Pages - Menu

Pages

5, మార్చి 2014, బుధవారం

నరేంద్రమోడి జాతకం-2-ఒక పరిశీలన

ఇంతకు ముందు వ్రాసిన నరేంద్రమోడి జాతకవిశ్లేషణ పూర్తి కాకుండా అలాగే ఉండిపోయింది.ఆ వ్యాసం కావలిస్తే ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే ఆయన జననసమయం ఎక్కడా సరిగ్గా దొరకడంలేదు. రకరకాల సమయాలు కనిపిస్తున్నాయి.జననసమయాన్ని తేల్చకుండా ఆయన జాతకాన్ని స్పష్టంగా చెప్పలేము.కనుక ముందుగా జననసమయ నిర్ధారణ చాలా ముఖ్యం అని ఇంతకు ముందు వ్రాసిన వ్రాసంలో అన్నాను.దానికి కొంత పరిశ్రమా,రివర్స్ యాస్ట్రో ఇంజినీరింగూ అవసరం.

అది చెయ్యబోయే ముందు కూడా మరికొన్ని జ్యోతిష్య సూత్రాల ఆధారంగా ఈయన జాతకాన్ని ఇంకోక్కసారి పరిశీలించవచ్చు.ఆ కోణాలలో ఈయన జాతకాన్ని ప్రస్తుతం చూద్దాం.

లగ్నం ఏదైనప్పటికీ ఆయన రాశి వృశ్చికమే అన్నది సత్యం.ఈయన జాతకంలో ఆత్మకారకుడు శని అన్నదీ,అమాత్య కారకుడు శుక్రుడు అన్నదీ సత్యమే.కనుక స్థిరంగా మనకు కనిపిస్తున్న ఈ అంశాల ద్వారా ఈయన జాతకాన్ని కొద్దిగా విశ్లేషించి చూద్దాం.ఎందుకంటే ఒకవేళ లగ్నం మారినప్పటికీ ఆయన జాతకంలోని ఈ అంశాలు మాత్రం మారవు.కనుక వాటివైపునుంచి ఆయన జాతకాన్ని పరిశీలిద్దాం.

ఎలక్షన్ సమయానికి గ్రహగోచారం ఎలా ఉన్నదో పరికిస్తే త్వరలో ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతున్నదో తెలుస్తుంది.

గురుగోచారం

రేపటినుంచి గురువుగారు వక్రస్థితి నుంచి బయటపడబోతున్నాడు.ఈ వ్యాసం ఇప్పుడు వ్రాయడానికి కారణం కూడా ఇదే.రేపటినుంచి గురువుగారికి వక్రస్థితి వదలడమే గాక అతిచారం మొదలౌతున్నది.అంటే మామూలుగా నడచే వేగం కంటె అతివేగంగా నడవబోతున్నాడు.కనుక రేపటినుంచీ నరేంద్రమోడీ ప్రచారం బాగా ఊపందుకుంటుంది.ఆయనకు మంచికాలం స్పష్టంగా మొదలౌతుంది.సెంటిమెంట్ పవనాలు ఆయనకు అనుకూలంగా బలంగా వీస్తాయి.

దీనికి ఇంకొక ప్రధానకారణం మోడీ జాతకంలో సెంటిమెంట్ ను సూచిస్తున్న గురువు తన ఉచ్చస్థితి వైపు వేగంగా ప్రయాణించడమే.1-6-2014 తేదీనాటికి గురువు మిధునం చివరి నవాంశలోకి అడుగుపెడతాడు.అంటే అప్పటినుంచి ఆయన తర్వాతి రాశి ఫలితాలు ఇవ్వడం మొదలౌతుంది.గురువుగారు జూన్ 19 న కర్కాటక రాశి ప్రవేశంతో ఉచ్ఛస్థితిలోకి అడుగుపెడుతున్నాడు.అంటే నరేంద్రమోడీ జాతకంలో భాగ్యస్థానంలో ఉచ్చస్తితిలోకి రాబోతున్నాడు. భాగ్యభావం కళ్ళుతెరవడం ద్వారా మోడీకి అత్యంత శుభప్రదమైన రోజులు మొదలు కాబోతున్నాయి.కనుక జూన్ మొదటివారం నుంచే నరేంద్రమోడీకి మహర్ధశ పట్టబోతున్నది.

చంద్రలగ్నాత్ గురువు నరేంద్రమోడీకి యోగకారకుడు.యోగకారకుని ఉచ్చస్థితి వల్ల ఆయనకు మంచిదశ మొదలౌతున్నది.పైగా సెంటిమెంట్ కు సూచకం అయిన చతుర్దంలో గురువు ఉన్నాడు.కనుక మోడీ పవనాలు బలంగా వీచబోతున్నాయి.దేశం మొత్తంనుంచి మంచి సెంటిమెంటల్ సపోర్ట్ ఆయనకు రాబోతున్నది.

