Pages - Menu

Pages

24, ఏప్రిల్ 2014, గురువారం

కృతజ్ఞత-దైవత్వానికి తొలిమెట్టు

మనం ఎవరినుంచైనా ఒక సహాయం పొందితే 'ధాంక్స్' అని వారికి చెప్పాలని ఒక పధ్ధతి మనం పాటిస్తాం.మన పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉంటాం.కాని ఆ 'ధాంక్స్' అనేది పెదవులనుంచి కాకుండా హృదయపు లోతుల లోనుంచి రావాలన్న విషయాన్ని మాత్రం విస్మరిస్తుంటాం.అసలు హృదయం అనేది ఒకటున్నదనీ దానికి స్పందన అనేది ఒకటి ఉంటుందనీ నవీన నాగరికతా ప్రభావంతో,మితిమీరిన స్వార్ధపరతతో, మనం పూర్తిగా మర్చిపోయాం.

'ధాంక్స్' చెప్పడం అనేది ఒక మొక్కుబడిగా,ఒక జీవరహితమైన తంతుగా మనకు అలవాటైంది.హృదయపూర్వకంగా కృతజ్ఞతను వెల్లడించడం అనేదాన్ని మనం పూర్తిగా మర్చిపోయాం.మన హృదయాలు జీవరహితములుగా తయారవ్వడమే దీనికి కారణం.

అతి ప్రాచీనకాలంలో మానవుడు ఇలా ఉండేవాడు కాడు.అతడు ప్రాధమికంగా కృతజ్ఞతతో నిండి ఉండేవాడు.ఎందుకంటే అతను ఈ లోకంలోకి ఒక ఒంటరి యాత్రీకుడిగా వచ్చాడు.ప్రకృతిలోని నీరూ గాలీ భూమీ ఆకాశమూ సూర్యుని వెలుగూ అతన్ని రక్షిస్తున్నాయని అతనికి స్పృహ ఉండేది.వాటి ఆధారంతోనే తాను బ్రతుకుతున్నాననీ మనుగడ సాగిస్తున్నాననీ అతను గ్రహించాడు.ఇందులో తన గొప్పా అహమూ ఏమీ లేవన్న సత్యాన్ని అతను గ్రహించాడు.కనుక వాటికి కృతజ్ఞుడై ఉండేవాడు.వాటిని ఆరాధనాభావంతో దర్శించేవాడు.

వేదకాలంలో ఉద్భవించిన మంత్రాలూ సూక్తాలూ అతను పొందిన ఈ సత్యమైన భావనకూ అతని ఈ అనుభవానికీ తద్వారా అతని హృదయంలో ఉప్పొంగిన కృతజ్ఞతకూ ప్రతిరూపాలే.

ఉదాహరణకు వేదంలోని 'భూసూక్తం' విషయాన్ని చూద్దాం. భూమినుంచే మనకు అవసరమైన సమస్తమూ వస్తున్నది.మనం తినే తిండిని భూమే మనకు ఇస్తున్నది.మనకు ఆధారంగా మన ఇళ్ళకు ఆధారంగా భూమే మనలను మోస్తున్నది.మనం విసర్జించిన మలమూత్రాలను అన్నింటినీ భరిస్తున్నది.మనకు అనేక ఖనిజాలనూ ఔషధాలనూ ఇస్తున్నది.చివరకు మనం పోతే మనల్ని తనలో కలుపుకుంటున్నది.మనల్నే కాదు మనలను కన్నతల్లులనూ వారి తల్లులనూ కూడా ఈ భూమే వారు బ్రతికున్నన్ని రోజులూ పోషించింది.చివరకు తనలోనే వారికి  విశ్రాంతినిచ్చింది.

మరి అటువంటి భూమిని దేవతగా భావిస్తే తప్పేమిటి?తల్లిగా పూజిస్తే తప్పేమిటి?పూజిస్తే తప్పుకాదు.పూజించకపోవడం ఘోరమైన తప్పు. జీవితాంతం ఒక ఉపయోగాన్ని ఒకరినుంచి పొంది వారిపట్ల కనీస కృతజ్ఞత లేకుండా ఉంటే ఆ మనిషిని ఏమనాలి?అసలు మానవుడు అన్న పదానికి అతను అర్హుడేనా?ఖచ్చితంగా అతన్ని మానవుడు అని పిలవలేం.

ఈ ఉదాత్తమైన భావన నుంచే వేదంలోని భూసూక్తం ఉద్భవించింది. భూసూక్తం ఒక్కటే కాదు.సమస్త వేదం అంతా ఇలాంటి ఉదాత్తమైన ఉన్నతమైన భావనల మంత్రపూరిత సమాహారమే.

