నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

2, ఆగస్టు 2014, శనివారం

అశ్వత్థామ-గుడ్లగూబ జ్ఞానోపదేశం

మహాభారతం మన చరిత్ర.

దానిని పుక్కిటిపురాణంగా ఒక కట్టుకధగా తెల్లదొరలు భావించారు.తమ బానిసలకు ఇంతటి ప్రాచీన చరిత్ర ఉంటే ఎలా? అన్న అసూయే వారిచేత అలా చేయించింది.

అదే భావాన్ని వారి బానిసలమైన మనం కూడా తలకెక్కించుకుని మన చరిత్రను మనమే చులకనగా చూడటం ఎప్పుడైతే ప్రారంభం చేశామో అప్పుడే మన పతనం ప్రారంభమైంది.మన చరిత్రను మనం విస్మరించి, తెల్లదొరలు వ్రాసిన ప్రకారం అలెగ్జాండర్ దండయాత్ర నుంచే భారతదేశం ఉన్నది.అంతకు ముందు లేదు అని నమ్మడం మొదలుపెట్టామో ఆరోజే మన సాంస్కృతిక మరణం ప్రారంభం అయింది.

మన పతనానికి ఇంకొక కారణం మనదైన దేవభాష సంస్కృతాన్ని మనం పూర్తిగా మరచిపోవడం.ఆ విషయాన్ని ప్రస్తుతానికి పక్కన ఉంచుదాం.

రామాయణ భారతాలు నిజంగా జరిగాయా? అని మనలోనే చాలామందికి అనుమానాలు ఉన్నాయి.

అటువంటి అనుమానాలు ఏమీ అక్కరలేదు.

మహాభారతం నిజంగా జరిగింది.

రామాయణం నిజంగా జరిగింది.

శ్రీరాముడూ శ్రీకృష్ణుడూ చారిత్రిక పురుషులే.

మహాభారతంలోని వీరులు అందరూ చారిత్రిక పురుషులే.వారు కల్పితాలు కారు.ఈ నిజాలకు చెందిన ఎన్నో వాస్తవాలు ఈనాడు పురావస్తు పరిశోధన లలో వెలుగు చూస్తున్నాయి. అయితే ఆ శాఖవారు చెయ్యవలసినంతగా పరిశోధన చెయ్యడం లేదు.ఇంకా దీక్షగా పరిశోధన చేస్తే,దానికి ప్రభుత్వం సహకరిస్తే మన చరిత్ర మళ్ళీ వెలుగు చూస్తుంది.ఆ ఆనవాళ్ళు ఆయాచోట్ల ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి.

సముద్రంలో దాగిఉన్న ద్వారకానగరపు శిధిలాలే దీనికి ప్రబలమైన సాక్ష్యం. ఇకపోతే కురుక్షేత్ర యుద్ధభూమి మన కళ్ళ ఎదుటనే ఉన్నది.ఇంద్రప్రస్థం ఉన్నది.మధుర ఉన్నది.బృందావనం ఉన్నది.మహాభారత భాగవతాలలో మనకు ఎదురయ్యే ప్రతి ప్రదేశమూ మన కళ్ళ ఎదుటనే కనిపిస్తున్నది. ఇంకా అవి అబద్ధాలని మనం అనుకుంటే అంతకంటే బానిసత్వం ఇంకొకటి ఉండబోదు.

మొగలులూ ఇంగ్లీషువారూ మనలను వదలిపెట్టి పోయినా కూడా వారి కుహనా భావజాల బురదను ఇంకా మనం కడుక్కోకుండా అట్టే పెట్టుకుంటాం అంటే అంతకంటే దరిద్రం ఇంకొకటి ఉండదు.

మహాభారతంలో నాకిష్టమైన ఘట్టాలు అనేకం ఉన్నాయి.వాటిల్లో ఒకటి - అశ్వద్ధామ పగతీర్చుకునే ఘట్టం.

మామూలుగా పౌరాణికులు చెప్పుకునే విధంగా కాకుండా దీనిలోని సూక్ష్మాలను కొంచం గమనిద్దాం.

ఎందుకని ఇదే ఘట్టం మీకు ఇష్టమైన ఘట్టాలలో ఒకటి? అని అనుమానం వస్తే,దానికి కొన్ని కారణాలున్నాయి అంటాను.

మనకు సప్త చిరంజీవులున్నారు.

శ్లో||అశ్వత్థామా బలీ వ్యాస: హనూమాంశ్చ విభీషణ:
కృపా: పరశురామశ్చ సప్తైతే చిరజీవిన:

అశ్వత్థామ,బలిచక్రవర్తి, వ్యాసభగవానుడు,హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు,పరశురాముడు-ఈ ఏడుగురు చిరంజీవులు.వారికి ఈ కల్పాంతం వరకూ చావు లేదు.

