Pages - Menu

Pages

15, ఆగస్టు 2014, శుక్రవారం

అశ్వత్థామ - పరమగురుకటాక్షం - శాపవిమోచనం

తన పాదాలపై బడి ఏడుస్తున్న అశ్వత్థామను జాలిగా చూచాడు పరశురాముడు.

'ఏడవకు నాయనా! లే!' అంటూ తన చేతులతో అతన్ని పైకి లేవనెత్తాడు.

ఆ దైవాంశసంభూతుడైన మహనీయుని స్పర్శతో అశ్వత్థామకు తనను పీడిస్తున్న బాధలు సగం తీసివేసినట్లు అనిపించింది.

తనకు శాపవిమోచనం కలిగినంత ఆనంద పడ్డాడు.

'భగవన్! నేను పాపాత్ముడను. భయంకరమైన పాపాలను గావించాను.మీ పవిత్ర కరకమలముల స్పర్శకు నేను తగను.' అంటూ రోదించసాగాడు.

చిరునవ్వు నవ్వినాడు రేణుకా తనయుడు.

'అన్ని విషయాలనూ గ్రహించాను నాయనా.నాకంతా తెలుసు. వ్యాసునిద్వారా నిన్ను ఇక్కడకు వెళ్ళమన్న సంకల్పాన్ని కలిగించింది నేనే.' అన్నాడాయన.

అప్రతిభుడైనాడు అశ్వత్థామ.

'భగవన్! ఏమిటి ఈ జగన్నాటకం? నన్నిక్కడికి రప్పించినది మీరేనా?మరి ఈ మూడు రోజులూ నన్నింత చిత్రవధకు గురిచేసినది ఎందుకు?నాకు మీ దర్శనభాగ్యాన్ని కలిగించకుండా ఇంత మానసిక క్షోభకు నన్ను గురిచేసినది ఎందుకు?' వినమ్రంగా అడిగినాడు.

'చేసినకర్మ అలా కాకుండా ఇంకెలా తీరుతుందనుకున్నావు నాయనా?' చిరునవ్వుతో ఎదురు ప్రశ్నించాడు పరశురాముడు.

'నీవు ఈ మూడురోజుల పాటు పడిన వ్యధతో నీ త్రివిధ శరీరాలలో ఆశ్రయించుకుని ఉన్న పాపకర్మ కొంత క్షయించి నీకు నన్ను చూడగలిగే అర్హత ప్రాప్తించింది.లేకుంటే నీ చర్మచక్షువులతో నా దివ్యరూపాన్ని నీవు చూడగలననే అనుకుంటున్నావా?.'ప్రశ్నించాడు.

ఆ మాటతో తనకు పట్టిన శాపం గుర్తుకు వచ్చింది అశ్వత్థామకు.

'కృష్ణుని శాపం నన్ను వెంటాడుతున్నది మహానుభావా! నేను చేసిన పాపఖర్మ నన్ను వెంటాడుతున్నది.నేను మీ పరమశిష్యుడను.అన్యథా శరణం నాస్తి.మీరుదప్ప ఈ శాపాన్ని విమోచనం చెయ్యగలవారు ఇక ఎవ్వరూ ముల్లోకాలలోనూ లేరు.అనుగ్రహించండి.నన్ను కరుణించండి.నాకు ఈ శాపం నుంచి విముక్తి ప్రసాదించండి.'అంటూ మళ్ళీ ఆయన పాదాలమీద పడబోయాడు.

వారించాడు పరశురాముడు.

'నాతో రా నాయనా' అంటూ తన ఆశ్రమం వైపు దారి తీశాడు.

ఆశ్చర్యం!!

ఆ పర్వతం మీద అప్పటివరకూ తాను మూడురోజులనుంచీ ఎన్నోసార్లు తిరిగిన నిర్జన ప్రదేశంలోనే ఒక విశాలమైన కుటీరం అశ్వత్థామకు కనిపించింది.

భృగునందనుని లీలకు ఆశ్చర్య పోతూ ఆయనను వెంబడించాడు.

స్నానపానాదులు ముగించి సేదదీరిన తదుపరి మళ్ళీ తన దుస్థితిని వివరిస్తూ శాపవిమోచనం అనుగ్రహించమని వేడుకున్నాడు.

తానొక్క దర్భాసనం మీద ఆసీనుడై అశ్వత్థామను ఇంకొక ఆసనం మీద కూర్చోనమని చెప్పి నిశ్చలంగా అతన్ని చూస్తూ ఉపదేశం ఆరంభించాడు పరశురాముడు.

