Pages - Menu

Pages

27, జనవరి 2014, సోమవారం

శ్రీశైలం నుంచి పిలుపొచ్చింది -4

ఒకసారి బ్రహ్మంగారు నంద్యాలలో పర్యటిస్తూ ఉన్నపుడు కంసాలి వీధిలో తన శిష్యులతో నడచి వెళుతున్నారు. ఆయనకు దాహం వేసి మంచినీళ్ళు అడిగారు.వాళ్ళు కరిగిన బంగారాన్ని తాగమని ఇచ్చినారు సార్.అప్పట్లో నంద్యాల అంతా సస్యశ్యామలంగా ఉండేది.అందరూ ధనమదంతో విర్రవీగుతూ ఉండేవారు. ఆయన్ని ఎగతాళి చెయ్యడానికి కరిగిన బంగారాన్ని త్రాగమని ఇచ్చినారు.పొగలు కక్కుతున్న ఆ బంగారాన్ని ఆయన గుటుక్కున త్రాగేసి ఏమీ జరగనట్లుగా తన శిష్యులతో నడచి వెళ్ళిపోయాడు.

'ఇదే మహిమను ఆదిశంకరులూ,త్రైలింగ స్వామీ కూడా చేసినారని కధలున్నాయి' అన్నాను.

'అదేమో నాకు తెలియదు సార్.ఇది మాత్రం నంద్యాలలో జరిగింది.బ్రహ్మంగారు చేసినారు.ఇంకొక మహిమ కాళికామాత ఆలయంలో చేసినాడు' అన్నాడు.

'ఈ ఊరిలో కాళికామాత ఆలయం ఉన్నదా?' అడిగాను.

'ఎందుకు లేదు సార్? ఈ ఊరికి రక్షాదేవత కాళీమాతనే.అయిదువందల ఏండ్ల క్రితం ఈ ఊరిని నందిమహారాజు పరిపాలించే సమయంలో ఈ ఊరి చుట్టూ పెద్ద అగడ్త ఉండేది.అందులో మొసళ్ళు ఉండేవి.ఆ కందకం బయటగా కాళీమాత ఆలయం ఉండేది.ఇప్పుడైతే అది ఊరిమధ్య అయిపొయింది.రాజు యుద్దానికి వెళ్ళేటప్పుడూ వచ్చేటప్పుడూ కాళీమాతను పూజించేవాడు.' అన్నాడు.

'కాళీమాత ఆలయంలో బ్రహ్మంగారు చేసిన మహిమ ఏమిటి?' అడిగాను.

'ఒకసారి ఆయన ఒక పదిమంది శిష్యులతో ఈ ఊరికి వచ్చినాడు సార్.మధ్యాన్నం భోజనానికి ఎవరినో అడిగినారు.వారు ఈయన్ను పరీక్షించాలని 'సరే మీరు స్నానం చేసుకుని రండి.ఈలోపల భోజనాలు సిద్ధం చేస్తాము'అని చెప్పినారు.వారు స్నానసంధ్యలు చేసుకొని వచ్చేసరికి ఏభైమందికి సరిపడా అన్నం వండించి కుప్పపోసి పెట్టినారు.

'తినండి' అని ఆయన్ను చాలెంజ్ చేసినారు.

బ్రహ్మంగారు వారి కుయుక్తిని గ్రహించి ' ఈ అన్నం అంతా నా శిష్యుడు సిద్దయ్య ఒక్కడికే చాలదు.మిగిలిన వారికి ఏమి పెడతారు?' అని అడిగినాడు.

వారు ఎగతాళిగా నవ్వుతూ 'ఏభై మందికి వండిన అన్నం ఒక్కడికే చాలదా? తినమనండి చూద్దాం" అనినారు.

అప్పుడు బ్రహ్మం గారు ఆజ్ఞాపించగా సిద్దయ్య కాళీమాతను మదిలో స్మరించి ఆ కుంభం ముందు కూర్చోనగా అతన్ని ఆవహించిన కాళికాశక్తి ఆ అన్నకుంభం మొత్తం అమాంతం ఆరగించి ఇంకా చాలక 'ఆకలి ఆకలి' అని పెడబొబ్బలు పెట్టసాగింది.అది చూచిన ఆ ప్రజలు భయంతో గడగడా వణికిపోయి బ్రహ్మంగారి కాళ్ళమీద పడి క్షమించమని వేడుకున్నారు.

