Pages - Menu

Pages

29, జులై 2014, మంగళవారం

ఆధ్యాత్మిక సందేహాలు - యోనితంత్రం -2

1998 డిసెంబర్ లో నేను పూనాలోని ఓషో ఆశ్రమంలో మూడురోజులు ఉన్నాను.అక్కడకు వెళ్ళిన ఉద్దేశ్యాలలో ఒకటి, అక్కడ జరుగుతున్న తంత్రం ఎలాంటిదో చూద్దామనే.

అప్పట్లో అక్కడ రాత్రి 11 తర్వాత 'తంత్ర గ్రూప్స్' జరిగేవి.అదంతా రహస్యంగా జరిగేది.మామూలుగా జరిగే అన్ని కార్యక్రమాలూ ప్రోగ్రాములూ అన్నీ అప్పటికి అయిపోయేవి.విజిటర్స్ కూడా అందరూ వెళ్ళిపోయేవారు.ఆ తర్వాత ఎంపిక చేయబడిన కొందరితో ఆ గ్రూప్స్ జరిగేవి.వాటిలో నేను పాల్గోనలేదు గాని,అందులోని కొందరితో మాట్లాడి వారినుంచి అక్కడ ఏమి జరుగుతుందో గ్రహించాను.

అదంతా westernized tantra.దానికీ మన నిజమైన తంత్రానికీ సంబంధం లేదు.ఇది తెలియగానే నాకు వారి విధానాలమీద జాలీ విసుగూ ఒకేసారి కలిగాయి.మూడురోజులు అక్కడ ఉండి సాధ్యమైనన్ని విషయాలు గమనించి తిరిగి వెనక్కు వచ్చేశాను.వారి పద్ధతులు నాకు నచ్చలేదు.

ఆలోచనలో ఉన్న నన్ను కదిలిస్తూ 'మరి నాకు మార్గం ఏమిటి?' అడిగాడాయన.

'మీకు ప్రస్తుతం రెండే దారులున్నాయి.ఒకటి- భైరవి కోసం వెదకడం.రెండు-ఇంకో మనిషితో సంబంధం లేని అంతర్గత యోనితంత్రాన్ని నేర్చుకోవడం.

ఇందులో మొదటిది దాదాపు అసంభవం.ఎందుకంటే,అన్ని రకాల అర్హతలూ, తంత్రసాధన అంటే ఇష్టమూ,భయంలేని మనస్సూ,సాధనకోసం ఎవర్నీ లెక్కచెయ్యని ధీరత్వమూ,విశాలదృక్పధమూ,నిజమైన ఆధ్యాత్మికచింతనలు కలిగి,స్వార్ధమూ అహంకారమూ వంటి అవలక్షణాలు లేని యోగిని మీకెక్కడ దొరుకుతుంది?అది జరిగేపని కాదు.ప్రస్తుతకాలంలో అలా దేవతలవంటి స్త్రీలు ఎక్కడా లేరు.ఒకవేళ ఉన్నా మీకు లభించరు.అది అసంభవం.

కనుక మీకు మిగిలింది రెండో విధానమే.అందులో అయితే మీకు ఇంకొకరితో పని లేదు.' అన్నాను.

'ఆ మార్గం నాకు నేర్పగలరా?' అడిగాడాయన.

'అలాగే చూద్దాం.త్వరపడకండి.అంతరికసాధన ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణ ప్రస్తుతానికి చెప్తాను వినండి.మీరు రక్తాన్ని అమ్మవారికి అర్పించారు. అమ్మకు రక్తం అంటే ఇష్టమే.అయితే మీరు బాహ్యంగా దానిని చెయ్యనక్కరలేదు.మీ చేతిని కోసుకుని ఆ రక్తాన్ని అమ్మకు పట్టనక్కరలేదు.

ప్రతి మనిషిలోనూ అమ్మ రక్తం త్రాగుతూనే ఉన్నది.కాళి ప్రతి మానవుడి శరీరంలోనూ ఉన్నది.ప్రతిరోజూ సెకండుకు ఇరవైలక్షల పైనే ఎర్ర రక్తకణాలు శరీరంలో పుడుతూ ఉంటాయి.అవి ఒక రెండు నెలలపాటు ఉండి అంతరిస్తాయి.వాటిని ఎవరు స్వాహా చేస్తున్నారు? అదే కాళికాశక్తి.

