నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

26, ఫిబ్రవరి 2014, బుధవారం

ఆంధ్రాను స్వర్గంగా మారుస్తాం

తెలంగాణా పోతే పోయింది మనకు మిగిలిన ఆంధ్రాను స్వర్గంగా మార్చుకుందాం అని చాలామంది నాయకులు బీరాలు పలుకుతున్నారు. వీరందరూ నిన్నా మొన్నటివరకూ 'ఆంధ్రా ఎన్నటికీ విడిపోదు,మా ప్రాణాలు అడ్డు వేసి అయినా రాష్ట్రం చీలకుండా కాపాడుతాం' అని వీధుల్లో వీరంగాలు వేస్తూ బందులు చేయిస్తూ ప్రజాజీవనానికి విఘాతం కలిగిస్తూ గప్పాలు కొట్టిన వారే.ఇప్పుడేమో పేడిగొంతు వేసుకుని 'మా ప్రయత్నాలు మేము చేశాం కుదర్లేదు.అయినా పర్లేదు ఆంధ్రాని డెవెలప్ చేసుకుందాం' అనే కొత్తపాట మొదలు పెట్టారు.

రెండేళ్ళ క్రితమే తెలంగాణా రావడం  ఖాయం అని అందరికీ తెలుసు.కాని నిన్నటివరకూ ప్రజల్ని ఎన్ని రకాలుగా మభ్యపెట్టాలో అన్ని రకాలుగానూ మభ్యపెట్టారు.బందులు చేయించారు.విద్యార్ధులకు క్లాసులు పోయాయి. బందుల సమయంలో సమయానికి కరెంటు లేకా మందులు దొరకకా ఎందఱో రోగులు చనిపోయారు.ప్రజలకి ఎంతో అసౌకర్యం కలిగింది.కొన్ని లక్షల పనిగంటలు వృధా అయిపోయాయి.అన్నీ తెలిసీ ఈ నాటకాలు ఆడారు. జనాన్ని వెఱ్ఱివెధవల్ని చేసారు.

ముందుముందు మన నాయకులు చెయ్యబోయే డెవలెప్ మెంట్ ఏమిటో నేను ఇప్పుడే చెప్పగలను.

1.ముందుగా కొత్త రాజధాని విషయంలో నానాపుకార్లు లేవదీసి ప్రతి చోటా భూముల ధరలు పెంచి పారేస్తారు.ఇప్పటికే,అంటే ఈ నాలుగురోజుల్లోనే, దొనకొండలోనూ,మాచర్లలోనూ,మంగళగిరిలోనూ భూముల రేట్లు అమాంతం నాలుగైదు రెట్లు పెరిగిపోయాయి.ఒంగోలు కర్నూలు గుంటూరు విజయవాడలలో భూముల రేట్లు ఇప్పటికే చుక్కల్లో ఉన్నాయి.సామాన్యుడు వాటివైపు కనీసం తలెత్తి చూచే పరిస్తితి కూడా ఇప్పుడు లేదు.

2.ఆ తర్వాత అన్ని రంగాలలోనూ అమాంతం పెరిగిపోయిన ధరలతో క్రమేణా సామాన్యుడు బ్రతకలేని పరిస్తితి ఆంధ్రాలో కల్పించబడుతుంది.

3.డెవెలప్ మెంట్ కోసం కేంద్రం విదిల్చిన నిధులని(అసలంటూ ఏవన్నా వస్తే) హాయిగా బొక్కేసి కొన్ని పార్టీల నేతలూ కొన్ని కులాల ప్రతినిధులూ వందల వేలకోట్లు వెనకేసుకుంటారు.ఆ డెవలప్ మెంట్ మాత్రం ఎక్కడా కనిపించదు.మహా అయితే నాలుగు గతుకులరోడ్లూ,ఆరు మనపైనే కూలే ఫ్లైఒవర్లూ కనిపిస్తాయేమో.

