Pages - Menu

Pages

15, మార్చి 2014, శనివారం

జనసేన పార్టీ జాతకచక్రం ఏమంటున్నది?



నిన్న 14-3-2014 రాత్రి 19-16 నిముషాలకు హైదరాబాద్ లో సినీనటుడు పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని ప్రకటించాడు. సందర్భంగా పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒకసారి పరికిద్దాం.

ముహూర్తాలు నిర్ణయించి అన్నీ మనమే నిర్దారించగలం అని చాలామంది అనుకుంటారు.ఇది తప్పు.భవిష్యత్తును మనం చేతిలోకి తీసుకోవడం సాధ్యం కాదు.మన ఇష్టం వచ్చినట్లుగా మన భవిష్యత్తును మార్చుకోవడం కర్మాతీతులైన మహర్షులకూ మహాయోగులకే సాధ్యమౌతుంది గాని మామూలు మనుషులకు సాధ్యం కాదు.మనుష్యులు ఎంతటివారైనా కర్మబద్దులే.

నిర్ణయింపబడిన ముహూర్తాన్ని కూడా పూర్వకర్మ తెలివిగా అతిక్రమిస్తుంది. రహస్యాలు ఏమిటో మామూలుగా ముహూర్తాలు పెట్టే సామాన్య జ్యోతిష్కులకూ పురోహితులకూ తెలియవు.అంతరిక యోగసాధనలో ఉన్నతస్తరాలు అందుకున్న వారికే విషయాలు అర్ధమౌతాయి.

ప్రస్తుతానికి వస్తే,లగ్నం ద్విస్వభావమైన కన్య అయింది.కనుక పార్టీ పరిస్తితి ఎప్పుడూ ఊగిసలాటగానే ఉంటుంది.గట్టి స్థిరత్వం ఉండకపోవచ్చు. లాభాదిపతి అయిన పూర్ణచంద్రుడు లగ్నానికి సపోర్ట్ గా ఉన్నప్పటికీ రెండింట ఉన్న పాపగ్రహ కూటమి వల్ల ఒక విషయం స్పష్టంగా కనిపిస్తున్నది.పవన్ కు ప్రజాభిమానం దండిగా ఉన్నప్పటికీ ఆయన్ను ముందుకు పోనివ్వకుండా ఆపేశక్తులు కూడా బలంగానే ఉంటాయన్న విషయం సుస్పష్టంగా కనిపిస్తున్నది.

మఖా నక్షత్రం నడుస్తున్నరోజున ఈ పార్టీ ప్రారంభం అయింది.కేతువు అష్టమంలో ఉన్నాడు.ఇది అంత మంచి శకునం కాదు.తన సిద్ధాంత ఔన్నత్యాలను అందుకోవడానికి ఈపార్టీ చాలా కష్టనష్టాలను చవిచూడవలసి ఉంటుంది.అంతేగాక ఈ పార్టీ ప్రారంభించడానికి ముందు పవన్ ఎంతో మానసిక సంఘర్షణను అనుభవించాడని కూడా ఈ యోగం సూచిస్తున్నది.

కుజహోరలో ఈ పార్టీ మొదలైంది.కుజుడు జ్ఞాతికారకుడుగా కుటుంబ స్థానంలో వక్రించి ఉన్నాడు.కనుక ఈ చర్యవల్ల పవన్ కు సొంత కుటుంబంలోనే వ్యతిరేకతా,శత్రుత్వమూ ఎదురయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి.

రెండింట ఉన్న శని రాహు కుజులవల్ల ఇతరపార్టీల సిద్ధాంతాలనూ ఆచరణలనూ తూర్పారబట్టే విధానం పార్టీలో కనిపిస్తుంది.పవన్ ఉపన్యాసంలోనే ధోరణి స్పష్టంగా కనిపించింది.ఇది వాక్స్తానంలో ఉన్న మూడుగ్రహాల ప్రభావమే.సిద్ధాంతాల పట్ల నిబద్ద్తతను శని ఇస్తే,ఎదుటివారి దాడిని తిప్పికొట్టడంలో రాహువూ కుజుడూ ప్రముఖపాత్ర పోషిస్తారు.

పంచమంలోని ధర్మస్థానాధిపతి శుక్రుడు పార్టీకి మంచి ఆలోచనలనూ నైతికతనూ ఆపాదిస్తాడు.ఉన్నతమైన సిద్ధాంతాలతో పార్టీ ప్రారంభించ బడుతుంది.ఈరోజు శుక్రవారం కావడం వెనుకగల ప్రభావమూ, పవన్ ఉపన్యాసం కుల మత ప్రాంతీయ తత్వాలకు అతీతంగా సాగడంలోని గ్రహప్రభావమూ ఇదే.

ఇకపోతే,లగ్నాధిపతి బుధుడు ద్వాదశాదిపతి అయిన సూర్యునితో కలసి ఆరవ ఇంటిలో ఉండటం వల్ల తన సూటి విమర్శలతో ఇతర పార్టీల రహస్య శత్రుత్వాన్ని కొనితెచ్చుకుంటాడని సూచిస్తున్నది.నిన్న ఆయన వేదికమీదనుంచి చేసిన విమర్శలు ఎవరికైనా మింగుడు పడటం కష్టమే.కానీ అవన్నీ నిజాలే గనుక ఎవరూ ఏమీ జవాబు చెప్పలేని పరిస్త్తితి ఉన్నది. కుజబుధుల మధ్యన గల ఖచ్చితమైన కోణదృష్టి కూడా దీనినే సూచిస్తున్నది.చంద్ర రాహువుల మధ్య ఉన్న అర్ధకోణ దృష్టివల్ల రకరకాలైన భావాలతో పార్టీ ఊగిసలాడుతుందని సూచన ఉన్నది.

ఎనిమిదింట కేతువు వల్ల లోతైన ఆధ్యాత్మికచింతన కలుగుతుంది.కేతువు ఇక్కడ కుజుడిని సూచిస్తున్నాడు.కుజుడు సోదరకారకుడు గనుక సోదరులతో శత్రుత్వమూ విభేదాలూ రావడం ఖాయం.పార్టీ కూడా అనూహ్యమైన అకస్మాత్తు నష్టాలను చవిచూడవలసి వస్తుంది.

పదింట గురువూ ద్వాదశంలో చంద్రుడూ జాతకానికి ముఖ్యమైన గ్రహాలు. దశమ గురువువల్ల సైద్ధాంతిక పరంగా మంచి ధార్మికత ఉంటుంది. కులమతప్రాంతీయభేదాలను అధిగమించి మానవత్వపరంగా ప్రజలకు మేలు చెయ్యాలన్న కోరిక పార్టీ నేతలకు ఉంటుంది.అయితే ఇది ఎంతవరకు ఆచరణలో సాధ్యపడుతుంది అన్నది ప్రశ్నార్ధకమే. ఎందుకంటే, గురువు లగ్నానికి కేంద్రాదిపత్య దోషి.కనుక సొంత గూటిలోనే కొంత అసంతృప్తిని కలిగిస్తాడు.అలాగే శత్రువుల కుట్రలవల్ల పార్టీ అనుకున్నవి అనుకున్నట్లుగా చెయ్యలేకపోవచ్చు.కనీసం అలా చెయ్యాలన్న ప్రయత్నంలో చాలా చిక్కులూ అవరోధాలూ అధికారులవద్ద నుంచీ నాయకుల వద్దనుంచీ వీరు ఎదుర్కోవలసి వస్తుంది.

లాభాదిపతి ద్వాదశంలో స్థితివల్ల పార్టీ ఆర్ధికంగా బాగా సంపాదించుకునేది ఏమీ ఉండదని అనిపిస్త్తున్నది.'నేను సంపాదించడానికి రాజకీయాలలోకి రావడం లేదు'- అన్న పవన్ మాటల వెనుక ఉన్న నిజాయితీని గ్రహయోగం సూచిస్తున్నది.

ఇదే యోగంవల్ల తన అన్నలతో ఈయనకు రహస్య శత్రుత్వం వస్తుందన్న సూచనా ఉన్నది.పైకి ఏమీ లేదని చెప్పినా లోలోపల ఈ చర్య వారిమధ్యన విభేదాలకు తప్పక దారితీస్తుందని వ్యయంలోని లాభాదిపతి సూచిస్తున్నాడు.

ద్వితీయంమీదా షష్ఠంమీదా ఉన్న గురుదృష్టి వల్ల తొందరపడి కామెంట్స్ చెయ్యడంవల్ల వచ్చె అనర్దాలనుండీ శత్రుత్వాలనుండీ గురువు కాపాడతాడని సూచన ఉన్నది.

చతుర్ధంమీద ఉన్న వక్రోచ్చశనిదృష్టివల్ల,పవన్ యొక్క ఆధ్యాత్మికచింతనా, విశాలభావాలూ క్రమేణా తన పార్టీలోని వారికే మింగుడుపడకపోవచ్చన్న సూచన ఉన్నది.అదే చతుర్ధం మీద ఉన్న గురుదృష్టి వల్ల పార్టీలో వచ్చె కల్లోలాలు మళ్ళీ శాంతిస్తాయన్న సూచనా ఉన్నది.

శుభార్గళం పట్టిన ఆరూఢలగ్నంవల్ల--ప్రాధమికంగా పార్టీ చాలా ఉన్నతమైన మంచి ఉద్దేశ్యాలతో మొదలైనా కూడా ఆచరణలో తాను అనుకున్న విలువలతో కూడిన రాజకీయాలను సాకారం చేసుకోవడం అంత సాధ్యం కాదేమో అన్న సంశయం దశమంలో ఉన్న కేతువు వల్ల కలుగుతున్నది.

