నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

4, జూన్ 2014, బుధవారం

గోపీనాద్ ముండే దుర్మరణం-ప్రమాణస్వీకార ముహూర్త ప్రభావం మొదలైందా?

నరేంద్ర మోడీ మంత్రివర్గ ప్రమాణస్వీకార ముహూర్తం అనేక దోషాలతో కూడి ఉన్నదని గత పోస్ట్ లో వ్రాశాను.అందులో ఉన్న గ్రహస్థితులు అప్పుడే ప్రభావం చూపించడం మొదలుపెట్టాయా?అన్న ప్రశ్నకు కేంద్రమంత్రి గోపీనాద్ ముండే దుర్మరణం అవుననే అంటున్నది.

అష్టమంలో రవి ఉండటం ఆ ముహూర్తంలోని కొన్ని దోషాలలో ఒకటి.మన ముహూర్తాలలో అష్టమశుద్ధిని ప్రధానంగా చూస్తాం.కాని మరి ఆరోజున ఆ ముహూర్తాన్ని ఎవరు నిర్ణయించారో ఎలా నిర్ణయించారోగాని ఈ దోషాన్ని వాళ్ళు లెక్కచెయ్యకుండా ముందుకు వెళ్లారు.అదేం చేస్తుందిలే అని వారు అనుకొని ఉండవచ్చు.ఏ ముహూర్తానికైనా అష్టమశుద్ధి ప్రధానంగా చూడాలి అని మన పూర్వీకులు మొత్తుకొని మరీ చెప్పారు.మనం వారిమాట వింటే కదా?

ముహూర్తభాగంలో అష్టమలగ్నదోషం అనేదీ,అష్టమశుద్ధి అనేదీ ప్రధానంగా చూడాలి.అంటే,ముహూర్తలగ్నం అనేది జాతకుని లగ్నానికి అష్టమం కాకూడదు.అలాగే ముహూర్తలగ్నంనుంచి అష్టమంలో ఏ గ్రహమూ ఉండకూడదు.ఎందుకంటే అష్టమం అనేది ఆయుష్యస్థానం గనుకా ప్రబల దోషపూరితమైన స్థానం గనుకా అక్కడ ఉండే గ్రహమూ దాని కారకత్వాలూ మొత్తం సర్వనాశనం అవుతాయి.అక్కడ గనుక క్రూరగ్రహాలుంటే ఆయుష్షును హరిస్తాయి.

జ్యోతిష్యం వంటి విద్యలతో వచ్చిన సమస్య ఇదే.ముందు దానిని ఎవ్వరూ నమ్మరు.పైగా రకరకాల మాటలతో హేళన చేస్తారు.జరిగిన తర్వాత మాత్రం బాధపడతారు.కాని అప్పుడు ఎంత విచారించినా ఉపయోగం ఏమీ ఉండదు.

అష్టమ రవివల్ల అధికారులకు గండమనీ,అకస్మాత్తుగా ప్రమాదాలు ముంచుకొస్తాయనీ,ఆయుర్హీనమనీ జ్యోతిర్విద్యలో గట్టిలోతులు తెలియని మామూలు పురోహితుడు కూడా చెప్పగలడు.అలాంటిది వారికి ఈ విషయం తెలియకపోవడం వింతగా ఉన్నది.

మంగళవారం ఉదయం ఆరున్నర ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.అంటే ఆ సమయంలో కుజహోర నడుస్తున్నది.ముహూర్తలగ్నంలో కుజుడు ద్వాదశంలో ఉండటం గమనించవచ్చు.ముహూర్తలగ్నం చరలగ్నం కావడమూ,కదులుతూ ఉన్న వాహనం మరణకారణం అవడమూ గమనించాలి.మంగళవారం కుజహోరలో సంఘటన జరగడం గమనార్హం.ప్రమాదాలూ దుర్మరణాలలో అంగారకగ్రహం యొక్క పాత్ర ఎన్నోసార్లు నిరూపితం అయిన సత్యం. 

అయితే సందేహ సుందరాలకు ఒక అనుమానం రావచ్చు.ఆ సమయానికి చాలామంది ప్రమాణ స్వీకారం చేశారు కదా? మరి గోపీనాద్ ముండే ఒక్కడికే ఇలా ఎందుకు జరిగింది? అని.

వారు ఒక్క విషయాన్ని గమనించాలి.ఆ నిముషంలో అతనొక్కడే ప్రమాణ స్వీకారం చేశాడు.అందరూ గుట్టగా ఒకే నిముషంలో ప్రమాణస్వీకారం చేయలేరు.కొన్ని సూక్ష్మచక్రాలు నిముషనిముషానికీ మారిపోతూ ఉంటాయి.ఇంకా సూక్ష్మచక్రాలు కొన్నైతే సెకన్లతేడాలో మొత్తం మారిపోతాయి.మొన్న కేసీఆర్ ప్రమాణ స్వీకారసమయంలో ఒక్క నిముషంలో నవాంశచక్రం మారిపోయింది.ఆ సంగతి చదువరులు గుర్తుంచుకోవాలి.

ఇంకొక ముఖ్యమైన సంగతి ఏమంటే,ఆ సమయానికి ప్రమాణస్వీకారం చేసిన అందరిలో ఎవరి జాతకంలో చెడుదశలు నడుస్తూ ఉంటాయో,సామాన్య భాషలో చెప్పాలంటే ఎవరి టైం బాగాలేదో,వారికే ఆ ముహూర్తదోషాలు ప్రబలంగా చుట్టుకుంటాయి.జాతకబలం గట్టిగా ఉన్నవారు రక్షింపబడతారు. లేదంటే వారివరకూ అవి పోస్ట్ పోన్ చెయ్యబడతాయి.

మరి టైం బాగాలేకపోతే మంత్రిపదవి ఎలా వచ్చింది? అన్న ప్రశ్న తలెత్తవచ్చు.జరుగుతున్న మహాదశ మంచిదే కావచ్చు.కాని ప్రబలదోషపూరితమైన అంతర్దశ గనుక ఆ తర్వాత మొదలైతే అది చెడుప్రభావాన్ని తప్పకుండా చూపించడం మొదలుపెడుతుంది.మహాదశా ఫలితాలను అది మార్చివెయ్యగలదు.గోపీనాద్ ముండే జాతకం దొరికితే దీనిని స్పష్టంగా గమనించవచ్చు.మంచిలో చెడూ,చెడులో మంచీ అంటే ఇదే.జాతకాన్ని చాలా సూక్ష్మంగా గమనిస్తే గాని ఈ విషయాలు బోధపడవు.

జ్యోతిష్యశాస్త్రంలో ముహూర్తభాగం అనేది ఎన్నో వందల వేల ఏళ్ళ పరిశోధనా ఫలితం.నిత్యజీవితంలో ఎన్నోసార్లు గమనింపబడి నిగ్గుతేలిన సత్యాలు అవి.వాటిని మనం తిరస్కారధోరణితో చూడటం వల్ల పరిణామాలు ఎలా ఉంటాయో ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

ఏదేమైనా ఈ సంఘటన విచారకరం.నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను.