నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

సాధనా సమ్మేళనం - కోటప్పకొండ -4

విష్ణుశిఖరంనుంచి దిగి మళ్ళీ బ్రహ్మశిఖరం వైపు కొండనెక్కేసరికి ఆలస్యమైంది.భోజనం కానిచ్చామనిపించి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాము. సాయంత్రం లేచి బయటకొచ్చి పార్కింగ్ ప్లేస్ లో ఉన్న బెంచీమీద విశ్రాంతిగా కూచున్నాము.

ఎదురుగా అస్తమిస్తున్న సూర్యుడు దర్శనమిస్తున్నాడు.చలికాలం కావడంతో సాయంకాలపు నీరెండ తాకుతుంటే హాయిగా ఉన్నది.మౌనంగా కూచుని సూర్యుణ్ణి చూస్తున్నాము.

సంభాషణ గాయత్రీ ఉపాసన మీదకు మళ్ళింది.

'అమెరికాలో మాకు సూర్యదర్శనం కావడమే కష్టం.ఇలాంటి ఎండను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉన్నది' అని రామన్నగారన్నారు.

'మనకు ప్రాణప్రదాత సూర్యుడే.సూర్యుడు కనిపించని దినం దుర్దినం అనే అర్ధాన్నిచ్చే మంత్రాలు వేదంలో చాలా ఉన్నాయి.నిజానికి గాయత్రీ ఉపాసన అంటే సూర్యునిలో ఉన్న శక్తిని ఉపాసించడమే.అది ప్రత్యేకశక్తి కాదు.దైవశక్తియే సూర్యరూపంలో మన సూర్యమండలంలోని గ్రహాలనూ,ముఖ్యంగా భూమినీ పోషిస్తున్నది.
ఇతర మతాలకూ మనకూ ఉన్న భేదం ఇదే.వారు ఇదంతా దేవుని సృష్టి అని భావిస్తూ సృష్టిలోని వస్తువులను పూజించరాదు దేవుణ్ణి మాత్రమే పూజించాలి అంటారు.సృష్టికంటే దేవుడు భిన్నంగా లేడు అని మనం అంటాము.కనుక సృష్టిలోని ప్రకాశవంతమైనవాటిని ఆయన ప్రతీకలుగా మనం పూజిస్తాము. నిజానికి వాటిద్వారా మనం పూజించేది సృష్టికర్త అయిన ఆ దైవాన్నే.ఈ విషయం అర్ధం చేసుకోలేని ఇతరమతాల వాళ్ళు మనల్ని విగ్రహారాధకులు అనుకుంటారు. అది నిజం కాదు.తాను పూజిస్తున్నది రాళ్ళనూ రప్పలనూ కాదని ప్రతి హిందువుకూ తెలుసు.భగవద్భావంతో ఆపనిని చేస్తున్నాననీ,తన ఆరాధన ఆ సర్వేశ్వరునికే చెందుతున్నదనీ,విగ్రహం ఒక సింబల్ మాత్రమే అనీ ప్రతి భారతీయునికీ తెలుసు.

మన సోలార్ సిస్టంలో ఉన్న అందరికీ సూర్యుడే దైవం.పుట్టినదగ్గర్నుంచీ పోయేవరకూ సూర్యశక్తి ఆధారంతోనే మనం బ్రతుకుతున్నాం.అందుకే మన ఆర్షధర్మంలో సూర్యదేవుడిని ప్రత్యక్షనారాయణుడని అంటాము.ఆయన నిత్యం కనిపించే దైవం.కనిపించే దైవాన్ని వదిలిపెట్టి ఊహామాత్రమైన వారివారి గ్రంధాలలోని దైవాలను కొలుస్తారు ఇతర మతస్తులు.నిజానికి వారే జీవంలేని విగ్రహారాధకులు.ఎందుకంటే వారు ఆరాధించేది వారి ఊహలోని నిర్జీవభావనా మాత్రమైన దైవాన్ని.ఇది వారు గ్రహించలేరు.ఎదురుగా కనిపిస్తూ నిత్యం మనల్ని పోషిస్తున్న సూర్యుడిని వదిలి ఇతరదేవతలను పూజించడం తప్పు.ఇది విశ్వాసరాహిత్యం అని నేనంటాను.

