నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

1, జూన్ 2014, ఆదివారం

కేసీఆర్ ప్రమాణస్వీకార కుండలి-గ్రహస్థితి


జూన్ 2 న ఉదయం 8.15 గంటలకు అధికారికంగా తెలంగాణా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చెయ్యబోతున్నారు. ఆ సమయానికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయో,వాటిని బట్టి సమీప రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదో చూద్దాం.

లగ్నం మిథునం 22 అయింది. ద్విస్వభావ లగ్నాన్ని ఎంచుకున్నందువల్ల పరిస్థితి ఎప్పుడూ ముందుకూ వెనక్కూ ఊగిసలాటగా ఉంటుంది.నవాంశ లగ్నం కేతుయుతమైన చరలగ్నం అయింది.కేతువు కుజుడిని సూచిస్తున్నాడు.కనుక ఎప్పుడూ ఏదో ఒక సమస్య రాష్ట్రాన్ని వెంటాడుతూనే ఉంటుంది.దానిని పరిష్కరించడం కోసం ఎప్పుడూ ఏదో ఒక సమరం నడుస్తూనే ఉంటుంది.స్వతంత్రరాష్ట్రంలో కూడా సమస్యలూ బందులూ ఉద్యమాలూ తప్పకపోవడం దీని సూచనే.

లగ్నాధిపతి బుధుడు లగ్నంలో ఉండటం మంచి సూచనే.దీనివల్ల ప్రజలలో విశ్వాసం నెలకొల్పే దిశగా కొత్త ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. అయితే లగ్నానికి కలిగిన పాపార్గళం వల్ల ఈ చర్యలు అనుకున్నంత సత్ఫలితాలను ఇవ్వలేవు.ఇచ్చిన హామీలు నెరవేర్చడమూ, బాలారిష్ట సమస్యలను ఎదుర్కోవడమూ మధ్యన ప్రభుత్వం సంకట పరిస్థితులను చూడవలసి వస్తుంది.అనేక వర్గాలు తమకిచ్చిన హామీలను నెరవేర్చమని గొడవలు మొదలు పెడతాయి. 

బాధకుడూ ఉభయ కేంద్రాదిపత్య దోషీ అయిన గురువు లగ్నంలో బుధునితో కలసి ఉండటం మంచిదికాదు.శత్రువుల నుంచి అనేక బాధలను ఎదుర్కొంటూ పరిపాలన ముందుకు సాగుతుంది.ఈ శత్రువులలో బయటి వారేకాక అంతర్గత శత్రువులు కూడా ఉండనే ఉంటారు.ఓపెన్ గా ఉండే శత్రువుల కంటే మంచిగా మాయమాటలు చెబుతూ పక్కన చేరే వారితోనే ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్నది.

ప్రజలలో అసంతృప్తి వేగంగా పెరుగుతుంది.అసహనం ఎక్కువౌతుంది.ప్రజలు ఆశించినంత వేగమైన ఫలితాలు రాష్ట్రాభివృద్ధిలో రాకపోవడమే దీనికి కారణం అవుతుంది.నిరసన గళాలు వినిపించడం మొదలౌతుంది.వాటిని బుజ్జగించడం ప్రభుత్వానికి నిత్యకృత్యం అవుతుంది.ఆ క్రమంలో వారి దృష్టిని మళ్ళించడానికి రకరకాలైన ఎత్తులు వెయ్యవలసి వస్తుంది.పంచమంలో ఉన్న రాహుశనులే దీనికి సూచికలు.

శని/బుధ/కుజదశలో ఈ మంత్రివర్గం ప్రారంభమౌతున్నది.ఆశించినంత వేగమైన ఎదుగుదల రాష్ట్రంలో కనిపించకపోవడం వల్ల ప్రజలలో అతిత్వరలో అసంతృప్తి నిరాశా మొదలు కావడం,మళ్ళీ పోరాటాలు మొదలు కావడం అనే సూచనను దశాసమయం సూచిస్తున్నది.

శుక్ల పంచమి,సోమవారం,పుష్యమి నక్షత్రం,గురుహోర,వృద్ధియోగం,బవ కరణంలో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరుగుతున్నది.కొత్త పరిపాలన మొదలౌతున్నది.

శుక్లపంచమి మంచిదే.దీనికి వృద్ధియోగం కలవడం శుభసూచకమే.రాష్ట్రం క్రమేణా అభివృద్ధిలోకి వస్తుంది.ఆశించినంత కాకపోయినా పరిస్థితి ఆశావహం గానే ఉంటుంది.పుష్యమీ నక్షత్రం కూడా మంచి నక్షత్రమే.గురుహోర పరిపాలనా ప్రారంభానికి మంచిదే.అయితే గురువుగారి బాధకాదిపత్యం వల్ల పరిపాలనలో ఎగుడుదిగుళ్ళు చికాకులూ తప్పకుండా ఉంటాయి.

