Pages - Menu

Pages

27, జూన్ 2014, శుక్రవారం

గెయిల్ గ్యాస్ పైప్ లైన్ అగ్నిప్రమాదం - అమావాస్య ప్రభావానికీ రాహుప్రభావానికీ మరో ఋజువు

ఈరోజు నిండు అమావాస్య.

ఈరోజు తెల్లవారు ఝామున తూర్పుగోదావరి జిల్లా 'నగరం'లో గెయిల్ పైప్ లైన్ బద్దలై అగ్నిప్రమాదం జరిగింది.11 మంది సజీవదహనం అయ్యి నిలువునా కాలిపోయారు.ఇంకొక 15 మందికి తీవ్రంగా ఒళ్ళు కాలిపోతే వారిని ఆస్పత్రికి తరలించారు.

'నగరం' అక్షాంశ రేఖాంశాలు

Longitude: 81E54
Latitude:16N29

గ్యాస్,పెట్రోల్,కెమికల్స్,తదితర ఇంధనాలూ,పేలుడు పదార్ధాలూ మొదలైనవి రాహువు కారకత్వాలని చాలాసార్లు ఇంతకుముందే వ్రాసి ఉన్నాను.ప్రస్తుతం శపితయోగం ప్రజలను వెంటాడుతున్నదనీ వ్రాశాను.అమావాస్య ప్రభావం ఉంటుందనీ ఎన్నోసార్లు చెప్పాను.రాహు కేతువులు రాశులు మారబోతూ చాలా అన్ స్టేబుల్ గా ఉన్నారనీ వారి ప్రభావాలు దారుణంగా ఉంటాయనీ వ్రాస్తూనే ఉన్నాను.

ఇప్పుడు మన కళ్ళముందే ఈ దారుణ సంఘటన జరిగింది.

నేను వ్రాస్తున్నవి నిజాలే అనడానికి ఇంతకంటే మళ్ళీమళ్ళీ ఋజువులు అవసరం లేదు.

నిన్నటి కుండలికీ ఈరోజు కుండలికీ స్థూలంగా పెద్దతేడాలు ఉండవు.కొన్ని కొన్ని పారామీటర్స్ మాత్రం మారుతాయి.అవేమిటో మాత్రమె క్లుప్తంగా చూద్దాం.

ఈరోజు ఆర్ద్రానక్షత్రం నడుస్తున్నది.వింశోత్తరీ విధానం ప్రకారం ఇది రాహువు అధీనంలో ఉంటుంది.ఈ నక్షత్రం ఉదయం 3.45 ప్రాంతం నుంచీ మొదలైంది అన్న విషయం గమనించాలి.రాహుసమయం మొదలుకావడంతోనే ఈ ప్రమాదం జరిగింది.ఇదొక బలీయమైన ఋజువు. 

కుజుడు హస్తా నక్షత్రంలో ఉన్నాడు.అంటే రాహువు ప్రభావం చంద్రునిమీదుగా ప్రయాణించి అంగారకుని కారకత్వాన్ని యాక్టివేట్ చేసింది.బుధుడు మృగశిర నక్షత్రంలో వక్రించి ఉన్నాడు.అంటే అంగారకుని ఆధీనంలో ఉన్నాడు. అగ్ని ప్రమాదాలలోనూ పేలుళ్ళలోనూ అంగారకునికి గల శక్తిని ఇంతకుముందు చాలాసార్లు వివరించాను.

ఉదయం 3.42 నుంచి  4.42 వరకూ కుజహోర ప్రమాదం జరిగిన ప్రాంతంలో నడిచింది.ఇది అగ్నికి ఆజ్యాన్ని తోడుచేసింది.రాహువుయొక్క నక్షత్రమూ కుజుని హోరాసమయమూ ఒకదానికొకటి తోడైతే ఇంకేం జరుగుతుంది? ఏం జరగాలో అదే జరిగింది.

