నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

23, ఫిబ్రవరి 2014, ఆదివారం

జాన్ హిగ్గిన్స్ భాగవతార్ జాతకం

మనలో చాలామందికి మన శాస్త్రీయ సంగీతం అంటే ఏమిటో తెలియదు. అదంటే చాలామందికి ఏమిటో తెలియని ఏవగింపు ఉంటుండటం కూడా నేను గమనించాను.మనవాడే అయిన సద్గురుత్యాగరాజు ఎన్ని కీర్తనలు వ్రాసినాడో మనకు తెలియదు.ఎన్ని రాగాలను ఆయన స్పృశించాడో మనకు అర్ధం కాదు. వాటిలో కనీసం ఒకటి రెండు కీర్తనలన్నా నేర్చుకుందామని మనకు తోచదు.నారాయణ తీర్ధులంటే ఎవరో క్షేత్రయ్య అంటే ఎవరో ఈ తరంలో వారికి చాలామందికి తెలియదు.

తమ సంస్కృతిని నిర్లక్ష్యం చెయ్యడంలో తెలుగువారిని మించిన వారు ఎవరూ లేరు అనేది నా నిశ్చితాభిప్రాయం.పంచెకట్టు తప్ప అసలు మనకంటూ ఒక సంస్కృతి ఉన్నదా అనేది కూడా నాకు అనుమానమే.అదే తమిళనాడుగాని కేరళగాని కర్నాటకగాని చూస్తే వారికంటూ ప్రత్యెక సంస్కృతులు ఉన్నాయి. భాషాభిమానం మనకంటే కొన్ని వేలరెట్లు వారికి ఉన్నది.మనంత దిగజారుడుతనమూ విలువలులేనితనమూ వారికి లేవు.

అసలు మన తెలుగువాళ్లంత దరిద్రపు జాతి ఎక్కడా ఉండదేమో అని నానాటికీ నాకు అభిప్రాయం బలపడుతున్నది.మన భాష మనకు పట్టదు.మన సంస్కృతి మనకు పట్టదు.మన కళలు మనకు పట్టవు.మన ఆధ్యాత్మికత మనకు పట్టదు.చివరికి మన రాష్ట్రం కూడా మనకు పట్టదు.అది ఎన్ని ముక్కలైనా మనకు అనవసరం.ఎవడికి చేతనైనది వాడు దోచుకుంటే చాలు. రాష్ట్రం ఏమైపోయినా మనకు అనవసరం.డబ్బు ఒక్కటి ఉంటే మనకు చాలు.సంస్కృతీ సంప్రదాయమూ మతమూ ఏవీ మనకు అక్కర్లేదు.దొంగల గుంపు తప్ప ఇక్కడ ఏమీ లేదని నాకనిపిస్తున్నది.

ఈ మధ్యలో నాకొక ఆలోచన బలంగా కలుగుతున్నది.ఆంధ్రాను వదిలిపెట్టి ఏదైనా వేరే రాష్ట్రంలో పోయి స్థిరపడదామా అన్నంత అసహ్యం ఇక్కడి మనుషులను చూస్తే నాకు కలుగుతున్నది.ఎక్కడ చూచినా ఇంతమంది దొంగలున్న రాష్ట్రం ఇండియా మొత్తం మీద బహుశా ఇదేనేమో?బహుశా ఇందుకేనేమో నారాయణతీర్ధులు,త్యాగరాజువంటి ఎందఱో మహనీయులు అందరూ ఆంధ్రాను వదిలిపెట్టి ఇతర రాష్ట్రాలలో పోయి స్థిరపడ్డారు.

ఈ మాటన్నందుకు చాలా మందికి కోపం రావచ్చు.అలాంటి ఆషాఢభూతులకు ఒకమాట చెబుతాను.పక్కనే ఉన్న తమిళనాడుని గాని కేరళనుగాని కర్ణాటకనుగాని విభజించాలని ప్రయత్నించి చూడండి.ఏమౌతుందో చూద్దాం. చస్తే కుదరదు.వారికి ఉన్న భాషాభిమానం గాని ఆత్మాభిమానం గాని రాష్ట్రాభిమానం గాని మనకేవి?కనుక నేనన్నమాట వాస్తవమే.ఊరకే కోపాలు వస్తే ఉపయోగం లేదు.వాస్తవాలు కళ్ళెదుట కనిపించాలి.