నిత్యమూ మనల్ని రక్షిస్తూ మనకు ఆహారం ఇస్తున్న సూర్యుని వదలిపెట్టి ఊహామాత్రమైన ఇతర దేవుళ్ళను పూజించడమే అసలైన పెద్ద తప్పు.ఇదే మానవజాతి చేస్తున్న అతిపెద్ద దైవద్రోహం అని నేనంటాను.

గాయత్రికి ఇప్పుడు మనం చూస్తున్న స్త్రీరూపం పురాణకాలంలో వచ్చింది. వేదకాలంలో ఈ పంచముఖీస్త్రీరూపం గాయత్రికి లేదు.శక్తి గనుక స్త్రీరూపంతో ఆరాధించడం మొదలుపెట్టాం.అంతే.నిజానికి గాయత్రి అంటే సూర్యశక్తి మాత్రమే.సవిత అని వేదం దానిని పిలిచింది.

అగ్ని కూడా సూర్యుని ప్రతిరూపమే.అందుకే బ్రాహ్మణులు అగ్నిని ఆరాధిస్తారు.పార్శీలు కూడా అగ్ని ఆరాధకులే.ఇస్లాం రాకముందు ఇరాన్ లో అగ్ని ఆరాధనే ఉండేది.వేదంలోని పదములకూ అవెస్తా లోని పదములకూ అనేక పోలికలున్నాయి.'మిత్రా','వరుణా' మొదలైన పదములు అవెస్తా లోకూడా మనకు దర్శనమిస్తాయి.

వేదంలో సూర్యుని అనేక పేర్లతో పిలిచారు.ఉదయంపూట 'మిత్ర' అనే నామంతోనూ,మధ్యాహ్నం 'ఇంద్ర' అనే నామం తోనూ,సాయంత్రంపూట 'వరుణ' అనే నామంతోనూ సూర్యుని వేదం స్తుతించింది.నిజానికి ఇంద్రుడు అంటే సూర్యుడే.అంతేకాదు గణపతి అన్నా,బ్రహ్మ అన్నా,విష్ణువు అన్నా,రుద్రుడన్నా కూడా నిజానికి సూర్యుడే.సూర్యునికి ఇవన్నీ పర్యాయ పదములు.'అసావాదిత్యో బ్రహ్మేతి...'మొదలైన వేదమంత్రములు దీనినే చెబుతున్నాయి. 

సూర్యుడిని ఉదయంపూట బ్రహ్మదేవునిగానూ,మధ్యాహ్నపు మండించే ఎండలో రుద్రునిగానూ,సాయంత్రపు చల్లని ఎండలో విష్ణువుగానూ పూజించే భావనలు మన గ్రంధాలలో ఉన్నాయి.వీటికి మూలాలు వేదంలోనే ఉన్నాయి.'ఓ దేవా.నీవు ఆకాశంలో సూర్యునిగా ప్రకాశిస్తున్నావు.అంతరిక్షంలో వాయువుగా వీస్తున్నావు.నీవే బ్రాహ్మణుల ఇళ్ళలో అగ్నిగా వెలుగుతున్నావు'అన్న అర్దాన్నిచ్చే మంత్రాలు వేదంలో చాలా ఉన్నాయి. కనుక సూర్యుని రూపంలోనూ అగ్నిరూపంలోనూ మనం ఆరాధిస్తున్నది సృష్టికర్తయైన ఏకైక దైవాన్నే.ఈ విషయం ఇతర మతస్తులకు అర్ధంకాదు. 

'సంధ్యావందనం లోని సూర్యోపస్థాన మంత్రములను అర్ధం చేసుకుంటే ఈ విషయాలు తెలుస్తాయి.'అన్నాను.

