నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

14, జులై 2014, సోమవారం

గురుపూర్ణిమ-సాధనా సమ్మేళనం -6

పంచవటి గ్రూప్ అనేది ప్రాధమికంగా నిజమైన సాధకుల కోసం ప్రారంభించబడిన గ్రూపు. ఆధ్యాత్మిక జీవనాన్ని నిజంగా ప్రేమించే వారికోసం, అలా జీవించాలని కోరుకునే వారికోసం,యోగశక్తినీ దైవశక్తినీ సాధనాశక్తినీ ప్రత్యక్షంగా చూడాలనీ అనుభవించాలనీ త్రికరణశుద్ధిగా అనుకునేవారి కోసం ఈ గ్రూప్ సృష్టించబడింది.గ్రూప్ అధ్వర్యంలో ఇప్పటివరకూ ఆరు సాధనా సమ్మేళనాలు జరిగాయి.మొదటి సమ్మేళనం ప్రకాశంజిల్లా పూనూరు గ్రామంలో జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లో రెండు, మహానందిలో ఒకటి,కోటప్పకొండలో ఒకటి జరిగాయి.ఇప్పుడు ఆరవది గుంటూరులో మా ఇంటిలో జరిగింది.

మొన్న 12-7-14 గురుపూర్ణిమ అయింది.

నిన్న 13-7-14 తేదీల ప్రకారం నా పుట్టినరోజు అయింది.

కనుక ఆ రోజులలో పంచవటి సభ్యులు కొందరు వచ్చి నన్ను కలుస్తామని అనుకున్నారు.నాకేమీ అభ్యంతరం లేదని చెప్పాను.కాకపోతే కొన్ని షరతులు విధించాను.

నేను పుట్టినరోజు చేసుకునే విధానం విభిన్నంగా ఉంటుంది.కొత్తబట్టలు, గుళ్ళూగోపురాలు, విందులు వినోదాలు, షాపింగులు, సినిమాలు, విహారయాత్రలు --ఇలా ఉండదు.వాటిలో ఏమీ లేదని నాకు అనుభవం నేర్పింది.కనుక ఆరోజున నేను పూర్తిగా మౌనధ్యానంలో ఏకాంతంగా కాలం గడుపుతాను. కనీసం ముప్పై ఏళ్ళనుంచి ఈ విధానం నేను పాటిస్తున్నాను.

ఆ రెండురోజులూ టీవీ ఉండదు.సెల్ ఫోన్ ఉండదు.ఇంటర్ నెట్ ఉండదు. పత్రికలు ఉండవు.అనవసరమైన మాటలు ఉండవు.ఇల్లు దాటి బయటకు పోవడం ఉండదు.నేను మాట్లాడిస్తే మాట్లాడాలి.లేదంటే మౌనంగా ఉండాలి.ఆ సమయంలో నేనెలా ప్రవర్తిస్తానో చెప్పలేను.అదంతా భరించాలి.కనుక నాతో పాటు రెండురోజులు ఉండాలంటే అలాంటి జీవనవిధానానికి తట్టుకోగల స్థితి ఉంటే సంతోషంగా రమ్మని చెప్పాను.

కొందరు రావాలని ఉన్నా కొన్నికొన్ని కారణాల వల్ల రాలేకపోయారు.కొందరు వస్తామన్నా నేనే వద్దన్నాను.చివరకు కొందరు మాత్రమే రాగలిగారు.

మొత్తమ్మీద ఏడుగురు సభ్యులు మాత్రం రాగలిగారు.వారు ఆ రెండురోజులూ నాతో మాఇంటిలో ఉన్నారు.అందులో ఒకరు బెంగళూర్ నుంచి,ముగ్గురు హైదరాబాద్ నుంచి,ఒకరు అనంతపూర్ నుంచి,ఇద్దరు గుంటూరు నుంచి వచ్చారు.మొదటి సమ్మేళనానికి వచ్చిన సభ్యుడొకరు మళ్ళీ ఈసారి కూడా రావడం ఆనందం కలిగించింది.అది అతనిలో ఆరిపోకుండా ఉన్న తపనకు సూచిక.మొదటి సమ్మేళనానికి వచ్చిన అనేకమంది మధ్యలో జారిపోయారు.ఇప్పటివరకూ నిలబడినవారు చాలా తక్కువ.

ఆధ్యాత్మికమార్గం చాలా కష్టమైనది.అది 'పదునైన కత్తి అంచుమీద నడక' అంటుంది కఠోపనిషత్తు.ఆ నడక మనం ఊహించినట్లుగా ఉండదు.అనుక్షణం కాళ్ళు తెగిపోతుంటాయి.ఆమార్గం మన భావాలకూ అభిప్రాయాలకూ అనుగుణంగా హాయిగా సుఖంగా ఏమీ ఉండదు.కనుక చాలామంది దీనినుంచి జారిపోతుంటారు.వారివారి భావాలకు అనుగుణంగా ఇక్కడి పరిస్థితి లేనప్పుడో లేక వారి అహం అనేది గాయపడినప్పుడో చాలామంది ఈ మార్గాన్ని వదిలేస్తారు.

