Pages - Menu

Pages

15, మే 2014, గురువారం

సత్యదర్శనం

మనిషి చేసే తప్పుల్లో మొదటిది ఉన్నదానిని ఉన్నట్లు చూడలేకపోవడం.ఈ సూత్రం లౌకికంలోనైనా ఆధ్యాత్మికంలోనైనా కరెక్ట్ గా వర్తిస్తుంది.ఇది చాలా కష్టమైన ప్రక్రియ.

రెండోది ఆ చూచినదానిని ఒప్పుకోలేకపోవడం.ఇది మరీ కష్టమైన ప్రక్రియ.దీనికి మన అహం అనేది చాలా తీవ్రంగా అడ్డొస్తుంది.

చాలామంది ఆధ్యాత్మిక ప్రేమికులు ఇక్కడే బోర్లా పడిపోతుంటారు.సత్యాన్ని గ్రహించలేక దారితప్పిపోతుంటారు.

మొదటిదానికి అడ్డంకులు మనం ఎప్పటినుంచో ఏర్పరచుకున్న భావాలు,అభిప్రాయాలు.వాటి అద్దాలలోనుంచే మనకు చూడటం అలవాటు అయ్యి ఉంటుంది.వాటిని దాటి చూడలేకపోవడమే ఆధ్యాత్మికంగా అసలైన అడ్డంకి.

ఆ చూచినదానిని స్వీకరించలేకపోవడం ఇంకొక పెద్ద అడ్డంకి.ఈ రెండవదానికి కారణం మనలో గూడుకట్టుకుని ఉన్న సంస్కారాలు.మన మనస్సును అవి ఆక్రమించి ఉండటంతో కొత్త దృక్పధానికి అక్కడ చోటు దొరకదు.కనుక సంస్కారాలు మారవు.సంస్కారాలు మారనిదే ఎంతటివారైనా ఆధ్యాత్మికంగా ఎదగడం సాధ్యంకాదు.అహం అనేది పక్కకు తోలగనిదే నిజమైన ఆధ్యాత్మికతను గుర్తించడం ఎవరికీ సాధ్యం కాదు.

ఆధ్యాత్మికత అంటే 'ఇదీ' అని మనకు కొన్ని భావాలు ఏర్పడి ఉంటాయి.ఆ భావాలకు ఆధారాలు మనం పెరిగిన పరిసరాలు,మనం చదివిన పుస్తకాలు,మనం కలిసిన చూచిన వ్యక్తులు.అయితే,ఆధ్యాత్మికత అనేది ఈ పరిధులకు మాత్రమే లోబడి ఉండదనీ,నిజానికి దానికి ఎల్లలు లేవనీ,మన ఊహలకూ అభిప్రాయాలకూ అది ఎంతో భిన్నంగానూ అతీతంగానూ ఉంటుందన్న విషయం చాలామంది గ్రహించలేరు.ఒప్పుకోలేరు.గ్రహించడానికి వాళ్ళ అభిప్రాయాలు అడ్దోస్తాయి.ఒప్పుకోడానికి వాళ్ళ అహం అడ్డొస్తుంది.ఇదే సోకాల్డ్ ఆధ్యాత్మికులు చేసే పెద్ద పొరపాటు.

నా వ్రాతలు చదివిన కొందరు నాతో కొన్నిరోజులు గడపాలని ఉత్సాహ పడుతుంటారు.కాని వాళ్లకు మొదట్లోనే తీవ్రమైన ఆశాభంగం కలుగుతూ ఉంటుంది.ఎందుకంటే వాళ్ళ ఊహలకు అనుగుణంగా నేను ఉండను.నటించను.నాకు ఎవ్వరి మెప్పూ గొప్పా అవసరం లేదు.నా పద్దతిలో నేనుంటాను.

నేనేదో మడి కట్టుకుని ఎప్పుడూ పూజలలో ధ్యానంలో ఉంటానని గడ్డం పెంచుకొని స్వామీజీలా ఉంటాననీ చాలామంది అనుకొని నావద్దకు వస్తుంటారు.కాని నా జీవితవిధానం వాళ్ళ ఊహలకు భిన్నంగా కనిపించడంతో వాళ్ళు నిరాశకు లోనై నాకు దూరమై పోతుంటారు.ఇది చాలాసార్లు జరిగింది.వారిని చూచి జాలితో నవ్వుకొని ఊరుకుంటాను.