'ఏకం సద్విప్రా బహుధా వదంతి..' అనే మంత్రం కూడా దీనినే చెబుతున్నది కదా' అన్నారు రామన్నగారు.

'అవును.అది మహాసౌరంలోని మంత్రం.' అన్నాను.

'అరుణం'కూడా మంచిదే కదా?'అడిగారు రామన్న గారు.

'అవును.అది అద్భుతములైన మంత్రముల సమాహారం.మహాసౌర మంత్రపాఠం కూడా మంచిదే.ప్రముఖములైన సూర్యోపాసనా మంత్రములు అందులోనివే.ఉదాహరణకు 'ఉదుత్యం జాతవేదసం..'అనే మంత్రంగానీ, సంధ్యావందనంలో జపించే 'హగుం సశ్శుచిషద్వసురంతరిక్ష ...'అనే మంత్రంగానీ,'ఆ సత్యేన రజసా..' అనే మంత్రంగానీ ఇంకా అనేక ప్రముఖ సూర్యమంత్రములు 'అరుణం'లోనివే.'అన్నాను.

సరిగ్గా అర్ధం చేసుకుంటే అన్ని సాధనలూ సూర్యోపాసనలో ఇమిడి ఉన్నాయి.భారతీయులమైన మనం ప్రాధమికంగా సూర్యోపాసకులమే.అంటే సూర్యునిద్వారా కనిపిస్తున్న దైవశక్తిని ఆరాదించేవారం అన్నమాట.

సంభాషణ బ్రహ్మచర్యం మీదకు మళ్ళింది.

'అసలు బ్రహ్మచర్యానికీ సాధనకూ సంబంధం ఏమిటి సార్?" అప్పటివరకూ మౌనంగా వింటున్న రాజు అడిగాడు.


'రాజు.నీ దగ్గర ఒక నూరు రూపాయలున్నాయనుకో.నీవు వెయ్యిరూపాయల విలువగల వస్తువును కొనాలి.నీవు ఏం చేస్తావు?నీ దగ్గర ఉన్న నూరు రూపాయలను పెంచి వెయ్యిచేసి అప్పుడు ఆ ధర చెల్లించి ఆ వస్తువును కొనుక్కుంటావు.కాని నీదగ్గర ఉన్న నూర్రూపాయలలో తొంభైతొమ్మిది రూపాయలను ఖర్చు చేసేస్తే నీ దగ్గర ఒక రూపాయి మిగులుతుంది.దానితో వెయ్యి రూపాయల వస్తువును నీవెలా కొనగలవు?ఇదీ అంతే.

నా చేతిలో ఒక రూపాయి లేకుంటేనేమి?నేను మిలియనీర్నే అనుకుంటే ఎలా ఉంటుందో బ్రహ్మచర్యం లేకపోతేనేమి నేను ధ్యానం చెయ్యగలను. చేస్తాను.అనుకోవడమూ అంతే.

యోగసిద్ధిని పొందాలంటే నీశరీరంలో గొప్పదైన శక్తి పోగుపడి ఉండాలి. దానికోసం నీవు బ్రహ్మచర్యాన్ని పాటించి అంతరిక శక్తిని పెంచుకోవాలి. యోగసాధనకు బ్రహ్మచర్యం రెడ్ ఇంకు తో అండర్ లైన్ చేసుకోవాల్సిన నిష్ఠ. అది లేకుండా అంతరిక సాధన చేస్తే పిచ్చెక్కుతుంది.' అన్నాను.

'నేనలా అనుకోవడం లేదు సార్.కోరిక కలిగినప్పుడు తీర్చుకుంటే ఆ తర్వాత ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు కదా? అనేది నా భావన.' అన్నాడు రాజు.

నాకు నవ్వొచ్చింది.