4.నీళ్ళు,కరెంటు,పన్నులు,జీతాలు,ఉద్యోగాలు వగైరా అన్నింటిలోనూ తీవ్రమైన సమస్యలు కొద్దినెలలలో తలెత్తబోతున్నాయి.విభజనక్రమంలో ప్రజాజీవనం అతలాకుతలం కావడం ఖాయంగా జరుగుతుంది.ఇది తుపాను ముందటి ప్రశాంతత మాత్రమే.

5.'ఇదేంది సారూ ఇదేనా మీరు సృష్టిస్తానన్న ఆంధ్రా స్వర్గం?' అని ఎవరైనా అడిగితే -'ఒక కొత్తరాష్ట్రం మొదలయ్యేటప్పుడు మొదట్లో కొన్ని త్యాగాలు తప్పవు నాయనా.ఏభై ఏళ్ళుగా నిర్మించిన హైదరాబాద్ ఒక్కరోజులో పోయింది కదా?చెత్తనుంచి మళ్ళీ మన రాష్ట్రాన్ని నిర్మించుకోవాలి.దానికోసం ప్రజలు త్యాగాలకు సిద్ధంగా ఉండాలి.గంజిత్రాగి బ్రతుకుదాం.అయినా సరే స్వర్గాన్ని నిర్మించుకుందాం'-అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి చేతులు దులుపుకుంటారు. పిచ్చిప్రజలు ఆ మాటలు నమ్మి గంజి త్రాగటం మొదలుపెడతారు.నాయకులు మాత్రం ప్రజల సొమ్ముతో స్వర్గసుఖాలను నిత్యమూ అనుభవిస్తూనే ఉంటారు.

6.ఈ లోపల మన కులపార్టీలూ కులనాయకులూ కులసంఘాలూ విజ్రుమ్భించి ఎవరికీ దొరికింది వారు ఎడాపెడా దోచుకోవాలని చూస్తారు.ఇదంతా కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి అనుకూల ప్రభుత్వం మన రాష్ట్రంలో కూడా ఉంటే జరగబోయే పరిస్తితి మాత్రమే.

7.ఇకపోతే,కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక ప్రభుత్వం ఆంధ్రాలో ఏర్పడితే,అప్పుడేం జరుగుతుందో చూద్దాం.

8.నాయకులు ఊరిస్తున్న సింగపూర్ సీమాంధ్ర కనుచూపు మేరలో ఎక్కడా కనిపించదు.ఎందుకంటే కేంద్రంనుంచి ఏ నిధులూ,ఏ ప్రాజెక్టులూ రావు గనుక.పైగా ప్రతివిషయంలోనూ ఇకమీదట తెలంగాణాకు న్యాయమూ ఆంధ్రాకు అన్యాయమూ జరగడం ఖాయంగా చూడవచ్చు. 

9.ఇక చేసేది ఏమీ లేక,ఉన్న దానిలోనే దోచుకోవాలని నాయకులు ప్రయత్నిస్తారు.ప్రజల్ని ఎప్పటికప్పుడు అనవసరమైన పక్కదారి మాటలతో ఉత్తుత్త సమస్యలతో మభ్యపెడుతూనే ఉంటారు.ప్రజలు కబేళాలో గొర్రెల్లా బ్రతుకుతూనే ఉంటారు.

10.ఈలోపల ఇంకొక ప్రమాదం - అతి ముఖ్యమైనది తలెత్తుతుంది- అదేమిటంటే,ఇకమీద తెలంగాణా ఆంధ్రాలలో ఏ ప్రాజెక్టు ఎవరికోచ్చినా రెండోవారు కెవ్వుమంటూ గోల చెయ్యడం సాధారణమవుతుంది.ఆ తర్వాత మన రెండు రాష్ట్రాలూ కొట్టుకుంటుంటే ఆ ప్రాజెక్టులు ఏ తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాలకో తరలిపోవడమూ మన కళ్ళెదుటే జరుగుతుంది.