ప్రాచీన మానవుడు పంచభూతాలలో దైవాన్ని దర్శించాడు.పుట్టిన క్షణం నుంచీ పోయేవరకూ తనను పోషిస్తున్న ఆ పంచభూతాలలో దైవశక్తిని దర్శించిన అతని హృదయంలో నుంచి ఉప్పొంగిన కృతజ్ఞతా భావాలే ఈ సూక్తాలు.ఎందుకంటే ప్రకృతి తనకిస్తున్న ఈ సౌకర్యాలను తన స్వశక్తితో తాను సంపాదించలేదని అతనికి తెలుసు.అవి దైవంనుంచి తనకు నిష్కారణంగా వచ్చిన వరాలని అతనికి తెలుసు.తనకు అర్హత లేకపోయినా దైవం వాటిని తనకు ఇచ్చిందనీ,వాటి రూపంలో దైవమే తనను పోషిస్తున్నదనీ అతనికి స్పృహ ఉన్నది. దైవప్రేమకు ఇదే సూచన అనీ అతనికి అర్ధమైంది.కనుకనే ఆ శక్తులను దైవంగా అతను ఆరాధించేవాడు.

నవీన మానవుడిలో ఈ హృదయ స్పందన లోపించింది.దానికి కారణాలు అనేకం.నవీన జీవనవిధానం ఒక కారణమైతే,మితిమీరిపోతున్న స్వార్ధపరత ఇంకొక కారణం.ఎంతసేపూ ఎదుటివాడిని ఎలా వాడుకోవాలి?ప్రకృతిని ఎలా వాడుకోవాలి?మనుషులను ఎలా వాడుకోవాలి?మన అవసరానికీ స్వార్ధానికీ ఎదుటివారు ఎలా ఉపయోగపడతారు?ఎంతవరకూ ఉపయోగపడతారు?ఆ తర్వాత వారిని ఎలా వదిలించుకోవాలి?అన్న భావజాలం నరనరానా జీర్ణించుకుపోవడమూ,నవీన నాగరికసమాజం కూడా అలాంటివారినే 'సక్సెస్ ఫుల్ వ్యక్తులు'గా గుర్తించి గౌరవించడమూ వల్ల ఇదే భావజాలం సమాజంలో అందరిలో పాతుకుపోతున్నది.దీనివల్లనే అంతా సర్వనాశనం అవుతున్నది.

దేనినైనా సరే 'వాడుకోవడం-వదిలెయ్యడం' మాత్రమే నవీన మానవుడు నేర్చుకుంటున్న విద్య.దీనినే 'మేనేజిమెంట్ టెక్నిక్' అని భావిస్తూ ఉద్యోగులకూ భావి ఉద్యోగులకూ వ్యాపారవేత్తలకూ కూడా ఇదే భావజాలాన్ని కాలేజీలు పెట్టి మరీ నూరిపోస్తున్నారు.ఈ క్రమంలో మానవుడు 'కృతజ్ఞత' అనే భావానికి దూరమై చివరికి పూర్తిగా పశువుగా మారిపోతున్నాడు.

నవీన కాలంలో గురుశిష్యుల బంధాలూ దీనివల్లనే కలుషితం అవుతున్నాయి. సోకాల్డ్ మోడరన్ గురువులూ తమ శిష్యులను ఏదో విధంగా వాడుకోవాలని చూస్తున్నారు.శిష్యులు కూడా తమతమ స్వార్ధపూరిత కోరికలు తీరడం కోసమే ఆయా గురువులను దగ్గరౌతున్నారు.తమ కోరికలు తీర్చే మార్గాలు చెప్పినంతసేపూ ఆ గురువుకు భజన చెయ్యడం,అలా కుదరని మరుక్షణం అతన్ని వదిలేసి ఇంకొ గురువువెంట పరిగెట్టడం సర్వసాధారణంగా మనం ఈనాడు చూస్తున్నాం.కనీసం కృతజ్ఞతాభావం కూడా నేటి సోకాల్డ్ శిష్యులలో ఉండటం లేదు.అందుకే నిజమైన గురువులూ శిష్యులూ ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు.స్వార్ధం అనే బంధంతో ముడిపడిన ఉపన్యాసకులూ శ్రోతలూ మాత్రం ప్రతిచోటా గుంపులుగా దర్శనమిస్తున్నారు.

మనిషి ఎంతో మేధావినని భావిస్తాడు.ఎంతో ఆలోచనా శక్తీ పరిశీలనా శక్తీ ఉన్నవాడినని విర్రవీగుతాడు.కాని తనను పోషిస్తున్న నేలపట్లా, గాలిపట్లా, నీరుపట్లా,ఆకాశం పట్లా,సూర్యుని పట్లా,చంద్రుని పట్లా,నక్షత్రసమూహాల పట్లా కృతజ్ఞత కలిగి ఉండాలని అతనికి తోచదు.ఒకవేళ ఎవరైనా ఈ భావాన్ని చెప్పినా అతన్ని ఒక వెర్రివాడిలా చూస్తాడు.

