Pages - Menu

Pages

4, జూన్ 2014, బుధవారం

కేంద్రమంత్రి గోపీనాద్ ముండే జాతకం-ఒక పరిశీలన

మొన్న మనం చూచిన ప్రమాణస్వీకార కుండలి నిన్న జరిగిన గోపీనాద్ ముండే దుర్మరణాల దృష్ట్యా ఆయన జాతకాన్ని ఒకసారి పరిశీలిద్దాం.

ఇలాంటి దుర్మరణాల జాతకాలను చూడకముందే కొన్నికొన్ని విషయాలు మనం చూచాయగా తెలుసుకోవచ్చు.నిత్యజీవితంలో చాలాసార్లు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండటం మనం చూస్తుంటాం.ఉదాహరణకు కొన్ని సంఘటనలను చెప్పుకుందాం.

1.ఆనందంగా పెళ్లి జరిగాక తిరుగు ప్రయాణంలో యాక్సిడెంట్ జరిగి పెళ్ళికొడుకో పెళ్ళికూతురో లేదా ఇద్దరూనో చనిపోతారు.

2.చేతికి ఎదిగివచ్చిన సంతానం ఉన్నట్టుండి కన్నుమూస్తారు.

3.ఇంటర్వ్యూలో నెగ్గి ఉద్యోగంలో చేరదామని వెళుతున్న వ్యక్తి ప్రమాదంలో దారిలోనే మరణిస్తాడు.

3.అన్నీ సక్రమంగా జరిగాయి అని ఆనందంగా ఉన్న కుటుంబంలో ఉన్నట్టుండి ఒక ఘోర విషాద సంఘటన జరుగుతుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యజీవితంలో నుంచి చాలా సంఘటనలు చెప్పుకోవచ్చు.

ఇలాంటి జాతకాలు చూడకుండానే ఒక విషయం గ్రహించవచ్చు.అదేమంటే వీరి జాతకాలలో ఘోరమైన శాపమో లేదా ఏదో ఒక ఘోరమైన దోషమో ఖచ్చితంగా ఉండి తీరుతుంది.చాలాసార్లు అది గురుశాపం గాని లేదా నాగదోషం గాని పితృశాపంగాని ప్రేతశాపంగాని అయి ఉంటుంది.

జాతకంలో గల శాపాలనూ దోషాలను గుర్తించడం ఒక ప్రత్యేకవిద్య.వాటిని నివారించడం తొలగించడం తపశ్శక్తితో కూడుకున్న పని.ఆయా కాంబినేషన్స్ గురించి ఇంకొక్కసారి వివరంగా చర్చిద్దాం.

ప్రస్తుతానికి గోపీనాద్ ముండే జాతకాన్ని గనుక గమనిస్తే చూడగానే ఒక విషయం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.అదేమంటే ఈ జాతకానికి ప్రబలదోషి అయిన గురువు చతుర్ధంలో నీచస్తితిలో ఉండటం.అంటే ఇది ప్రబల గురుదోషం ఉన్న జాతకం అని చూడగానే తెలిసిపోతున్నది.ఇది ప్రబలదోషం అని ఎందుకన్నానంటే ఆ గురువు సున్నా డిగ్రీలలో రాశిసంధిలో పడి ఉండటమే గాక నవాంశలోకూడా మకరంలోనే నీచస్థితిలో ఉన్నాడు. అంతేగాక ద్రేక్కాణ,చతుర్దాంశ,ద్వాదశాంశ చక్రాలలో కూడా మకరంలోనే నీచస్థితిలో ఉన్నాడు.కనుక ఇది ప్రబలమైన గురుశాపం ఉన్న జాతకం అని తెలిసిపోతున్నది.

ప్రబల గురుదోషం ఉన్నవారి జాతకాల్లో గురుదశ మొదలు కావడం తోనే ఘోరాలు జరుగుతాయి.ఏ గ్రహమైనా తన దశలోనో అంతర్దశలోనో ఫలితాన్ని ఇవ్వడం మొదలుపెడుతుంది అన్నది జగమెరిగిన జ్యోతిష్యసూత్రం.అంటే ఆ కర్మఫలం ఆ దశలో ఆ సమయానికి పరిపక్వానికి వస్తుందన్నమాట.

ఈ జాతకంలో గురుదశ 23-4-2013 న ప్రారంభమైంది.ప్రస్తుతం గురు/గురు/శుక్ర/శుక్ర దశ జరుగుతున్నది.