ద్విస్వభావ లగ్నమూ,లగ్నంలో రెండుగ్రహాలూ,లాభస్థానంలో రెండు గ్రహాలూ, పంచమంలో రెండుగ్రహాలూ ఉండటాన్ని బట్టి పరిపాలన ఒక్కరి చేతిలో కాక రెండుశక్తుల చేతులలో ఉండటం సూచింపబడుతున్నది.ఎప్పుడూ రెండువర్గాలను బుజ్జగించడమే రాష్ట్ర ప్రభుత్వానికి సరిపోతుందన్న సూచన స్పష్టంగా కనిపిస్తున్నది.ఏ ప్రపోజల్ కైనా ఇరుపక్షాల వాదనలూ,వారిమధ్యన సర్దుబాట్లూ తప్పనిసరి అవుతుంది. వెంటనే కాకపోయినా ముందుముందు తప్పకుండా ఈ పరిస్థితి ప్రభుత్వానికి తలనొప్పులు సృష్టిస్తుంది.

తెలంగాణా అధికారిక చిహ్నంలో కూడా కాకతీయ తోరణమూ చార్మినారూ(రెండు గుర్తులు) ఉండవలసిన అవసరం రావడమే నేను చెబుతున్నది తప్పక జరుగుతుంది అన్నదానికి ఖచ్చితమైన సూచన.

లాభస్థానంలో కేతుశుక్రులవల్ల ఒక బలమైన సూచన కనిపిస్తున్నది. ప్రస్తుతం మిత్రులుగా కనిపిస్తున్న ఒక వర్గంవారివల్ల చివరకు మాత్రం ఎడబాటూ విధ్వంసమూ మరియు నష్టమే వాటిల్లుతుంది అనేదే ఆ సూచన.ఇది ఎంతవరకూ నిజమౌతుందో ముందుముందు మనమే చూడబోతున్నాం.

నాలుగింట మాందీ గుళికుడూ కుజుడూ కలసి ఉన్నందున అంతర్గత కుట్రలతో పార్టీ పరిపాలనా వేగవలసి వస్తుందన్న సూచన బలంగా కనిపిస్తున్నది.రాష్ట్రం సాధించుకున్నప్పటికీ అనేక సమస్యల పరిష్కారానికి పోరుబాట మాత్రం ఎప్పటికీ తెలంగాణాకు తప్పకపోవచ్చుననే సూచనా ఉన్నది.

లగ్నంలో గురువు ఉండటం ఒకరకంగా మంచిదే.పంచమంలో శనిరాహువుల వల్ల ఒక వర్గపు కుట్రలను ప్రభుత్వం ఎప్పుడూ ఒక కంట కనిపెట్టవలసి ఉంటుంది.ఈ పరిస్థితిని లగ్నంలోని గురువు యొక్క స్థితి నిగ్రహిస్తుంది.ఈ రకంగా గురువు స్థితి మంచిదే అయినప్పటికీ అధికార పోరాటం మాత్రం తప్పకపోవచ్చు.

మొన్న ఒక స్నేహితుడు తెలంగాణా ప్రాంతం నుంచి మాట్లాడుతూ 'విడిపోతున్నామని బాధగా ఉన్నది' అన్నాడు.

'ఎక్కడ విడిపోతున్నాం? ఏం విడిపోతున్నాం? పరిపాలన విడిగా సాగుతుంది అంతేకదా.మనుష్యుల మధ్యన బంధుత్వాలూ స్నేహాలూ ఎక్కడికి పోతాయి?అవెక్కడికీ పోవు.ఇంతాచేస్తే ఏం జరిగింది? మన దేశంలోనే ఇంకో తెలుగు రాష్ట్రం ఉద్భవించింది.అంతే.దీనివల్ల మంచేగాని చెడు ఏమీలేదు. రెండురాష్ట్రాలూ ముందుముందు బాగా అభివృద్ధి జరగాలని ఆశిద్దాం.'అని చెప్పాను.

తెలంగాణా వెనుకబడిన ప్రాంతాలలో బాగా అభివృద్ధి జరిగి, విద్య, వైద్య, రవాణా,వ్యాపార,ఇతర మౌలిక సౌకర్యాలు మెరుగుపడి,ప్రజల జీవన ప్రమాణాలు బాగైతే అంతకంటే కావలసింది ఏముంది?

ఆంధ్రా తెలంగాణా రాష్ట్రాలు సమానంగా చక్కగా అభివృద్ధి కావాలని,తెలుగు ప్రజలందరూ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని,ఈ అభివృద్ధి దేశాభివృద్ధికి తోడ్పడాలని కోరుకుందాం.

తెలంగాణా రాష్ట్ర అవతరణ సందర్భంగా అందరికీ నా శుభాభినందనలు.