Pages - Menu

Pages

12, ఆగస్టు 2014, మంగళవారం

అమెరికా అభిమానీ -- ఆశుకవిత్వమూ

మొన్నొకరోజున నల్గొండలో పని ముగించుకుని గుంటూరుకు తిరుగు ప్రయాణంలో రైలెక్కాను.

నన్నూ మా ఇనస్పెక్టర్నీ చూస్తూనే కండక్టర్ 'సార్ మీకోసం 6,7 సీట్లు ఖాళీగా ఉంచాను' అన్నాడు.

'ఓకే.ధాంక్స్' అంటూ రైలెక్కి మా సీట్లు చూచుకుని కూచున్నాము.

పక్కనే 5 నంబర్లో ఎవరో ఒకాయన కూచుని ఉన్నాడు.

కొంతదూరం ప్రయాణం జరిగింది.మా ఇనస్పెక్టర్ ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు.నేను వింటున్నాను.

కాసేపయ్యాక పక్కకు చూస్తే,ఆ ఐదో నంబర్ సీటాయన నావైపు ఒకరకంగా చూస్తున్నాడు.

'ఏంటబ్బా ఇలా చూస్తున్నాడు?ఏమోలే మనకెందుకు?' అనుకుని సర్దుకుని కూచున్నాను.

కాసేపయ్యాక అతను మళ్ళీ అలాగే చూడటం గమనించాను.

పొద్దున్న షేవింగ్ చేసుకునేటప్పుడు పొరపాటున ఎక్కడైనా వదిలేశానా అని అనుమానం వచ్చి ముఖం తడిమి చూచుకున్నాను.అంతా బాగానే ఉంది.

'మరేమిటి ఈయన సమస్య?' అని అతని వైపు చూచాను.

'సార్.మీరు సత్యనారాయణ శర్మగారు కదా' అన్నాడు అతను.

'అమ్మనాయనో దొరికిపోయాన్రా బాబూ.ఈయనెవరో బ్లాగుపక్షి అయి ఉంటాడు.ఇక గుంటూరు వచ్చేవరకూ నాకు తప్పదన్నమాట సుత్తి.' అనుకుంటూ 'అవునండి' అన్నాను.

అతను సీట్లోంచి దిగ్గున లేచి నిలబడ్డాడు.

'సార్.నేను మీ వీరాభిమానిని.మీ బ్లాగ్ ప్రతిరోజూ చదువుతాను.ఇంకా చెప్పాలంటే ఒక్క రోజు మీరు పోస్ట్ వ్రాయకపోతే ఇంకా వ్రాయరేమిటి అని పదిసార్లు మీ బ్లాగు ఓపన్ చేస్తూ ఉంటాను.' అన్నాడు సంభ్రమంగా.

'అమ్మయ్య.బ్రతికించావు' అనుకుని 'అవునా.థాంక్స్.కూచోండి.ఎందుకు నిలబడ్డారు?' అన్నాను.

'సార్.నేను దీనిని నమ్మలేకపోతున్నాను.మీరు?ఇలా నా పక్కన ప్రయాణంలో కలవడం?' అని ఉబ్బిపోతున్నాడు.

అతన్ని నార్మల్ చేద్దామని ' ఎక్కణ్ణించి వస్తున్నారు?' అడిగాను.

'నేను అమెరికాలో ఉంటాను.మీ పోస్ట్ లు అన్నీ మొదటినుంచీ చదివాను. రెండేళ్ళ తర్వాత ఇప్పుడే ఇండియాకు వచ్చాను.హైదరాబాద్ లో దిగి మా ఊరు వెళుతున్నాను.నిజానికి మిమ్మల్ని కలవడం ఈసారి నా ప్రోగ్రాంలో ఒక భాగం.నేను దుర్గామాత భక్తుడిని.మీరు వ్రాసిన తారాస్తోత్రం రోజూ చదువుకుంటాను.మిమ్మల్ని రోజూ తలచుకుంటాను.విమానం ఎక్కబోయే ముందుకూడా అమ్మను ప్రార్ధించాను మిమ్మల్ని కలిసేటట్లు చెయ్యమని. ఎందుకంటే మీరు ఎవరితోనూ కలవడానికి అంత ఇష్టపడరని మీ బ్లాగ్లో చదివాను.ఈ ట్రిప్పులో నాకు మిమ్మల్ని కలవడం వీలవుతుందో లేదో,మిమ్మల్ని ఎలా కలవాలా? అని అనుకుంటున్నాను.ఇది కలో నిజమో కూడా నాకు అర్ధం కావడం లేదు.' అంటూ తెగ ఎగ్జైట్ అయిపోతున్నాడు.

