో రెండు విషయాలు మాత్రం జ్యోతిష్యపరంగా చూద్దాం.

వీరవిద్యల మీద అంత అభిమానం ఉండటానికీ,కంటిచూపు క్షీణిస్తూ రావడం వల్ల కెరీర్ మార్చుకొని సంగీతంలో ప్రవేశించి నేడు ఇన్ని కోట్లమంది గుండెలలో స్థానం సంపాదించుకోవడానికీ కొన్ని కారణాలు ఉండాలి. అవేమిటో మాత్రమె నేను చెప్పదలుచుకున్నాను.

1.వీరవిద్యలకు కారకుడైన అంగారకుడు బలీయమైన ఉచ్ఛస్థితిలో ఉన్న సూర్యునితో కలిసి స్వక్షేత్రంలో ఉండటం దీనికి కారణం.కుజుని బలంవల్ల సాహస క్రీడలన్నా,వీరవిద్యలన్నా జాతకునికి అమితమైన ప్రేమ ఉంటుంది.మన్నాడే జాతకంలో కూడా అదే జరిగింది.వీరిద్దరూ యముని భరణీ నక్షత్రంలో చాలా దగ్గరగా ఉండటం వల్ల హింసతో కూడిన ప్రాణాంతక విద్యలంటే ఇష్టం ఉంటుంది.అయితే వీరిపైన గల శనిదృష్టి వల్ల ఈయోగం భంగమైపోయింది. మాతృకారకుడైన చంద్రుని క్షేత్రం నుంచి శని దృష్టి ఉన్నందువలన తల్లివైపు నుంచి వచ్చిన దోషం ఈయనను కుస్తీలు బాక్సింగ్ వైపు పోకుండా ఆపి కెరీర్ ను మలుపు తిప్పింది.అయితే ఇదే ఈయనకు వరంగా మారింది.ధర్మస్వరూపుడైన శని భగవానుడు ఇచ్చే వరాలు ఇలాగే ఉంటాయి.

2.ఈయన మేనమామా,సంగీతాచార్య బిరుదాంకితుడూ, మంచి విద్వత్తు కలిగిన సంగీతజ్ఞుడూ అయిన కేసీ డే కూడా తన చిన్నతనం లోనే కంటి చూపును కోల్పోయాడు.మన్నాడే కు కూడా మంచి వయస్సులో ఉన్నప్పుడే కంటిచూపు తగ్గుతూ వచ్చింది.కనుక ఈ లక్షణం వీరి జీన్స్ లో వీరి తల్లిగారి వైపునుంచి సంక్రమించిందని చెప్పవచ్చు.దీనికి సూచనగా శని కర్కాటక రాశిలో దర్శనమిస్తాడు.

దీనికి ఇంకొక రుజువుగా చంద్రుడు ఈయన జాతకంలో కేతువుతో మ్రింగబడ్డాడు.తల్లివైపు నుంచి జీన్స్ లో వచ్చిన దృష్టిదోషం జాతకంలో ఇక్కడ కనిపిస్తుంది.

ఈయన ఒకసారి కళ్ళజోడు పెట్టుకుని కుస్తీపోటీలో పాల్గొంటూ ఉన్నప్పుడు అది విరిగి దాని వెండితుంపులు కంటికింద గుచ్చుకున్నాయిట.శుక్రుడు వెండికీ,చంద్రుడు కంటిచూపుకీ, కేతువు హటాత్తుగా జరిగే ప్రమాదాలకూ కారకులన్న విషయం గుర్తుంటే శుక్ర,చంద్ర,కేతువులు కలసి సహజరాశి చక్రంలో కళ్ళకు సూచిన అయిన వృషభంలో ఉన్న యోగపు ఫలితం ఎంత ఖచ్చితంగా జరిగిందో అర్ధమై ఆశ్చర్యం కలుగుతుంది.

బలీయమైన ఇదే శుక్రచంద్రుల యోగంవల్ల ఈయనకు ఇద్దరూ ఆడపిల్లలే జన్మించారన్నదీ వింతగొలిపే వాస్తవమే.

యధావిధిగా సరియైన జన్మసమయం దొరకనందున జాతకాన్ని క్షుణ్ణంగా చూడలేము. ఈయన జాతకంలో చంద్రుడు గాని శనిగాని ఆత్మకారకులౌతారు.కాని ఈయనకు చంద్ర లక్షణాలు లేవు. శని భగవానుని లక్షణాలు గట్టిగా ఉన్నాయి.ఒకవేళ చంద్రుడు ఆత్మకారకుడే అయితే కారకాంశ ధనుస్సో మకరమో అవుతుంది. అప్పుడు కూడా తృతీయంలో ఉన్న నీచబుధుని వల్ల గొప్ప సంగీతం పట్టుబడదు. కనుక ఈయన ఆత్మకారకుడు శనియే అని తేలుతుంది.

అప్పుడు కారకాంశ మీనం అవుతుంది.అక్కడనుంచి తృతీయంలో శుక్రచంద్రకేతుయోగం వల్ల సంగీత ప్రపంచంలో ధ్రువతారగా వెలిగే యోగం దక్కింది.చంద్రుడు ఉచ్ఛస్థితిలో ఉన్నవిషయం గమనించాలి.కేతువు శుక్రుడిని సూచిస్తున్నాడు.కనుక ఇదొక గొప్పయోగం అయింది.అయితే కేతువువల్ల ఈయనకు దక్కవలసిన గౌరవం దక్కకుండా జారిపోయింది. ఈ అద్భుతమైన స్వరాన్ని బాలీవుడ్ సరిగ్గా వాడుకోలేదనే నాకనిపిస్తుంది. ఈయన కెరీర్ చివరలో వెకిలిపాటలకూ హాస్యగాళ్ళ పాటలకూ ఈయనను పాడమనడంతో ఈయనకు విసుగుపుట్టి సినిమాసంగీతం నుంచి పూర్తిగా విరమించుకున్నాడు.1940 లలో కేసీ.డే కూడా ఇదేపని చేశాడు.అప్పటికే బాలీవుడ్లో దిగజారుతున్న సంగీతవిలువలను భరించలేక ఆయన తప్పుకున్నాడు.వీరందరూ విలువలున్న కళాకారులు,అంతేగాని నేటి కొందరిలాగా చచ్చేవరకూ ఇదే చెత్తనటన నటిస్తూ ఉంటాను.ఇవే చెత్తపాటలు పాడుతూ ఉంటాను అనలేదు.

గౌరవించవలసిన వారిని సరిగ్గా గౌరవించలేకపోవడం మన భారతీయుల జీన్స్ లో ఉన్న అనేక దౌర్భాగ్యాలలో ఒకటి.

