నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

3, ఏప్రిల్ 2014, గురువారం

అనగనగా ఒక దేశం

అనగనగా ఒక దేశం.

ఆ దేశంలో ఎవరికీ దేశాభిమానం లేదు.ఉన్న కొద్దిమంది మాటా ఎవరూ వినరు.

ఆ దేశంలో అందరూ బానిసలే.కొందరు నిజంగా బానిసలైతే,ఇంకొందరు భావజాల బానిసలు.అందరూ నీతులు చెబుతారు.కాని ఎవ్వరూ వాటిని పాటించరు.

తమ దేశాన్ని ఇతరులకు తాకట్టు పెట్టమన్నా పెడతారుగాని సుపరిపాలన మాత్రం కోరుకోరు.

పరాయివాడి పల్లకీ మోస్తారు గాని,తనవాడికి కనీస మర్యాద ఇవ్వరు. అసలు 'తన' అనే పదానికి అర్ధమే వారిలో చాలామందికి తెలియదు.

అలాంటి బానిసలకు ఉన్నట్టుండి ఒకరోజున స్వాతంత్ర్యం వచ్చింది.

ఇంకేముంది ఎవరిష్టం వచ్చినట్లు వారు దోపిడీ మొదలుపెట్టారు.అప్పటిదాకా కష్టపడిన నాయకులు-'ఇప్పటిదాకా కష్టపడింది చాల్లే.ఇంకెన్నాళ్ళు ఈ గోల'- అనుకుంటూ హాయిగా సుఖపడటం మొదలుపెట్టారు.

కొన్నాళ్ళపాటు ఏం జరుగుతుందో పిచ్చిప్రజలకి అర్ధం కాలేదు.అర్ధమైన తర్వాత 'మేమేం తక్కువ తిన్నామా?' అంటూ వాళ్ళూ దోపిడీ మొదలు పెట్టారు.

ప్రపంచంలోని అన్ని న్యాయశాస్త్రాలూ అక్కడ ఉన్నాయి.కాని ఎవరూ వాటిని పాటించరు.వాటికి చిక్కకుండా ఎలా తప్పుకోవాలో అక్కడ పుట్టిన కూనకు కూడా తెలుసు.

ప్రపంచంలోని అన్ని మతాలూ అక్కడున్నాయి.కాని వాటిని ఇతరులను ద్వేషించడానికీ,మనిషికీ మనిషికీ మధ్యన అడ్డుగోడలు సృష్టించడానికీ మాత్రమే వాళ్ళు ఉపయోగించుకుంటారు.

ఆ దేశంలో ఆడదేవతలని పూజిస్తారు.కాని ఆడది ఒంటరిగా దొరికితే రేప్ చెయ్యకుండా ఎవరూ ఊరుకోరు.

ఆ దేశంలో చాలామంది, స్త్రీని పిలవడం వరకూ 'అమ్మా' అనే పిలుస్తారు.కాని చూపులు మాత్రం అదో రకంగా చూస్తుంటారు.

అక్కడ ప్రతి ఇంట్లోనూ పవిత్ర గ్రంధాలుంటాయి.అవి చాలామందికి కంఠస్థం వచ్చుకూడా.కాని వాటిలో ఉన్నవాటిని మాత్రం ఎవడూ పాటించడు.

ప్రతి అవకాశాన్నీ దేశసంపదను దోపిడీ చెయ్యడానికే ఆ దేశప్రజలు ఉపయోగించుకుంటారు.కదిలిస్తే మాత్రం భలే నీతులు చెబుతారు.

అక్కడ ఎవరికీ స్థిరమైన నీతులు ఉండవు.ఉన్న ఒక్క నీతీ 'డబ్బు' మాత్రమే.

'ఎలా సంపాదించావు?' అని ఎవ్వడూ అడగడు.'ఎంత సంపాదించావు?' అని అడుగుతారు.'ఇంత తక్కువ సంపాదించావేంటి చేతకాదా?' అనికూడా అడుగుతారు.

అక్కడ ప్రతి ఐదేళ్లకూ ఒకసారి ఎన్నికలనే ప్రహసనాలు జరుగుతాయి. రాబోయే అయిదేళ్ళవరకూ రాజ్యాంగబద్ధంగా దోచుకునేవారిని వాటిలో ఎన్నుకుంటారు.

అవకాశం వచ్చినవారు ఇక విజ్రుంభిస్తారు.అవకాశం రానివారు వచ్చిన వారిపైన బురద చల్లుతూ ఆ అయిదేళ్ళు ఎప్పుడు గడుస్తాయా అని ఎదురుచూస్తూ ఉంటారు.

అవినీతి అన్న పదానికి ఆ దేశంలో అర్ధమే లేదు.ఎందుకంటే అది తప్ప ఎక్కడ చూచినా ఆదేశంలో ఇంకేమీ కనిపించదు కాబట్టి.

నీతి అన్న మాటకు అక్కడ విలువే లేదు.ఎందుకంటే దానిని ఆ ప్రజలు ఎప్పుడో మరచిపోయారు గాబట్టి.

ఆ దేశానికి భలే సహనం ఉంది.ఎందుకంటే వేల ఏళ్ల నుంచీ దానిని ఎందరు దోచుకుంటున్నా కిమ్మనకుండా అలా భరిస్తూనే ఉంది నేటివరకూ.ఆ దోచుకునేవారు పరాయివారైనా తనవారైనా ఆ దేశానికి ఏమాత్రమూ భేదం లేదు.

దోపిడీకి యుగయుగాలుగా అలవాటు పడిపోయి,చివరికి ఎవ్వరూ తనను దోచుకోకపోతే తనకు ఏమీతోచని స్థితికి చేరుకుంది ఆ దేశం. 'ప్లీజ్ నన్ను దోచుకోరా?' అని అడుగుతూ ప్రతివారి వెంటా పడుతుంది.

కాస్త తెలివైన ప్రతివారూ ఆ దేశాన్ని వదిలిపోతున్నారు.తెలివి ఎక్కువైనవారు అక్కడే ఉండి దాన్ని దోచుకుంటున్నారు.లేదా దోపిడీ దారులకు సహకరిస్తున్నారు.లేదా ఏమీ చెయ్యలేక ఏడుస్తూ బ్రతుకుతున్నారు.

కొద్దో గొప్పో దేశభక్తి ఉన్నవాళ్ళు ఏదో మంచి మార్పు రాకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.ఎదురుచూస్తున్నారు గానీ వాళ్ళ ఆశమీద వాళ్ళకే నమ్మకం లేదు.ఎందుకంటే ఎవరిని ఎన్నుకోవాలో వారికే అర్ధం కావడం లేదు.

ఎక్కువ శాతం దొంగలే ఉన్న ఆ దేశంలో,దొరల పాలన ఎవ్వరికీ ఇష్టం లేదు.దొరలే వస్తే అందరి దొంగతనాలూ బయటపడతాయని వాళ్ళ భయం. అదే సమయంలో,తాము దొంగలమని ఒప్పుకోడానికి అక్కడి గజదొంగలతో సహా ఎవ్వరూ సిద్ధంగా లేరు.అక్కడ దొంగలందరూ ఎదుటివారినే 'దొంగ దొంగ' అని వేలెత్తి చూపిస్తారు.

పాపం ఆ పిచ్చిదేశాన్ని ఎవ్వరూ రక్షించలేరు.ఒక్క దేవుడే ఆ దేశాన్ని రక్షించాలి--ఆ దేశ ప్రజలనుండి.