అప్పుడు బ్రహ్మంగారు 'అల్పులారా! మావంటివారిని మీరు పరీక్షించ తగునా? తప్పుకదా?' అని బుద్ధి చెప్పి, తన కమండలంలోని నీటిని సిద్ధయ్యమీద చల్లి 'అమ్మా!ఇక సిద్ధయ్యను వదలిపెట్టు' అని ప్రార్ధించగా అతన్ని ఆవహించిన కాళికాదేవి వదలి వెళ్ళిపోయింది. అప్పుడు సిద్దయ్య శాంతించాడు సార్.ఇది నిజంగా జరిగిన మహత్యం.ఇప్పటికీ దీనిని నంద్యాలవాసులు కధగా చెప్పుకుంటారు.' అన్నాడు.

అయితే ఈ సారి వచ్చినపుడు అమ్మ దర్శనం చేసుకోవాలి అనుకుంటూ దేవాలయం ఎక్కడ ఉంటుందో అడ్రస్ అడిగి తెలుసుకున్నాను.

ఇలా మాట్లాడుకుంటూ, మాటల్లోనే శ్రీశైలం చేరుకున్నాము.దారిలో ఒకచోట మల్లయ్య మాకోసం వేచిఉన్నాడు. అతన్ని కార్ ఎక్కించుకొని బయల్దేరాము.దారిలోనే కమీషనర్ గారి ఇల్లు ఉన్నది.పలకరించి వెళదాం అని మల్లయ్య అన్నాడు.సరే అని అటు దారి తీశాము.

మేం వెళ్లేసరికి ఆయన తోటపనిలో ఉన్నాడు.దగ్గరుండి మొక్కల పని చేయిస్తున్నాడు.కుశల ప్రశ్నలు అయ్యాక కూర్చుని టీ తాగుతూ ఉండగా 'మీకు గార్డెనింగ్ అంటే బాగా ఇష్టంలా ఉన్నది' అన్నాను.

అవునండి.ఎక్కడెక్కడి నుంచో నాకిష్టమైన మొక్కలు తెప్పించి పెంచుతూ ఉంటాను.' అన్నాడాయన. చుట్టూ చూస్తె దానికి తార్కాణంగా రకరకాల మొక్కలు తోటలో కనిపించాయి. వాటిలో కొన్నింటిని బొమ్మూరు నర్సరీ నుంచీ, ఇంకోన్నింటిని వేరే నర్సరీల నుంచీ, మరి కొన్నింటిని శ్రీశైలం అడవిలోనుంచీ తెప్పించానని ఆయన చెప్పాడు.

'ఇది బ్రహ్మకమలం.ఏడాదికి ఒకసారి పూస్తుంది.దీనిని హిమాలయాల నుంచి తెప్పించాను.'అంటూ ఒక మొక్కను చూపించాడు.అది కేక్టస్ జాతికి చెందిన మొక్కలాగా కనిపించింది.నీటిని బాగా నిలువచేసుకునే జాతి మొక్క అది.దాని కొమ్మను తుంచి ఇంకొకచోట పెట్టినా అది చెట్టుగా మారుతుందని చెప్పాడాయన.కొమ్మనుంచి ఆకులోకి వచ్చిన దాని నరాలు కూడా బలంగా బాగా ఉబ్బి కనిపిస్తున్నాయి.ఆ మొక్కను చూస్తూనే దాని ఆకారాన్ని బట్టి అది గురుగ్రహ అధీనంలో ఉన్నదని నాకర్ధమైంది.గురువుకు 'జీవుడు'అని ఇంకొక పేరు.అందుకే దీనికి కూడా జీవశక్తి అధికంగా ఉన్నది.'అనుకుంటూ తలపంకించాను.ఆయన హాబీని అభినందించాను.

'చాలామంది మా ఇంట్లో బ్రహ్మకమలం ఉన్నది అనీ అది పూసింది రండి చూద్దురుగాని' అనీ అనడం నేను విన్నాను.కొంతమంది అదేపనిగా వెళ్లి దానిని చూడడమూ నాకు తెలుసు.బ్రహ్మకమలం తోటలో ఉంటె చాలదు.ప్రతిమనిషిలోనూ బ్రహ్మకమలం ఉన్నది.నీలో ఉన్న బ్రహ్మకమలాన్ని నీవు దర్శించాలి.అదే అసలైన విషయం.

