నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

30, ఏప్రిల్ 2014, బుధవారం

బ్రతుకు కల

నీ వాకిట నిలుచుని ఉన్నా
నా భుజం మీదనుంచే ఎక్కడో చూస్తున్నావు
నాకోసం

నీ తలుపు తడుతూ ఉన్నా
తలుపు తీయకుండా వేచి ఉన్నావు 
నా కోసం

నీ ఎదురుగా నేనుంటే
ఇల్లంతా తిరుగుతున్నావు
నాకోసం

నీ ఊపిరిలో చలనంగా నేనున్నా
ఆ సవ్వడి ఎక్కడిదా అని వెతుకుతున్నావు
నాకోసం

నీ నీడగా నేనొస్తుంటే
తలతిప్పి నావైపు చూడటానికి
నీకెందుకో ఇంత భయం?

అనుక్షణం అందిస్తున్న
స్నేహహస్తాన్ని అందుకోవడానికి
నీకెందుకో ఇంత సంకోచం?

అమృతం ఎదురుగా ఉంటే
అగాధాలలో జలం కోసం వెదుకుతున్నావు
ముంగిట నేనే నిలుచుని ఉంటే
ముల్లోకాలూ నాకోసం గాలిస్తున్నావు

నాకోసం తిరుగుతూ
నన్నే నమ్మలేకున్నావు
అసలు నీకేం కావాలో
నీవే తెలుసుకోలేకున్నావు

నీ భయాలను వీడక పోతే
కాలం కళ్ళముందే మరుగౌతుంది
నీ అహాన్ని వదలకపోతే
జీవితం నీడలవెంట పరుగౌతుంది

ఎదురుచూపులా ఆపలేవు
ఎదుట నిలిస్తే తాకలేవు
నిన్ను నీవెప్పటికీ గెలవలేవు
నన్ను నన్నుగానేమో కలవలేవు

నువ్వు నువ్వుగానే ఉంటే
నన్ను కలుసుకోలేవు
నిన్ను నీవు వదలకుంటే
నన్ను గెలుచుకోలేవు

నిన్ను నీవు గెలవనిదే
అనుసరించలేవు నన్నెప్పటికీ
నన్ను అనుసరించనిదే
తెలుసుకోలేవు నిన్నెప్పటికీ

సముద్రంలో కరగకపోతే
అల అలగానే మిగులుతుంది
సమత్వంలో నిలవకపోతే
బ్రతుకు కలగానే ముగుస్తుంది