ఇలాంటి సంఘటనలు చాలాసార్లు నేను చూచాను గనుక నాకు ఏమీ కొత్త అనిపించలేదు.

'ఇదంతా మామూలే.అమ్మ నా జీవితంలో ఇలాంటి అద్భుతాలు అనేకం చేసింది.' అన్నాను నవ్వుతూ.

ఇక అతను మాట్లాడటం మొదలుపెట్టాడు.నేను శ్రోతనైపోయాను.నా బ్లాగులో నేను ఎప్పుడో వ్రాసి మరచిపోయిన విషయాలు కూడా కొన్ని అతను గుర్తు చేసి వాటిని చదివి అతను ఎంత ప్రభావితుడైనదీ వివరిస్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది.

అలా ఒక గంట ప్రయాణం గడిచాక వీలైతే తన జాతకం చూడమని అభ్యర్ధించాడు.జాతకం ఇప్పుడు కాదు,తర్వాత చూస్తానని చెప్పి, అతని శరీర లక్షణాలను బట్టి అతని కుటుంబమూ బంధువులూ స్నేహితులూ జీవితంలో జరిగిన కొన్నికొన్ని వివరాలూ అప్పటికప్పుడు చెప్పాను.

ఆ తర్వాత తనకున్న ఆధ్యాత్మిక సందేహాలను కొన్నింటిని అడిగాడు.వాటిని వివరించి అతని సందేహాలను తీర్చాను.

అతను చాలా సంతోష పడ్డాడు.

అప్పటికి అతనికి ఎగ్జైట్ మెంట్ తగ్గి మామూలు మనిషయ్యాడు.

సరదాగా మాట్లాడుకోవడం ప్రారంభించాం.

'సార్.మీకు కోపం ఎక్కువని సాధారణంగా మీ వ్రాతలు చదివిన వాళ్ళు అనుకుంటారు.కాని మీరేమో ఇంత సరదాగా మాట్లాడుతున్నారు.ఏంటిది?' అన్నాడు.

'మా గోత్రపు మూలపురుషులలో పరశురాముడు ఒకరు.ఆయనా దూర్వాస మహర్షీ అనుసరించిన శ్రీవిద్యాతంత్రపు పరంపరనే నేనుకూడా అనుసరిస్తాను ఆచరిస్తాను.కనుక వారిలాగా నాకూ కోపం ఎక్కువేనేమో?నాకైతే తెలియదు.' అన్నాను నవ్వుతూ.

'మీకు కోపం ఎక్కువనే అభిప్రాయం తప్పని ఇప్పుడు పర్సనల్ గా నేను తెలుసుకున్నాను.' అన్నాడు.

నేనేమీ మాట్లాడలేదు.

'సార్.మీరేమనుకోక పోతే నాదొక చిన్న రిక్వెస్ట్' అన్నాడు.

'చెప్పండి.' అన్నాను.

'మీకు ఆశుకవిత్వ వరం ఉన్నదని మీ 'శ్రీవిద్య' చదివితే అర్ధమౌతున్నది. పద్యాలలో కందపద్యం చాలా కష్టం అని నేను నమ్ముతాను.మీరన్ని కంద పద్యాలను అవలీలగా ఎలా చెబుతారు?ఇది నాకెప్పటికీ అర్ధం కాని వింత?' అడిగాడు.

నవ్వాను.

'నాకూ తెలియదు.అంతా అమ్మ అనుగ్రహం.' అన్నాను.

'సార్.మీరేం అనుకోకపోతే నాకోసం కొన్ని పద్యాలు ఇప్పుడు చెప్పగలరా?' దాదాపు ప్రాధేయ పడుతున్నట్లుగా అడిగాడు.

మనిషి మంచివాడులాగే ఉన్నాడు.గర్వమూ అహమూ అతితెలివీ లేవు. పైగా మన అభిమాని.కనుక ఇతని కోరిక నెరవేరుద్దామని అనుకున్నాను.