ఈయన జాతకంలో ఏకాకిగ్రహం(లోన్లీ ప్లానెట్) రాహువు అవ్వడం వలన,తన జన్మస్థలమైన బెంగాలునూ,కర్మస్థలమైన ముంబాయినీ వదిలి ప్రేమవివాహం చేసుకొని దూరంగా బెంగుళూరులో స్థిరపడ్డాడు.రాహువు ప్రేమవివాహాన్ని ఇస్తాడనీ,దూరప్రాంతాలకు తీసుకుని పోతాడని జ్యోతిష్యవేత్తలకు తెలుసును.రాహువు నైరుతిదిక్కునూ,కుజకారకత్వం వల్ల దక్షిణాన్నీ సూచిస్తున్నాడు.కనుక మన్నాడే దక్షిణాదిన స్థిరపడ్డాడు.

సినిమాపాటలను అలా ఉంచితే,రవీంద్రసంగీత్ లో ఈయన పాడిన పాటలు వినినవారికీ,ఈయన పాడిన ఘజళ్ళూ,కీర్తనలూ వినినవారికీ ఈయన స్వరమాధుర్యం ఏమిటో తెలుస్తుంది.పాడేపాటలో పూర్తిగా లీనమై ఆపాట యొక్క భావాన్ని సంపూర్తిగా ఆస్వాదిస్తూ ఏస్థాయిలో అయినా ఎలాంటి మెలికనైనా సులభంగా తిప్పుతూ సహజంగా పాడటం ఈయన ప్రత్యేకత. లోతైన ధ్యానశక్తి లేనిదే ఇది సాధ్యంకాదు.భారతీయ సంగీతంలోని మనోధర్మం అదే.

చాలామంది కళాకారులు తర్వాతి జన్మలలో గొప్ప యోగులౌతారు. ఎందుకంటే వారికీ వీరికీ కొన్ని సామ్యాలుంటాయి.భావంలో లీనం కావడం ఇద్దరికీ సమంగానే ఉంటుంది.అయితే కళాకారులకు వైరాగ్యం ఉండదు. యోగులకు అది ఉంటుంది.వైరాగ్యాన్ని పొందగలిగిన కళాకారుడు తర్వాతి జన్మలలో యోగి అవుతాడు.అందుకే చాలామంది యోగులలో కూడా కళాభినివేశం ఉండటం చూడవచ్చు.అది వారి పూర్వజన్మ సంస్కారం.

ఘంటసాలకు మంచిపేరు తెచ్చిపెట్టిన కొన్నిపాటలు హిందీలో మన్నాడే పాడిన ట్యూన్లకు కాపీలే.ఎక్కువగా వీటిని పెండ్యాల కాపీచేశాడు. ఉదాహరణకు 'రసికరాజ తగువారము కామా','శివశంకరీ శివానందలహరి' పాటల ట్యూన్లు మన్నాడే పాడిన 'ఛంఛం బాజేరే పాయలియా','ఝనక్ ఝనక్ తొరి బాజే పాయలియా'  పాటలకు చక్కని కాపీలు.ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి.మన తెలుగుసినిమా సంగీతదర్శకులు చాలామంది కాపీరాయుళ్ళే.మొత్తం ట్యూన్లో లేకుంటే తమకు కావలసినంతవరకూ అక్కడక్కడానో హిందీ పాటలనుంచి చక్కగా కాపీ ఎత్తేసేవారు.అవి తెలుగులో మంచి హిట్స్ అయ్యేవి.హిందీపాటల్ని కాపీ చెయ్యడంలో స్పెషలిస్టని సంగీతదర్శకుడు సత్యాన్ని అందరూ అనేవారుగాని కాపీకొట్టని తెలుగు సంగీతదర్శకులు చాలా అరుదు.

ఒక రాగాన్ని ఆధారంగా తీసుకుని పాట ట్యూన్ కట్టినపుడు,అదే రాగం ఆధారంగా తీసుకున్న ఇతరపాటలలోకూడా ఇదే ట్యూన్ చాయలు కనిపిస్తాయి.ఇది సహజం.కాని మొత్తం పాటనే చాలావరకూ కాపీ చెయ్యడం అనేది అంత మంచిదికాదు.అయితే ఆ పాటను బాగా ఇష్టపడే  సంగీత దర్శకులు కొందరు దానినే మొత్తం ఇంకోభాషలో దింపుకునే వారు.దానిని తప్పు అనికూడా అనలేము.ఆపాటమీద వారికున్న ఇష్టంగా దానిని తీసుకుంటే సరిపోతుంది.

కొత్తగా పాటలు నేర్చుకునేవారు మన్నాడే పాతపాటలు సరిగ్గా పాడగలిగితే చాలావరకూ వారికి పాటలు పాడటం వచ్చినట్లే లెక్క.వాటిలో అంతటి లోతూ స్వరవిస్తారమూ ఉంటాయి.ఇప్పట్లో సినిమాలలో పాటలు పాడుతున్న కోతిగాయకులు మన్నాడే దరిదాపుల్లోకి కూడా వచ్చి పాడలేరు అన్నది నగ్నసత్యం.

గాయకునికి టెక్నికల్ నాలెడ్జి ముఖ్యమే.కాని భావంలో లగ్నం కావడం అంతకంటే ప్రధానమైన విషయం.టెక్నికల్ నాలెడ్జి శరీరం వంటిదైతే, భావనిమగ్నత ప్రాణం వంటిది.ఆ నిమగ్నత లేకుండా పాడితే ఘంటసాల పాడిన భక్తిగీతాలకీ తర్వాతతరం గాయకులు పాడుతున్న భక్తిగీతాలకీ మధ్యన ఉన్న తేడాలాగా ఉంటుంది.

మన్నాడే స్వరంలో ఒక మాయ ఉన్నది.అది వినేవారిని మంత్రముగ్ధులను చేస్తుంది.వేరేలోకాలకు అలవోకగా తీసుకుపోతుంది.ఆయన పాడుతుంటే ఒక యోగి ధ్యానస్థితిలో ఉండి భావంలో తదేకంగా లీనమై పాడుతున్నట్లు అనిపిస్తుంది.ఒక తాన్సేనో ఒక బైజూబావరానో పాడుతున్నట్లు అనిపిస్తుంది.

మహమ్మద్ రఫీ ఎంతమంచి వెర్సటైల్ సింగరో అందరికీ తెలుసు.మన్నాడే గురించి మహమ్మద్ రఫీ అనిన మాటను ఇప్పటికీ పాతతరం మరచిపోలేదు. రఫీ ఒకసారి ఇలా అన్నాడు -'మీరందరూ నా పాటలు వింటారు. నేను మన్నాడే పాటలు వింటాను'.

ఆ మహాగాయకునికి అంజలి ఘటిద్దాం.