'మన భావనలు అక్కడ పనిచెయ్యవు రాజు.యోగసాధనకూ బ్రహ్మచర్యానికీ అవినాభావ సంబంధం ఉన్నది.అదొక సైన్స్.ఎన్నోవేల ఏండ్ల నుంచి ఇది నిగ్గుదేలిన సత్యం.కోరిక తీర్చుకున్న తర్వాత ఇంక నీవు చేసేదేముంది?నిద్రపోవడం తప్ప.ధ్యానం చెయ్యడానికి నీకు శక్తి ఎక్కడ మిగిలిఉంటుంది?ధ్యానం అంటే నీరసంతో పడుకొని నిద్రపోవడం కాదు.తొట్టిలో నీరు నిండుగా ఉన్నపుడు నీవు అందులో ఒక చిన్నపడవను నడపగలవు.పంపు తిప్పేసి నీరు మొత్తం ఖాళీ చేసేస్తే ఖాళీ తొట్టిలో ఏం నడుపుతావు? కోరిక తీరాక ఉండేది నువ్వనుకుంటున్నట్లు ప్రశాంతత కాదు.నీరసం.

జంతువుల లాగా విచ్చలవిడి లైంగికజీవితం గడిపేవారికి ఆ నష్టం ఎలా ఉంటుందో అర్ధంకాదు.కాని యోగులకు అదెంతటి ఘోరమైన నష్టమో బాగా తెలుసు.జంతువులకు సీజన్ లోనే కోరిక కలుగుతుంది.అది ప్రకృతి ధర్మం.మనిషి జంతువు కంటే హీనుడిగా తయారవ్వడం వల్ల అతనికి సీజనూ గీజనూ ఏమీ లేదు.

వీర్యనష్టంవల్ల ప్రాణమయకోశంలో కలిగే కుంగుబాటు నుంచి కోలుకోవడానికి చాలామంది యోగులకు పదిహేనురోజులనుంచి నెలరోజులు పడుతుంది.ఇది ఇంద్రియపరాయణుల ఊహకు కూడా అందని విషయం.ఎందుకంటే, ప్రాణమయకోశం అంటే ఏమిటో,అదెక్కడ ఉంటుందో,ఎలా ఉంటుందో వారు కలలో కూడా ఊహించలేరు.వారు ఆ పదాలను విని ఉండవచ్చు.కాని వారికి అనుభవం ఉండదు.

చెరకులో రసం నిండుగా ఉంటే అది అమ్మవారి చేతిలో విల్లుగా మారుతుంది. రసం అంతా పోగా మిగిలిన పిప్పి ఎందుకు పనికొస్తుంది? తగలబెట్టడానికి తప్ప ఇంకెందుకూ పనికి రాదు.ఇదీ అంతే.బ్రహ్మచర్యశక్తి లేని దేహం చితిలో కాలడానికి తప్ప ఇంకెందుకూ పనికిరాదు.'-అన్నాను.

'పైగా ఎంతకాలం అలా ధ్యానం చేసుకోగలవు?మళ్ళీ కోరిక కలిగేదాకా. అంతేకదా?ఈ లోపల నీ మనస్సు ధ్యానంలో ఉండదు.కోరికవైపే లాగుతూ ఉంటుంది.దానిని ధ్యానం అని ఎలా అనగలం?చివరకు అదొక విషవలయం అవుతుంది.శక్తి లేనప్పుడు స్తబ్దుగా పడిఉండటం.శక్తి కలిగితే కోరిక తీర్చుకోవడం.మళ్ళీ పిప్పి అయిపోవడం.చివరికి ఈ విషవలయంలో నుంచి నీవు ఎప్పటికీ బయటపడలేవు'- అని అప్పటివరకూ మౌనంగా వింటున్న మదన్ అన్నాడు.

'బాగా చెప్పావు మదన్.యోగసాధనకు బ్రహ్మచర్యం తప్పనిసరి అని గ్రహించు రాజు.ఇందులో మారుమాటకు ఆస్కారం లేదు.'అన్నాను.