మొన్న కేరళలో ఇడుక్కి ప్రాంతంలో జరిగిన ఘోరమైన కారు ప్రమాదం కూడా ఇదే సమయంలో తెల్లవారుఝామునే జరిగింది.అందులో ఒక కుటుంబంలో ఇద్దరు అక్కడే చనిపోతే ఇద్దరు బయటపడ్డారు.వాళ్ళు ప్రయాణిస్తున్న కారు పట్టుదప్పి 1000 అడుగుల లోతులోకి పడిపోయింది.దానికి పొగమంచు కారణం అన్నారు.పొగమంచు ఒకరకమైన మాయే.కళ్ళముందు ఉన్నదానిని కనపడకుండా అడ్డుకునే ప్రతిదీ మాయ క్రిందికే వస్తుంది.అన్ని మాయలకూ రాహువే కారకుడు.

బీహార్లో రాజధాని ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడమూ తెల్లవారుఝామునే జరిగింది.కనుక తెల్లవారుఝాము సమయంలో రాహువు యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటున్నదని తెలుస్తున్నది.రాహువు సూర్యుడిని మ్రింగుతాడని పురాణవచనం.కనుక సూర్యోదయం కాబోయే ముందు ఉన్న చీకటిని రాహువుగా అనుకోవచ్చు.ఆ చీకటిని చీల్చుకుంటూ సూర్యోదయం జరుగుతుంది.అంటే సూర్యోదయానికి కొన్ని గంటలముందు రాహువు సూర్యుడిని బంధించి ఉండటం అన్న భావన చాలా తార్కికంగా ఉన్నది.అందుకే ఆ సమయంలో రాహువు బలీయంగా ఉంటున్నాడు.అనేక ప్రమాదాలు ఆ సమయంలోనే జరుగుతున్నాయి.

అంతేకాదు.యోగధ్యానాది మార్మికసాధనలు చేసేవారు కూడా ఈ సమయంలోనే వాటిని చెయ్యాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి.మాయను జయించాలంటే దానిప్రభావం గట్టిగా ఉన్న సమయంలోనే దానిని ఎదుర్కోవాలి.బ్రాహ్మీముహూర్తం వెనుక ఉన్న రహస్యం ఇదే.

ప్రమాదం జరిగిన తర్వాత భద్రతాప్రమాణాలు సరిగ్గా లేవని ప్రజలు గోలచెయ్యడమూ వాటిమీద కమీషన్ వెయ్యడమూ అది ఎటు పోతుందో ఏమైపోతుందో తెలీకపోవడమూ మన దేశంలో మామూలే కదా.ముందే ఎందుకు వీటిని చూచుకోరో అర్ధం కాదు.

ఏదేమైనా,నేను కొన్ని నెలలనుంచీ హెచ్చరిస్తున్న శపితయోగమూ రాహుప్రభావమూ కర్మసిద్ధాంతమూ ప్రత్యక్షనిజాలే అనడానికి ప్రతిరోజూ మన కళ్ళముందు జరుగుతున్న ఈ సంఘటనలే నిదర్శనాలు.

కొంతమంది అంటారు.జరిగిన తర్వాత మీరు అన్నీ వ్రాస్తున్నారు.ముందే చెప్పవచ్చు కదా అని.

కోట్లాది మంది జీవితాలలో ప్రతిరోజూ అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి;ప్రతివారికీ బొట్టు పెట్టి చెప్పడం సాధ్యం కాదు.

రాహువు కారకత్వాలు ఏమిటో వ్రాస్తూనే ఉన్నాను.ఆయన అధీనంలో ఏయే పదార్ధాలు ఉంటాయో వ్రాస్తున్నాను.ఆయా పదార్ధాలతో డీల్ చేస్తున్నపుడు ప్రస్తుతం చాలాచాలా జాగ్రత్తగా ఉండాలి అనేదే దీని అర్ధం.ఈ జాగ్రత్త పాటిస్తే ప్రమాదం తప్పుతుంది.లేకుంటే జరుగుతుంది.లక్షలాది జనంమీద స్థూలంగా మాత్రమె చెప్పడానికి వీలవుతుంది.వ్యక్తిగత జాతకాలైతే వ్యక్తిగతంగా చెప్పవచ్చు.అదీ తేడా.

చాలామంది ఇలా అంటారు-'కరెక్ట్ గా ఫలానాచోట ఫలానా సంఘటన ఫలానా నిముషానికి జరుగుతుంది అని చెప్పవచ్చు కదా'- అని.