16, అక్టోబర్ 2013, బుధవారం

దేవరగట్టు-మక్కా

ఈ లోకంలో మానవులు అసలైన ఆధ్యాత్మికతను వదలి ఏవేవో వారికి తోచిన తంతులలో కాలం వెళ్ళబుచ్చుతూ అవే దైవానికి చేర్చే మార్గాలని భ్రమిస్తూ ఉంటారు.కళ్ళు తెరచి చూస్తే,మన చుట్టూఉన్న ప్రపంచంలో దీనికి నిదర్శనాలు ఎన్నైనా కనిపిస్తాయి.

ప్రస్తుతం భూమ్మీద రెండుచోట్ల రెండురకాలైన కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఒకటి - మక్కాలో సైతాన్ అంటూ రాతిస్తంభాన్ని లక్షలాదిమంది 'సాంప్రదాయబద్ధంగా' రాళ్ళతో కొట్ట్డడం.ఆతర్వాత లక్షలాది జంతువులను 'సాంప్రదాయబద్ధంగా' దేవుడికి బలివ్వడం.

రెండు - కర్నూల్ జిల్లా దేవరగట్టు గ్రామంలో దేవుడి ఊరేగింపు సందర్భంగా రెండు గ్రామాల ప్రజలు 'సాంప్రదాయబద్ధంగా' కర్రలతో తలలు పగలగొట్టుకోవడం.

నా దృష్టిలో ఈ రెండూకూడా మానవునిలోని సాంప్రదాయబద్ధమైన అజ్ఞానానికి సూచికలే.

ఎందుకని?

దైవానికి జంతువుల బలి ఎంతమాత్రం అవసరం లేదు.ఎందుకంటే అవికూడా దైవసృష్టిలో సృష్టించబడిన జీవాలే గనుక.మానవునికి మిగిలిన జంతువుల కంటె కొంచం తెలివి ఉన్నంతమాత్రాన వాటిని చంపే హక్కు అతనికి లేదు.'నీకోసమే వాటిని సృష్టించాను. వాటిని చంపి భుజించు' అంటూ దేవుడు చెప్పినట్లు కొన్ని మతగ్రంధాలలో ఉన్న మాటలకు వాస్తవికత లేదు.ఇవి జిహ్వచాపల్యాన్ని జయించలేని కొందరు మనుషులు వ్రాసిన మాటలేగాని దైవం చెప్పిన సూక్తులు కానేకావు.ఎందుకంటే దైవంనోట అలాంటి పక్షపాతంతో కూడిన మాటలు ఎన్నటికీ రావు.

సైతాన్ అనేది రాతిస్తంభంలో లేదు.అది మన చుట్టూ ఉన్నది.మన హృదయాలలో ఉన్నది.ఒక పక్క దేవుణ్ణి పూజిస్తున్నాం అని చెబుతూ ఇంకోపక్క సాటి మనుషులను చంపాలని ప్లానులు వేసే మనుషుల గుండెల్లో సైతాన్ ఉన్నది.ఆ సైతాన్ని చంపాలంటే మనమే చెక్కిన రాతిస్తంభాన్ని మనమే రాళ్ళతో కొట్టడం కాదు,మనల్ని మనమే రాళ్ళతో కొట్టుకోవాలి.

ఒక పక్కన ఉన్నతమైన భావనతో నిరాకార తేజోస్వరూపంగా దైవాన్ని కొలిచే ముస్లిములు ఇంకోపక్కన ఇలాంటి అనాగరిక ఆటవిక తంతులను ఎలా ఆచరిస్తారో నాకెప్పటికీ అర్ధం కాదు.

ఇక దేవరగట్టు విషయానికొస్తే,ఇది కూడా మక్కాలొ జరిగే తంతులాంటి అనాగరిక ఆచారమే.ఒక వర్గం దేవుణ్ణి ఊరేగిస్తుంటే ఇంకొక వర్గం దానిని అడ్డుకోవడం ఏమిటి?దానికోసం యుద్ధం ఏమిటి?కర్రలతో తలలు పగలగొట్టుకొని ఆనందించడం ఏమిటి?పైశాచికత్వం కాకపోతే దీనిని ఏమనాలి?

ఎప్పుడో కాలగతిలో ఏదో ఒక సందర్భంలో ఆయా ఘట్టాలు జరిగి ఉండవచ్చు. వాటిని శిలాశాసనాలుగా తీసుకొని తరతరాలుగా వాటిని గుడ్డిగా ఆచరించడానికి అవేమీ అంత ఆదర్శ సంఘటనలు కావు.వాటిలో ఉన్నత తాత్త్వికసత్యాలూ లేవు.

ఈ రెంటినీ విమర్శిస్తే ఆయా అనుయాయులకు పిచ్చికోపం వస్తుంది.ఈ రెంటినే కాదు.'సత్యం ఇదిరా బాబూ' అని చెప్పే ప్రతివాడిమీదా లోకానికి పిచ్చి కోపం వస్తూనే ఉంటుంది.ఎందుకంటే తరతరాలుగా తాము ఆచరిస్తున్న తర్కరహిత ఆచారాలలో సత్యం ఎంత? అని ప్రశ్నించుకోవడానికి చాలా గుండెధైర్యమూ సత్యనిష్ఠా ఉండాలి.దురదృష్టవశాత్తూ అవి మానవులలో ఎక్కడోకాని కనిపించవు.

దేవరగట్టులో జరుగుతున్న ఈ అనాగరిక తంతును ఆపడానికి వెళ్ళిన పోలీసులపై గ్రామస్తులు ఎదురుదాడి చెయ్యడం వారి అజ్ఞానానికి పరాకాష్ట అనుకోవచ్చు.పైపెచ్చు,ఈ అనాగరిక ఆచారం ఆపితే దేవుడికి కోపం వస్తుందనీ,ఆయా గ్రామాలకు ఏదో చెడు జరుగుతుందనీ గ్రామస్తులు ఇప్పటికీ నమ్ముతారు.రోదసీయుగంలో కూడా అడవి మనుషులలాగా బ్రతుకుతామంటే ఎవరేం చెయ్యగలరు?

అలాగే, మక్కా వెళ్ళి సైతానంటూ రాతి స్తంభాన్ని రాళ్ళతో కొట్టి జంతువులను బలిచ్చి ఆనందంగా తిరిగివచ్చె సాధారణ ముస్లిం, తాను తిరిగివచ్చిన తర్వాత తనచుట్టూ ఉన్న సాటిమానవులనూ వారు పాటించే ఇతర మతాలనూ ద్వేషిస్తూ గుండెలనిండా కోపాన్ని కలిగిఉంటే దాని ప్రయోజనం ఏమిటి?సైతాన్ని అతడు ఏరకంగా చంపినట్లు?తాను ద్వేషించే సైతాన్ని తన గుండెల్లోనే పెట్టుకుని తిరిగివచ్చినట్లు కాదా?