తోటలో బ్రహ్మకమలం ఉన్నా ముళ్ళచెట్టు ఉన్నా నీకేమీ ఉపయోగం లేదు.మహా అయితే ఫోటోలు తీసి నలుగురికీ చూపడానికి పనికొస్తుంది. ఇంటికొచ్చిన గెస్ట్ లకు చూపితే వారు ముక్కుమీద వేలేసుకుని 'ఇదేనా బ్రహ్మకమలం?'అని ఆశ్చర్యపోవడానికి పనికొస్తుంది.కాని దానివల్ల ఇసుమంతైనా ఉపయోగం లేదు.

ఈ ఆలోచనలో ఉన్న నా మనసులో ఒక పద్యం ఆశువుగా పుట్టుకొచ్చింది.

ఆ||బ్రహ్మకమలమంచు భేషజంబది యేల
పత్ర పుష్పములను పొగడనేల
కమలమందు వెలయు కైవల్యమెరుగరా
బాహ్యదృష్టి మీరి బ్రహ్మమందు

అసలైన బ్రహ్మకమలం మనిషి లోపల ఉన్నది.దానిని దర్శించే సులువును మనిషి తెలుసుకోవాలి.ఏడాదికి ఒకసారి పుష్పించే దాని రహస్యం ఏమిటో మానవుడు గ్రహించాలి.

ఈలోపల కమీషనర్ గారు ఆలయసిబ్బందికి ఫోన్ చేసి ఫలానావాళ్ళు వస్తున్నారు.దగ్గరుండి దర్శనం చేయించండి.అని ఆదేశాలు జారీ చేశాడు.ఫోన్ పెట్టేసి నావైపు తిరిగి ఇలా అన్నాడు 'ఇక్కడ ఎవరైనా సరే శివలింగాన్ని తాకవచ్చు.కాని కాలక్రమేణా ఎవరుబడితే వారి చెమట తాకడంవల్లా,పాలతో అభిషేకం చేస్తున్నప్పుడు అందులోని కెమికల్స్ తాకడంవల్లా శివలింగం పాడైపోతున్నది.కనుక వెండిగాని బంగారుగాని కవచం చేయించి అందరూ శివలింగాన్ని తాకడం ఆపుదామని ఆలోచిస్తున్నాము.'

దానికి నేనేమీ జవాబు చెప్పలేదు.ఆయనకు థాంక్స్ చెప్పి గెస్ట్ హౌస్ కి దారితీశాము.కాసేపు అక్కడ ఫ్రెష్ అయ్యి సోఫాలో కూలబడుతుండగా 'టీవీ పెట్టమంటారా?' అడిగాడు అటెండర్.

'వద్దు' అన్నాను.

'పోనీ ఏసీ వెయ్యమంటారా?' అడిగాడు.

'అదీ వద్దు'అన్నాను.

అతను వింతగా చూచాడు.

'అదేంటి సారూ.ఇక్కడికి వచ్చేవాళ్ళు లోపలి వచ్చీరాకముందే ఏసీ వెయ్యి టీవీ పెట్టు అంటారు.మీరు వద్దంటున్నారు?' అన్నాడు విచిత్రంగా చూస్తూ.అంటూనే ఏసీ ఆన్ చేసి అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.

నేనేం జవాబు చెప్పలేదు.కాసేపు ఆ ఏసీలో ఆ సోఫాలలో కూచునేసరికి ఏదో కృత్రిమంగా అనిపించి ఒళ్లంతా కంపరం పుట్టింది.వెంటనే బయటకొచ్చి మెట్లమీద ఎండలో హాయిగా కూచున్నాను.

'అదేంటి సార్.లోపల హాయిగా ఏసీలో కూచోక ఇక్కడ కూచున్నారు?'అని మావాళ్ళు అడిగారు.ఇక అడుగువేసి అడుగుతీసిన ప్రతిదానికీ ఏమని జవాబులు చెప్తూ కూచునేది?అందుకని ఏం మాట్లాడకుండా నవ్వి ఊరుకున్నాను.

ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళడమూ యధావిధిగా దర్శనం చేసుకోవడమూ జరిగిపోయాయి.'శ్రీవిద్య' శుద్దోపాసనను పద్యరూపంలో అనుగ్రహించినందుకు లోపాముద్రాదేవికీ, అమ్మవారికీ, పరమేశ్వరునికీ మనస్సులో ప్రణామాలు అర్పించాను.శ్రీశైల దేవాలయంలో నాకిష్టమైన కొన్ని ప్రదేశాలున్నాయి.అక్కడ ప్రశాంతంగా కూచుని వేరే వాళ్లకు అనుమానం రానిరీతిలో నాపని పూర్తి చేశాను.

