నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

దేశజాతకం -సూర్య/బుధ/గురుదశ


జ్యోతిష్యపరంగా ఊహించిన విధంగానే దేశపరిస్థితులు నడుస్తూ భూమ్మీదా మానవులమీదా ఉన్న గ్రహప్రభావాన్ని నిరూపిస్తున్నాయి.ఈ నేపధ్యంలో అసలు మన దేశజాతకం ఎలా ఉందొ ఏమంటున్నదో ఒకసారి పరిశీలిద్దాం.

ప్రస్తుతం మన దేశ జాతకంలో సెప్టెంబర్ 2009 నుంచి సెప్టెంబర్ 2015 వరకూ సూర్యదశ నడుస్తున్నది.ఇందులో మళ్ళీ ప్రస్తుతం జూన్ 2013 నుంచి ఏప్రిల్ 2014 వరకూ సూర్య/బుధ దశ జరుగుతున్నది.ఇందులో మళ్ళీ జనవరి చివరి వారం నుంచి మార్చి మొదటివారం వరకూ సూర్య/బుధ/గురు దశ నడుస్తున్నది.ప్రస్తుత దశ ఎలా ఉండబోతున్నదో చూద్దాం.

రవిబుధులు తృతీయంలో ఇంకా మూడు గ్రహముల మధ్యన ఇరుక్కొని ఉన్నారు.వీరిద్దరి నేతృత్వంలో ఏప్రియల్ వరకూ ఉన్న అంతర్దశ ప్రజాజీవితంలో మేధాపరమైన గొప్ప మార్పును సూచిస్తున్నది.ప్రజలు కొత్త వెలుగు కోసం కొత్త మార్పుకోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని ఈ గ్రహములు సూచిస్తున్నాయి.

అధికార మార్పు కూడా సూచితం అవుతున్నది.అయితే ఈ మార్పు సుఖంగా శాంతిగా రాకుండా కల్లోలం తర్వాతా,కుట్రలూ కుతంత్రాల తర్వాతా వస్తుందని పంచగ్రహ కూటమి సూచిస్తున్నది.

మార్చి మొదటివారం వరకూ నడుస్తున్న గురు విదశ ఏమంటున్నది?గురువు ఈ లగ్నానికి మంచివాడు కాడు.శత్రుస్థానంలో ఉండటం వల్ల మంచి చెయ్యడు.కనుక అధికారంలో ఉన్న వారికి ఎటుచూచినా శత్రుత్వమూ చిక్కులూ ఎదురవుతాయి.అధికారం చేతులు మారుతుంది.అయితే విపరీత రాజయోగం వల్ల ప్రజలపరంగా చూస్తె కల్లోలాల తర్వాత కధ సుఖాంతం అవుతుందని సూచన ఉన్నది.

ఈ లోపల మాత్రం ఎన్నో గొడవలూ,కల్లోలాలూ,మేధోమధనాలూ,నష్టాలూ ప్రజాజీవితంలో తప్పవు.లగ్నాత్ శత్రుస్థానంలోనూ చంద్రలగ్నాత్ సుఖస్థానం లోనూ ప్రస్తుతం సంచరిస్తున్న శని రాహు కుజులవల్ల సొసైటీలో అనేక ప్రమాదాలూ గొడవలూ గందరగోళాలూ తప్పక జరుగుతాయి.

గురు విదశ తర్వాత రాబోయే శని విదశలోనూ ఆ తర్వాత రాబోయే రవి/కేతు దశలోనూ దేశంలో అసలైన మార్పులు వస్తాయి.అవేమిటో ఆ దశలు మొదలు కాబోయే కొద్దిగా ముందు చూద్దాం.