నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

25, ఏప్రిల్ 2014, శుక్రవారం

దేనికైనా రెడీ


గుంటూరు డివిజన్ రైల్వే వీక్ వారోత్సవాలలో భాగంగా ఒక మంచిడ్రామా వేద్దామని అనుకున్నాం.ఒక సమకాలీన సమస్యకు హాస్యాన్ని రంగరించి డ్రామాను వ్రాసుకుంటే బాగుంటుందని భావించి --ఆడపిల్లల భ్రూణహత్యల వల్ల సమాజంలో ఆడామగా నిష్పత్తిలో తేడా రావడమూ.దానివల్ల ఆడపిల్లలు తగ్గిపోయి,మగపిల్లలు ఎక్కువై పోయి,మగపిల్లలకు పెళ్ళిళ్ళు కాక,కన్యాశుల్కం ఇచ్చుకుని అమ్మాయిలను పెళ్ళిచేసుకునే రోజులు సమాజంలో మళ్ళీ వస్తున్న డేంజర్ సిగ్నల్స్ ను దృష్టిలో ఉంచుకుని--ఒక డ్రామాను వ్రాసుకున్నాము.

దానిపేరే 'దేనికైనా రెడీ'.

మొదట్లో ఈ నాటిక పేరు 'బంధాలు-సంబంధాలు' అనుకున్నాం.కాని ఈ పేరు మరీ పాతచింతకాయ పచ్చడిలా ఉన్నదని భావించి ఇలా మార్చాం. 

ఈ డ్రామా వ్రాసింది మిత్రుడు ప్రసాద్.ఐడియాలు అందించింది మిత్రుడు వెంకట్రామ శాస్త్రి.రిహాల్సల్స్ సందర్భంగా స్క్రిప్ట్ ను రకరకాల మార్పులు చేసి దానిని ఒక పరిపూర్ణత్వాన్ని తెచ్చింది నేను,సహోద్యోగులు వెంకటరామశాస్త్రి, సత్యగోపాల్,ఉమామహేశ్వర్ మొదలైనవారు.

ఇందులో అయిదు పాత్రలుంటాయి.

ఈశ్వర్రావ్
ఇతను రిటైర్డ్ రైల్వే స్టేషన్ మాస్టర్.మొదటి సంతానంగా అమ్మాయి పుట్టాక ఇక పిల్లలు చాలనుకుని ఆమెను చక్కగా పెంచి పెద్దచేసి పెళ్ళిచేసి రిటైరై హాయిగా జీవితం గడుపుతూ ఉన్న వ్యక్తి.మంచి కామెడీ డైలాగులతో డ్రామాను నడిపిస్తూ చివరలో సమాజానికి సందేశాన్ని ఇచ్చే పాత్ర.ఈ పాత్రను నేను ధరించాను.

గిరిధర్
ఇతను ఈశ్వర్రావ్ మిత్రుడు.పెద్ద సివిల్ కాంట్రాక్టర్.తన ఇద్దరు అబ్బాయిలకూ పెళ్ళిళ్ళు చెయ్యాలని నానా ప్రయత్నాలూ చేస్తూ కుదరక ఏదైనా సంబంధాలు ఉన్నాయేమో అని వెదుకుతూ మిత్రుడు ఈశ్వర్రావ్ వద్దకు వస్తాడు.డ్రామా రచయిత ప్రసాద్ ఈ వేషం ధరించాడు.

గోపాలం
ఇతను ఈశ్వర్రావ్ మేనల్లుడు.చదువు మానేసి ఉద్యోగంలో చేరాడు. ప్రభుత్వోద్యోగం కావడం వల్ల ఏ అమ్మాయీ ఇతన్ని పెళ్ళి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు.అమ్మాయిలందరూ సాఫ్ట్ వేర్ అబ్బాయిలే కావాలని అంటున్నారు.కనుక వయస్సు మీదపడుతూ పెళ్ళికాని ప్రసాద్ గా మిగిలిపోతున్న స్థితిలో ఉన్నాడు.మేనమామ ఈశ్వర్రావ్ ఇతనికి సంబంధాలు చూస్తున్నాడు.బాగా కామెడీ పండించడానికి అవకాశం ఉన్న పాత్ర ఇది.ఈ పాత్రను మిత్రుడు సత్యగోపాల్ ధరించాడు.ఏ సంబంధం ఒచ్చినా చేసుకోడానికి రెడీ అయ్యే పాత్ర ఇది.నాటిక టైటిల్ ఇదే.