దీనిని అంటించుకోవడం చాలా కష్టం.ఇందులో స్థిరంగా నిలబడటం ఇంకా కష్టం.అనుక్షణం మారడానికి సిద్ధంగా లేకపోతే ఇందులో ఎవ్వరూ ఇమడలేరు. మార్పును స్వాగతించలేకుండా తమతమ భావాలనూ ఆలోచనలనూ అహాలనూ అంటిపట్టుకుని ఉండేవారికి నేను సూచించే ఆధ్యాత్మికమార్గంలో పట్టు చిక్కదు.

ఈ రెండురోజులూ నాతో కలిసి ఉన్నవారికి నాతో కలిసి ధ్యానంచేసే అవకాశం ఇచ్చాను.బౌద్ధతంత్రం నుంచీ ఆర్షతంత్రం నుంచీ కొన్ని ప్రాక్టికల్ ధ్యానవిధానాలు నేర్పించాను. దగ్గరుండి వారిచేత చేయించాను.ఎందుకంటే నిజమైన ఆధ్యాత్మికత అనేది ధియరీలో లేదు. అది ఆచరణలో ఉంటుంది.

శనివారం నాడు వారితో కలసి నేనూ ధ్యానం చేశాను.'స్పిరిట్యువల్ ఎనర్జీ ఫీల్డ్' అంటే ఎలా ఉంటుందో వారికి అనుభవం కావడం కోసం ఆ ధ్యానసమయంలో ఒక శక్తివలయాన్ని సృష్టించి అది వారికి అనుభవం అయ్యేటట్లు చేశాను.ఎందుకంటే ఎన్ని మాటలు మాట్లాడుకున్నా అంతిమంగా దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ప్రాక్టికల్ గా అనుభవిస్తేనే ఇలాంటి విషయాలు అర్ధమౌతాయి.నమ్మకమూ అప్పుడే కలుగుతుంది.

ప్రత్యక్షంగా ఋజువును చూపించగలిగినదే నిజమైన ఆధ్యాత్మికత.

రెండురోజులపాటు ప్రపంచాన్ని పట్టించుకోకుండా పూర్తిగా ధ్యానమయమైన జీవితం గడపాలంటే ఒకేసారి సాధ్యంకాదు.దానికి ఎంతో ముందునుంచి తయారు కావాలి.ఎన్నో పునాదులు వేసుకుంటూ రావాలి.మనస్సును తయారు చేసుకుంటూ రావాలి.ఎన్నింటినో మనంతట మనం వదులుకోవాలి. అప్పుడే అలా ఉండగలం.

సభ్యులు దానికి సిద్ధంగా లేరు గనుక మధ్యమధ్యలో వారికి కొంత లీజర్ టైం అవసరం అయింది.ఆ సమయంలో అనేక ఆధ్యాత్మిక విషయాలను ప్రాక్టికల్ ఉదాహరణలతో వారికి వివరించాను.వారి సందేహాలను తీర్చాను.

వాటిలో కొన్ని విషయాలు--
  • కర్మ-దాని వివిధ సూక్ష్మభేదములు-మంచిలో చెడు,చెడులో మంచి, చెడుకర్మ,మంచికర్మ,నిష్కామకర్మలు ఏమిటి?
  • నిత్యజీవితంలో అవి ఎలా చెయ్యబడతాయి?
  • కర్మరహస్యాలను నిత్యజీవితంలో ఎలా ఆచరణలో పెట్టాలి?
  • ధ్యానంలో మనస్సు ఎందుకు నిలబడదు?అలా నిలబడాలంటే ఏం చెయ్యాలి?
  • మనకు కనిపించని శక్తులు నిత్యజీవిత సంఘటనలను ఎలా ఆడిస్తాయి?వాటిని ఎలా అడ్డుకోగలం?ఎలా మార్చగలం?
  • మన మనస్సులలో నిత్యం తలెత్తే భయం,అసూయ,ఆశ మొదలైన ఎన్నోరకాల నెగటివ్ వైబ్రేషన్స్ తో ఎలా డీల్ చెయ్యాలి?
  • ధ్యానంవల్ల నిత్యజీవితంలో మనకు కలిగే ఉపయోగాలు ఏమిటి?
  • సాధన,ఉపాసన అనేవి ఎలా జరగాలి?వాటిలో మెట్లు ఏమిటి?ఎలా వాటిని అందుకోవాలి?
  • రోజువారీ జీవితం గడుపుతూనే దానిని యోగపరమైన,ధ్యానపరమైన సాధనగా ఎలా మార్చుకోవాలి?
  • మొదలైన అనేక మార్మికవిషయాల మీద చర్చలు ఈ సమ్మేళనంలో జరిగాయి.

ఈ సమ్మేళనంలో ప్రత్యక్షంగా పాల్గొనగలిగినవారిని అభినందిస్తున్నాను. కొందరు సభ్యులు మాత్రం శరీరంతో రాలేకపోయినా, మానసికంగా మా మధ్యనే ఉండి దాని ఫలితాలను చాలాదూరం నుంచి అందుకోగలిగారు.

వారిని ఇంకా అభినందిస్తున్నాను.

ఎందుకంటే,'యోగశక్తికి దూరంతో సంబంధం లేదు' అన్న విషయాన్ని వారు ప్రత్యక్షంగా గ్రహించారు గనుక.

ఆ విధంగా జరిగిన రెండురోజుల పూర్తిస్థాయి సాధనా సమ్మేళనం నిన్నటితో ముగిసింది.