గురువు ఈ జాతకానికి ప్రబలదోషి అనీ గురుశాపం ఉన్నదనీ వ్రాశాను.ఇకపోతే శుక్రుడు లగ్నాదిపతీ అమాత్యకారకుడూ అయి ద్వితీయ మారకస్థానంలో చతుర్దాదిపతి అయిన శని నక్షత్రంలో ఉన్నాడు.గురువు చతుర్ధంలోనే ఉంటూ గురుశాపాన్నిస్తున్నాడని మరువరాదు.శుక్రుడు విలాసవాహనాలకు కారకుడు.పైగా చతుర్దాదిపతి అయిన శని నక్షత్రంలో ఉన్నాడు.అంటే వాహనకారకత్వం బలాన్ని పుంజుకుందని అర్ధం అవుతున్నది.అందుకనే ప్రస్తుతం వేగంగా దూసుకొచ్చిన కారు రూపంలో శుక్రుడు ప్రమాదం కలిగించాడు.

ఇకపోతే ఈ లగ్నానికి బాధకుడైన సూర్యుడు ప్రత్యక్తార అయిన చిత్తా నక్షత్రంలో ఉంటూ లగ్నంలోనే వచ్చి ఉన్నాడు.

ఇక్కడ ఒక విచిత్రమైన జ్యోతిష్యసూచనను గమనించాలి.

ఇక్కడ లగ్నంలో ఉన్న బాధకాధిపతి సూర్యుడు నీచస్థితిలో ఉన్నాడు. మొన్నటి ముహూర్తకుండలిలో ఆయన అష్టమం(మరణం)లో కూర్చుని ఉన్నాడు.అంతేగాక జన్మలగ్నమైన తుల మొన్నటి ముహూర్తలగ్నం కూడా అయింది.

నవాంశలో గురువు రాహువుతో కూడి యున్నాడు.అంటే గురుచండాల యోగం ఉన్నదన్నమాట.ఈ యోగం గురించి నిన్ననే ఒక పోస్ట్ లో వ్రాసి ఉన్నాను.రాశితుల్య నవాంశ విధానం ప్రకారం ఈ గ్రహయోగం లగ్నాత్ చతుర్దంలో అంటే వాహన సంబంధమైన రాశిలో అది కూడా చరరాశిలో ఉన్నది.అంటే వేగంగా ప్రయాణించే వాహనం వల్ల ప్రమాదం సూచన స్పష్టంగా ఉన్నది.

రాశిచక్రంలో గురువుకు మూడింట రాహువుతోనూ పదకొండింట శుక్రునితోనూ పట్టిన అర్గలం కూడా దీనినే బలపరుస్తున్నది.అంటే రాహువు పెట్రోల్ నూ,శుక్రుడు వాహనాన్నీ వెరసి ఈ ఇద్దరూ కలసి పెట్రోల్ తో నడిచే ఒక కారునూ సూచిస్తున్నారు.అంటే గురుశాపంవల్ల వేగంగా దూసుకొచ్చే పెట్రోల్ వాహనంతో ఈ ప్రమాదం జరగాలని రాసిపెట్టి ఉన్నదని స్పష్టంగా దర్శనమిస్తున్నది.

ఇంకొక్క సూక్ష్మమైన విషయాన్ని ఇక్కడ బహిర్గత పరుస్తాను.కాలేయానికి కూడా గురువే అధిపతి అని జ్యోతిష్యజ్ఞానం ఉన్న వారికి అందరికీ తెలుసు.ఈ ప్రమాదంలో గోపీనాద్ ముండేకు తగిలిన దెబ్బతో అతని కాలేయం రెండు మూడు ముక్కలుగా చితికి పోయిందని తెలుస్తున్నది.బలీయమైన గురుశాపాన్ని ఈ సంఘటన స్పష్టంగా నిరూపిస్తున్నది.


మరణాన్నీ మరణ కారణాన్నీ స్పష్టంగా చూపించే అష్టాంశ ఏమంటున్నదో చూద్దాం.

అష్టాంశ లగ్నం రాశిచక్రానికి ద్వాదశం కావడమూ అక్కడనుంచి గురుశుక్రులు అష్టమంలో ఉచ్చరవితో కలసి చరరాశిలో ఉండటమూ చూస్తే ఏం కనిపిస్తున్నది?

గురువులో శుక్రదశలో నడిచే వాహనంలో మరణం సంభవిస్తుందని స్పష్టంగా కనిపిస్తున్నది.గురువులో/గురువులో/శుక్రదశలోనే ప్రస్తుతం ఆయన మరణం సంభవించింది.

ఇక్కడ ఉచ్చరవి కలవడం వల్ల ఏం అర్ధమౌతున్నది?అధికారికమైన విషయ సంబంధంగా ఉన్నతమైన పదవిలో ఉన్నపుడు ప్రయాణ సందర్భంలో మరణం సంభవిస్తుందని సూచన స్పష్టంగా ఉన్నది.జరిగింది అదేగా మరి.

ఈ చక్రానికి ప్రబల దోషీ మారకుడూ అష్టమాదిపతీ అయిన కుజుడు వాహనాలకు సూచకం అయిన చతుర్దంలో ఉంటూ దాని అధిపతి అయిన గురుదశలో వాహనప్రమాదం మరణకారణం అవుతుందని సూచిస్తున్నాడు.