తెలుగుజాతి అంత దరిద్రపుజాతి ఎక్కడా ఉండదు అనేది వాస్తవం.ఇంతకు ముందు ఎవరైనా ఈమాట అంటే నేనూ ఒప్పుకునేవాడిని కాదు.కాని ఈ మధ్య జరిగిన జరుగుతున్న పరిణామాలు చూచి నా అభిప్రాయం మార్చుకున్నాను.ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా,మనలో ప్రతివాడికీ వ్యక్తిగత స్వార్ధమేగాని ఒక విశాలమైన రాష్ట్రచింతనగాని,రాష్ట్ర భావనగాని  లేవు అనేది పచ్చినిజం.

మాలిక్ కాఫర్ కు ఉప్పందించి మన కోటల దారులూ గుట్లూ అన్నీ చెప్పి కాకతీయ సామ్రాజ్యం పతనం కావడానికి కారకులయినది మన తెలుగువారే.ఇక అక్కడనుంచి తమిళనాడు వరకూ అతను ఊచకోత కోసుకుంటూ పోవడానికి దారులు ఏర్పరచినది కూడా మన తెలుగువారే అన్నది చారిత్రికవాస్తవం.డిల్లీ సుల్తానుల పరిపాలన డెక్కన్ లో వ్యాపించడానికి రాజమార్గాలు తెరిచింది మన తెలుగువారే.

కనుక మొదటినుంచీ కూడా కుట్రలతో మనల్ని మనం నాశనం చేసుకోవడంలో మనకు చాలా ప్రజ్ఞ ఉన్నది అనేమాట పచ్చినిజం.మనకు ఎటువంటి విలువలూ ఆదర్శాలూ లేవు. పచ్చిస్వార్ధమూ, దొంగబుద్ధీ, దోచుకోవడమూ, పక్కవాడిని చెడగొట్టి చివరకు మనంకూడా సర్వనాశనం కావడమూ తప్ప మనకు ఇంకేమీ తెలియదు.

తెలుగుజాతికి విశ్వామిత్రమహర్షి శాపం ఉన్నదని,వీరు తమ పద్ధతులు చాలా త్వరగా మార్చుకోకపోతే ముందుముందు చాలా ఘోరాలు జరుగుతాయనీ నేను రెండుమూడేళ్ళ క్రితం అన్నప్పుడు ఇదే బ్లాగులలో ఎందఱో నన్ను ఎగతాళి చేసి విమర్శించారు.ఇప్పుడెం జరిగిందో చూడండి మరి.

సరే ఆ సోదిని అలా ఉంచి,ప్రస్తుతంలోకి వస్తే,మనల్ని మనం మరచిపోయినా, మన కళలను అక్కున జేర్చుకుని,నేర్చుకుని,జీవితాన్ని వాటికి అంకితం చేసి చరితార్దులైనవారు ఎందఱో ఉన్నారు.వారిలో తమిళుల వంటి పొరుగురాష్ట్రాలవారే గాక విదేశీయులు కూడా ఉన్నారు.వారిలో ఒకడే జాన్ హిగ్గిన్స్ భాగవతార్.

ఈయన 18-9-1939 న మసాచుసెట్స్ లోని యాండోవర్ లో జన్మించాడు.నేను సరిదిద్దిన జనన సమయం ఉదయం 8-51 నిముషాలు.జాతకాన్ని పైన చూడవచ్చు.

ఎంతో ఘర్షణనూ చీధరింపులనూ ఎదుర్కొని,నోరు తిరగని పరాయిభాషను నేర్చుకుని, పరమ చాందసులైన తమిళబ్రాహ్మణుల వద్ద శిష్యరికం చేసి, కర్నాటక శాస్త్రీయసంగీతంలో అనన్యమైన ప్రతిభను సాధించి,వాళ్ళ ఎదుటనే కచేరీలు చేసి,వాళ్ళచేతనే శెభాష్ అనిపించుకున్న ఒక అమెరికన్ పేరు నేడు చాలామందికి తెలీక పోవచ్చు.అతనే జాన్ హిగ్గిన్స్ భాగవతార్.ఆయన జీవితం వికీపీడియాలోనో ఇంకా ఇతర సైట్స్ లోనో చూడవచ్చు.జాతకం వరకూ మనం పరిశీలిద్దాం.

ఆత్మకారకుడు బుధుడు.కారకాంశ ధనుస్సు.అక్కడ నుంచి వాక్స్థానంలో ఉచ్ఛకుజుని వల్ల మంచి గాయకుడయ్యాడు.శని కేతువుతో కలసి పంచమంలో ఉండటం వల్ల ఆధ్యాత్మిక కీర్తనలతో నిండిఉన్న కర్నాటక సంగీతాన్నినేర్చుకుని మంచి ప్రజ్ఞ సాధించాడు.