మనిషిగా పుట్టినవానికి చావు లేకపోవడం ఏమిటి?మహాభారతం జరిగి ఇప్పటికి 5000 సంవత్సరాలు దాటింది.అప్పటి మనుషులు ఇప్పటికీ ఉంటారా?ఇదెలా సాధ్యం?

ఇది వినడానికి విచిత్రంగా ఉంటుంది.అల్పబుద్ధులమైన మనకు అన్నీ విచిత్రంగానే తోస్తాయి.జ్యోతిష్యం నిజమేనా?యోగశాస్త్రం నిజమేనా?వేదాంతం నిజమేనా?దేవుడున్నాడా?సాంప్రదాయం ఎందుకు?ఆయుర్వేదం అసలు పనిచేస్తుందా?మూలికలకు శక్తి ఉన్నదా?తంత్రవిద్య నిజమేనా?శకున శాస్త్రం నిజమేనా?విగ్రహారాధన ఎందుకు?ఇలాంటి అల్పసందేహాలు వెలిబుచ్చుతూ వారికున్న అతితెలివితో మన ధర్మానికి చెందిన ప్రతిదానినీ విమర్శించాలని ప్రయత్నించే అల్పబుద్ధులను చూస్తే నాకు వారిమీద చాలా జాలి కలుగుతుంది.

కొన్నాళ్ళు పోతే "మా అమ్మా నాన్నా నిజమేనా?వారసలు ఉండేవారా?" అని కూడా నేటి మనుష్యులు అడిగేటట్లు కనిపిస్తున్నారు.అమ్మానాన్నా లేకుండా మనమెలా వచ్చామో వారికి అర్ధం కాదు.అలాగే వేల సంవత్సరాల మన ధర్మమూ అది చెబుతున్న విషయాలూ నిజం కాకపోతే నేడు మనకు కనిపిస్తున్న ధర్మాచరణలు ఎలా మిగిలి ఉన్నాయో కూడా వారికి అర్ధం కాదు.ధర్మమూ సంప్రదాయమూ మన తల్లి దండ్రులు.అవి లేవు అనుకుంటే మనం లేనట్లే.వాటిని నిస్సిగ్గుగా ప్రశ్నిస్తే మన అస్తిత్వాన్ని మనం ప్రశ్నించుకున్నట్లే.

వారి చిరునామాను వారు మరచి పోవడం వల్లే ఈ స్థితి దాపురించింది.వారి మూలాలను వారు మర్చిపోయి పాశ్చాత్యుల వైపు దేబిరిస్తూ చూస్తుండటం వల్లే ఇలాంటి సందేహాలు వస్తుంటాయి.వారి పూర్వీకులను వారు మరచి పోయినందువల్లనే ఇలాంటి సందేహాలు వస్తుంటాయి.వారి ధర్మాన్నీ సంప్రదాయాన్నీ వారు మర్చిపోవడం వల్లనే ఇలాంటి అల్పమైన సందేహాలు వస్తున్నాయి.ఎంతో ఉన్నతమైన సంపదకు వారసులై ఉండీ దాని విలువను వారు తెలుసుకోలేక పోతున్నారు.అది వారి ఖర్మ.

కనీసం దానిని ఇప్పుడైనా బాగుచేసుకోవలసి బాధ్యత వారి మీద ఉన్నది. దానికి సరియైన దారిలో ప్రయత్నం అవసరం.ఊరకే సందేహాలు వెలిబుచ్చుతూ ఉంటె వారి అజ్ఞానం బయట పడటం తప్ప ఉపయోగం ఉండదు.

అదలా ఉంచి,ప్రస్తుతానికి వస్తే,సప్త చిరంజీవులలో-పరశురాముడూ హనుమంతుడూ విభీషణుడూ రామాయణకాలం నాటివారు.బలిచక్రవర్తి ఇంకా ముందటివాడు.అశ్వత్థామా వ్యాసమహర్షీ కృపాచార్యుడూ మహాభారత కాలం నాటి వారు.

వీరందరూ ప్రస్తుతం జీవించే ఉన్నారు.మన భారతదేశంలో రకరకాల ప్రదేశాలలో వారు ఇప్పటికీ అజ్ఞాతంగా ఉన్నారు.కొందరు అదృష్టవంతులకు మాత్రమే వారు ఇప్పటికీ కన్పిస్తున్నారు.వీరిలో హనుమంతుని చూచిన వారున్నారు.పరశురాముని చూచినవారున్నారు.కృపాచార్యుని చూచిన వారున్నారు.అశ్వత్థామనూ చూచినవారు నేటికీ ఉన్నారు.