11.ఎవరి రాష్ట్రాభివృద్ధిని వారు చూచుకోకుండా పక్క రాష్ట్రం మీద పడి ఏడవడం ఎక్కువౌతుంది.తమ చేతగానితనాన్ని కేంద్రంమీద నెట్టేసి చేతులు దులుపుకోవడం మాత్రమే జరుగుతుంది.

12.పనిలో పనిగా ఇంకొక పదేళ్ళో ఇరవై ఏళ్ళో గడిచాక ప్రత్యెక రాయలసీమ ఉద్యమం ఎలాగూ మొదలౌతుంది.చిత్తూరు,అనంతపూరు,కర్నూలు,కడప జిల్లాలతో రాయలసీమ రాష్ట్రం ఉద్భవిస్తుంది.ఆ తర్వాత రాయలసీమ స్ఫూర్తితో ఉత్తరకోస్తా దక్షిణకోస్తా ఉద్యమాలూ మొదలౌతాయి.వెరసి ఆంధ్రా మళ్ళీ మూడుముక్కలుగా విడిపోతుంది.కర్నూలు గనుక రాజధాని కాకపోతే రాయలసీమ ఉద్యమం వచ్చె ప్రమాదం తప్పకుండా పొంచి ఉన్నది.ఇది వెంటనే కాకపోవచ్చు కొన్నేళ్ళ తర్వాత మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది.

13.ఈలోపల భూముల ధరలూ ఇతర ధరలూ ఊహించలేనంతగా పెరిగిపోయి సామాన్యుడు రాష్ట్రంలో బ్రతకలేని పరిస్తితి ఖచ్చితంగా వస్తుంది.అవినీతి విచ్చలవిడిగా విజ్రుంభిస్తుంది.ఎవడైనా నీతి గురించి మాట్లాడితే వాడిని ఒక వెర్రివాడిగా జమకట్టే రోజు అతిత్వరలో రాబోతున్నది.'నీకు చేతనైతే డబ్బులిచ్చి పని చేయించుకో లేదంటే నోర్మూసుకొని ఒకమూల కూచో'- అని ఓపెన్ గా చెప్పుకునే రోజు అతి దగ్గరలో మనం చూస్తాం.తత్ఫలితంగా క్రైం రేట్ రాష్ట్రంలో బాగా పెరుగుతుంది.

కొద్దిగా ఆలోచన ఉన్నవారు ఈ ఆంధ్రాలో మనం ఎందుకున్నాంరా దేవుడా అని ఏడిచే పరిస్తితి కల్పించబడుతుంది.

నాయకులు ప్రజల్ని మోసం చేస్తున్నంతవరకూ,ప్రజలకు దేశభక్తి లేనంతవరకూ,కులాల కుమ్ములాటలనే రొచ్చులోనుంచి మనం బయటపడలేనంతవరకూ,దూరదృష్టీ విశాలదృష్టీ మనకు రానంతవరకూ మన రాష్ట్రం బాగుపడటం ఎన్నటికీ జరగదు.

రాష్ట్రం విడిపోవటం మన కళ్ళెదుటే చూశాం.ఇవన్నీ కూడా మన కళ్ళెదుటే ముందుముందు ఖచ్చితంగా చూస్తాం.దేశంలో ఆంధ్రా ఇప్పటికే నవ్వుల పాలయింది.ఇంకా భ్రష్టుపట్టడం రేపటి సూర్యోదయమంత నిజం.

ఆంధ్రాను స్వర్గంగా చేసుకోకుంటే మానె,ప్రత్యక్ష నరకంగా మార్చుకోకుంటే అదే పదివేలు.అవినీతి రాజకీయ నాయకులూ,ఆలోచన లేని స్వార్ధపూరిత ప్రజలతో రెండోదే ఖాయంగా జరుగుతుంది అని నా అభిప్రాయం.త్వరలోనే అదీ చూస్తాంగా తొందరెందుకు?