కనుక బాహ్యంగా మీరు రక్తతర్పణం చెయ్యనక్కరలేదు.మీలోపల అది నిత్యమూ జరుగుతూనే ఉన్నది.మనందరిలో ఉంటూ నిత్యమూ మన రక్తాన్ని త్రాగేస్తూనే ఉన్నది కాళి.అలా రక్తాన్ని త్రాగడం ద్వారా మనకు జీవితాన్ని ప్రసాదిస్తున్నది.ఉన్న రక్తకణాలు నశించి కొత్తవి పుట్టకపోతే మనం ఎక్కువకాలం బ్రతకం.అదే మాత కటాక్షం.గొప్పగొప్ప కాళీ ఉపాసకుల మనుకునే వారికి కూడా ఈ రహస్యం తెలియదు.ఆ రక్తాన్ని త్రాగుతున్న శక్తిని మీరు సాక్షాత్కరించుకుంటే చాలు.అయినా మీరు ఎంత రక్తాన్ని అలా ధారపొయ్యగలరు? ఒక స్పూనో,ఒక గరిటో లేదా ఒక గ్లాసో.అంతే కదా.మరి మీ శరీరంలోని మిగతా రక్తం మాట ఏమిటి?కనుక విధానం అది కాదు.

మీ శరీరంలోని రక్తం అంతటినీ అమ్మకు నివేదన చెయ్యాలి.అది బయట కాదు.లోపల జరగాలి.దానికొక విధానం ఉన్నది.ఒక పద్ధతి ఉన్నది.దానిని ఆచరిస్తే మీ జీవితంలో అద్భుతాలు జరగడం మీ కళ్ళారా మీరే చూస్తారు.అప్పుడు అమ్మ ప్రసన్నం అయినట్లుగా ఇంకెప్పుడూ ఇంకే విధానంలోనూ ప్రసన్నం కాదు.

అమ్మవారికి 'రుధిరప్రియ' అన్న నామం ఉన్నది.'శ్రీవిద్య' లో చదవండి. "రక్తధాతువు నందు రాజ్యమేలుచు నిల్చి" అన్న పద్యంలో దీనినే నేను వివరించాను.ఆ పద్యం నాకు ప్రస్తుతం పూర్తిగా గుర్తురావడం లేదు. దాదాపు 1500 పద్యాలలో 'శ్రీవిద్య' వ్రాశాను.కాని వాటిలో ఒక్క పద్యమూ నాకిప్పుడు గుర్తులేదు.అమ్మ వ్రాయించింది.వ్రాశాను.మర్చిపోయాను.ఏరోజు వ్రాసినవి ఆరోజే మర్చిపోతూ వచ్చాను.

అంతరిక సాధన అనేది ఆ విధంగా ఉంటుంది.

ఈ విధంగా యోనితంత్రాన్ని కూడా మీరు internalize చెయ్యాలి.అదీ అసలైన నిజమైన యోనితంత్రం.దానికి ఏ స్త్రీ సహాయమూ అక్కర్లేదు.వాళ్ళకోసం వెతికేఖర్మా వాళ్ళను ప్రాధేయపడే ఖర్మా అక్కర్లేదు.అంతా మీ లోలోపలే జరుగుతుంది.సాధన అనేది బాహ్యం నుంచి అంతరికానికి ఎదగాలి అని నేను ఎప్పుడూ చెప్పేది ఇదే.

ఇప్పుడేగా మీరు నన్ను మొదటిసారిగా కలిసింది.తొందర వద్దు. ముందుముందు ఇంకా చాలాసార్లు కలిసి మాట్లాడి చర్చించి అసలు నేనేంటో ముందు తెలుసుకోండి. నేనూ మిమ్మల్ని ఇంకా గమనించాలి.ఆ తర్వాత చూద్దాం.