బ్రహ్మచర్యం అవసరం లేదు.మామూలుగా సంసార జీవితం గడుపుతూ కూడా సాధన చెయ్యవచ్చు అని ఈ మధ్య కొంతమంది గురువులు చెప్పడం చూస్తున్నాము.వారేమి చెబుతున్నారో వారికే తెలియనంత అజ్ఞానంలో ఉన్నారు వారు.ఇలాంటి కుహనా గురువుల వల్లనే సమాజం సర్వనాశనం అవుతున్నది.'ఇష్టం వచ్చినట్లు లైంగికశక్తిని వృధా చేసుకోండి.ఏమీ పరవాలేదు'.అని ఇప్పటివరకూ కొంతమంది నికృష్టవైద్యులు మాత్రమె చెబుతున్నారు.ఇప్పుడు కొందరు గురువులూ అదే చెబుతున్నారు.

మొన్నీ మధ్యనే ఒక పుస్తకంలో చదివాను.ఒక గురువుగారు బుద్ధుని ధ్యానమార్గాన్ని ప్రజలకు బోధిస్తున్నారు.బాగానే ఉంది.ఆయనకూడా ఇదే చెబుతున్నాడు.హాయిగా సంసారం చేసుకుంటూ కూడా ధ్యానం చెయ్యవచ్చు అని.అది చదివి నాకు చచ్చేంత నవ్వు వచ్చింది.హాయిగా సంసారం చేసుకునేవాడికి ధ్యానం ఎలా కుదురుతుంది? వాడి ధ్యానం అంతా కోరిక మీదా హాయిమీదా ఉంటుంది.ఇంక యోగం ఎలా సాధ్యమౌతుంది?ఇలాంటి వారినే కుహనా గురువులని నేనంటాను.వీరేం చెబుతున్నారో వీరికీ తెలియదు.వీరిని అనుసరించే శిష్యులకు అసలే తెలియదు.

బుద్ధుని మార్గాన్ని బోధించే ఈ గురువుకు, బుద్ధుడు సంసారాన్ని వదలిపెట్టి ఎందుకు సన్యాసి అయ్యాడో అర్ధం కాలేదు.లేకుంటే ఈయనకున్న తెలివి బుద్ధునికి లేదేమో మరి?హాయిగా సంసారం చేసుకుంటూ రాజభవనంలో సుఖంగా ఉండి సాధన చేసుకోవచ్చని బుద్ధునికి పాపం అర్ధం కాలేదు లాగున్నది.బహుశా ఈ గురువు అప్పుడు బ్రతికి ఉన్నట్లయితే బుద్ధుడిని సన్యాసి కాకుండా ఆపి రాజుగానే ఉంచేసేవాడేమో?కనీసం శుద్దోధనుడు సంతోషించి ఉండేవాడు.యశోధర సంతోషించి ఉండేది.

బుద్ధుని ధ్యానవిధానాన్ని మాత్రం తీసుకుని మిగతా జీవితాన్ని ఆదర్శంగా తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసమో ఆ గురువుకే తెలియాలి.ఈ మాత్రం తెలివితేటలు లేకేనేమో బుద్ధుడు తాను సన్యాసి అవడమే గాక తన జీవితకాలంలో కొన్ని వేలమందిని సన్యాసులుగా మార్చాడు?

పిచ్చి గురువులు!పిచ్చిమాటలు!!

యోగానికి పతంజలి ఇచ్చిన నిర్వచనం బౌద్ధపు పోకడలతో కూడుకున్నట్టిది. 'చిత్తవృత్తి నిరోధమే యోగం' అన్నది బౌద్దమతపు ప్రభావం కలిగిన నిర్వచనం. అంతకంటే పాతదైన సిద్ధయోగ సాంప్రదాయంలో ఈ నిర్వచనం వేరుగా ఉన్నది.'జీవాత్మను పరమాత్మతో కలపడమే యోగం' అని అతి ప్రాచీన నిర్వచనం మన యోగసాంప్రదాయంలో ఉన్నది.అలా చెయ్యాలంటే జీవాత్మ అంటే ఏమిటో తెలియాలి,పరమాత్మ అంటే ఏమిటో తెలియాలి.