రాహుగోచారం

మే 12 నుంచి రాహువు తులారాశి మొదటి నవాంశలోకి అడుగు పెడుతున్నాడు.అంటే జ్యోతిష్య ఫలితసూత్రాల ప్రకారం ఆయన అప్పటినుంచి కన్యారాశి ఫలితాలు అందించడం మొదలౌతుంది.ఆ రోజునుంచీ మోడీ జాతకంప్రకారం చంద్రలగ్నాత్ లాభస్థానంలోకి రాహువు ప్రవేశించినట్లే లెక్క. కనుక ఆ రోజునుంచీ నరేంద్రమోడీకి అనుకూల పవనాలు బలంగా వీచడం మొదలౌతుంది.లాభస్తానంలోని రాహువు వల్ల ఆయనకు ఇతర పార్టీల నుంచి మద్దతు కూడా ఆరోజునుంచీ బలంగా లభిస్తుంది.ముస్లిం వర్గాలనుంచి కూడా ఆయనకు బలమైన సపోర్ట్ రావడం స్పష్టంగా ఆరోజునుంచీ చూడవచ్చు.

శుక్ర గోచారం

28-4-2014 నుంచి 23-5-2014 వరకూ శుక్రుడు మీనంలో ఉచ్ఛస్థితిలోకి రాబోతున్నాడు.శుక్రుడు నరేంద్రమోడీ జాతకంలో అమాత్యకారకుడు.మే 3 నుంచి శుక్రుని ఆరోహణ పర్వం నవాంశలో మొదలౌతుంది.అక్కడనుంచి 20 రోజులపాటు నరేంద్రమోడీకి ఎదురనేది ఉండదు.అన్నిచోట్లా ప్రజాభిమానం వెల్లువెత్తుతుంది.ఎన్నికల సమయానికి అమాత్య కారకుని ఉచ్చస్థితివల్ల ఎన్నికలలో విజయం ఆయన సొంతం అవుతుంది.

శనిగోచారం

2-3-2014 నుంచి శని వక్రత్వం మొదలైంది.కనుక ఈ రోజునుంచీ శనిభగవానుడు అత్యంత బలాన్ని పుంజుకోబోతున్నాడు.పాపగ్రహాలు వక్రిస్తే మహాశక్తివంతంగా తయారౌతాయి.మోడీకి శని ఆత్మకారకుడు.కనుక క్రమక్రమంగా ఆయన ప్రసంగాలు ఊపందుకోవడం స్పష్టంగా ఆ రోజునుంచీ గమనించవచ్చు.ప్రత్యర్ధుల మీద డైరెక్ట్ ఎటాక్ ఆయన ఎన్నికల ప్రసంగాలలో ఇక స్పష్టంగా కన్పిస్తుంది.నవాంశలో మిదునంలో ఉన్న శని,తన వక్రత్వం వల్ల మేషంలోని తన నీచస్తితికి చేరుకోవడం కోసం పయనం మొదలు పెడతాడు.కనుక మహాశక్తివంతుడౌతాడు.

అదే సమయంలో ప్రత్యర్ధుల విమర్శలూ మోడీ మీద తీవ్రస్థాయిలో మొదలౌతాయి.కాని ఆ విమర్శలు ఆయనను ఇంకా ఇంకా బలోపేతం చెయ్యబోతున్నాయి.ఆ విమర్శలను ఆయన సమర్ధవంతంగా తిప్పి కొట్టడమే కాక ప్రత్యర్ధులు సమాధానం చెప్పలేని నిజాలను మంచి తర్కంతో ప్రజల ముందు పెట్టగలుగుతాడు.తద్వారా ఆయనవైపు ప్రజలు ఆశగా చూడటం మొదలౌతుంది.

అన్ని గ్రహాలూ అనుకూలంగా కనిపిస్తున్నందువల్ల నరేంద్రమోడీ ప్రధాన మంత్రి అయ్యే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి.అయితే ఈ క్రమంలో ఆయనకు బయటనుంచి కొంత సపోర్ట్ అవసరం అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.అదే జరిగితే మన దేశానికి మంచిరోజులు వచ్చినట్లే భావించవచ్చు.

ప్రస్తుతం రాజకీయ ముఖచిత్రంలో నరేంద్రమోడీని మించిన సమర్ధుడైన ప్రధానమంత్రి అభ్యర్ధి మన దేశంలో ఎవరూ కనిపించడం లేదనే చెప్పవచ్చు. భాగ్యభావంలో ఆయనకు కలుగబోతున్న ఉచ్ఛగురువు అనుగ్రహం కూడా ఆయనకున్న దైవబలాన్నీ భగవంతుని నిర్ణయాన్నీ స్పష్టంగా సూచిస్తున్నది.

రివర్స్ యాస్ట్రో ఇంజినీరింగ్ ద్వారా మోడీ జననసమయాన్ని నిర్ధారణ చెయ్యడం ఎలాగో వచ్చే వ్యాసాలలో చూద్దాం.