ఎందుకంటే,ఈ విధంగా చాలామంది ఏదో ఊపులో ఉన్నపుడు నన్ను కలిసి ఏవేవో మాట్లాడుతూ ఉంటారు.తర్వాత పత్తా ఉండరు.అలా చాలామందిని చూచాను.స్థిరత్వం లేని వారిని నేను శిష్యులుగా స్వీకరించను.ఒక వ్యక్తిని ఎంతోకాలం పాటు సూక్ష్మంగా పరిశీలించిన తర్వాతనే ఆ అవకాశం ఇస్తాను.

అందులోనూ ఇలాంటి వాటిల్లో అమ్మ అనుజ్ఞ లేనిదే నేను ఎవరికీ ఉపదేశం ఇవ్వను.'పలానావాడికి నీవు ఉపదేశం ఇవ్వు.అతనికి అర్హత ఉన్నది' అని అమ్మ ఆదేశం నాకు స్పష్టంగా వస్తుంది.అది వస్తేగాని నేను ఉపదేశం చెయ్యను.అది రాకముందే చేస్తే అది నా అహంకారం అవుతుంది.అలాంటి ఉపదేశం పనిచెయ్యదు.అమ్మ ఆదేశంతో చేస్తే దానివెనుక శక్తి ఉంటుంది.అప్పుడు ఆ ఉపదేశం ఫలవంతం అవుతుంది.మీకు వేగంగా సిద్ధిని కలిగిస్తుంది.ఎందుకంటే అప్పుడు పనిచేసేది నేను కాదు.జగన్మాత శక్తి నాద్వారా అప్పుడు మీమీద పనిచేస్తుంది. 

ప్రస్తుతానికి నేను వ్రాసిన 'శ్రీవిద్య' సీరీస్ చదవండి.రాబోతున్న నవరాత్రులకు అది పుస్తకంగా రిలీజ్ కాబోతున్నది.అప్పుడైతే మీరు సరాసరి పుస్తకమే చదువుకోవచ్చు.ఈలోపల బ్లాగ్ పోస్ట్ లు చదవండి.ఒకసారి కాదు.పదిసార్లు దానిని బాగా శ్రద్ధగా చదవండి.మీ సందేహాలు అప్పుడు అడగండి. చెప్తాను. ముందు ఆ పని చెయ్యండి.' అన్నాను.

'సరే' అన్నాడాయన.అలా అంటూ తనకొచ్చిన కొన్ని కలలు చెప్పి వాటి అర్ధాలను అడిగాడు.

వాటి అర్ధాలు ఆయనకు విశదీకరించాను.

'ఇక మీ సందేహాలు అడగండి.'-అన్నాను సురేంద్ర వైపు తిరిగి.

'జ్యోతిష్యమూ హస్త సాముద్రికమూ ఒకటేనా?' అడిగాడు.

'రెండూ ఒకటే.భాషలు వేరు.మెసేజ్ ఒకటే.మీ చేతిలోనే మీ జాతకచక్రం ఉంటుంది.ప్రతి మనిషీ తన చేతిలోనే తన జాతకచక్రాన్ని మోసుకుంటూ తిరుగుతున్నాడు.చూడగలిగితే అరచేతిలోనే గ్రహాలున్నాయి.' చెప్పాను.

'మరి ఫేస్ రీడింగ్ అంటారు అదీ నిజమేనా?' అడిగాడు.

'నిజమే.దానిని సాముద్రికశాస్త్రం అంటారు.అందులో భాగాలే ముఖసాముద్రికం హస్తసాముద్రికం ఇవన్నీ.చేతిలో ఉన్నట్లే ముఖంలో కూడా జాతకచక్రం కనిపిస్తుంది.అక్కడ కూడా గ్రహస్థానాలున్నాయి.

నుదురూ,ముక్కూ,చెవులూ,కళ్ళూ,కనుబొమలూ,బుగ్గలూ,పళ్ళూ,నోరూ,నాలుకా,జుట్టూ,తలతీరూ,మెడా ఇలా ఒకటేమిటి శరీరంలోని అన్ని భాగాలూ ఎన్నో విషయాలను వాటివాటి భాషలో చెబుతూనే ఉంటాయి.ఆ భాష అర్ధమైతే చాలు.దీనినే నేటివారు బాడీ లాంగ్వేజ్ అంటున్నారు.ఒక మనిషి కూచునే తీరు,నిలబడే తీరు,మాట్లాడే తీరు,స్పందించే విధానం,కళ్ళు ఆర్పే విధానం,చేతులు ఆడించే విధానం ఇవన్నీ మనిషి కేరక్టర్ నూ,మనస్తత్వాన్నీ పట్టిస్తాయి.