నా ఆలోచనను భగ్నం చేస్తూ ' కానీ కొన్ని కండిషన్స్ సార్.దీనికి కూడా మీరు మన్నించాలి' అన్నాడు.

'మళ్ళీ ఇవేమిటి?' అనుకుంటూ 'సరే చెప్పండి' అన్నాను.

'మీరిప్పుడు సరదాగా ఉండే పద్యాలు ఆశువుగా చెప్పాలి.అదికూడా ఇంగ్లీషు పదాలు ఉపయోగించి చెప్పాలి.ప్లీజ్ నా రిక్వేష్ట్ కాదనకండి.ఎందుకంటే మీతో ఈ ప్రయాణం నాజీవితంలో నాకెప్పుడూ గుర్తుండిపోవాలి.అందుకోసం ఇలా అడుగుతున్నాను.' అన్నాడు.

నవ్వొచ్చింది.

ఈ అమెరికావాళ్ళతో ఇదొక చిక్కు.అదేమిటోగాని వాళ్లకు విచిత్రమైన కోరికలుంటాయి.

'సరే చూద్దాం'-అనుకుని అమ్మను ఒక్క క్షణం మనస్సులో తలచుకున్నాను.

'చూడండి.సరదా అంటే ఇతరులమీద కామెంట్ చెయ్యాలి.ఆ పాపం నాకెందుకు?నా మీద నేనే కామెంట్ చేసుకుంటూ జోకులేసుకుంటూ చెబుతాను.కానీ నావి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి.వాటికి మీరూ ఒప్పుకోవాలి' అన్నాను.

'ఏమిటి సార్ అవి?' అడిగాడు.

'నేను చెబుతుంటే మీరు పెన్నూ పేపరూ తీసుకుని గబగబా వ్రాసుకోవాలి. మధ్యలో రెండో సారి చెప్పమని అడగకూడదు.అలా అడిగితే అక్కడితో నా ఫ్లో ఆగిపోతుంది.ఆ పైన చెప్పను.అంటే నేను వినాయకుడిని మీరు వ్యాసభగవానులన్నమాట ప్రస్తుతానికి ' అన్నాను నవ్వుతూ.

'అలాగే సార్' అన్నాడు అతను కూడా నవ్వుతూ.

ఇదంతా అతనికి భలే సరదాగా ఉన్నదని అతన్ని చూస్తేనే అర్ధమై పోతున్నది.

'రెడీనా' అడిగాను.

'రెడీ' అన్నాడు పెన్ను ఒక నోట్ ప్యాడూ రెడీ చేసుకుంటూ.

'వ్రాసుకోండి' అన్నాను మనస్సును ఏకాగ్రం చేస్తూ.

కం||ప్రాగ్జ్యోతిష పురమందున
బ్లాగ్జ్యోతిష్కుం డొకండు బిగ్గుగ మెరసెన్
ఎగ్జోటికు సబ్జెక్టుల
ప్రాగ్జిమిటీలే దెలుపుచు ప్రజ్ఞను జూపెన్

'ఇది మొదటి పద్యం.ఎలా ఉంది?' అడిగాను.

అతను ఉబ్బిపోతున్నాడు.

'రెండవది వినండి.' అంటూ ఇది చెప్పాను.

కం|| బ్యూటీఫులు పోస్టులతో
డ్యూటీ దప్పక దెలుపును జరిగిన వార్తల్
నాటీగా ఎదురొచ్చిన
ఫైటింగుకు రమ్మనమని పిలుపుల నిచ్చున్

'ఇదెలా ఉంది?' అన్నాను నవ్వుతూ.

'సార్.నేను మాటల్లో చెప్పలేను.ప్లీజ్ కొనసాగించండి.' అతను ఉద్వేగంతో ఊగిపోతున్నాడు.

కం|| పటపట మను పోస్టులతో 
ఫేటును జూపించునతడు ప్లాటరు నందున్
సిటిజెన్లను నెటిజెన్లను
చిటపటలాడంగ జేయు చిమరిక్కులతో

'ఇదెలా ఉంది?' అతన్ని ఊరించడానికి అడిగాను.

'ప్లీజ్ ప్లీజ్ కంటిన్యూ సార్.అయాం నోటింగ్ డౌన్' అన్నాడు వేగంగా వ్రాసుకుంటూ.