వీరికి తెలియని రహస్యం ఒకటున్నది.గ్రహాలు మనం అనుకునేటట్లు జడపదార్ధాలు కావు.అవి చైతన్యపు పుంజాలు.అందుకే వాటిని దైవీశక్తులని అంటాము.సైన్సు జీవులు వాటిని మట్టిముద్దలుగా భావించవచ్చు.కానీ మార్మిక యోగదృష్టికి అవి మట్టిముద్దలు కావు.అవి శక్తిస్వరూపాలు. ప్రపంచంలో జడం అనేది ఏదీలేదు.మనం జడం అనుకునేది నిజానికి ఒక చైతన్యపు ఘనీభవరూపం.మనం రాయి అనుకునే దానిలో కూడా ఎంతో ఎటామిక్ ఎనర్జీ ఘనీభవించి బంధింపబడి ఉంటుంది.కనుక అదీ శక్తిస్వరూపమే. 

ఒకచోట గట్టి కర్మానుభవం ఉన్నది అక్కడ ఏదో ఒక తీవ్రమైన ప్రమాదం జరుగబోతున్నది అనుకుందాం.దానిని మనం కనిపెట్టి అడ్డుకుంటే,ఆ శక్తి ఇంకొక రూట్ తీసుకుంటుంది.ఎందుకంటే అది తెలివిలేని శక్తికాదు.ఆ శక్తిని నడిపే ఒక మోటివ్ ఫోర్స్ ఉంటుంది.ఆ ఫోర్స్ ఏం చేస్తుందంటే,మనం అనుకోనివిధంగా ఊహించని విధంగా అది రూట్ మార్చుకుని ఇంకొక రకంగా ఆ ప్రమాదాన్ని జరిపిస్తుంది.దీనిని దృఢకర్మ అంటాము.అంటే ఎంత ప్రయత్నించినా తప్పనిది.

మనకు శక్తి చాలకపోతే,దానిని ఆపుతున్న మనమీద కూడా ఆ శక్తి తిరగబడుతుంది.ఎందుకంటే ఇతరుల కర్మలో మనం చేతులు పెడుతున్నాం గనుక.

'Final destination' అనే ఇంగ్లీష్ సినిమా సీక్వెల్స్ చాలామంది చూచి ఉంటారు.ఆ సినిమాలో ఈ సూత్రాన్నే వాళ్ళు వాడుకుని ఒక సీరియల్ కధగా మలిచారు.అయితే వాళ్లకు 'పరిహార క్రియలు' అనే కాన్సెప్ట్ తెలియదు గనుక దాని జోలికి పోలేదు.

మన భారతీయ జ్యోతిశ్శాస్త్రంలో ఈ కాన్సెప్ట్ ఉన్నది.బలీయమైన కర్మను తుడిచి పెట్టాలంటే దానికి సరిపోయే బలీయమైన పరిహారం చెయ్యాలి.అప్పుడు కర్మను పరిహారం చెయ్యవచ్చు.కాని ఆ అదృష్టం అందరికీ కలగదు.అది ఎవరికి దక్కుతుంది? ఎవరికి అలా పరిహారాలు చేసుకోవడం సాధ్యమౌతుంది? అన్నది పాత పోస్ట్ లలో చర్చించాను.కావలసిన వారు చూడవచ్చు.

ఒక్క విషయం మాత్రం తేటతెల్లంగా రుజువౌతున్నది.మనుష్యుల పైన గ్రహప్రభావం సత్యం.కర్మఫలితాలనేవి సత్యం.వాటిని అనుభవించడమూ సత్యమే.ఈ మహత్తరమైన విజ్ఞానం భారతీయుల సొంతం.దీనిని ఇప్పుడిప్పుడే ప్రపంచం గుర్తిస్తున్నది.మనం మాత్రం ఇంకా మన ప్రాచీనసంపదను గుర్తించకుండా దానిని విమర్శించుకుంటూ కూచుంటున్నాం.

చుట్టూ నీరున్నా తాగేవాడికే అది దాహం తీరుస్తుంది.తాగుదామా వద్దా అని మీనమేషాలు లెక్కిస్తూ కూచుంటే ఈలోపల ఉన్న సమయం కాస్తా గడచిపోతుంది.

ప్రపంచం మొత్తం కర్మబద్ధమై నడుస్తున్నది.కర్మను జయించేవారెవ్వరు? ప్రస్తుత జీవనపోరాటంలో అంతటి ఓపిక ఎవరికుంది?