అర్ధం చేసుకోలేని మనుష్యులు వెంట ఉన్నప్పుడు ప్రతిదీ ఒక విసుగు అవుతుంది.కానీ తప్పదు.మనల్ని అర్ధం చేసుకుని మౌనంగా అనుసరించేవారు దొరకడం నిజంగా ఒక అదృష్టమే.ఆ అదృష్టం గొప్పగొప్ప యోగులకు కూడా దక్కదు.వారికీ అనుక్షణం ఏదో ఒక చికాకు ఉంటూనే ఉంటుంది.అలా మాటమాటికీ విసిగించే మనుషులూ పరిస్థితులూ వారికీ అనుక్షణం ఎదురౌతూనే ఉంటాయి.ఇక మనమెంత?

కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత వెనక్కు బయలుదేరాము.దగ్గరలోని ఒక గెస్ట్ హౌస్ నుంచి కింద నదీ డ్యామూ చాలా మంచి వ్యూ ఉంటుంది.అక్కడకు వెళ్లి కొన్ని ఫోటోలు దిగాము.శ్రీశైలంలో రైల్వే గెస్ట్ హౌస్ నిర్మాణంలో ఉన్నది.దానిని కూడా చూద్దామని అక్కడకు వెళ్ళాము. 

రామమూర్తి ఇలా అన్నాడు.

'సార్.ఇక్కడ మనవైపునుంచి లైజాన్ ఆఫీసర్ గా ఉండమని నన్ను అడిగినారు.కాని నేను ఒప్పుకోలేదు.'

'ఎందుకు?మీకు కూడా ఇక్కడ ఉండటం ఇష్టమే కదా?'అడిగాను.

'ఒక్క సమస్య ఉన్నది సార్.నేను ఇక్కడకు వస్తే నా జీతం తగ్గిపోతుంది.'

'తగ్గితే ఏమి?మీకు ఇష్టమైన పని చెయ్యడంలో ఆనందం ఉంటుంది కదా?పైగా మీరు సర్వీస్ చివరికి వచ్చిఉన్నారు కూడా?' అడిగాను.

'అదికాదు సార్.ప్రస్తుతం నాకు ఏభైవేలు జీతం వస్తుంది.అందులోనుంచి ప్రతినెలా పాతికవేలు ఖర్చుపెట్టి అయిదుగురు అనాధ పిల్లలను చదివిస్తున్నాను.ఈ విధంగా గత ఇరవై ఏళ్ళనుంచీ నా జీతంలో సగం ఖర్చు చేసి పేద పిల్లలను చదివించడం ఒక సాధనగా చేస్తున్నాను.నేను జీవితంలో ఏదన్నా మిగుల్చుకుంటే ఈ పుణ్యమే సార్.ఇప్పుడు ఆ పిల్లలు కాలేజీకి వచ్చి ఉన్నారు.అర్ధాంతరంగా నేను సాయం చెయ్యడం ఆపితే వాళ్ళ జీవితాలు చెదిరిపోతాయి.అందుకని వాళ్ళ చదువు అయిపోయి ఉద్యోగాలు సంపాదించుకుని వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడితే అప్పుడు నేను ఉద్యోగానికి రిజైన్ చేసి ఇక్కడ వచ్చి సెటిలై పోతాను సార్.మీరు నమ్ముతారో లేదో? ఇప్పటికీ నాకు సైకిల్ కూడా లేదు సార్.'అన్నాడు రామ్మూర్తి.

ఒక్క క్షణం అతని వైపు చూచాను.నా కళ్ళు అప్రయత్నంగా చెమర్చాయి.

అతను నా దృష్టిలో అమాంతం ఎదిగిపోయి ఎంతో ఉన్నతంగా కనిపించాడు.