ప్రతి మతంలోనూ ఇలాంటి పిచ్చిపిచ్చి ఆచారాలు చాలా కనిపిస్తాయి. అత్యున్నతములైన సత్యాలూ,అజ్ఞానపూరిత ఆచరణలూ ఒకేసారి రెండూ పక్కపక్కనే కనిపిస్తాయి.అసలైన సత్యాన్ని ఉన్నదున్నట్లు చెప్పిన బౌద్ధమూ అద్వైతమూ వంటి మతాలుమాత్రం కాలగర్భంలో కలసి ఎక్కడో నామమాత్రంగా మిణుకు మిణుకుమంటూ ఉండిపోతాయి.అవెవరికీ పట్టవు.

మనుష్యులు బయటకు ఎన్ని మాటలు చెప్పినా వారిస్వార్దాన్నీ,అజ్ఞానాన్నీ, హింసాప్రవృత్తినీ పెంచిపోషించే మతాచరణలే వారికి నచ్చుతాయి.లేదా ఆయా మతాలలో ఇలాటివాటిని ప్రేరేపించే తంతులనే వారు స్వీకరించి ఆచరిస్తూ ఉంటారు.మిగిలిన సత్యాలను వారు స్వీకరించరు.ఆచరించరు.అలాగే,సత్యాన్ని ఉన్నదున్నట్లుగా చెబితే కూడా ఎవరికీ ఎక్కదు.సాటి మానవులనూ సాటి జీవులనూ ప్రేమించలేనివారికి దైవత్వం ఎలా వస్తుందో నాకైతే ఎప్పటికీ అర్ధం కాదు.

మనుషులకు అసలైన మతమూ దైవాన్ని చేరే అసలైన మార్గమూ అక్కరలేదు.వీరికి కావలసినది అనవసరమైన తంతులూ,అజ్ఞానపూరిత ఆచారాలూ,వారి స్వార్ధాన్నీ భయాన్నీ అహంకారాన్నీ సంతృప్తిపరచే డొల్ల కార్యక్రమాలూ మాత్రమే.మనుషుల అజ్ఞానాన్నీ మొండితనాన్నీ ఆ దేవుడు కూడా మార్చలేడు.ఈ లోకం ఖర్మ ఇంతే.

10, అక్టోబర్ 2013, గురువారం

ప్రస్తుత పరిస్తితులమీదా? ఏం వ్రాయాలి?

ఇంతకు ముందు మీరు సామాజిక పరిస్తితులపైన పోస్టులు వ్రాసేవారు. ప్రస్తుతం అవేవీ వ్రాయడం లేదు.పూర్తిగా ఆధ్యాత్మికం మీదే వ్రాస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రాలో జరుగుతున్న గొడవలు రాజకీయ ప్రజాసంక్షోభాల మీద జ్యోతిష్యపరంగా వ్రాయండి అని కొందరు నన్ను అడుగుతున్నారు.వారికోసం ఈ పోస్ట్.

ప్రజలూ దొంగలే
పాలకులూ దొంగలే
ప్రతి దొంగా ఎదుటివాడిని దొంగ అంటూ
దొంగలూ దొంగలూ కలసి
దేశాన్ని దోచుకుంటుంటే
ప్రజలు దద్దమ్మలై దానికి వంతపాడుతుంటే
ఏం వ్రాయగలం? ఏం చెప్పగలం?

ప్రస్తుత పరిస్తితుల పైన ఏమని వ్రాయాలి?
శపితయోగం గురించి గతంలో చాలా వ్రాసినాను. 
ప్రస్తుతం ఏమీ వ్రాయడం ఇష్టం లేకనే మిన్నకున్నాను.
సామూహిక కర్మ ప్రభావం.
అంతే.

21, సెప్టెంబర్ 2013, శనివారం

పంచవటి సంస్థ (Panchawati Inc.) అమెరికాలో మొదలైంది

"సాటి మానవుని బాధలను పట్టించుకోని వేదాంతం నాకక్కరలేదు" అన్నారు వివేకానందస్వామి.రామకృష్ణుని శిష్యులు మెట్టవేదాంతులు కారు.వారు ఉత్త ఊకదంపుడు ఉపన్యాసకులు కారు.వారు ఆచరణవాదులు.అసలు సిసలైన సాధకులు.అంతేకాదు వారు నిజమైన మానవతావాదులు.

"ఆత్మనో మోక్షార్ధం జగద్ధితాయచ(నీ మోక్షం కొరకు,జగత్తుకు మంచి చెయ్యడం కొరకు నీ జీవితాన్ని అర్పించు) అన్న మహత్తరమైన ఆశయంతో వివేకానందులు రామకృష్ణామిషన్ స్థాపించారు.ఇన్నేళ్ళలో ఈసంస్థ లెక్కలేనంతమంది మహర్షులను మహనీయులను మహాత్ములను సృష్టించింది.

వారందరూ శ్రీరామక్రిష్ణులు చూపిన 'శివభావే జీవసేవ (శివుడినే సేవిస్తున్నాను అన్నభావంతో జీవుడిని సేవించు.జీవుడిలో శివుడిని చూడు)' అన్నబాటలో నడిచి చరితార్దులై ప్రపంచ ఆధ్యాత్మికచరిత్రలో ధృవతారలై వెలుగుతున్నారు.వారి అడుగుజాడలలో నడిచే ప్రయత్నంతోనే ఇప్పుడు పంచవటి సంస్థ(Panchawati Inc.)అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో మొదలైంది.

రాయిలో భగవంతుడిని కొలవడం మంచిదే.మనం కొన్ని వేల ఏళ్ళుగా అదే చేస్తున్నాం.కాని జీవులలో ఉన్న భగవంతుడిని ఆరాధించడం ఇంకా ఉన్నతమైనది.ఈ భావన మన వేదాలలో ఉపనిషత్తులలో ఎప్పటినుంచో ఉన్నది.దానిని బయటకు తీసి ఆచరణాత్మకంగా మలచి కర్మనే యోగంగా చెక్కి,సేవద్వారానే మానవుడు ఆధ్యాత్మికంగా ఎదగగలడు అని చెప్పిన ఘనత వివేకానందస్వామిది.

మానవ జీవితగమ్యం భగవత్ సాక్షాత్కారం.మానవుడు లౌకిక జీవితంలో ఎన్ని సాధించినా సరే,ఇది సాధించకుండా మరణిస్తే అతని జన్మ వృధా అవుతుంది.అతడు అసంతృప్తితో చావవలసి వస్తుంది.తర్వాత ఏ జన్మ వస్తుందో తెలియదు.కనుక మానవజన్మను చాలా జాగ్రత్తగా ఉపయోగించుకో వలసి ఉంటుంది.ఈ విషయాన్ని మనగ్రంధాలు అన్నీ నొక్కిచెప్పాయి. దైవసాక్షాత్కారాన్ని పొందడానికి మన ధర్మంలో మతంలో అనేక మార్గాలున్నాయి.వీటిలో భక్తి,జ్ఞాన,రాజ,కర్మయోగాలు నాలుగూ రాజ మార్గాలవంటివి.మిగిలిన చిన్నచిన్న మార్గాలన్నీ ఈ నాలుగింటిలో కలసి వస్తాయి.వాటిలో ఒకటిగాని,కొన్నిగాని,అన్నీగాని  ఎవరి శక్తిని బట్టి వారు ఆచరించి జీవితగమ్యాన్ని చేరమని వివేకానందస్వామి మహోపదేశం ఇచ్చారు.

