Pages - Menu

Pages

11, మే 2014, ఆదివారం

ఎవరో అడిగారు

ఎవరో అడిగారు
సంధ్యావందనం ఎందుకు మానేశావు?
'సంధ్య నాలోనే ఉంది.ఇంక దేనికి వందనం చెయ్యాలి?' అన్నాను.

ఎవరో అడిగారు
పూజలు ఎందుకు చెయ్యవు?
'ఎవరికి చెయ్యాలి?' అన్నాను.

ఎవరో అడిగారు.
గుడికి ఎందుకు వెళ్ళవు?
'విడిగా గుడి ఎక్కడుంది?'అన్నాను.

ఎవరో అడిగారు,
దైవాన్ని ఎందుకు పూజించవు?
'ప్రత్యేకంగా ఎలా పూజించాలి?' అడిగాను.

ఎవరో అడిగారు 
నీవు నాస్తికుడవా?
'నీ దృష్టిలో కావచ్చు'అన్నాను.

ఎవరో అడిగారు
అంతుబట్టవా?
'అంతువరకూ వస్తే పడతాను' చెప్పాను

ఎవరో అడిగారు
అర్ధం కావా?
'అర్ధంగా ఉన్నంతవరకూ కాను' చెప్పాను

ఎవరో అన్నారు
నీతో పెట్టుకుంటే పిచ్చెక్కడం ఖాయం.
'ఉన్న పిచ్చి వదలడం ఖాయం' అన్నాను.

ఎవరో అడిగారు
అసలేం చెప్పాలనుకుంటున్నావ్?
'మీరు మరచిపోయినది' అన్నాను.

ఎవరో అడిగారు.
అసలేం చెయ్యాలనుకుంటున్నావ్?
'నాతో మిమ్మల్ని తీసుకుపోదామనుకుంటున్నా' అన్నాను.

ఎవరో అడిగారు.
'ఎక్కడికి?'
'వెనక్కు తిరిగిరాని చోటికి' అన్నాను.

ఎవరో అడిగారు.
అసలేంటి నీ గోల?
'తెలుసుకోవాలని నీకెందుకంత దూల?' అన్నాను.