నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

6, ఫిబ్రవరి 2014, గురువారం

మకర సంక్రాంతి కుండలి-ఫలితాలు



ఈమధ్య జ్యోతిష్యం వైపు దృష్టి సారించి చాలా రోజులైంది.మకరసంక్రాంతి కుండలి ఏమంటున్నదో ఒకదారి చూద్దాం.

ఈ ఏడాది మకర సంక్రాంతి 14-1-2014 న మధ్యాన్నం 1.05 కి మన దేశరాజధానిలో జరిగింది.ఆ సమయానికి గల గ్రహకుండలిని ఇక్కడ చూడవచ్చు.

ఇందులోని గ్రహస్థితులను బట్టి ఈ మూడునెలలలో మన దేశ పరిస్థితులు ఎలా ఉంటాయో స్థూలంగా పరిశీలిద్దాం.

లగ్నం చరరాశి అయింది.గుళిక లగ్నానికి దగ్గరగా ఉన్నాడు.కనుక దేశం అన్నిరంగాలలో ముందుకు పోవాలని చాలామంది ఆశిస్తున్నా,సామూహిక కర్మ అనేది దేశాన్ని అంత త్వరగా బాగుపడనివ్వదు.ఆలోచన అద్భుతం. ఆచరణ శూన్యం అన్నట్లు దేశపరిస్థితి ఉంటుంది.

లగ్నాధిపతి కుజుని షష్ఠస్థితివల్ల దేశం అంతర్గత శత్రుపీడతో సతమత మౌతుంది.ప్రజలకు దూరదృష్టి కొరవడుతుంది.తమపై తామే యుద్దానికి దిగుతూ ఉంటారు.నాయకుల మాయమాటలకు తేలికగా మోసపోతారు. ప్రతివారూ హిపోక్రసీతో నిండి,అతితెలివితో చివరకు ఊబిలో అడుగేస్తారు.

దశమంలో బలహీన రవివల్ల అధికారంలో ఉన్న ప్రభుత్వం బలహీన పడుతుంది.అక్కడే ఉన్న బుధుని కారణంగా ప్రతిపక్షాలు క్రమేణా తెలివైన అజెండాలతో బలాన్ని సంతరించుకుంటాయి.

మూడింట వక్రగురుచంద్రుల వల్ల,ప్రభుత్వాలు ప్రజలకు ఏవేవో మాయమాటలు చెప్పి మసిబూసి మారేడుకాయ చెయ్యాలని చూచినా ఫలితం ఉండదు.ఏం జరుగుతున్నదో మేధావులూ ప్రజలూ చక్కగా గమనిస్తూ ఉంటారు. అప్పటికప్పుడు ప్రకటించే ఎన్నికల ప్రజాకర్షక పధకాలు ఏమాత్రం ఫలితాలను ఇవ్వవు.

సప్తమంలో ఉచ్ఛశనిరాహువుల వల్ల,ప్రతిపక్షాలు బాగా బలాన్ని పుంజుకోవడం తధ్యం.గత పరిపాలనలతో విసిగిపోయిన ప్రజలు నూతన నాయకత్వం వైపు తప్పకుండా మొగ్గు చూపుతారు.అయితే,విడిపోతున్న రాహుశనులవల్ల ప్రతిపక్షాల మధ్య ఐక్యత కొరవడుతుంది.ఏకాభిప్రాయం లోపిస్తుంది.

తొమ్మిదింట వక్రశుక్రునివల్ల విదేశీ సంబంధాలు దెబ్బతింటాయి.అధికార బలానికి,పురుషాహంకారానికి మహిళలు,అమాయకులు బలైపోతారు. ఆర్ధికరంగం ఏమంత గొప్పగా ఏమీ ఉండదు.

నవాంశలోని చతుర్ధ నీచకుజుని వల్ల,ప్రజలు అమితమైన ఉత్సాహంతో ముందుకు దూకి భంగపడతారు.

ఇందులోని చాలా సూచనలు ఇప్పటికే జరిగాయి.కొన్ని ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి.ఈ పరిస్తితి మార్చి నెలాఖరు వరకూ కొనసాగుతుంది.ఏప్రియల్లో జరుగబోయే మేష సంక్రాంతి చాలా ముఖ్యమైనది.ఎందుకంటె తర్వాతి మూడు నెలలలోనే ఎన్నికలు జరుగబోతున్నాయి.

అప్పటి ఫలితాలను అప్పుడు చూద్దాం.