మహోన్నతమైన మన సనాతనధర్మం కులానికి మతానికి జాతికి వర్గానికి వర్ణానికి అతీతమైనది.కాని అనేక కారణాలవల్ల తరతరాలుగా ఇవే సంకెళ్ళలో అది చిక్కుకుపోయింది.ఎందరికో దూరమై పోయింది.ఆ సంకెళ్ళను తెంచి దానిలోని అమూల్యసంపదను అందరికీ అర్ధమయ్యేలా పంచి ఆర్తితో వెదుకుతున్న ఎందరికో సరైన దారిచూపి,దాని ఒడిలోనికి వారినందరినీ ఆహ్వానించి,వారి ఆర్తిని తీర్చాలని నేను నావంతుగా మూడేళ్లుగా నా బ్లాగ్ ద్వారా నిజమైన సనాతనధర్మాన్ని వివరిస్తూ ప్రయత్నిస్తున్నాను.

ఈ ప్రయత్నంలో చాలావరకూ సఫలీకృతుడనయ్యాను అనడానికి నేను అందుకున్న వేలాది మెయిల్స్, నేను తీర్చిన వేలాది ఆధ్యాత్మిక సందేహాలే రుజువులు.నా బ్లాగ్ లోని పోస్ట్ లు చదివి -- "నిజమైన సనాతనధర్మం అంటే,హిందూమతం అంటే ఇదా? మన మతంలో ఇంత గొప్పదనం ఉన్నదా?ఇన్ని మహోన్నత విషయాలూ రహస్యాలూ మన ధర్మంలో ఉన్నాయా? అన్న విషయాలు తెలుసుకున్నాము.మీ బ్లాగ్ చదివి ఎంతో నేర్చుకున్నాము.మా ఆలోచనాపరిధి ఎంతో పెరిగింది.మా జీవితాలలో ఊహించని మార్పు వచ్చింది.మీ వ్యాసాలు చదవకుంటే జీవితంలో ఎంతో కోల్పోయి ఉండేవారము" - అంటూ నాకు వచ్చిన మెయిల్స్ కొన్ని వందలున్నాయి.నా ఈ నిస్వార్ధ ప్రయత్నాన్ని చూచి ఈనాడు నాకు తోడుగా ఇంకొందరు వచ్చి నిలిచారు.ఇంకా ఎందఱో మాతో కలవడానికీ,కలసి నడవడానికీ సిద్ధంగా ఉన్నారు.వారందరికీ నా కృతజ్ఞతలు.

పైన వివరించిన మహత్తరమైన ఆశయాలతో ఉత్తేజితులైన కొద్దిమందితో 'పంచవటి' సంస్థ ఈనాడు అమెరికాలో ప్రారంభమైంది.ఈ ఉన్నతమైన ఆశయం వెనుక విష్ణుభొట్ల రామన్నగారు,ఆకెళ్ళ పద్మజగారు,డాక్టర్ సావిత్రిగారు ప్రస్తుతానికి ఉన్నారు.వీరు ముగ్గురినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

త్వరలో మనదేశంలో ప్రారంభించబోతున్న 'పంచవటి ట్రస్ట్' లో చేరి దాని ఆశయాలలో పాలు పంచుకోవడానికి ఇప్పటికే ఉన్న మా 'పంచవటి' గ్రూప్ సభ్యులు సిద్ధంగా ఉన్నారు.వారికీ నా కృతజ్ఞతలు.

ముందుముందు ఈసంస్థ ఎంతో ఎత్తుకు ఎదిగి,కులమతాలకు అతీతంగా,ఒక మహావృక్షంగా మారి ఎందఱో వ్యదార్తులకు స్వాంతన కలిగిస్తుందనీ ఎందఱో నిస్వార్ధసాధకులకు నిజమైన ఆధ్యాత్మికమార్గం చూపి వారిని భగవదున్ముఖులను గావిస్తుందనీ,దారి తెలియక వెదుకుతున్నవారికి సరియైన మార్గదర్శనం చెయ్యగలదనీ నేను నమ్ముతున్నాను.

ఈ కల సాకారం కావడానికి వెనుక ఎంతో తపన ఉన్నది. ఎన్నో హృదయాల నిరంతర అన్వేషణ ఉన్నది.అమూల్యమైన ఈ మానవజన్మను వృధాగా గడిపి అందరిలాగా చావకూడదన్న ఒక ఆర్తి ఉన్నది. అదంతా నేను ఇక్కడ చెప్పబోవడం లెదు.ఈ మూడేళ్ళలో జరిగిన సంఘటనలను అన్నింటినీ నేను ఇక్కడ వివరించబోవడం లెదు.కానీ ఒక్క విషయాన్ని మాత్రం చెప్పాలనుకుంటున్నాను.

ఈ మార్గంలో మేము ఒంటరులం కాము.మా వెనుక భగవంతుని ఆశీస్సులున్నాయి.అంతేగాక పవిత్రాత్ములైన పరమపూజ్య స్వామి గంభీరానంద,స్వామినందానంద,స్వామిఉద్ధవానంద,స్వామి తపస్యానంద మొదలైన మహనీయుల,జగద్గురువుల,యోగేశ్వరుల ఆశీస్సులున్నాయి. ఇంకెందరో మహనీయుల కటాక్షం నిండుగా మావెంట ఉన్నది.స్వామి ఆత్మలోకానంద,గౌరీవ్రత్ మా మొదలైన ప్రస్తుత మహాత్ముల మార్గదర్శనం ఉన్నది.

'స్వామి ఆత్మలోకానంద','గౌరీవ్రత్ మా' - వీరిద్దరూ భారతీయులు కారు.శ్వేత జాతీయులు.వీరిలో 'గౌరీవ్రత్ మా' యూదు జాతీయురాలు.కాని భారతీయ సనాతనధర్మంతో ప్రభావితురాలై తన జీవితాన్ని రామకృష్ణ వివేకానందుల మహత్తర ఆశయాలకోసం త్యాగంచేసి సన్యాసం స్వీకరించి తపోమయజీవితం గడుపుతూ నలభైఏళ్ళ నుండి అమెరికాలో మనం ఊహించలేనంత గొప్ప సేవ చేస్తున్నారు.