'అశ్వత్థామా.విను కృష్ణశాపం తిరుగులేనిది.ఆయన భగవంతుని అవతారం.నేనూ ఆయనా నిజానికి ఒక్కరమే.ఒక రూపంలో నిన్ను శపించినది నేనే.మరలా ఈ రూపంలో నిన్ను అనుగ్రహిస్తున్నదీ నేనే.'

అశ్వత్థామకు మళ్ళీ మతి పోయినంత పనయింది.

'అవును నాయనా.ఇదంతా లీలానాటకం.కాలప్రభావంతో యుగాలు మారుతూ ఉంటాయి.ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మం ఉంటుంది.క్రమేణా ధర్మం క్షీణిస్తుంది.అప్పుడు అధర్మం పెరిగి పెరిగి ఒక విధమైన దుర్భరమైన స్థితికి భూమి చేరుకుంటుంది.ఆ సమయంలో ఆ భారాన్ని తొలగించి మళ్ళీ కొత్త ఋతువును భూమిపైన ఆవిష్కరించడానికి జననాశనం చెయ్యక తప్పదు.

నా కాలంలో కూడా అధర్మ ప్రభావంతో ఎక్కడ చూచినా భూభారం పెరిగిపోయింది.దానిని తగ్గించాలంటే యుద్ధం అవసరం.అధర్మంలో మునిగి అహంకారంతో కన్నూమిన్నూ గానక తాము చెప్పినదే వేదమన్నట్లు ప్రవర్తిస్తున్న రాజులను సంహరించడానికే నేను అవతరించాను.సమస్త భూమండలాన్నీ ఇరవై ఒక్కసార్లు వెదకి మరీ క్షత్రియసంహారం గావించాను.

నా పరశు ప్రహారానికి తెగని రాజశిరస్సు లేదు.ఆ కాలంలో నేను సంహరించిన రాజుల రక్తంతో ఈ భూమి ముద్దగా తడిసిపోయింది.

ఇదంతా చాలాకాలం క్రితం జరిగింది.ప్రస్తుతం నేను ఈ మహేన్ద్రగిరిని నా నివాసంగా మార్చుకుని ఇక్కడే నిరంతర తపోదీక్షలో ఉంటున్నాను.

కాలం మారింది.యుగాలు మారాయి.అధర్మం మళ్ళీ విజృంభించింది.ఎక్కడా ధర్మం అనేది లేదు.భూభారం మళ్ళీ పెరిగిపోయింది.అందుకే మహాభారత యుద్ధం అనివార్యమైంది.ఇది శ్రీకృష్ణుని ఇచ్చానుసారమే జరిగింది.ఇందులో ఆయన తన పాత్రను చక్కగా పోషించాడు. మీరందరూ కూడా ఆయన లీలానాటకంలో పాత్రలు.మీమీ పాత్రపోషణ కోసం భూమిమీదకు వచ్చారు.కర్తవ్య నిర్వహణ గావించారు.భూభారం మీద్వారా తగ్గించబడింది.

నీలో రుద్రాంశ ఉన్నది.నీ ద్వారా కొన్ని వేలమంది హతులు కావలసిన కర్మ వారికి ఉన్నది.తద్వారా కొంతకాలం ఖర్మ అనుభవించవలసిన గతి నీకున్నది.అంతా కర్మప్రభావం.

కర్మ దురూహ్యమైనది.దాని మూలాలు ఎక్కడ ఉన్నాయో మహనీయులైన సిద్ధులు మాత్రమె గ్రహించగలరు.అన్యులకు అది అసాధ్యం.కర్మ ప్రభావంతో జీవులు ఈలోకంలో పుట్టి రకరకాలైన పూర్వకర్మ ఫలాలను అనుభవిస్తూ ఉంటారు.తమకు మంచి జరిగినప్పుడు తమ గొప్ప అనుకుంటారు.చెడు జరిగినప్పుడు దైవాన్ని నిందిస్తారు.కానీ సమస్తం తమ కర్మానుసారమే జరుగుతున్నదన్న సత్యాన్ని వారు గ్రహించలేరు.

నీ కర్మానుసారంగానే నీకు కృష్ణుని శాపం తగిలింది.కృష్ణుని శాపాన్ని నేను తీసివెయ్యగలను.ఎందుకంటే మేమిద్దరమూ విష్ణువు యొక్క ప్రతిబింబాలమే.

'ఒక్కసారి తలెత్తి చూడు.' అన్నాడు పరశురాముడు.

అప్పటివరకూ తలవంచుకుని ఆయన మాటలు శ్రద్ధగా వింటున్న అశ్వత్థామ తలెత్తి ఆయనవైపు చూచాడు.

ఆశ్చర్యంతో నోటమాట రాక అప్రతిభుడై తాను చూస్తున్న దృశ్యాన్ని గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయాడు.



