Pages - Menu

Pages

2, ఫిబ్రవరి 2014, ఆదివారం

దేహనిష్ట కంటె మనోనిష్ఠ గొప్పది

పంచవటి సభ్యుడైన నరేష్ అతని భార్యా నిన్న వచ్చినారు.ఒక పెళ్ళికి గుంటూరుకి వచ్చి పనిలో పనిగా మా ఇంటికి కూడా వచ్చినారు.

'పెళ్ళికంటే కూడా ముఖ్యంగా మిమ్మల్ని కలిసి మాట్లాడడానికే గుంటూరుకు వచ్చాను' అన్నాడు.

దూరం నుంచి నన్ను వెదుక్కుంటూ వచ్చినందుకు సంతోషం కలిగింది. నిజమైన ఆధ్యాత్మిక తపన ఉన్నవారు- "మాకు కుదరలేదు. వీలుకాలేదు. తీరిక లేదు"- ఇలాంటి ఏవేవో కుంటిసాకులు చెబుతూ కాలాన్ని వృధా చెయ్యరు.ఏదోరకంగా సంకెళ్ళు తెంచుకోవాలని చూస్తారు.మార్గం కోసం తపిస్తారు.అది దొరికేవరకూ అసహనంతో వేగిపోతారు.అలాంటి వారిని చూడటంతోనే వారి లోపల ఉన్న అగ్ని వారి కళ్ళలోనే కనిపిస్తుంది.ఎవరు నిజమైన సాధకులో ఎవరు కారో,ఎవరు ఎంతలో ఉన్నారో,ఎవరి స్థాయి ఏమిటో,వారిలోని అడ్డంకులూ లోపాలూ ఏమిటో,వారిని చూడగానే నేను గ్రహించగలను.

'మీకోసం ఇది తెచ్చాను.తీసుకోండి' అంటూ 'అమ్మత్త్వమ్' అన్న పుస్తకాన్ని నాకు ఇవ్వబోయాడు.ఆ పుస్తకం జిల్లెళ్ళమూడి అమ్మగారిమీద ఎవరో వ్రాసిన పుస్తకం.

నవ్వాను.

'నరేష్.పుస్తకాలు నాకెందుకు?చిన్నప్పటినుంచి కొన్ని వేల పుస్తకాలు చదివాను.వద్దు.నీవే ఉంచుకో. కాని ఒక సలహా విను.ఈ మధ్యకాలపు రచయితలు వ్రాసిన పుస్తకాలూ,ఎవరు బడితే వారు వ్రాసిన పుస్తకాలూ చదవవద్దు. వీరికి విషయం మీద సరియైన అవగాహన లేదు.పాతకాలం వారు వ్రాసిన పుస్తకాలు చదువు.ఉదాహరణకు శ్రీపాద,కొండముది రామకృష్ణ,మొదలైన పాతతరంవారివీ,వీలైతే ఇంకా పాతవారివీ రచనలు చదువు.అమ్మగారి విషయం సరిగ్గా చక్కగా అర్ధమౌతుంది.' అని చెప్పినాను.

'రాత్రి మాతోపాటు గుంటూరుకి చెందిన ఒకాయన రైల్లో ప్రయాణం చేసినారు. ఆయన టీవీలో కూడా ప్రవచనాలు ఇస్తుంటారు.' అన్నాడు.

'అలాంటి పండితులు గుంటూరులో చాలామంది ఉన్నారు.ఆయన ఈ పేటలోనే ఉంటారు.నేనెప్పుడూ వారి ఛాయలక్కూడా పోను.ఎందుకంటే వారికి లోకుల బ్యాంక్ ఎకౌంట్లలో ఎంతెంత డబ్బుందో తెలుసు.కాని వారి ఎకౌంట్లో ఒక్క రూపాయి కూడా ఉంటుందో ఉండదో అనుమానమే.పండితుల దగ్గరా పూజారుల దగ్గరా పురోహితుల దగ్గరా నిజమైన ఆధ్యాత్మికత ఉంటే నేతిబీరకాయలో నెయ్యి ఉన్నట్లే.' అన్నాను.

చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత 'తారాస్తోత్రం పారాయణ చేస్తున్నాను.మీ చేతితో ఇస్తే తీసుకుందామని ప్రింట్ తీసి మరీ తెచ్చాను.'అంటూ తారాస్తోత్రం కాపీని నా చేతికి ఇచ్చినాడు.

అతని శ్రద్ధకు ముచ్చటేసింది.

దానిని చేతిలోకి తీసుకుని మౌనంగా అమ్మను ప్రార్ధించి ఆ కాగితాలు అతనికి తిరిగి ఇచ్చేశాను.

'దీనిని పారాయణ చేసేటప్పుడు ఏవైనా నియమనిష్టలు పాటించాలా?' అడిగాడు నరేష్.

'అవును.మనసుతో పాటించాలి.శరీరంతో కాదు.శరీరనిష్టలకు నా పధ్ధతి విరుద్దం అని నీకు తెలుసుకదా.దేహంతో నేను ఏ నిష్ఠ పాటించానని ఈ స్తోత్రం ఉద్భవించింది?ఒక్కోసారి నేను రెండురోజులపాటు స్నానమే చెయ్యను. ఒక్కోసారి రోజుకు మూడుసార్లు స్నానం చేస్తాను.దేవుడి దగ్గర ప్రత్యేకంగా కూచుని నేను పూజచెయ్యగా దీపారాధనలూ వగైరాలూ చెయ్యగా ఇంతవరకూ ఎవ్వరూ చూడలేదు.నాతో ఎవరైనా కలిసి కొన్నాళ్ళు జీవిస్తే ఇలాంటి వింత విషయాలు వారే ప్రత్యక్షంగా చూడవచ్చు. 

ఉదాహరణకి చెబుతాను విను.తారాస్తోత్రంలోని ఒక శ్లోకం నేను బాత్రూంలో స్నానం చేస్తున్న సమయంలోనే తటాలున స్ఫురించింది.వెంటనే తడిబట్టలతో బయటకొచ్చి కాగితం మీద వ్రాశాను.ఇంకొన్ని రోడ్డుమీద పోతున్నపుడు ఉద్భవించాయి.బాహ్యనిష్ఠతో ఈ స్తోత్రం ఉద్భవించలేదు.అంతరికనిష్ఠ నుంచి పుట్టింది.కనుక నిష్ఠ కావలసింది మనస్సుకి.శరీరానికి కాదు.' అన్నాను.

శ్రీరామకృష్ణుల ప్రత్యక్షశిష్యులైన బ్రహ్మానందస్వామి ఇలా అనేవారు.

'దేహాన్ని నియమంలో పెట్టడం బహుతేలిక.మనస్సుని కట్టడి చెయ్యడం అతికష్టం.'

'మరి శరీరానికి నిష్ఠ అవసరంలేదా?'- అనేవారున్నారు.

అవసరమే.మొదట్లో అవసరం.ఎల్లకాలం అవసరం లేదు.దేహనిష్ట కంటె మనోనిష్ట ఉత్తమమైనది.అనవసరమైన మడీ నియమాలూ నిష్టలూ నేనెప్పుడూ ప్రోత్సహించను.నాది అంతరిక నిగూఢ యోగమార్గం.దానికి ప్రాధమికంగా కొంత దేహనిష్ట అవసరమే గాని అదే పరమావధి కాదు.

'నిజమైన సాధనకు శుభ్రత అవసరం.అంతేగాని నీళ్ళలో నానుతూ ఉండే మడి అవసరం లేదు.'-అని నేనంటాను.అనడమే కాదు.పాటిస్తాను.

'బాహ్యపూజ కంటె అంతరికపూజ ఉత్తమం' అని కూడా నేనంటాను.అనడమే కాదు నిత్యజీవితంలో ఆచరిస్తాను.

'పూజలు చెయ్యకపోయినా పరవాలేదు.ఉత్తమమైన మానవుడిగా జీవిస్తే చాలు.' అనికూడా నేనంటాను.అలా ఉండాలని ప్రయత్నిస్తాను.

'కులం కంటె గుణం ప్రధానం' అని చాలామంది అంటారు.కాని ఆచరించరు.నేను ఆచరిస్తాను.