నేను గత రెండు మూడేళ్ళనుంచి మాత్రమె ఇవన్నీ వ్రాస్తున్నాను.కానీ ఇంతకు చాలాకాలం ముందు నన్నెరిగిన కొందరు వ్యక్తులుకూడా ఇదే పని చేసేవారు.ఇలాగే వారూ ఆశాభంగానికి గురయ్యేవారు.

చిన్నప్పటినుంచీ నన్నెరిగిన ఒక వ్యక్తి ఉన్నాడు.చాలా చిన్నవయసులోనే నేను శ్రద్ధగా ధ్యానాభ్యాసం చెయ్యడం అతను అనేకసార్లు చూచాడు.ఆ తర్వాత నేను హైస్కూలు చదువు పూర్తిచేసుకుని కాలేజికి వెళ్ళడమూ అక్కడనుంచి ఉద్యోగంలో చేరడమూ మొదలైనవి జరిగిపోయాయి.ఈ మధ్యలో అతనికీ నాకూ కాంటాక్ట్స్ తగ్గిపోయాయి.అప్పట్లోనే అతను డిటెక్టివ్ పుస్తకాలు బాగా చదివేవాడు.

ఒక ఇరవై ఏళ్ళ తర్వాత అతను ఒకసారి నాకు ఫోన్ చేశాడు.

'నేనూ ఈ మధ్య ధ్యానం నేర్చుకున్నాను.సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను'అన్నాడు.

'ఎవరి దగ్గర నేర్చుకున్నావ్?ఏ విధానం ప్రాక్టీస్ చేస్తున్నావ్?' అడిగాను.

'అవన్నీ నేనొచ్చి చెబుతాలే.చాలారోజులైంది నిన్నుచూచి. రేపు మీ ఇంటికి వస్తున్నాను.నీతో కొన్నాళ్ళు ఉందామని అనుకుంటున్నాను.నీతో కలిసి ధ్యానం చేద్దామని అనుకుంటున్నాను.'అన్నాడు.

'మంచిది.వచ్చెయ్' అన్నాను.

అనుకున్నట్లే అతను వచ్చాడు.ఒకపూట ఉన్నాడు.

రెండో రోజు ఉదయమే 'నేను బయలుదేరుతున్నాను' అన్నాడు.

నాకు విషయం అర్ధమైనా,ఏమీ అర్ధం కానట్లు నవ్వుతూ 'ఏం? అప్పుడే బయలుదేరుతున్నావ్?'అన్నాను.

'నిజం చెబితే నీవు బాధపడతావ్'అన్నాడు.

'బాధపెట్టేది నిజం కాలేదని నా ఉద్దేశ్యం.ఒకవేళ బాధకలిగినా నిజాన్ని వినక తప్పదుకదా.వినే ధైర్యం నాకుంది.చెప్పే ధైర్యం నీకుంటే చెప్పు' అన్నాను.

'నేను ఊహించినట్లు నీవు లేవు' అన్నాడు.

పగలబడి నవ్వాను.

'అదెలా కుదురుతుంది? నా తీరులో నేనుంటానుగాని నీవు ఊహించినట్లు నేనెలా ఉండగలను?ప్రతి ఒక్కరి ఊహలకు అనుగుణంగా మారడానికి నేనేమైనా ఊసరవెల్లినా?' అడిగాను.

'అదికాదు.నీవు చిన్నప్పుడు బాగా ధ్యానం చేసేవాడివి.కాని ఇప్పుడు చెయ్యడం లేదేం? అడిగాడు.

'ఏమో తెలియదు.ధ్యానానికి కూడా నేనంటే అసహ్యం కలిగి నన్నొదిలి పారిపోయినట్లుంది'అన్నాను నవ్వుతూ.

'అదీగాక నిన్న చూచిన దృశ్యం నా మనస్సును విరిచేసింది'అన్నాడు బాధగా.

'ఏమైంది' అన్నాను నవ్వుతూ.

'అద్దం ముందు నిలబడి నీకు నువ్వే నమస్కారం చేసుకుంటున్నావ్.ఇంత అహంకారం పనికిరాదు.'అన్నాడు.

'ఓహో అదా...'అన్నాను.

అతను వచ్చినరోజున నేను స్నానంచేసి బాత్రూంలోనుంచి వచ్చి, దేవుని దగ్గరకు వెళ్ళకుండా బొట్టు పెట్టుకోకుండా,సరాసరి అద్దం ముందు నిలబడి నాకు నేనే నమస్కారం చేసుకోవడం అతను చూడనే చూచాడు.