పరశురాముని స్థానంలో లీలామానుష విగ్రహుడూ పీతాంబరధారీ తన కిరీటమున నెమలి పింఛమును అలంకారముగా కలిగినవాడూ చేతిలో మురళిని ఎల్లప్పుడూ ధరించేవాడూ అయిన శ్రీకృష్ణుడు కూర్చుని చిద్విలాసంగా నవ్వుతూ అశ్వత్థామకు దర్శనమిచ్చాడు. 

అశ్వత్థామకు నోట మాట రాలేదు.

తేరుకుని శ్రీకృష్ణుని పాదాలకు సాష్టాంగ ప్రణామం గావించాడు.

'భగవన్! నీ లీల ఇప్పుడిప్పుడే నాకు కొద్దిగా అర్ధమౌతున్నది.నీ లీలలో మేమంతా పావులమే.ఆ విషయం తెలియక అంతా మేమే చేస్తున్నామన్న భ్రమలో అహంకారంలో మునిగి విర్రవీగాము.నిన్ను వ్యతిరేకించాము.నీవు మావలెనే సామాన్య మానవుడవని భావించి నానా దుర్భాషలాడాము.నీ లీలను గ్రహించలేక పోయాము.

పాండవులు అలా చెయ్యకుండా నీపట్ల పూజ్యభావం కలిగినవారై నీకు శరణాగతులై నీవు సూచించిన ఉత్తమమైన మార్గంలో నడిచారు.ఇప్పుడు నాకంతా అర్ధమౌతున్నది.కానీ ప్రస్తుతం నేనేమి చెయ్యగలను?చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉన్నది నా పరిస్థితి.

నీకు కరుణామూర్తివి.శరణాగతరక్షకుడవు.నన్ను క్షమించు.నా పాపాలను మన్నించు.నీ శాపాన్ని ఉపసంహరించు' అని వేడుకున్నాడు.

జగత్సమ్మోహనమైన చిరునవ్వు నవ్వాడు మురళీమోహనుడు.

'అశ్వత్థామా! విను.సమస్త జగత్సృష్టి స్థితి సంహారాలకు నేనే కారణాన్ని.నా శాపాన్ని ఈ క్షణమే నేను ఉపసంహరించగలను.కానీ ఆ పనిని నేను చెయ్యను.అలాచేస్తే నేను పెట్టిన నియమాన్ని నేనే ధిక్కరించినట్లు అవుతుంది.అంతమందిని నీవు వధించిన కర్మ తీరేమార్గం అది కాదు.ఈ విధంగా అందరి కర్మనూ నేను నా అనుగ్రహంతోనే క్షయం గావిస్తే ఇక సృష్టి ఎందుకు?ఈ లీల అంతా ఎందుకు?ఏ సృష్టీ చెయ్యకుండా నా స్వస్థితిలో ఆనందశయనుడనై నేనే ఎల్లప్పుడూ ఉండవచ్చు.

సృష్టి అంటేనే కర్మవలయం.ఆ వలయంలో పడిన నీవు నీ స్వప్రయత్నంతోనే అందులోనుంచి బయటకు రావాలి.అందుకోసం నీకు ఒక మార్గం మాత్రమె నేను చూపిస్తాను.నడక నీవే నడవాలి.

అనుభవించనిదే ఎవరికైనా సరే కర్మ తీరదు నాయనా.ఈ విషయాన్ని ముందు చక్కగా గ్రహించు.కాకుంటే ఒక సులభోపాయాన్ని నేను చెప్పగలను.నిన్ను ఉద్ధరించే మార్గాన్ని నీకు ఉపదేశించగలను.

ఎందుకంటే శాపాన్ని నీకు ఇచ్చినదీ నేనే.అది పోయే మార్గం చెప్పేవాడను కూడా నేనే.' అంటూ శ్రీకృష్ణుడు మాయమై ఆయన స్థానంలో తిరిగి పరశురాముడు కన్పించసాగినాడు.

'అశ్వత్థామా! శ్రద్ధగా విను.

బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించిన ఒక మహాశక్తి ఉన్నది.ఆమెయే ఆద్యాశక్తి.ఆమె జగజ్జనని. పరాత్పరి. లీలావినోదిని.సమస్త సృష్టీ ఆమె ఆడుతున్న ఒక ఆట.

అనుకుంటే ఒక్కక్షణంలో ఆమె ఎన్నో కోట్ల భూగోళాలను తాను సృష్టించగలదు.మళ్ళీ ఒక్క క్షణంలో వాటిని తుత్తునియలు చేసి గాలిలో కలిపి వెయ్యగలదు.సృష్టి స్థితి లయములు ఆమె కనుసన్నలలో నడుస్తూ ఉంటాయి.ఇవన్నీ ఆమె ఆడుకునే ఆటలు.