కనిపించని దైవం పట్ల విశ్వాసం ఉండకపోతే కొంత అర్ధం చేసుకోగలం.కాని అనునిత్యమూ మన చుట్టూ కనిపిస్తూ మనల్ని రక్షిస్తున్న శక్తులపట్ల కనీస కృతజ్ఞత లేనివారిని మానవులని పిలవాలో పశువులని పిలవాలో అర్ధంకాదు.తనకు అన్నం పెట్టిన వ్యక్తిపైన పశువుకైనా కొంత కృతజ్ఞత ఉంటుంది.నవీన మానవుడికి అది కూడా లోపించింది.

ఈ సున్నితత్వాన్ని మానవుడు కోల్పోవడానికి ప్రధానమైన కారణాలు ఏమంటే అహంకారమూ స్వార్ధమూ మాత్రమె. ఏది జరిగినా తన గొప్ప వల్లనే జరుగుతున్నాయన్న అహంభావమే మానవుని వినాశనానికి ప్రధానమైన కారణం.ప్రతిదానినీ తన స్వార్ధానికి వాడుకోవాలని చూడటమే మానవుని పతనానికి మూలకారణం.ఇక్కడే మానవుడు దైవశక్తిని విస్మరిస్తున్నాడు. అహానికి బానిసగా మిగిలిపోతున్నాడు.చివరకు ఒక వికృతజీవిగా తేలుతున్నాడు.

కృతజ్ఞత మాట అలా ఉంచి,అందరికోసం సృష్టించబడిన పంచభూతాలను ఒక్కరో లేక కొందరో పూర్తిగా స్వంతం చేసుకోవాలని చూడటమూ దానిమీద వ్యాపారాలు చెయ్యాలని చూడటమూ ప్రకృతిదృష్టిలో మహా ఘోరమైన అపరాధాలు.అటువంటి మనుషులనే 'రాక్షసులు' అని పూర్వకాలంలో అనేవారు.పూర్వకాలంలో రాక్షసులు కూడా తపస్సు చేసేవారు.దైవారాధన చేసేవారు.ఈరోజులలో కూడా భూబకాసురులూ,దేశ సంపదను కొల్లగొట్టే హిరణ్యాక్షులూ,తమ స్థాయిని ఉపయోగించుకుని కనిపించిన ప్రతివారినీ చెరిచే రావణాసురులూ కోకొల్లలుగా ఉన్నారు.వీరంతా దైవద్రోహులు. కృతఘ్నులు.వీరే నవీనకాలపు రాక్షసులు.మళ్ళీ వీరందరూ వారివారి దైవాలకు మహాభక్తులే.అదే వింతల్లో వింత.రాక్షసులు కూడా దైవభక్తులు అవడమంటే ఇదే.

నా పూర్వజన్మ సుకృతంవల్ల నా చిన్నప్పుడు నేనొక మహనీయుని దర్శించాను.ఆయన నేటి స్వామీజీలవలె 'కాపీ క్యాట్' కాదు.ఫైవ్ స్టార్ హోటళ్ళలో యోగాక్లాసులు పెట్టి ఉపన్యాసాలిచ్చే వ్యాపారసాధువు కాదు.శక్తి లేకపోయినా శక్తిపాతం చేస్తానని ప్రగల్భాలు పలికే అశక్తుడూ కాదు.నలభై రోజుల్లో దైవాన్ని చూపిస్తామంటూ నేడు ప్రచారం చేసుకునే దొంగస్వామీజీల వంటి స్వామీ కాదు.రాజకీయాలనూ,అధికారపు అహంకారాలనూ, ధనమదాన్నీ,ఆడంబరపు కుళ్ళునీ,ప్రపంచపు వ్యామోహాలనూ ఆయన అసహ్యించుకునేవారు.

ఆజన్మ బ్రహ్మచారిగా,తాను బ్రతికిన 86 ఏళ్ళూ నిస్వార్ధంగా నిరాడంబరంగా జీవిస్తూ నిరంతర దైవధ్యానంలో తపస్సులో జీవించిన ధన్యాత్ముడాయన. మానవ జీవితపు పాపపంకిలం సోకని పవిత్రజీవితం ఆయనది.