ఈ పదాలన్నీ ఊరకే వ్యాకరణపరంగానూ బౌద్ధికంగానూ అర్ధమైతే చాలదు. అవేమిటో ఎక్కడున్నాయో అనుభవంలో తెలియాలి.అలా తెలుసుకోవాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు.దానికి ఎంతో సాధన కావాలి.సాధనకు బ్రహ్మచర్యం అత్యంత అవసరం.ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానింపబడి ఉన్న ప్రక్రియలు.

'ఒక ఎత్తైన పర్వతం మీద ఒక నిధి ఉన్నది.నీవు దానిని పొందాలి.అంటే కొండ ఎక్కాలి.కొండ ఎక్కాలంటే నీకు ప్రస్తుతం ఉన్న శక్తి చాలదు.కనుక అభ్యాసం ద్వారా,మంచి తిండి తిని,వ్యాయామం చెయ్యడం ద్వారా శక్తిని పెంచుకోవాలి.తగినంత బలం నీలో వచ్చిపుడు నీవు  కొండను ఎక్కగలవు.అలా కాకుండా ఇప్పుడు ఉన్న శక్తినే వృధా చేసుకుంటూ ఇక్కడే కూలబడిపోతే నీవెలా కొండను ఎక్కగలవు? నిధిని ఎలా దక్కించుకోగలవు?నీవల్ల ఎప్పటికీ కాదు.ఇదీ అంతే.'

'మరి తంత్రంలో indulgence వల్ల కూడా సిద్ధి పొందవచ్చు అని అంటారు కదా.మీరు కూడా కొన్నిచోట్ల అలా వ్రాసినారు.అదెలా?' అడిగాడు రాజు.

'అది వేరు.సామాన్యంగా సంసార జీవితం గడపుతూ శక్తిని వృధా చేసుకోవడం వేరు.నేను చెప్పే తంత్రసాధన వేరు.తంత్రసాధనలో indulgence వల్ల సిద్ధి కలగడం సాధ్యమే.అటువంటి మార్గం ఒకటి తంత్రంలో ఉన్నది.అయితే ఆ విధానమూ ప్రక్రియా నీకు తెలియాలి.అది నీవనుకుంటున్న indulgence కాదు.పైగా నీకు భైరవి సహాయం అవసరం అవుతుంది' అన్నాను.

'భైరవి అంటే ఏమిటి?' అన్నట్లు అందరూ ప్రశ్నార్ధకంగా చూచారు.

'భైరవి అంటే దేవత కాదు.నీవంటిదే ఒక సాధకురాలు.తంత్రమార్గంలో సాధన చెయ్యాలని ఇచ్చ ఉండి,దానికి తగిన ధైర్యం ఉండి,తంత్రసాధనలో నీకు సహాయపడటానికి ముందుకు వచ్చే సాధకురాలినే భైరవి అని ఆమార్గంలో పిలుస్తారు.అలాంటి ధీరవనితలు పాతకాలంలో ఉండేవారు.ఇప్పటికీ బెంగాల్లో కొన్ని రహస్య సాంప్రదాయాలలో ఇలాంటి అభ్యాసాలు ఉన్నాయి.నీ అదృష్టం బాగుండి అలాంటి భైరవి నీకు దొరికితే,మీరిద్దరూ ఆ సాధనలో నిలదొక్కుకుని,దారిలో ఎదురయ్యే ఆటంకాలకు భయపడకుండా సాధన చేసి,దానిని సాధించగలిగితే అప్పుడు తంత్రంలో కూడా అద్బుతమైన సిద్ధి సాధ్యమే.' అన్నాను..

'మరి ఆ సాధనలలో సెక్స్ మీద కంట్రోల్ వస్తుందా సార్?' రాజు అడిగాడు.