చిన్నచిన్న ఆడపిల్లలను వ్యభిచార ఊబిలోకి దించి వారిచేత బలవంతంగా వ్యభిచారం చేయించే child trafficking అనేది ఆసియా దేశాల తర్వాత అమెరికాలోనే ఎక్కువ. గౌరీవ్రత్ మా నాలుగు దశాబ్దాల నుంచి ఈ చెడును ప్రతిఘటిస్తూ అమెరికాలో ఎందఱో ఆడపిల్లలను ఈ ఊబినుంచి రక్షించి వారికి నూతనజన్మను ఇచ్చే పనిని చేస్తూ ఉన్నారు.ఒంటరి స్త్రీని నేనేమి చెయ్యగలను అనుకోకుండా,మొక్కవోని ధైర్యంతో,రామకృష్ణ,శారదా వివేకానందుల మీద అమేయమైన నమ్మకంతో,అమెరికన్ మాఫియాకు ఎదురు నిలిచి,ప్రాణాలకు తెగించి,ఎందఱో పురుషులు చెయ్యలేని ఈ పనిని గౌరీవ్రత్ మా ఒక్కరే చేస్తున్నారు.

హిందూ మతంలో పుట్టకపోయినా,భారత దేశానికి ఎన్నో వేల మైళ్ల దూరంలో ఉన్నా,ఈ దేశాన్ని ఈ సంస్కృతిని ప్రేమిస్తూ,ఊరకే మాటలు చెప్పి ఊరుకోవడం కాకుండా అవిచూపిన బాటలో నడుస్తూ,జీవితాలను చరితార్దాలుగా మలచుకున్న విదేశీయులు ఎందఱో నేడు మన కళ్ళెదురుగా ఉన్నారు.

వీరికి mothers trust అనే సంస్థ ఉన్నది.ఆ సంస్థ వివరాలనూ, వారు ఎంతటి అద్భుతమైన సేవను చేస్తూ ఎంతటి ఉదాత్తమైన ఉన్నతమైన జీవితాలను గడుపుతున్నారో ఇక్కడ చూడండి.

స్వామివివేకానంద యొక్క అనేకమంది శిష్యులలో ఒకరు స్వామి విరజానంద.1938 లోనే ఆయన రామకృష్ణా మిషన్ కు ఆరవ సర్వాధ్యక్షులుగా పనిచెశారు.స్వామి వివేకానందుల స్వహస్తాల నుంచి సన్యాసం స్వీకరించిన అదృష్టశాలి విరజానందస్వామి.ఆ భాగ్యమే ఆయనను జగద్గురువును చేసింది.శ్రీరామకృష్ణుల ప్రత్యక్షశిష్యులైన వివేకానందాది మహనీయుల తర్వాత తరంలో మొట్టమొదటి వారు స్వామి విరజానంద.

ఆయన శిష్యులలో ఒకరు స్వామి భాష్యానంద.ఆయన 1960 లలో అమెరికాలో నివసించి వేదాంతప్రచారం గావించారు.సనాతనధర్మాన్ని విదేశీయులకు అర్ధమయ్యేలా చెబుతూ తన ఉదాత్తమైన జీవితంతో ఎందరినో ప్రభావితులను చేశారు.ఆ ప్రభావంతో ఇప్పుడు రామకృష్ణ వివేకానందుల మార్గంలో ఎందఱో విదేశీయులు నడుస్తూ ఉజ్జ్వలమైన ఋషిజీవితాలు గడుపుతూ,భారతీయులమైన మనం సిగ్గుతో తల దించుకునేలా చేస్తున్నారు.మన ధర్మాన్ని గురించి ఈనాడు వారు మనకు బోధిస్తున్నారు. మన వేదాలలో ఏముందో మనకు తెలీదు.దానిని వారు గ్రహించడమే కాదు. జీవితాలలో ఆచరించి చూపిస్తున్నారు.మనమో,డబ్బు వెంటా, ఇంద్రియ సుఖాలవెంటా పిచ్చిగా పరిగెత్తుతున్నాం.కనీసం వారిని చూచైనా మన నిజమైన ధర్మం ఏమిటో మనం నేర్చుకునే ప్రయత్నం చెయ్యకపోతే మనకు నిష్కృతి లేనే లేదు.

మహోన్నతులైన మన పూర్వఋషులు చూపిన మార్గంలో,శ్రీరామకృష్ణ శారదామాత వివేకానందుల అడుగుజాడలలో నడవాలనే మహోన్నత ఆశయంతో ఈనాడు అమెరికాలో 'పంచవటి' సంస్థ మొదలైంది.

"పంచవటి" - ఫలాపెక్ష లేని ఒక ఉదాత్తమైన సంస్థ.మాకు పేరు ప్రఖ్యాతులు అక్కర్లెదు.కిరీటాలు అక్కర్లేదు.ఆర్భాటాలు అక్కర్లెదు.పొగడ్తలు అక్కర్లెదు. ఏదో ఆశించి మేము ఈ పనిని చెయ్యడం లేదు.నిజమైన సనాతనధర్మాన్ని ఆచరించి జీవితాలను ధన్యములు చేసుకోవడమూ,ఆర్తి ఉన్న ఇతరులను కూడా ఈమార్గంలో నడిపించి వారిని కూడా ధన్యులను చెయ్యడమే మా ఆశయం.ఈ ఆశయానికి ఊతం శ్రీరామకృష్ణులు, శారదామాత, వివేకానంద స్వామి.కులమతాలకు అతీతంగా వారు చూపిన విశ్వజనీనమైన మార్గమే మా బాట.

భగవదవతారమైన శ్రీరామకృష్ణుని కరుణాకటాక్షాలతో ఈ జన్మలోనే మా గమ్యాన్ని చేరగలమన్న నమ్మకం మాకున్నది.మా ప్రయత్నానికి దైవం తన చేయూతనిచ్చుగాక.

మా వెబ్ సైట్ ఇక్కడ చూడవచ్చు.

త్వరలో మా కార్యక్రమాలను పై వెబ్ సైట్ ద్వారానూ,ఈ బ్లాగ్ ద్వారానూ కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్ చెయ్యడం జరుగుతుంది.

19, సెప్టెంబర్ 2013, గురువారం

సద్గురు ప్రణవానంద ఆశ్రమం


సద్గురు ప్రణవానందస్వామి
నేను నంద్యాల పట్టణానికి పోతే అక్కడికి పోయిన పని ముగిసినాక వీలైనప్పుడల్లా దర్శించే స్థలాలు రెండున్నాయి.ఒకటి సద్గురు త్యాగరాజ స్వామి ఆలయం.రెండవది సద్గురు ప్రణవానందస్వామి సమాధి ఉన్న ఆశ్రమం.చాలామందికి తెలిసిన విషయం ఏమంటే తమిళనాడు లోని తిరువయ్యారు లో త్యాగరాజస్వామి సమాధీ ఆలయమూ ఉన్నవి.కాని మన ఆంధ్రదేశంలో త్యాగరాజస్వామికి ఆలయం ఒక్క నంద్యాలలోనే ఉన్నది.ఆ వివరాలు ఇంకొక పోస్ట్ లో వ్రాస్తాను. ప్రస్తుతానికి సద్గురు ప్రణవానందుల ఆశ్రమం గురించి.