చంద్రుని నుంచి చూచినా తృతీయంలోని ఉచ్ఛకుజుని వల్ల మంచి సంగీతప్రజ్ఞ కలిగింది.మకరం భారతదేశానికి సూచిక గనుకా,కుజుడు దక్షిణానికి సూచకుడు గనుకా దక్షిణ భారతదేశానికి చెందిన శాస్త్రీయ సంగీత ప్రజ్ఞను ఇచ్చినాడు.

ఆత్మకారకుడైన బుధునితో యురేనస్ పంచమ శుభదృష్టిని కలిగి ఉన్నాడు. కనుక అతీతమైన అనుభవాలను ఇవ్వగల భక్తి సంగీతాన్ని సాధన చేసినాడు. అదే యురేనస్ శని కేతువులతో కలిసి ఉండటం వల్ల అకస్మాత్తుగా అసహజమైన మరణాన్ని ఇచ్చినాడు.

శని గురుల వక్రస్తితి వల్ల ఈయనకు ధార్మికమైన తీరని కర్మశేషం ఉన్నదని తెలుస్తున్నది.అది తీరిన మరుక్షణం ఇతను ఈలోకాన్ని వదలవలసి ఉంటుందని కూడా తెలుస్తున్నది.అలాగే జరిగింది కూడా.

నా ఉద్దేశ్యం ప్రకారం ఈయన లగ్నం కన్య అయి ఉండాలి.అప్పుడే అష్టమం లోని నీచశని కేతువుల వల్ల అసహజమైన మరణం(యాక్సిడెంటల్ డెత్) ఉంటుంది.7-12-1984 న ఎవడో త్రాగుబోతు రాష్ గా మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తూవచ్చి కుక్కను షికారుకు తిప్పుతున్న జాన్ హిగ్గిన్స్ ను గుద్దేసి పారిపోయాడు.గాయాలతో జాన్ హిగ్గిన్స్ మరణించాడు.అప్పటికి ఆయనకు 45 ఏళ్ళు మాత్రమే.కేతువు ఇక్కడ కుజుని ప్రతినిధి అయ్యాడు.అంటే కుజ శనుల కలయిక అష్టమంలో జరిగింది.ఇక యాక్సిడెంట్ జరగక ఏమౌతుంది?కుజ శనుల కలయికతో ఏమి జరుగుతుందో నేను ఎన్నో వ్యాసాలలో వ్రాసినాను.ఈయన జాతకం కూడా ఈ సూత్రానికి మరొక్క ఉదాహరణ.

లగ్న యురేనస్ ల మధ్యన ఖచ్చితమైన షష్టాష్టక దృష్టి గమనార్హం.ఇది కూడా హఠాత్తుగా జరిగే అసహజ మరణాన్నే(sudden accidental death) సూచిస్తున్నది. 

మరణ సమయంలో శుక్ర/గురు/కేతు దశ నడిచింది.శుక్రుడు లగ్నంలో వ్యయాదిపతి అయిన రవివల్ల అస్తంగతుడు.గురువు ఈ లగ్నానికి కేంద్రాదిపత్య దోషి.అంతేగాక మారకుడు.శని నక్షత్రంలో వక్రిగా ఉండి చాలా దోషంతో కూడుకుని ఉన్నాడు.కేతువు అష్టమంలో నీచ శనితో కలసి ఉన్నాడు.కనుక మారకం జరిగింది.కేతువు శునకాలకు కారకుడన్న విషయం జ్యోతిర్వేత్తలకు సుపరిచితమే.ఇతని చావు సమయంలో కేతు విదశ జరుగుతూ ఉండటమూ ఆ చావుకు ఒక కుక్క కారణం అవడమూ ఎంత విచిత్రమో?పైగా అష్టమం చరరాశి కావడం వల్ల రోడ్డుమీద జరిగిన వాహనప్రమాదం ఈయన ప్రాణాలు తీసింది.ఇది కూడా జ్యోతిష్య సూత్రాల ప్రకారమే తూచా తప్పకుండా జరిగింది.

ఆత్మకారకుడైన బుధుని నుంచి నవమంలో శనికేతువు(కుజు)ల వల్ల ధార్మికమూ మోక్షకారక సంగీతమైన భారతీయ కర్నాటక సంగీత సాంప్రదాయాన్ని నిష్టగా అభ్యసించాడు.