ఇంతలో మా కేటరింగ్ వారు 'టమోటో జ్యూస్' తీసుకొచ్చి నాకొక కప్పు ఇచ్చారు.అతనికీ మా ఇనస్పెక్టరుకీ కూడా ఇవ్వమని చెప్పాను.

'ఒకచేత్తో జ్యూస్ తాగుతూ ఇంకో చేత్తో ఈ పద్యం వ్రాసుకోండి.'-అంటూ ఇది చెప్పాను.

కం||న్యూసుల పేపరు చదువుచు
జ్యూసుం ద్రావుచు గిలుకును జ్యోతిష్యములన్
కేసు స్టడీలను దెల్పుచు
డోసులతో క్యూరుజేయు డీసీజు లనే

టమోటో జ్యూస్ మింగుతున్న అతనికి నవ్వుతో పొలమారింది.

'ఇంకొకటి వ్రాసుకోండి.'అంటూ ఈ పద్యం చెప్పాను.

కం||నెటు లోకము నందాతడు
నటుషెల్లున జూపునింక నేషను న్యూసున్
కటుత్రోటుగ కామెంటిన
బటుబూటున దన్నవచ్చు భయమది లేకన్

అని చెప్పి 'ఇక చాలు'. అన్నాను.

'ఏం సార్.ఆపారు? అని అడిగాడు.

'ఒక్కసారి మీ సీట్ నంబర్ చూడండి.' అన్నాను.

'అయిదు' అన్నాడు.

'అందుకే అయిదు పద్యాలు చెప్పాను.ఇక చాలు.మీకో విషయం చెబుతాను వినండి.అయిదు బుధునికి సూచిక.ఇంటలెక్చువల్ ఎమినెన్స్ ఇచ్చేది కూడా బుధుడే.జాతకంలో బుధ కారకత్వాలు బలంగా ఉన్న వారితోనూ బుధ నక్షత్రాల వారితోనూ నాకు అనుబంధం తేలికగా ఏర్పడుతుంది. ఎందుకంటే నా నక్షత్రం రేవతి.' అన్నాను.

'అవునా?నాదీ రేవతీ నక్షత్రమే సార్.అంటే కూచునే సీటుతో సహా లింకులు ఇలా ఉంటాయా?' అతను మళ్ళీ ఆశ్చర్యపోయాడు.

'సార్.అద్భుతం.నో వర్డ్స్.మాటల్లేవు.నా జీవితంలో ఈరోజు ఇలా జరగడం నేనిప్పటికీ నమ్మలేకపోతున్నాను.'అన్నాడు.

ప్రయాణమంతా ప్రతి అయిదు నిముషాలకొకసారి అలా అంటూనే ఉన్నాడు.

ఇంతలో గుంటూరు వచ్చింది.

'మా ఊరొచ్చింది.నేను దిగాలి.' అంటూ నేను లేచాను.

'సార్.మీకు అభ్యంతరం లేకుంటే మీ అడ్రస్ ఇస్తే,ఒక వారం తర్వాత మీ ఇంటికి వచ్చి ఒకసారి మళ్ళీ మీతో మాట్లాడాలని నా కోరిక.ప్లీజ్ కాదనకండి. ' అన్నాడు.

'దానిదేముంది.అలాగే రండి.' అని నా ఫోన్ నంబరూ మా ఇంటి అడ్రసూ అతనికి ఇచ్చాను.

నేను రైలు దిగుతుంటే ఒద్దని వారిస్తున్నా వినకుండా నా పాదాలను తాకి నమస్కరించాడు.చుట్టూ ఉన్నవాళ్ళు వింతగా చూస్తున్నారు.ఇదొక ఇబ్బందికర పరిస్థితి.కానీ ఏంచేస్తాం?ఒక్కొక్కసారి తప్పదు.వారి అభిమానాన్నీ వారిచ్చే గౌరవాన్నీ కాదనలేం.అది అమ్మ ఇస్తున్నది.వద్దంటే ఆమెకు మళ్ళీ కోపం వస్తుంది.

ఇటువంటి అభిమానులను నాకిచ్చినందుకూ ఇంకా ఇస్తున్నందుకూ అమ్మను మనస్సులో తలచుకొని ప్రణామం చేశాను.

అమెరికా అభిమానితో సరదా ప్రయాణం అలా జరిగింది.