నంద్యాల నుంచి మహానందికి వెళ్ళే దారిలో బుక్కాపురం అని ఒకగ్రామం వస్తుంది.ఆ గ్రామ పొలిమేరలలో దారిపక్కనే ఒక పెద్ద ఊడలు దిగిన మర్రిచెట్టూ దాని పక్కనే పాతకాలంనాటి ఒక ఆశ్రమమూ కనిపిస్తాయి. చాలామందికి తెలియని విషయం ఏమంటే,అది ఒక సద్గురుస్థానం అనీ,నిజమైన వేదాంతీ మహనీయుడూ అయిన ప్రణవానందస్వామి అక్కడే నివసించి సమాధి అయ్యారనీ ఎక్కువమందికి తెలియదు.


నేను గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగినప్పటికీ నాకు రాయలసీమ అంటేనే ఇష్టం.దానికి కారణం రాయలసీమలో ఉన్న ఆధ్యాత్మిక తరంగాలే. సర్కార్ జిల్లాల వాతావరణం కలుషితం అయినంతగా రాయలసీమ కాలేదు.పైగా, రాయలసీమలో ఆధ్యాత్మిక వాతావరణం సర్కార్ జిల్లాలలో కంటే చాలాహెచ్చు.ఇప్పటికీ ఎన్నో నిజమైన సాధు సాంప్రదాయాలు రాయలసీమలో ఉన్నాయి.వాటిలో ఒకటి శ్రీమదుమామహేశ్వర గురుపీఠం.ఎందఱో యోగులు,అవధూతలు, మహానీయులు ఇప్పటికీ రాయలసీమ మారుమూల పల్లెలలో కూడా మనకు కనిపిస్తారు.అయితే వారిని గుర్తించగలిగే ప్రజ్ఞ మనలో ఉండాలి.


ప్రణవానందస్వాములకు ముందు వీరి పరంపర నాకు తెలియదు.కాని ప్రణవానందస్వామి తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ రాయలసీమలో స్థిరపడి బుక్కాపురంలో సమాధి అయ్యారు.ఆయన శిష్యుడైన సద్గురు సదానందస్వామి గుంతకల్లు దగ్గర ఉన్న గంజిగుంట అనే గ్రామంలో ఆశ్రమం నిర్మించుకుని అందులోనే నిర్యాణం చెందారు.వారి సమాధి అక్కడ ఉన్నది. ఆయన శిష్యుడైన శంకరానందగిరి స్వామి ఉరవకొండ దగ్గర ఉన్న లత్తవరం అనేగ్రామంలో సమాధి చెందారు.వీరు ముగ్గురూ నిజమైన వేదాంతులు. మహనీయులు.సద్గురువులు.

వీరిలో శంకరానందగిరిస్వామిని దర్శించే భాగ్యం నాకు కలిగింది.1984 లో నేను గుంతకల్లులో ఉన్నప్పుడు తిలక్ నగర్లో ఉన్న వారి ఆశ్రమాన్ని తరచూ దర్శించేవాడిని.ఆయన అక్కడకు తరచుగా వచ్చేవారు.

ఒకసారి మా అమ్మగారితో స్వామి దర్శనానికి వెళ్లాను.అప్పుడు మా అమ్మగారు స్వామిని ఒక ప్రశ్న అడిగారు.

'పెద్దవయసు కావడంతో కాళ్ళనొప్పుల వల్ల స్థిరంగా ఆసనంలో కూర్చుని ఎక్కువసేపు జపధ్యానాలు చెయ్యలేకపోతున్నాను.దీనికి మార్గం ఏదైనా చెప్పండి స్వామీ' అన్నారు.

దానికి స్వామి వెంటనే పతంజలి యోగసూత్రాలలో నుంచి ఉదహరిస్తూ-' అమ్మా."స్థిర సుఖమాసనం" అని యోగసూత్రాలలో మహర్షి చెప్పినారు. కనుక పద్మాసనమే కానవసరం లేదు.నీకు శ్రమలేకుండా సుఖంగా ఎక్కువ సేపు కూర్చోనగలిగే ఆసనం ఏదైనా మంచిదే తల్లీ.మనస్సు ఏకాగ్రం కావడం ప్రధానం.'- అని సమాధానం ఇచ్చారు.

అప్పటికి నాకు 20 ఏళ్ళు.నేను అప్పటికే యోగసూత్రాలను అనేకసార్లు తిరగామరగా చదివి ఉండటంచేత వాటిలో చాలాభాగం నాకు కంఠతా వొచ్చు. మా గురువులు చెప్పినది కూడా అదే కావడంతో ఆయన చెప్పిన సమాధానం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది.



శంకరానందగిరి స్వామి ప్రవచనాలను వినే అదృష్టం నాకు కొన్నిసార్లు కలిగింది.అనర్గళమైన ఆయన వాగ్ధాటికి ముగ్దులవని వారు అరుదు.ఆయన మాట్లాడటం మొదలుపెడితే మూడునాలుగు గంటలపాటు వేదాలనుంచీ, ఉపనిషత్తులనుంచీ,బ్రహ్మసూత్రాల నుంచీ,భగవద్గీత నుంచీ,యోగవాసిష్టం నుంచీ,యోగసూత్రాలనుంచీ,పురాణాల నుంచీ ఎన్నోశ్లోకాలను సందర్భానుసారంగా అప్పటికప్పుడు అనర్గళంగా ఉదాహరిస్తూ మధ్యమధ్యలో పిట్టకధలను చెబుతూ వేదాంతబోధ చేసేవారు.

ఆయన కన్నడప్రాంతంలో ఒక మంచి సంపన్నకుటుంబంలో జన్మించారు. చిన్నవయసులోనే వైరాగ్యసంపన్నుడై సన్యాసం స్వీకరించి తపస్సులో కాలం గడిపారు.దశనామీ సాంప్రదాయంలో వీరిది 'గిరి' సాంప్రదాయం.తెలుగు, కన్నడ,ఇంగ్లీషు,హిందీ,సంస్కృత భాషలలో ఆయన అనర్గళంగా మాట్లాడగలిగేవారు.సరస్వతీదేవి ఆయన నోటిలో నివాసం ఉన్నదా అనిపించేది.ఆయన ప్రవచనాలను వినినవారు నిజంగా అదృష్టవంతులే.అంత అద్భుతంగా spell binding గా ఉండేవి ఆయన ఉపన్యాసాలు.అప్పటికీ ఇప్పటికీ నేను ఎందఱో ఉపన్యాసకులను విన్నాను. కాని ఆయనతో సాటిరాగల అద్భుతవక్తలు నాకు ఇప్పటివరకూ కనిపించ లేదు.