'మతం కంటె మానవత్వం ప్రధానం' అని నేను గట్టిగా విశ్వసిస్తాను.

'ఎల్లకాలం బాహ్యపూజలూ దీపారాధనలూ అష్టోత్తరాలూ అభిషేకాలూ సంధ్యావందనాలూ వ్రతాలూ చేస్తూ ఉండటం ఆధ్యాత్మికత కాదు.అది ఒక stagnation.' - అని నేనంటాను.

నా భావాలన్నీ ఇలాగే చాందస భావాలకు విరుద్దంగా విలక్షణంగా ఆచరణాత్మకంగా ఉంటాయి. అందుకే అవి చాలామందికి నచ్చవు.కాని ఒకరికి నచ్చలేదని సూర్యుడు ఉదయించడం మానుకుంటాడా?

వివేకానందస్వామి తరచుగా ఇలా అనేవారు.

'సత్యం సంఘాన్ని ఎప్పుడూ అనుసరించదు.సంఘమే సత్యాన్ని అనుసరించాలి.లేదా నశించాలి.మూడో మార్గం లేదు.'

అతని భార్యకు ఇలా చెప్పినాను.

'అమ్మా.నీవు ఎంతో అదృష్టవంతురాలివి గాబట్టి నీకు నిజమైన ఆధ్యాత్మిక భావాలున్న భర్త దొరికాడు.అతన్ని ప్రోత్సహించు.ఈ మార్గంలో అతనికి సహకరించు.అంతేగాని అడ్డంకివి కాకు.మానవ జీవితగమ్యం ఆధ్యాత్మిక సిద్ధిని పొందడమే.

'ఎంత సంపాదించినా ఎన్నెన్ని చేసినా చివరకు అవేవీ చెదరని మనశ్శాంతినీ తృప్తినీ ఇవ్వవు.ఒక్క ఆధ్యాత్మిక మార్గంలోనే అవి దక్కుతాయి.ఎక్కడో ఎవరికో గాని ఇలాంటి నిజమైన ఆధ్యాత్మికభావాలు ఉండవు.నచ్చవు.కనుక ఆధ్యాత్మికమార్గంలో నీ భర్తను నీవు అనుసరించాలి.అతని తోడుగా నీవు నడవాలి.ఎప్పుడూ మంచి స్నేహితులలాగా నవ్వుతూ కలసిమెలసి మీరు ఉండాలి. అదే మన ధర్మం చెబుతున్న పరమసత్యం.' అన్నాను.

శ్రీ రామకృష్ణులు ఇలా అనేవారు.

"స్త్రీలలో రెండు రకాలైన వారున్నారు.ఒకరు విద్యాశక్తి.ఇంకొకరు అవిద్యాశక్తి. భర్తకు సాధనలో సహాయపడుతూ అతని అడుగుజాడలలో నడచే స్త్రీ విద్యాశక్తి. దానికి వ్యతిరేకంగా అనుక్షణం అతన్ని లౌకికమైన కోరికలతో వేధిస్తూ ఆధ్యాత్మిక మార్గం నుంచి పక్కకు లాగే స్త్రీ అవిద్యాశక్తి.ఈ రెండు రకాలైన స్త్రీలు ప్రపంచంలో ఉంటారు."

కొన్ని కుటుంబాలలో దీనికి వ్యతిరేకంగా ఉంటుంది.అక్కడ స్త్రీలు ఆధ్యాత్మిక సంస్కారాలు కలిగి ఉంటే పురుషులు వారిని పక్కకు లాగుతూ ఉంటారు. మొత్తమ్మీద స్త్రీయైనా పురుషుడైనా సాధనకు సహకరించే జీవిత భాగస్వామి దొరకడం ఎంతో పూర్వజన్మ పుణ్యఫలమే అనాలి.

ఆమె ముఖం చూస్తే ఉత్తమ సహధర్మచారిణి లాగే అనిపించింది.

తారాస్తోత్రం ఎలా పారాయణ చెయ్యాలో అతనికి చెప్పాను.

వారు సెలవు తీసుకుని వెళ్ళిపోయారు.