మామూలు మనస్తత్వశాస్త్రవేత్తలు వీటిని కొంతవరకూ గ్రహించారు.కాని యోగులకు వీటి వెనుక ఉన్న లోతైన విషయాల కర్మజ్ఞానం ఉంటుంది.' అన్నాను.

'నేను మీరు వ్రాసిన 'తారాస్తోత్రం' పారాయణ చేస్తున్నాను.అది చెయ్యడం మొదలు పెట్టాకనే నేను ఇల్లు కట్టగలిగాను.పనులలో కదలిక కూడా వచ్చింది.వాస్తు ప్రకారం జాగ్రత్తగా కట్టగలిగాను.' అన్నాడు.

'జాతకంలోని చతుర్ధభావాన్ని బట్టే మీరు ఉన్న ఇల్లు ఉంటుంది.చతుర్దానికి దోషాలున్నపుడు అవి నివృత్తి కాకుండా మీరు ఎంత ప్రయత్నించినా పూర్తిగా వాస్తు ప్రకారం ఇల్లు కట్టలేరు.మీరు ఎంత జాగ్రత్తగా కట్టినా దానిలో లోపాలు తప్పకుండా వస్తాయి.దీనిని ఆపడం మీ తరం కాదు.' అన్నాను.

ఇంతలో రాజశేఖర్ అనే అతను అందుకుని 'నేను జ్యోతిష్యం చెబుతూ ఉంటాను.' అన్నాడు.

'ఎక్కడైనా నేర్చుకున్నారా?' అడిగాను.

'లేదు.ఒకాయన దగ్గర కొన్ని బేసిక్స్ తెలుసుకున్నాను.సప్తమం వివాహ భావం అలా కొన్నికొన్ని.వాటిని బట్టి పరిశీలన ద్వారా చెబుతుంటాను.'

"రేమేడీలు కూడా చెబుతారా" అడిగాను.

'అంటే బాగులేని గ్రహానికి అవసరమైన ప్రదక్షిణాలు చెయ్యమని చెబుతాను.అంతే.మనం రేమేడీలు చెబితే అవి మనకు చుట్టుకుంటాయా?' అడిగాడు.

'చుట్టుకుంటాయి.వారి కర్మను మీరు తప్పిస్తే అది మీరు అనుభవించవలసి వస్తుంది.తప్పదు.అందుకే జ్యోతిష్కులు సామాన్యంగా ప్రతిరోజూ ఆ దోషం పోవడానికి సహస్రగాయత్రి జపం చేస్తారు.లేకుంటే అది వదలదు.'అన్నాను.

'నాది సింహలగ్నం లాభంలో గురువు వక్రి' అన్నాడు.

'జాతకంలో గురువు వక్రించిగాని నీచలోగాని ఉంటే అది గురుదోషం అవుతుంది.పంచవిధ గ్రహస్తితులైన అస్తన్గత,వక్ర,నీచ,శత్రుక్షేత్ర,గ్రహయుద్ధ స్థితులలో ఉన్నదానిని బట్టీ,ఆయా భావాధిపతులను బట్టీ వారిమధ్యన ఉన్న స్థితులనూ దృష్టులనూ బట్టి  ఆయా దోషాలు తెలుస్తాయి.'

'సామాన్యంగా గురుదోషం ఉన్న జాతకులు పూర్వంలో గురుద్రోహం చేసి ఉంటారు.లేదా గురువు మాట వినకుండా మొండిగా ప్రవర్తించి ఉంటారు.లేదా ఉపదేశం తీసుకుని దానిని నిర్లక్ష్యంతో మధ్యలో వదిలేసి ఉంటారు.లేదా గురుసేవ సరిగ్గా చేసి ఉండరు.లేదా రోజుకొక్క గురువులను మార్చి ఉంటారు.లేదా సద్గురువులను ఎగతాళి చేసి ఉంటారు.లేదా హింసించి బాధపెట్టి ఉంటారు.ఇలా గురుదోషంలో చాలా తేడాలున్నాయి.వాటిని జాతకం చూచి గ్రహించవచ్చు.'చెప్పాను.