ఆయనది ఉత్తపాండిత్యం అనుకుంటే పొరపాటు పడినట్లే.పాండిత్యానికి తోడు ఆయన గొప్పతపస్వి.ఆయనలో పాండిత్యమూ తపస్సూ కలసిమెలసి ఉండేవి.ఆయన మహాజ్ఞాని అని ఆయనను చూస్తేనే అర్ధం అవుతుంది. ఒకనిలో పాండిత్యమూ తపస్సూ కలగలసి ఉంటే అది బంగారానికి సువాసన అబ్బినట్లు అవుతుంది అని శారదామాత అనేవారు.శంకరానందస్వామి అట్టి మహనీయుడు.

అప్పట్లో శంకరానందస్వామీ,గండిక్షేత్రం రామక్రిష్ణానందస్వామీ కలసి ఇచ్చిన గీతోపన్యాసాలు ఆంద్రదేశాన్ని ఉర్రూతలూగించాయి.ఇద్దరు మహా పండితులూ మహావక్తలూ,మహాజ్ఞానులూ కలిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో వాటిని విన్నవారికే ఎరుక.అదృష్టం అంటే వారిదే.వారితో పోలిస్తే నేటి టీవీ ఉపన్యాసకులు చెల్లని రూపాయిలూ పంటికింద రాళ్ళూ అనే చెప్పాలి.



అప్పట్లో ఎన్టీ రామారావు తీసిన 'పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి' సినిమా రిలీజైంది.గుంతకల్లు ప్రసాద్ టాకీస్ లో అది విడుదలైంది.నేను ఆ సినిమా చూడటానికి పోయినరోజే స్వామి కూడా సినిమా చూడటానికి వచ్చారు. హాలు యజమానులు స్వామి శిష్యులు కావడంతో ఆయన్ను ప్రత్యేకంగా బాక్స్ లో కూచోబెట్టి సినిమా చూపించారు.సామాన్యంగా సాంప్రదాయ స్వాములు సినిమాలకు రారు.కొందరేమో 'నేను స్వామీజీని అయ్యుండి సినిమాకి పోవడం ఏమిటి?'అని నామోషీగా అనుకుంటారు.కాని స్వామి అలాంటి భేషజాలు ఏమీ లేకుండా ఒక చిన్నపిల్లవానిలాగా  హాలుకు వచ్చి మరీ ఆ సినిమాను చూచారు.ఆయన మామూలు జ్ఞాని కాదనీ జ్ఞాని స్థాయిని దాటిన విజ్ఞాని అనీ నాకు ఆరోజే అర్ధమైంది.



గంజిగుంటలో స్వామి గురువులైన సదానందయోగీంద్రుల ఆరాధన జరుగుతుంది.1988లో జరిగిన ఆరాధనకు మేము అక్కడున్నాము.ఆరోజున తన గురువుగారి పాదుకలను తలమీద పెట్టుకుని ఎంత భక్తిగా స్వామి మేడమీద తన గదినుంచి కిందకు దిగివచ్చారో ఆ దృశ్యం నాకింకా ఇప్పటికీ కళ్ళముందు మెదులుతుంది.తాను స్వయంగా ఒక జ్ఞాని అయి ఉండీ తన గురువును ఎంతగా గౌరవించేవారో? ఆ దృశ్యం నిజంగా అద్భుతం.



గుంతకల్లులో ఒకసారి బహిరంగసభ జరిగింది.ఎందఱో స్వాములు మహనీయులు ఆసభకు వచ్చినారు.ఎన్నో గొప్ప వేదాన్తోపన్యాసాలు ఇవ్వబడ్డాయి.ఇంతలో ఎక్కడనుంచి వచ్చినదో సభామధ్యంలోకి ఒక ఊరకుక్క ప్రవేశించింది.అందరూ దానిని తరిమి కొడుతున్నారు.అప్పటివరకూ అంతా బ్రహ్మమే అంటూ ఉపన్యాసాలు వినిన భక్తులు అవన్నీ మరచి కుక్కను 'ఛీఛీ' అని అదిలిస్తున్నారు.

శంకరానందస్వామి వేదికపైనుంచి దానిని గమనించి మైకు తీసుకున్నారు. కుక్కవైపు చూస్తూ చేతులు జోడించి 'స్వామీ! మీ దారిన మీరు పోతుంటే వారికి తెలియక మిమ్మల్ని అదిలిస్తున్నారు.వారి అజ్ఞానాన్ని మన్నించి మీదారిన మీరు సుఖంగా వెళ్ళండి' అని మైకులో చెప్పారు.సభ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది.అందరూ తొలగి దారి ఇచ్చారు.ఆ కుక్క తన దారిన తాను బయటకి వెళ్ళిపోయింది.ఈ సంఘటనకు నేనే ప్రత్యక్ష సాక్షిని.

వేదాంతాన్ని చెప్పడమే కాదు ఆచరించి చూపించిన మహాజ్ఞాని శంకరానందగిరిస్వామి.ఆయన గురువు సదానందయోగీంద్రులు.ఆయన గురువు ప్రణవానందస్వామి.



వీరి సాంప్రదాయంలో నాకు నచ్చిన ఇంకొక ముఖ్యవిషయం.వీరి ఆశ్రమాలలోని ఆలయాలలో దేవాలయద్వారానికి పైగా ఇరువైపులా శ్రీరామకృష్ణ వివేకానందుల చిత్రాలు తప్పకుండా ఉంటాయి.స్వామి తన ఉపన్యాసాలలో వీరిని గురించి చెప్పకుండా ఉండరు.వివేకానందులనూ రామకృష్ణులనూ చెప్పకుండా వారి ఉపన్యాసం ముగియదు.



అటువంటి మహనీయులను స్మరిస్తే చాలు.మన పాపాలు పటాపంచలై పోతాయి.మన మనస్సులు పవిత్రమైన భావాలతో నిండిపోతాయి.మనకు కూడా బ్రహ్మావలోకన ధిషణ కలుగుతుంది.

ఈ మధ్య నేను బుక్కాపురం ఆశ్రమానికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటోలను ఇక్కడ చూడవచ్చు.ఆశ్రమం నిర్మానుష్యంగా ఉంటుంది.కాపలాగా ఒక్క మనిషి(అతను కూడా భక్తుడే అయి ఉంటాడు) తప్ప అక్కడ సామాన్యంగా ఎవరూ ఉండరు.నిరాడంబరంగా నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉండే నిజమైన ఆశ్రమం అది.ధ్యానానికి చాలా అనువైన ప్రశాంతమైన ప్రదేశం.