అప్పుడే అతని ముఖంలో కదలాడిన భావం చూచి నాకు అనుమానం వచ్చింది.

ఇదా సంగతి అనుకున్నాను.

'తప్పేముంది?నాకు నేనే నమస్కారం చేసుకున్నాను.ఇందులో నీవు బాధపడేది ఏముంది?ఏం నీక్కూడా నమస్కారం చెయ్యాలా?' అడిగాను.

'ధ్యానం మానేసి చివరికి ఇలా తయారయ్యావా?' అడిగాడు. 

'కాదు మరీ ఎక్కువగా చేసి ఇలా అయ్యాను.' చెప్పాను.

'మనం చిన్నప్పుడు నేర్చుకున్న లలితాసహస్రనామం కూడా చదవడం మానేశావ్?' అన్నాడు కోపంగా.

'దానికంటే ఒక డిటెక్టివ్ కథల పుస్తకం చదవడం మేలు' అన్నాను.

అతను కోపంగా బయలుదేరి వెళ్ళిపోయాడు.

పోవడమేగాక నాకెలా భ్రష్టత్వం పట్టిందీ చిలవలు పలవలుగా వివరించి మరీ అందరికీ చెప్పాడు.అది విని మా బంధువులలోనూ,చిన్నప్పుడు నన్నెరిగినవాళ్ళలోనూ,చాలామంది నేనంటే అసహ్యం పెంచుకున్నారు.ఇది జరిగి ఇప్పటికి పద్నాలుగేళ్ళు అయింది.

ఈ మధ్యనే అతను మళ్ళీ ఒకసారి కలిశాడు.

'బాగున్నావా?' నవ్వుతూ అడిగా.

అతను అయిష్టంగా చూస్తూ 'ఆ బాగానే ఉన్నా.నీవెలా ఉన్నావ్?ఇప్పుడు కూడా స్నానం తర్వాత అద్దంముందు నిలబడి నీకు నీవే దణ్ణం పెట్టుకుంటున్నావా?' అడిగాడు.

'లేదు' అన్నాను.

'అమ్మయ్య.పోనీలే ఇప్పటికైనా నీకు కొంత బుద్దోచ్చినట్లుంది' అన్నాడు.

'పూర్తిగా విను.స్నానం చేస్తే కదా అద్దం ముందు నిలబడేది.ప్రస్తుతం పదిరోజులకు ఒకసారి మాత్రమె స్నానం చేస్తున్నాను.అది కూడా చెయ్యాలనిపిస్తేనే.అనిపించకపోతే అదీ చెయ్యను.స్నానమే లెకపోతే ఇక నమస్కారం ఎక్కడినుంచి వస్తుంది?' అన్నాను.

అతను అసహ్యంగా చూస్తూ ఉండిపోయాడు.

'నా సంగతి సరేలే గాని,నీవు డిటెక్టివ్ పుస్తకాలనుంచి సెక్స్ పుస్తకాలకి అప్ గ్రేడ్ అయ్యావా?' అడిగాను అతని చేతిలోని స్వాతి వీక్లీ చూచి.

అతనికి పిచ్చికోపం వచ్చింది.ఏమీ చెయ్యలేక ఊరకే చూస్తూ ఉండిపోయాడు.

కొంచం అతనికి జ్ఞానబోధ చేద్దామని అనుకున్నా.

'చూడు.నీ కళ్ళతో నీవు చూస్తున్నంత సేపూ నీకు సత్యం అర్ధంకాదు.ముందు ఈ మాటని బాగా అర్ధం చేసుకోడానికి ప్రయత్నం చెయ్యి.నీకు అర్ధమైతే అదృష్టవంతుడివి.లేకపోతే నీ ఖర్మ.సెక్స్ పుస్తకాలవరకూ ఎదిగావ్.వీడియోల దాకానో బ్లూఫిలింల దాకానో  ఎదిగిన తర్వాత,ఆపైన ధ్యానం ఎలా చెయ్యాలో ట్రయినింగ్ కావాలంటే అప్పుడు నన్ను కలువ్.నేర్పిస్తాను.'అన్నాను.

అతను కోపంతో అలాగే చూస్తున్నాడు.

నవ్వుతూ నా దారిన నేనొచ్చేశాను.