Pages - Menu

Pages

28, ఏప్రిల్ 2014, సోమవారం

అసమర్ధుని ఆధ్యాత్మిక యాత్ర

ఉన్న జీవితం మీద అసంతృప్తి
ఇంకేదో పొందాలన్న అమితాసక్తి
అంతులేని సంఘర్షణలో 
అనుక్షణం కరిగిపోతుంది కాలం

కళ్ళతో పిలుస్తాయి సుదూర తీరాలు
కాళ్ళను కట్టేస్తాయి మాయామోహాలు
రేవును వదలకుండా 
నావ పయనం ఎలాసాధ్యం?
పూవు వికసించకుండా
సుగంధపు పరిమళం ఎలాసాధ్యం?

వదలనంటుంది వెలిసిన ప్రస్తుతం
అందనంటుంది వెలుపలి ఆశయం
ఎటూ తేల్చుకోలేని ఎదురుచూపులలో
ఎగశ్వాసగా మిగులుతుంది 
ఎల్లలెరుగని శూన్యం

అడుగును వెయ్యాలంటే అమిత భయం
ఆశను చంపుకోవాలంటే తగని అహం
ముందూ వెనుకల ముసుగులాటలో
అంతులేని ద్వైదీభావంలో
ఆవిరై పోతుంది జీవితం

సత్యాన్ని ఒప్పుకోవాలంటే సంకోచం
అసత్యాల నీడలతో వీడని సహవాసం
నిత్యకృత్యంగా మారిన అసహనం
తెరుచుకోని ముత్యపు చిప్పకెందుకో 
ప్రవాళసృష్టిపై ఇంతటి ఆరాటం?

నీడలోని చీకటిని వీడలేని అశక్తత
ఎండవెలుగుకు తాళలేని అసమర్ధత
సందిగ్దపు సమరంలో నిరంతర పోరాటం
చీకటి వెలుగుల సంధ్యలలో 
చిరకాలపు ఒంటరి ప్రయాణం

నీలాకాశంలో మేఘంగా ఎగరాలని ఆవేశం
కాళ్ళకంటిన బురదను కడుక్కోలేని ఆక్రోశం
అలసిపోయి సొలసిపోయి
దిగంతాల తీరాలకు
ఎగిరిపోయే ఆత్మవిహంగం

లోని సంకెళ్ళను తెంచుకోకుంటే
సహవాసపు రుచి దక్కదు నేస్తం
మనసు వాకిళ్ళను మూసుకునే ఉంటె
ఇహలోకపు గతి తప్పదు నేస్తం

కళ్ళూ చెవులూ నోరూ పనిచేస్తూనే ఉంటే
ఆధ్యాత్మికమెలా దక్కుతుంది?
ఒళ్ళు మరచి నీ బైటకి నీవు దూకకుంటే
ఆత్మాశ్రయమెలా చిక్కుతుంది?

లోకంలో సమర్ధుడవైతే ఉపయోగం లేదోయ్
శోకాన్ని దాటే మార్గం తెలీనంతవరకు
కూపమే మహాసంద్రమని అనిపిస్తుందోయ్
లోకపు కోటను వీడి పోనంతవరకు

నాటకాలు కట్టిపెట్టి నాణ్యంగా నడవవోయ్
పూటకొక్క వేషమేస్తే పుట్టగతులు కష్టమోయ్
మోసాన్నే వీడనంటె మోక్షం లభియించదోయ్
మోహాలను గెలవకుంటె మోదం వికసించదోయ్

అంతులేని పయనంలో అడుగడుగూ కష్టమోయ్
వింతదైన లోకంలో పడిలేవడమెందుకోయ్
నిన్ను నీవు నమ్ముకుంటె నీవే గుదిబండవోయ్ 
నిన్ను నీవు నమ్మకుంటె ముందడుగే కుదరదోయ్  

అసమర్ధుని ఆధ్యాత్మిక యాత్రలో
అనుక్షణమూ నరకమోయ్
ఆశ వలకు లోబడితే
అగచాట్ల విలాపమోయ్

తన్ను తాను గెలవకుంటే తాత్పర్యం దక్కదోయ్
మిన్ను వైపు కెగరకుంటే మిత్తి నిన్ను వదలదోయ్
కన్ను మూసి తెరుచులోపు కాలం కబళించునోయ్
నిన్ను నీవు పొందకుంటే నీ బ్రతుకే శూన్యమోయ్