కొన్ని సంవత్సరాల క్రితం పశ్చిమకనుమలలో అవతారమూర్తి అయిన పరశురాముని చూచి మాట్లాడిన ఒక మహనీయుడు నాకు వ్యక్తిగతంగా తెలుసు.

పుట్టిన ప్రతివారూ చావడం మనం చూస్తూ ఉన్నాం గనుక,అలా జరగడమే సహజం అని మనం నమ్ముతుంటాం.కాని ప్రతి నియమానికీ ఒక వెసులుబాటు కూడా ఉంటుంది.పుట్టిన ప్రతివారూ నూరేళ్ళ లోపే చావాలని రూలేమీ లేదు.ఇప్పుడు కూడా నూరేళ్ళు దాటి బ్రతికేవారిని ఎంతోమందిని మనం చూస్తున్నాం.కొన్ని చోట్ల నూటయాభై ఏళ్ళ వరకూ బ్రతికినవారు కూడా ఇప్పటికాలంలోనే ఉన్నారు.

ఆ విషయాన్ని అలా ఉంచితే ఈ మహాభారత కాలపు చిరంజీవులలో వ్యాసమహర్షి యోధుడు కాదు.బ్రాహ్మణధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరించి మహర్షియై వేదాలను విభజన చేసిన మహాగురువు ఆయన.సజీవ శరీరంతో ఆయన దర్శనం ఇప్పటికీ కాశీప్రాంతంలో కొందరు యోగులకు కలుగుతూ ఉంటుంది.గురుపూర్ణిమ నాడు మనం పూజించవలసినది ఇప్పటికీ సశరీరంతో ఉన్నట్టి మహాగురువు వ్యాసమహర్షినే గాని,నేడు తామరతంపరగా పుట్టుకొస్తున్న గురువులను కాదు.ఈ సంగతి నేటి పిచ్చిజనానికి తెలియదు.

ఇకపోతే,మిగిలిన ఇద్దరు-అశ్వద్దామ,కృపాచార్యుడు.

విచిత్రం ఏమంటే వీరిద్దరూ దగ్గరి బంధువులు.వీరిలో కృపాచార్యుడు అశ్వద్దామకు మేనమామ.వీరిద్దరూ జన్మత: బ్రాహ్మణులే అయినప్పటికీ క్షత్రియధర్మాన్ని పాటించినవారు.ఆయుధవిద్యలలో ఆరితేరిన మహా వీరులు.ఖడ్గము,గద,బల్లెము,పరశువు,విల్లు మొదలైన మామూలు ఆయుధాల వినియోగంలోనే గాక,మంత్రసహితములుగా ప్రయోగింపబడే అస్త్రవిద్యలో కూడా వీరు ఉద్దండులు.

వీరిలో కృపాచార్యుడు స్వయానా కౌరవ పాండవులకు అస్త్రశస్త్ర విద్యా గురువు.దారిద్యంలో జీవితాన్ని గడపుతున్న ద్రోణాచార్యుని రప్పించి కురుపాండవులకు రణవిద్యను నేర్పించమని ఆ పదవినుంచి తాను తప్పుకున్న ఉదాత్తస్వభావుడు కృపాచార్యుడు.

ఈయన జన్మత: ఒక గొప్ప మహనీయుడు. అయోనిజుడు.అంటే ఈయన ఒక తల్లి గర్భాన పుట్టలేదు. కుమారస్వామి లాగా ఈయన జననం కూడా తల్లి గర్భం బయటనే జరిగింది.స్వయానా ఒక మహర్షి తనయుడు గనుక ఈయనకూ పుట్టుకతోనే మహర్షి లక్షణాలు సంక్రమించాయి.

ఇక అశ్వత్థామ స్వయానా మహాగురువు ద్రోణాచార్యుని తనయుడు. భరద్వాజ మహర్షి మనుమడు.భారద్వాజ గోత్రం చాలా విశిష్టమైనది. భరద్వాజ మహర్షి అస్త్రశస్త్రాది విద్యలలో ఆరితేరినవాడే గాక 5000 సంవత్సరాల క్రితమే వైమానిక విద్యలో నిష్ణాతుడు.ఆరోజులలో ఉపయోగించే విమానాల తయారీ విధానం అంతా ఆయనకు కొట్టిన పిండి.