బ్రోకర్ భుజంగం
ఇతను ఒక పెళ్ళిళ్ళ పేరయ్య.ఇప్పటి భాషలో మేరేజి బ్యూరో నడుపుతున్న వ్యక్తి.ఇతని దగ్గరికి పెళ్ళి సంబంధాల కోసం మిగిలిన పాత్రలు అందరూ వస్తారు. ఇది కూడా బాగా కామెడీ పండించే పాత్రే.దీనిని మిత్రుడు వెంకటరామశాస్త్రి ధరించాడు.

ప్రసాద రావ్
ఇతని పెద్ద కూతురుకి ఒక సంబంధాన్ని బ్రోకర్ భుజంగం కుదురుస్తాడు. అబ్బాయి అమెరికాలో సాఫ్ట్ వేర్ కంపెనీలో పెద్ద CEO అని చెప్పి పెళ్ళి చేస్తాడు.కాని పెళ్ళైన ఆర్నెల్లు తిరగకుండా ఆ పెళ్ళికొడుకు పెద్ద వ్యసనపరుడనీ,ఇప్పటికే అక్కడ ఇంకా కొంతమందితో సంబంధాలు ఉన్నాయనీ తెలుస్తుంది.కట్నం చాలక ఇంకా 25 లక్షలు తెమ్మని అమ్మాయిని హింసిస్తూ ఉంటాడు.ఈ పరిస్తితిలో బ్రోకర్ భుజంగంతో గొడవ పెట్టుకోవడానికి అతని ఆఫీస్ కి వస్తాడు ప్రసాదరావ్.పాత్ర నిడివి చిన్నదైనా మంచి ఆవేశమైన డైలాగ్స్ ఉన్న పాత్ర.దీనిని మిత్రుడు ఉమామహేశ్వర్ ధరించాడు. విఫలమౌతున్న విదేశీ సాఫ్ట్ వేర్ సంబంధాలను ఎత్తిచూపే పాత్ర ఇది.

పుట్టింది అమ్మాయైనా అబ్బాయైనా వారిని సమభావంతో పెంచి పెద్దచేసి, మంచి విద్యాబుద్ధులు నేర్పి,ఉన్నత స్థానానికి వారు ఎదిగేలా చెయ్యాలనీ, వివక్ష పనికిరాదనీ,కడుపులో ఉన్నది అమ్మాయని తెలిసి ఎబార్షన్ చేయించడం చాలా ఘోరమైన తప్పనీ,నేరమనీ,అత్తగారింట్లో అమ్మాయిని హింసించడం తగదనీ,భార్యాభర్తల సంబంధం కలకాలం చల్లగా ఉండాలంటే ముఖ్యంగా కావలసింది వారిమధ్యన అవగాహన అనీ,చదువుకున్న అమ్మాయిలకు అహంకారం పనికిరాదనీ దానివల్ల ఈగో సమస్యలు తలెత్తి వివాహాలు విడాకులకు దారి తీస్తున్నాయనీ,వివాహానికి ముఖ్యంగా కావలసింది డబ్బూ స్టేటస్సులు కాదనీ.ఒకరినొకరు అర్ధం చేసుకునే మనస్తత్వం ప్రధానమనీ,ప్రతివారూ సమాజం మారాలి అంటారుగాని ఆ మార్పు అనేది ముందుగా తమనుంచి మొదలుకావాలన్న సందేశంతో నాటిక ముగుస్తుంది.

డ్రామా బాగా రక్తి కట్టింది.ప్రేక్షకులలో నవ్వుల పువ్వులు విపరీతంగా పూయించింది.చివరిలో ఈశ్వర్రావ్ పాత్ర ఇచ్చిన సందేశం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని వారిని ఆలోచింపజేసింది.

ఇదే నాటికను సికింద్రాబాద్ లో ఏప్రియల్ 15 న జరిగిన జోనల్ రైల్వే వీక్ ఉత్సవాలలో కూడా ప్రదర్శించడం జరిగింది.తీసుకున్నది బర్నింగ్ టాపిక్ కావడంతో అక్కడ కూడా ఈ నాటిక విజయవంతమై ప్రేక్షకుల ప్రశంసలను పొందగలిగింది.

ప్రస్తుత సమాజానికి మంచి సందేశాత్మకమైన ఈ నాటికను ఎవరైనా ఔత్సాహికులు ప్రదర్శించాలని భావిస్తే వారికి స్క్రిప్ట్ పంపించడానికీ,డైరెక్షన్ మొదలైన ఇతర సహాయం అందించడానికీ మేము సిద్ధంగా ఉన్నాము.