చతుర్దంలో ఉన్న పాపగ్రహకూటమి వల్ల క్రమేణా సొంతపార్టీలోనే పవన్ భావాలను పూర్తిగా అర్ధం చేసుకోలేనివారు తయారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.నిన్న ఆయన సమావేశానికి వచ్చిన వారందరూ ఆయనంత పరిపక్వమైన ఆలోచనా,దార్శనిక స్పష్టతా,సిద్ధాంతఔన్నత్యమూ ఉన్నవారేనా లేక ఉత్త సినీ అభిమానులా అన్నది ఆలోచించదగిన విషయమే.

పాకలగ్నమైన కుంభం నుంచి రాహువు నవమంలో ఉండటం వల్ల,ఈ జాతకానికి అష్టోత్తరీ దశ ఉపయోగిస్తుంది.ఆ దశాప్రకారం పార్టీ ప్రారంభ సమయానికి చంద్ర/బుధ/శుక్రదశ నడుస్తున్నది.జ్యేష్టసోదరులతో విభేదాలూ (చంద్రబుధుల సమసప్తకం),ఉన్నత ఆశయాలతో(నవమాధిపతి పంచమ స్థితి) ఈ పార్టీ మొదలైందని స్పష్టంగా కన్పిస్తున్నది.

వింశోత్తరీ దశాప్రకారం కేతు/రాహు/శని దశలో ఈపార్టీ మొదలైంది. అష్టమంలోని కేతువు వల్ల మానసిక సంఘర్షణా,ద్వితీయంలో ఇంకా రెండు గ్రహాలతో కలసి ఉన్న రాహువువల్ల కుటుంబానికి ఇష్టంలేకపోయినా పార్టీని ప్రారంభించడమూ,ఉచ్ఛ వక్రశనివల్ల ప్రజలకు బాధ్యతగా ఏదోమేలు చెయ్యాలన్న సత్సంకల్పమూ కనిపిస్తున్నాయి.  

చాలా పార్టీలు ఉన్నత సిద్ధాంతాల తోనే మొదలౌతాయి.క్రమేణా ఆచరణలో ఘోరంగా దిగజారిపోతాయి.తద్వారా ప్రజలు నిరాశకు గురికావడమూ జరుగుతూనే ఉంటుంది.ఇలా ఇప్పటికి ఎన్నో సార్లు జరిగింది. మధ్యనే ఉన్నతమైన ఆశయాలతో వచ్చిన ఆమాద్మీ పార్టీ చేస్తున్న పిల్లచేష్టలతో పార్టీ క్రమేణా ఎంతగా విశ్వసనీయతను కోల్పోతున్నదో గమనిస్తే నేను చెబుతున్నది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అని అర్ధం అవుతుంది.

పవన్ మాటల్లోని నిజాయితీ నాకు నచ్చింది.అతని విశాలమైన ప్రాక్టికల్ గా ఉన్న భావాలూ నాకు నచ్చాయి.అతను ఏదీ దాచుకోకుండా ఓపెన్ గా మాట్లాడే విధానమూ నాకునచ్చింది.కులానికీ మతానికీ ఇతర అల్పమైన విషయాలకూ అతీతంగా అతను ఆలోచించే విధానం అన్నింటికంటే నాకు బాగా నచ్చింది.

అయితే వ్యక్తిగత భావాలు వేరు.ఒక పార్టీని నడిపించడం వేరు.పార్టీ అంటే ఎన్నెన్నో భావాలూ విభేదాలూ ఉన్న అనేకమంది వ్యక్తుల సమూహం. మొదట్లో ఉత్సాహంతో అందరూ చేరతారు.క్రమేణా స్వార్ధాలూ,కుట్రలూ మొదలౌతాయి.చీలికలు మొదలౌతాయి. క్రమంలో కొన్ని సిద్ధాంతాలను త్యాగం చెయ్యవలసి వస్తుంది.అప్పటినుంచి పతనం ప్రారంభం అవుతుంది. చివరకు అదికూడా అన్ని పార్టీల్లాగే తయారౌతుంది.ఇది ప్రతి పార్టీలోనూ జరిగే తంతే.

అటువంటి పతనం సంభవించకుండా,పార్టీనీ కేడర్ నూ నడుపుతూ,తాను నిన్నచెప్పిన సిద్దాంతాలలో రాజీపడకుండా నిజంగా ప్రజల సంక్షేమంకోసం కుల మత ప్రాంత వర్గవిభేదాలకు అతీతంగా పవన్ కృషి చెయ్యగలిగితే అంతకంటే సంతోషం ఇంకేదీ ఉండదు.ప్రస్తుతం మన రెండు రాష్ట్రాలకూ కావలసింది ఇలాంటి భావాలే.

కానీ అది సాధ్యమేనా?ప్రస్తుత కుళ్ళుసమాజం పనిని సజావుగా చెయ్యనిస్తుందా?

తరతరాలుగా వేళ్ళూనుకొని ఉన్న స్వార్ధపరశక్తులు అటువంటి మార్పును స్వాగతిస్తాయా?ముఖ్యంగా భావావేశాలకు తేలికగా పడిపోయే మన ప్రజలు అటువంటి ఉన్నతమైన మార్పును ఒప్పుకుంటారా?

ఏమో? కాలమే సమాధానం చెప్పాలి.