ఈయన వేస్లీయన్ విశ్వవిద్యాలయంలో చదివినాడు.1962 లో సంగీతంలో డిగ్రీ చేశాడు.అప్పుడు బుధ/గురు/బుధ దశ జరిగింది.బుధుడు సంగీతాన్ని ఇస్తాడు.పైగా లగ్నాధిపతి.వ్యయంలో సూర్యుని నక్షత్రంలో ఉంటూ శాస్త్రీయ సంగీతంలో ప్రజ్ఞను ఇచ్చినాడు.ఈయన పాశ్చాత్య సంగీతంలో కూడా శాస్త్రీయ సంగీతాన్నే అభ్యసించాడు.1964 లో ఎమ్మే చేశాడు.అప్పుడు బుధ/శని/బుధ దశ జరిగింది.పంచమాదిపతిగా శని ఉన్నత విద్యను ఇచ్చాడు.1973 లో పీ హెచ్ డీ చేసాడు.ఆ సమయంలో కేతు/బుధ దశ జరిగింది.

ఈయనకు సంగీతం తల్లివైపు నుంచి వచ్చింది.ఆమె ఒక సంగీత బోధకురాలు.లగ్నాత్ చంద్రుడు తృతీయంలో ఉండటమూ చంద్రుని నుంచి కుజుడు తృతీయంలో బలంగా ఉండటమూ గమనిస్తే విషయం బోధపడుతుంది.నీచ చంద్రుని వల్ల పరాయి భాషలో సంగీతాన్ని అభ్యసించినా బలంగా ఉన్న కుజుడు లౌకిక సంగీతాన్ని గాక భగవన్మార్గంలో ఔన్నత్యాన్ని ఇవ్వగల శక్తి ఉన్న భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ఇచ్చినాడు. 

త్యాగరాజ కృతులను ఆయన పాడిన తీరు అద్భుతంగా ఉంటుంది.తెలుగు వచ్చిన మనకే అలా పాడటం కష్టం అనుకుంటే,ఒక అమెరికన్ పరాయి భాషను నేర్చుకుని ఆ గమకాలనూ సరిగమలనూ భావయుక్తంగా పాడి మన దేశస్తులను మెప్పించడం ఎంత కష్టమో ఊహించవచ్చు.ఆ!! ఒక విదేశీయుడు త్యాగరాజ కృతులను ఏమి పాడగలడులే? అని చప్పరించిన వారి ఎదుటనే కచేరి ఇచ్చి వారి చేతనే బిరుదులను పొందిన జాన్ హిగ్గిన్స్ భాగవతార్ నిజంగా చరితార్ధుడు.

1960,70లలో ఆల్ ఇండియా రేడియోలో ఆయన కచ్చేరీలు వచ్చేవి.త్యాగరాజ ఆరాధనోత్సవాలలో దిగ్గజాల వంటి గాయకుల ముందు త్యాగరాజ కృతులను పాడి వారిని మెప్పించిన గాయకుడు జాన్ హిగ్గిన్స్.ఆయన గాన పాటవానికి మెచ్చి 'భాగవతార్' అన్న బిరుదును ఆయనకు ఇవ్వడం ఎంతో సమంజసంగా ఉన్నది.

ఎవరో భారతీయ సంగీతజ్ఞుడు ప్రారబ్ధం వల్ల అలా అమెరికాలో పుట్టి కొంతకాలం జీవించి కర్మ తీరాక దేహం చాలించాడని నా అభిప్రాయం.ఇది ఉత్త అభిప్రాయమేకాదు నిజంకూడా.పంచమంలోని ఉచ్ఛకుజుడిని చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమౌతుంది.ఇతనికి మనదేశం అంటే ఉన్న ప్రేమవల్లా మన సంగీతం అంటే ఉన్న ప్రేమవల్లా తర్వాత జన్మలో మన దేశంలోనే ఒక సాంప్రదాయ కుటుంబంలో పుట్టినాడు.ప్రస్తుతం మన దేశంలో జీవించే ఉన్నాడు.అయితే ఆ వివరాలు యోగరహస్యాలు కాబట్టి ఎక్కువగా వివరించడం కుదరదు.

జాన్ హిగ్గిన్స్ భాగవతార్ పాడిన కొన్ని కీర్తనలని ఇక్కడ వినవచ్చు.

ఎందఱో మహానుభావులు

కృష్ణా నీ బేగనే బారో

గోవర్ధనగిరిధర గోవిందా

అమ్మా రావమ్మా

ఇదే పరంపరలో భాగంగా కొందరు విదేశీయులు పాడిన 'కమలాంబా సంరక్షతు మాం' కృతిని కూడా వినండి.