'నేను కొన్నేళ్ళ నుంచి సాయిబాబా పూజ చేస్తూ ఉంటాను.ఒక్కొక్కసారి పూజారి రాకపోతే నేనే గుడిలో పూజ చేస్తాను.తరచూ కాకాని శివాలయంలో ప్రదక్షిణాలు చేస్తాను.అరుణాచలం గిరి ప్రదక్షిణాలు త్వరలో 108 పూర్తి కాబోతున్నాయి.40 రోజులు అరుణాచలంలో చిన్నగదిలో ఉండి ప్రతిరోజూ ఉదయం సాయంత్రం గిరిప్రదక్షిణ చేశాను.దక్షిణామూర్తి స్తోత్రం కూడా చదువుతాను' అన్నాడు.

'ఇదంతా గురుదోష ప్రభావమే.మీకు తెలియకుండానే ఆ దోషం పోవడానికి మీ చేత ఇదంతా చేయించబడుతున్నది.సద్గురు కటాక్షం ఉంటే ఇలాగే జరుగుతుంది.మీకు తెలియకుండానే రేమేడీలు మీచేత చేయించ బడతాయి.అది లేకుంటే ఆయా దశలలో ఇంకాఇంకా చెడుకర్మలో కూరుకు పోవడం జరుగుతుంది.ప్రస్తుతం మీకేం దశ జరుగుతున్నది?' అన్నాను.

'ప్రస్తుతం గురువులో చంద్రుడు జరుగుతున్నది.ఈ గురుదోషం ఎప్పుడు పోతుంది?' అడిగాడు.

లోలోపల నవ్వుకున్నాను.ఎందుకంటే గురుదశ జరుగుతున్నపుడే చాలామంది నా దగ్గరకు రాగలుగుతారు.అందులోనూ గురువులో చంద్రుడు జరిగేవారు ఆ సమయంలో ఖచ్చితంగా వచ్చి ఆథ్యాత్మిక సందేహాలూ చర్చలూ అంటూ నన్ను కలవడం ఎన్నోసార్లు గమనించాను.వేరే సమయంలో వాళ్ళు రావాలన్నా రాలేరు.

కారణం? నా జాతకంలో గురుచంద్రులు కలసి మోక్షకారకరాశి అయిన మీనంలో ఉన్నారు.ఈ విధంగా గ్రహాలకు సంబంధించిన లింకులు మనుష్యుల మధ్యా సంఘటనల మధ్యా ఉంటాయి.

'మీకున్న గురుదోషం అప్పుడే పోదు.దాదాపుగా 2018 లో మీకు గురుదశ అయిపోతుంది.ఆ చివరిఘట్టంలో 2016 నుంచి మీకు గురువులో రాహుదశ వస్తుంది.దానిని దశాఛిద్రం అంటారు.ఆ సమయంలో మిమ్మల్ని యమబాధలు పెడుతుంది. ఆ తర్వాత పోతుంది.అంతవరకూ ఇప్పుడు చేస్తున్నవే చేస్తూ ఉండండి. సామాన్యంగా గురుదోషం ఒక్కతరం నుంచే రాదు.చాలా పాతకాలం నుంచి ఉంటుంది.అంటే మీరు కాదు.మీ పూర్వీకులనుంచే ఆ దోషం ఉంటుంది.మీ తండ్రిగారి జాతకం చూస్తే తెలుస్తుంది.' చెప్పాను.

'మా తండ్రిగారి జాతకం లేదు.కాని మా అబ్బాయి జాతకం నాకు తెలుసు. వాడికి నీచరవితో గురువు కలసి ఉన్నాడు.' అన్నాడు.