మేనమామా మేనల్లుడూ అయిన కృపాచార్యుడు అశ్వత్థామా కలసి ఆరోజు రాత్రి పాండవుల శిబిరం మీదకు దాడి చేశారు.ఆ దాడిలో కృష్ణుడూ పాండవులూ సాత్యకీ తప్ప అక్కడ ఉన్నవేలమంది యోధులు అశ్వత్థామ చేతిలో హతం అయిపోయారు.ఈ ఘట్టం మహాభారతంలోని అనేక ఘట్టాలలో నాకు చాలా ఇష్టమైన ఘట్టాలలో ఒకటి.

ఎందుకు?

ఎందుకంటే,దానికి చాలా కారణాలున్నాయి.

ఒకటి-వీరిద్దరూ జన్మత: బ్రాహ్మణులే అయినప్పటికీ క్షత్రియధర్మాన్ని బ్రాహ్మణధర్మంతో కలిపి పాటించి మహావీరులైనవారు.

రెండు-వీరిలో కృపాచార్యుడు చాలా మహనీయుడు.ఆయన ధర్మానుసారి. కాని సుయోధనునికి ఋణపడి ఉండటం వల్లా,అతను చేసిన మేలును మర్చిపోలేక పోవడం వల్లా,కృతజ్ఞతా భావానికి బద్ధుడై కౌరవుల వైపే పోరాడాడు.

అప్పటి మహావీరులలో చాలామంది ధర్మం తెలిసినవారే. కానీ,'కృతజ్ఞత' అనే ఒక్కదానికి కట్టుబడి సుయోధనుని పక్షాన పోరాడారు. తమకు చావు తప్పదని తెలిసికూడా కృతజ్ఞతకు కట్టుబడ్డారు.అలాగే కృపాచార్యుడు కూడా చేశాడు.అది వారి ధర్మాచరణ.

మూడు-అశ్వద్ధామ కూడా ధర్మం తెలియనివాడు కాదు.ఋషిపుత్రునికి ధర్మం తెలియకుండా ఎలా ఉంటుంది?కాని స్నేహధర్మానికి,కృతజ్ఞతకు కట్టుబడి తమకు జీవితాన్ని ఇచ్చిన సుయోధనుని పక్షాన పోరాడాడు. 

అశ్వద్ధామ శస్త్రాస్త్రవిద్యలలో మహావీరుడు.మహారధి. మహారధి అంటే 60,000 మంది వీరులతో ఒక్కడే పోరాడగల శక్తి ఉన్నవాడు అని యుద్ధవిద్యా నిర్వచనం.అంతేకాదు.మొత్తం ఆనాటి యోధులలో,మహాశక్తివంతమైన బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించే విద్య తెలిసిన ఏకైనయోధుడు అశ్వద్ధామ.ఈ విద్య అర్జునుడికి కూడా తెలుసు.

నాలుగు-కృపాచార్యుడూ ఆశ్వద్దామా ఇద్దరూ కూడా ఈనాటికీ బ్రతికే ఉన్నారు.ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం.

కనుక ఇద్దరు చిరంజీవులైన మహనీయుల కార్యాచరణకు బీజం వేసిన ఆ రాత్రి ఘట్టం మహాభారతం లోని అనేక సన్నివేశాలలో నాకిష్టమైన ఘట్టం.

ఇద్దరు చిరంజీవులతో కూడిన ఆ భయానకమైన రాత్రి సన్నివేశం ఎంతో ఉద్విగ్నభరితమైనది.కొద్దిగా ధ్యానిస్తే చాలు ఆరాత్రి నాకళ్ళ ముందు ఇప్పటికీ కనిపిస్తుంది.

ఆ రాత్రి ఎన్నో భావోద్వేగాలకు నిలయం.ఎంతో అంతర్మధనానికి ఆలయం.

ధర్మాన్ని ప్రశ్నింపజేసింది ఆ రాత్రి.

ధర్మానికి కొత్త నిర్వచనం ఇచ్చింది ఆ రాత్రి.

ఒక మహావీరుని వీర విహారానికి సాక్షిగా నిలిచింది ఆ రాత్రి.

అశ్వద్దామకు కలిగిన ఒక అంతులేని శాపానికీ,నేటికీ ఆయన అనుభవిస్తున్న ఘోరమైన దురవస్థకీ బీజం వేసింది ఆ రాత్రి.

సుయోధనుడు తొడలు విరిగి నేలకూలిపోయి పడి ఉన్నాడు.కురుక్షేత్ర యుద్ధం సమాప్తం అయింది.పాండవుల శిబిరంలో పండుగలు చేసుకుంటున్నారు.అందరూ త్రాగి నృత్యాలు చేస్తూ ఆనందంగా ఉన్నారు.

ఆ రాత్రి నిద్రపట్టనివారు ఇద్దరే ఉన్నారు.