'ఎందుకు రాదు? అందులోనే అసలైన అద్భుతమైన కంట్రోల్ వస్తుంది.వారి నిగ్రహశక్తిని నీవు ఊహించనుకూడా ఊహించలేవు.అణచిపెట్టుకునే ప్రయాసతో కూడిన సాధనలో అటువంటి కంట్రోల్ రావడం చాలా కష్టం.అయితే తంత్రమనేది ఒక రహస్య సాధనామార్గం.నీవనుకుంటున్నట్లు అది కోరిక కలిగినవెంటనే తీర్చుకునే రకపు indulgence కాదు.అదొక రహస్య సాధనా మార్గం.దానిని గురుముఖతా నేర్చుకొని సాధన చెయ్యవలసి ఉంటుంది.

అయితే దీనిలో కొన్ని చిక్కులున్నాయి.ఇలాంటి అభ్యాసాలను సమాజం హర్షించదు.అంటే,మనచుట్టూ ఉన్న సమాజం అంతా నీతిమంతులతోటి నిండిపోయి ఉన్నదని నేననడం లేదు.మనకు కనిపించే సంఘంలో అంత పతివ్రతలూ నీతిమంతులూ ఎవరూ లేరు.అందరూ రహస్యపాపులే.కాని అలాంటివారే మళ్ళీ ఇలాంటి రహస్యతంత్ర సాధనలను అసహ్యించుకుంటారు.

ఉదాహరణకు,రజనీష్ ను విమర్శించే వాళ్ళంతా ఇలాంటి హిపోక్రిట్లే.ఇటువంటి కపటసమాజంలో నిజమైన తపన ఉన్న భైరవి దొరకడం చాలా కష్టం. ఎందుకంటే ఆమెకూ వివేక వైరాగ్యాలుండాలి. సాధనా సంపత్తి ఉండాలి.సాధన పట్ల తపన ఉండాలి.అన్నింటినీ మించి తెగింపూ ధైర్యమూ ఉండాలి. తంత్రసాధకురాలై ఉండాలి.అలాంటి భైరవి దొరకడమే కష్టం అనుకుంటే, సమర్ధుడైన తంత్రగురువు దొరకడం ఇంకా కష్టం.దాదాపుగా దుర్లభమే అని చెప్పవచ్చు.ఒకవేళ ఇవన్నీ కుదిరితే అప్పుడు ఆ సాధనల ద్వారా నీవడిగిన సిద్ధి సాధ్యమే' అన్నాను.

నా మాటలు విన్న తర్వాత సాధనామార్గం అంటే ఏమిటో,అది ఎలా ఉంటుందో వారికి కొంతైనా అర్ధమైనట్లు నాకనిపించింది.ఎంతో ఎత్తుగా ఉన్న ఆధ్యాత్మికగమ్యంలాగే మా ఎదురుగా ఉన్న కొండశిఖరం కూడా ఎత్తుగా కనిపిస్తున్నది.

క్రమంగా సూర్యుడు పడమటి దిక్కున అస్తమించాడు.చీకటి తెరలు లోకాన్ని కప్పుతున్నాయి.


అందరం లేచి దేవాలయంలోకి వెళ్లి పరమేశ్వరుని దర్శనం చేసుకుని ఒక గంటసేపు అక్కడే ధ్యానంలో కూర్చున్నాము.ఆ తర్వాత బయటకు వచ్చి ఎవరి ఇష్టమైనది వారు తిని,గదులకు వెళ్లి నిద్రకు/ధ్యానానికి ఉపక్రమించాము.

ఉదయం నాలుగుకే లేచి ఆరుగంటలలోపే స్నాన/ధ్యానాదులు ముగించుకుని దేవాలయం వద్దకు చేరుకున్నాము.ఉదయం పూట జరిగే మొదటి అభిషేకంలో పాల్గొని,కొద్దిగా ఉపాహారం సేవించి,గుంటూరుకు తిరుగు ప్రయాణం అయ్యాము.

(సంపూర్ణం)