'చూచారా మరి? అదే నిదర్శనం.అంటే మీ తర్వాత తరానికి కూడా ఈ గురుదోషం ఇప్పటికే సంక్రమించింది.మూడు తరాల జాతకాలు తీసుకుని పరిశీలిస్తే ఇలాంటి వంశపారంపర్య జన్యుదోషాలు స్పష్టంగా కనిపిస్తాయి. జ్యోతిష్యవిద్యలో నా స్పెషలైజేషన్ అదే.' అన్నాను.

'నాకు చతుర్దంలో రాహువు నీచలో ఉన్నాడు.మా ఇంటిలో కూడా దోషాలున్నాయి.ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత గమనిస్తే అర్ధమౌతున్నది.' అన్నాడు.

'మీ ఇంటికి నైఋతి దోషం తప్పకుండా ఉంటుంది.అలాగే ఈశాన్య దోషం కూడా ఉంటుంది.మీ ఇంటిలో వస్తువులు ఏవీ ఎక్కడివక్కడ నీట్ గా ఉండవు.ఇంట్లోకి కాయితాలూ దుమ్మూ వెంట్రుకలూ వస్తుంటాయి.ఇంటి చుట్టుపక్కల ప్రశాంతంగా ఉండదు.గొడవగా ఉంటుంది.గమనించండి' అన్నాను.

'నిజమే.మా ఇంటి ఎదురుగానే ఒక స్కూల్ ఉన్నది.ఎప్పుడూ గోలగానే ఉంటుంది.నైరుతి దోషాలున్న మాట వాస్తవమే.లెట్రిన్ ట్యాంక్ అక్కడే ఉన్నది.దానిని మార్చాలని శతవిధాల ప్రయత్నిస్తున్నాను.వీలుకావడం లేదు.' అన్నాడు.

'అదేమరి.జ్యోతిష్యజ్ఞానం ఎంత సత్యమో చూచారా?ఇంకోవిషయం వినండి. మీరు స్నేహితుల నుంచి బాగా నష్టపోతారు.నిజమేనా?' అడిగాను.

'నిజమే.అందరూ నన్ను వాడుకొని వదిలేసేవారే.' అన్నాడు.

ఇంతా చేస్తే నేను అతని జాతకం ఇంకా చూడనే లేదు.ఊరకే అతను చెప్పిన కొన్ని గ్రహస్తితులను బట్టి ఇన్ని విషయాలు అర్ధమయ్యాయి.ఇక జాతకాన్ని చూస్తే మొత్తం జీవితమంతా స్పష్టంగా తెలిసిపోతుంది.ఇదీ జ్యోతిష్య శాస్త్రం యొక్క శక్తి.

ఆ విధంగా కాసేపు మాట్లాడుకున్న తర్వాత -'మేం వెళ్ళి వస్తాం.' అంటూ వాళ్ళు లేచారు.

'మంచిది.' అన్నాను.

ఒంటిగంట సమయంలో వాళ్ళు సెలవు తీసుకుని వెళ్ళిపోయారు.

భోజనం చెయ్యాలనిపించలేదు.

ఉదయం నుంచీ మబ్బు పట్టి వదలకుండా సన్నగా వాన కురుస్తూనే ఉన్నది. వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉన్నది.ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నది.

ఎవ్వరూ లేని ఏకాంతగృహాలు తంత్రసాధనకు అనుకూలించే ప్రదేశాలలో కొన్ని అని తంత్రగ్రంధాలు అంటాయి.అది ప్రత్యక్ష వాస్తవం.ప్రపంచంలో మన ఒంటరితనం మనకప్పుడే బాగా అనుభవం అవుతుంది.ఈ ప్రపంచంలో నిజానికి ఎవరూ మనవారు కారు.అంతిమ విశ్లేషణలో మనకు భగవంతుడు తప్ప దిక్కెవ్వరూ లేరు.

ఇంటి తలుపులన్నీ వేసుకుని లైట్లు ఆపేసి ప్రశాంతంగా నా సాధనలో అడుగుపెట్టాను.పిక్నిక్ నుంచి శ్రీమతి తిరిగి వచ్చేసరికి సాయంత్రం ఆరున్నర అయింది.అప్పటివరకూ నా లోకంలో నేను ఆనందంగా విహరించాను.

ఆ విధంగా ఈ ఆదివారం గడిచింది.