బలవన్మరణ జాతకాలలో నేను ఎన్నోసార్లు నిరూపించిన జైమిని మహర్షి ప్రతిపాదిత సూత్రం ఇక్కడ కూడా మళ్ళీ రుజువు కావడం గమనించవచ్చు.కావలసిన వాళ్ళు పాత పోస్ట్ లు ఒక్కసారి తిరగెయ్యండి.

ఈ జాతకానికి ఆత్మకారకుడు శనీశ్వరుడయ్యాడు.కారకాంశలగ్నం తులా అయింది.అదే రాశిలగ్నం కూడా అయింది.అక్కడనుండి మూడింట ఉన్న గుళికుడు ఈ జాతకునికి కలగబోయే బలవన్మరణాన్ని సూచిస్తున్నాడు. ఆత్మకారకుడున్న సింహరాశి నుంచి మూడింట అంటే లగ్నంలో నీచస్థితిలో ఉన్న సూర్యుడు కూడా అధికారసంబంధమైన బలవన్మరణాన్ని సూచిస్తున్నాడు.ఇంతకంటే రుజువు ఇంకేం కావాలి?

యాక్సిడెంట్ అయిన రోజున గోచార కుజుడు ద్వాదశంలో ఉన్న జననకాల బుధునికి చాలా దగ్గరగా సంచరించాడు.ఇద్దరూ హస్తానక్షత్రంలోనే ఉన్నారు.

గోచారరాహువు జననకాల లగ్ననీచసూర్యునిపైన ఖచ్చితమైన డిగ్రీ సంయోగంతో చిత్తానక్షత్రంలో సంచరిస్తున్నాడు.ఇది యాక్సిడెంట్ నూ దుర్మరణాన్నీ సూచించే ఖచ్చితమైన కార్మిక్ సిగ్నేచర్.చిత్తానక్షత్రం కుజుని అధీనంలో ఉంటుందనీ అది ఆయనకు ప్రత్యక్తార అనీ గుర్తుంచుకుంటే ఈ ప్రమాదం అంత ఖచ్చితంగా అదే రోజున ఎందుకు జరిగిందో అర్ధమైపోతుంది.

ఇంతకీ ఇలాంటి మరణం పొందటానికి ఆయన చేసిన పూర్వకర్మ ఏమై ఉంటుంది?తేలికగా దీనిని అర్ధం చేసుకోవచ్చు.కాని అది వ్యక్తిగతం గనుకా ఆ జాతకునికి మాత్రమె చెప్పవలసిన విషయం గనుకా దానిని ఇక్కడ పబ్లిగ్గా చర్చించడం సంస్కారం కాదు.అలా చర్చించడం వలన ఇప్పుడు ఒరిగేదీ లేదు.కనుక ఆ విషయం మాత్రం దాచి ఉంచుతున్నాను.

అందుకే మనపెద్దవాళ్ళు అంటారు.మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలి. డబ్బుల్లేకపోయినా పరవాలేదు.ఎవరి ఉసురునూ మనం పోసుకోకూడదు.ఏ శాపానికీ గురికాకూడదు.అవి ఊరకే పోవు అని.

ఈ రోజులలో అలా హెచ్చరించేవారూ లేరు.చెప్పినా వినేవారూ లేరు.కర్మను నమ్మేవారూ లేరు.ప్రతిచోటా దూకుడూ దురుసుతనమూ ఎక్కువయ్యాయి. స్వార్ధమే పరమార్ధం అవుతున్నది.వీటివల్ల ఎంతటి చెడుకర్మ పోగవుతున్నదో ఎన్ని శాపాలకు మనకు తెలియకుండానే గురవుతున్నామో ఆ దేవుడికే ఎరుక.భవిష్యత్తులో ఆ కర్మ అనుభవించేటప్పుడు ఎన్ని బాధలు పడాలో కూడా ఆ దేవుడికే ఎరుక.

ఏది ఏమైనా ఒక్క విషయం దీనివల్ల రుజువౌతున్నది.ఎంతటివారైనా కర్మను తప్పించుకోలేరు.ఒకరికి బాధకలిగిస్తే మన సమయం వచ్చినపుడు దానిని అనుభవించక తప్పదు అన్న విషయం దీనివల్ల రుజువౌతున్నది.అందుకే సాధ్యమైనంతవరకూ ఎవరికీ హానిచేయ్యకుండా అందులోనూ మహనీయులైన వారికి అసలంటూ ఎటువంటి హాని చెయ్యకుండా బ్రతకాలని తెలుస్తున్నది.

జ్యోతిష్యం అనేది చాలా ఖచ్చితమైన సైన్స్ అనీ ఆ సూత్రాలు ఎన్నిసార్లైనా ఎంతమంది జీవితాలలోనైనా మళ్ళీమళ్ళీ తూచా తప్పకుండా రుజువౌతూనే ఉంటాయని కూడా ఇంకోసారి స్పష్టంగా దర్శనమిస్తున్నది.