ఒకరు- బాధతో మెలికలు తిరుగుతూ రణరంగంలో నిస్సహాయ స్థితిలో పడి చావుకోసం ఎదురు చూస్తున్న సుయోధనుడు.

ఇంకొకరు-మనస్సులో సుడులు తిరుగుతున్న బాధతో నిద్రపట్టక చీకటిలోకి చూస్తూ అరణ్యంలో చెట్టుక్రింద కూర్చుని ఉన్న అశ్వత్థామ.

పక్కనే కృపాచార్యుడూ కృతవర్మా నిద్రలో ఉన్నారు.కాని అశ్వత్థామకు నిద్ర రావడం లేదు.ఒక పక్కన తండ్రి మరణం,ఇంకొక పక్కన మిత్రుడు సుయోధనుని దీనస్థితి అతని కళ్ళముందు ఆడుతూ ఉన్నాయి.

ఇన్ని విద్యలు తెలిసీ,ఇంత బలమూ శౌర్యమూ ఉండీ తన తండ్రి అధర్మంగా చంపబడుతూ ఉంటె ఏమీ చెయ్యలేక తాను చూస్తూ ఉండవలసి వచ్చింది. ఇప్పుడు మిత్రుడు సుయోధనుని మరణాన్ని కూడా కళ్ళారా చూస్తూ ఊరకుండవలసి వచ్చింది.అశ్వత్థామ బాధతో ఆగ్రహంతో కుమిలి పోతున్నాడు.

ఆ సమయంలో అతను ఒక దృశ్యాన్ని చూచాడు.ఒక గుడ్లగూబ ఆ నిశిరాత్రిలో సంచరిస్తూ కాకిగూళ్ళలోకి వెళ్లి అక్కడి కాకిపిల్లలను చంపేస్తూ ఉండటాన్ని అతను గమనించాడు.అతనికి ఏం చెయ్యాలో బోధపడింది. గుడ్లగూబ అతనికి జ్ఞానోపదేశం చేసినట్లూ కర్తవ్యాన్ని ఉపదేశించినట్లూ అయింది.

కాకులకు రాత్రిళ్ళు కళ్ళు కనిపించవు.కాని గుడ్లగూబ అలా కాదు.అది రాత్రిళ్ళు బాగా చూడగలదు.రాత్రిపూట మాత్రమే అది సంచరిస్తుంది. కాకిధర్మం వేరు.గుడ్లగూబ ధర్మం వేరు.

అశ్వద్దామకు కర్తవ్యం బోధపడింది.తెల్లవారే లోపల పని పూర్తి కావాలి. ఆలస్యం చేస్తే ఉపయోగం లేదు.వెంటనే పనికి ఉపక్రమించాలి.

ఇక తట్టుకోలేక,కృపాచార్యుడినీ ఆ పక్కనే నిద్రిస్తున్న కృతవర్మనూ నిద్రలేపాడు అశ్వత్థామ.తాను చెయ్యబోతున్న పనిని వివరించి వెంటనే బయలుదేరమని అన్నాడు.ఒకవేళ వారు తనతో సహాయంగా రావడానికి ఇష్టపడక పోతే తానే ఒంటరిగా వెళ్లి పాండవశిబిరం మీద దాడిచేసి తెల్లవారేలోపల అందర్నీ చంపి సుయోధనునికి ఆ వార్తను తెలియజేసి ఆనందాన్ని కలిగిస్తానని అంటాడు.

అప్పుడు ఆయనకూ కృపాచార్యునికీ జరిగిన సంభాషణ నాకు ఎంతో ఇష్టమైన ఘట్టాలలో ఒకటి.ఎన్నో ధర్మసూక్ష్మాలను ఈ సంభాషణ కలిగి ఉన్నది.

నన్ను ఎందఱో ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు.అలాంటివారు కొంచం శ్రద్ధ తీసుకుని మహాభారతం చదివితే వారి సందేహాలు అన్నీ నివృత్తి అవుతాయి.మహాభారతంలో లేని విషయం లేదు.అన్నిరకాలయిన ధార్మిక,ఆధ్యాత్మిక,లౌకిక విషయాలూ,ఎన్నో ధర్మసూక్ష్మాలూ అందులో స్పష్టంగా వివరింపబడి ఉన్నాయి.

ఈనాడు మనకు నిత్యజీవితంలో వస్తున్న అనేక సందేహాలకు సమాధానాలు ఆనాడే అందులో చెప్పబడినాయి.వాటిని అర్ధం చేసుకుని ఆచరించడమే మనం చెయ్యవలసినది.

(ఇంకా ఉన్నది)