ఒకరోజు,ఎవరూ లేని సమయంలో ఆయన ఒక్కరే కూర్చుని మౌనంగా ప్రకృతిని వీక్షిస్తూ కన్నీరు కార్చడం నేను చూచాను.అటువంటి సున్నితమైన అంశాలను ప్రశ్నించడమూ,'ఏమైంది?ఎందుకు ఏడుస్తున్నారు?'అని అడగటమూ సభ్యత కాదు గనుక నేనేమీ మాట్లాడకుండా మౌనంగా ఆయన సన్నిధిలో కూర్చుని ఉన్నాను.

కొద్దిసేపటి మౌనం తర్వాత ఆయనే మెల్లిగా ఇలా అన్నారు.

'చూడు.మనకు ఏమాత్రం అర్హత లేకున్నా దైవం ఎన్ని వరాలను మనకిచ్చిందో?పీల్చడానికి గాలినిచ్చింది.గాలే లేకుంటే రెండు నిముషాలకంటే మనం బ్రతకం.త్రాగటానికి నీటినిచ్చింది.తినడానికి తిండినిచ్చింది.కానీ మనం ఈ భూమికి ఎందుకొచ్చామో మనం మరచిపోయాం.భోగలాలసతకు అలవాటు పడ్డాం.అయినా సరే,దైవం నొచ్చుకోకుండా మన తప్పులను ప్రతిరోజూ క్షమిస్తూనే ఉన్నది.ఈ వరాలను కొనసాగిస్తూనే ఉన్నది.అసలు బ్రతకడానికీ ఊపిరి పీల్చడానికీ మనకేమి అర్హత ఉన్నది?ఇన్ని వరాలను పొందటానికి మనకేమి అర్హత ఉన్నది?దైవం యొక్క ఈ నిష్కారణమైన కరుణను స్మరించినప్పుడు నా గుండెలో కదిలిన కృతజ్ఞత ఇలా కన్నీటి రూపంలో పొంగి ఆయన పాదాలను అభిషేకిస్తూ ఉంటుంది'

ఎంతటి స్వచ్చమైన మనసు?ఎంతటి నిస్వార్ధమైన మనసు?ఎంత సున్నితమైన పసిమనసు?

నా కళ్ళలోనూ గిర్రున నీళ్ళు తిరిగాయి.అప్రయత్నంగా వంగి ఆ వృద్ధుని పాదాలను స్పర్శించకుండా నేను ఉండలేకపోయాను.నిజమైన దైవత్వం అంటే ఏమిటో నేను ఆరోజు అర్ధం చేసుకున్నాను.

అదీ అసలైన దైవత్వం!!

గుడులూ గోపురాలూ తిరగటం దైవత్వం కాదు.పూజలూ పునస్కారాలూ చెయ్యడం దైవత్వం కాదు.జపాలూ ధ్యానాలూ చెయ్యడం దైవత్వం కాదు.స్వచ్చమైన నిష్కల్మషమైన నిస్వార్ధమైన కృతజ్ఞతాపూర్వకమైన పసిమనసు కలిగి ఉండటమే నిజమైన దైవత్వం.

నిష్కారణంగా దైవం మనపైన కురిపిస్తున్న వరాలను గ్రహించి కృతజ్ఞతతో హృదయం ఉప్పొంగడమే నిజమైన దైవత్వం.అలాటి వారి హృదయంలో దైవం నిత్యం కొలువై ఉంటుంది.వారు పిలిస్తే దైవం పలుకుతుంది.అలా పలకడం నేనెన్నో సార్లు ప్రత్యక్షంగా దర్శించాను.

మనం కోరిన పనులు జరిగినప్పుడు మొక్కులు చెల్లించడం ఆస్తికత్వం కాదు.'నేనడిగింది ఇస్తే నీకిది ఇస్తాను' అంటూ దేవుడితో అనైతిక వ్యాపారం చెయ్యడం భక్తీ కాదు.

ఏపనీ జరగనప్పుడు కూడా,జీవితంలో అన్నీ నీకు ఎదురు తిరుగుతున్నపుడు కూడా,నీ జీవితమే నీకు అగమ్యగోచరం అయినప్పుడు కూడా,దైవంపట్ల కృతజ్ఞతతో నీ హృదయం నిండి ఉప్పొంగిపోవడమే నిజమైన ఆస్తికత్వం.

గుళ్ళోని విగ్రహంలో మాత్రమె కాకుండా నీ చుట్టూ ఉన్న ప్రకృతిలో కూడా దైవాన్ని దర్శించగలగడమే నిజమైన ఆస్తికత్వం.ప్రకృతిపట్లా,దైవం పట్లా నిష్కారణమైన కృతజ్ఞతా స్పందన నీ గుండెలోతులలో నిరంతరమూ కదలాడటమే నిజమైన ఆస్తికత్వం.

అదే నిజమైన దైవత్వానికి తొలిమెట్టు.