'నీ అభిప్రాయాలు ఏమైతేనేమి?నీ ఆలోచనలు ఏమైతేనేమి?ఆధ్యాత్మికం అంటే నీకు సరియైన అవగాహన ఉంటేనేమి?లేకుంటేనేమి?కాశినాయనను నీవు సరిగ్గా అర్ధం చేసుకుంటే ఏమి?చేసుకోకపోతేనేమి?ఆయన చెప్పిన పనిని నీవు తూచాతప్పకుండా చేస్తున్నావు.నీ అవసరాలు మానుకొని ఇంకొకరి ఉన్నతి కోసం నీవు పాటుపడుతున్నావు.నీవు వివేకానందస్వామి అడుగుజాడలలో నడుస్తున్నావు.మహనీయుల కటాక్షం నీమీద కాకుంటే ఇంకెవరిమీద ఉంటుంది?కాశిరెడ్డినాయన  అనుగ్రహానికి ఇంతగా నీవు పాత్రుడవయ్యావంటే ఇదన్నమాట అసలు కారణం?' అనుకున్నాను.

ఒక మనిషికి కోటిరూపాయలు ఉంటే,ఒక వంద దానం చెయ్యడం పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు.కాని అందులోనుంచి ఒక ఏభైలక్షలను నిస్వార్ధంగా ఒక పనికి ఖర్చు చెయ్యడం గొప్ప.ఆ విధంగా ఏళ్ళ తరబడి చేస్తూనే ఉండటం అసలైన గొప్పవిషయం.తన అవసరాలు మానుకుని చెయ్యడం ఇంకా గొప్ప విషయం.

మహామహా కోటీశ్వరులు అతి పిసినారులై వాళ్ళవాళ్ళ సుఖాలకీ విలాసాలకీ మాత్రం కోట్లు ఖర్చు చేసుకుంటూ,సాటి మనిషి ఆకలిని పట్టించుకోని ఈ లోకంలో ఒక సామాన్య ఉద్యోగి తన జీతంలో నుంచి సరిగ్గా సగభాగం గత ఇరవై ఏళ్ళనుంచీ అజ్ఞాతంగా ఒక మంచిపని కోసం వెచ్చిస్తున్నాడంటే ఎంత గొప్ప విషయం?

చాలామందికి రైల్వే అంటే లంచగొండులైన టీటీయీలూ రిజర్వేషన్ క్లార్కులూ గుర్తొస్తారు.కాని ఇలాంటి ఉదాత్తులైన ఉద్యోగులు కూడా రైల్వేలో ఉన్నారు.కాని వాళ్ళు అజ్ఞాతంగా ఉంటారు.వారికి లోకం మెప్పు అవసరం లేదు.దైవం మెప్పు ఉంటె వారికి చాలు.రామ్మూర్తే దీనికి ఉదాహరణ.

లోకం మెప్పు పొందటంలో ఏ ఉపయోగమూ లేదు.అది నిలిచేదీ కాదు.దైవం మెప్పును నీవు పొందాలి.అది శాశ్వత ఫలితాన్ని ఇస్తుంది.దానికి టాంటాం అవసరం లేదు.లోకంలో గొప్ప పనులు నిశ్శబ్దంగానే జరుగుతూ ఉంటాయి.తెలియనివారు ఊరకే గోల చేస్తుంటారు.తెలిసినవారు మౌనంగానే ఉంటారు.

వివేకానందస్వామి ఒక మాట అనేవారు.

'నలుగురూ చూస్తున్నపుడు వాళ్ళ మెప్పుకోసం ఒక గొప్ప పనిని చెయ్యడంలో ఘనత లేదు.నిత్యజీవితంలో ఎవ్వరూ నిన్ను గమనించడం లేదు అన్నటువంటి పరిస్థితిలో కూడా నీవు ఉదాత్తమైన జీవితం గడపగలిగితే అదీ నిజమైన ఘనత.'

ఒక మనిషిలోని ఆలోచనలూ అభిప్రాయాలూ అలవాట్లూ ప్రధానం కాదు. అతనిలో ఉన్న ఆచరణాత్మకమైన మంచితనమే అత్యంత ముఖ్యమైన విషయం.అంతర్దృష్టి ఉన్నవారు దానినే గమనిస్తారు.విలువిస్తారు.అంతేగాని పైపై వేషాలకు వారు ఏమాత్రం విలువను ఇవ్వరు.

'మల్లయ్యా.ఈసారి వచ్చినపుడు అక్కమహాదేవి తపస్సు చేసిన గుహలు చూడాలి' అన్నాను.

'తప్పకుండా చూద్దాం సార్.తీసుకువెళతాను' అన్నాడు తను.

వచ్చిన పని పూర్తయింది.తిరుగు ప్రయాణంలో నంద్యాల వెళ్ళకుండా, మార్కాపూర్ స్టేషన్ లో దిగి గుంటూరు వెళ్ళే రైలెక్కాము.

(సంపూర్ణం)