జగన్మాత అయిన ఆమె అనుగ్రహం లేనిదే త్రిమూర్తులమైన మేము కూడా ఏమీ చెయ్యలేము.అట్టి మహాశక్తి అనుగ్రహం వల్లనే నీవు ఇప్పుడు నీ శాపవిమోచనాన్ని పొందగలవు.ఎందుకంటే నా శాపాన్ని త్రిప్పివెయ్యగల శక్తి ఆమె ఒక్కరికే సాధ్యం.ఇంకెవ్వరూ ఈ సమస్త సృష్టిలో ఆపనిని చెయ్య సమర్ధులు కారు.చెయ్యగలిగినా కూడా నేనా పనిని చెయ్యకూడదు.

సముద్ర మధన సమయంలో వెలువడిన కాలకూట విషాన్ని త్రాగి మూర్చితుడైన శివుని తిరిగి పునర్జీవితుని చేసిన శక్తి ఆమెయే.ఆమెయే ప్రపంచస్థితి రక్షణలో నాకు సహాయంగా లక్ష్మిగా ఉన్నది.సృష్టికర్త యైన బ్రహ్మదేవుని ముఖంలో పలికే వేదనాదమైన సరస్వతి ఆమెయే.ఆమె కరుణ లేకుంటే మేము ముగ్గురమూ అశక్తులమే.

ఫాలాక్షుని త్రినేత్ర జ్వాలలో కాలి బూదిగా మారిన రతీపతిని కరుణతో పునర్జీవితుని గావించిన మాతృమూర్తి ఆమె.సమస్త శాపాలనూ పాపాలనూ పోగొట్టుకోవాలని వాంచించేవారు శీఘ్రఫలదాయిని అయిన జగజ్జననినే ఉపాసించాలి.

జగజ్జనని అనుగ్రహాన్ని పొందే ఒకే ఒక్క శీఘ్రోపాయం ఉన్నది.అదే శ్రీవిద్యా తంత్రం.దానిని నేను నా గురువైన దత్తాత్రేయుని వద్ద గ్రహించాను.సమస్త లోకాలలోనూ దీనిని మించిన ఉన్నతమైన సాధన గానీ రహస్యమైన సాధన గానీ లేనేలేదు.ఇకముందు ఉండబోదు కూడా.

ఆ జగజ్జననిని ఉపాసించే పంచదశీ విద్యను నీకు ఇప్పుడే ఉపదేశిస్తాను.ఆ ఉపాసనా బలంతో నీ ఖర్మను నీవే జయించాలి.నేను ఆపనిని నీకు చేసి పెట్టకూడదు.అలా నేను చెయ్యను.అది సృష్టి విరుద్ధం.కర్మ విరుద్ధం.ధర్మ విరుద్ధం కూడా.

ఇక్కడ నీకు కొన్ని రహస్యాలు చెబుతాను విను.

మనిషికి మూడు శరీరాలున్నాయి.అవే స్థూల సూక్ష్మ కారణ శరీరములు.ఏ శాపమైనా పాపమైనా ఈ మూడు శరీరాలనూ దహిస్తుంది.మూడింటినీ ఆవహిస్తుంది.

వీటిలో స్థూల దేహం రక్తమాంసాది ధాతునిర్మితం.

సూక్ష్మదేహం సూక్ష్మేంద్రియ అంత:కరణ సమన్వితం.

కారణ శరీరం వాసనామయం.

కృష్ణశాపం ఇప్పుడు నీ మూడు దేహాలనూ ఆక్రమించింది.దానిని నీ ఉపాసనా బలంతోనూ సాధనాబలంతోనూ అమ్మ అనుగ్రహం తోనూ ప్రక్షాళన గావించాలి.

నీవు పొందిన కృష్ణశాపంతో నీ మూడు శరీరములూ కలుషితము లయ్యాయి.అందుకే ఈ మూడురోజులూ నిన్ను పరీక్షించాను.ఆ పరీక్షలో నీవు పడిన యాతనతో అవి తగినంత శుద్ధి అయినాయి.శ్రీవిద్యోపాసనకు కావలసిన అర్హతను నీవిప్పుడు సంతరించుకున్నావు.ఈ మూడు శరీరాలూ తగినంత శుద్ధిగా లేకపోతే ఈ ఉపాసనకు నీవు అర్హుడవు కాలేవు.

ఇంకొక్క సూక్ష్మ రహస్యాన్ని చెబుతాను విను.

దేవగురువైన బృహస్పతి మానవులకు జీవకారకుడు.ఆయన అనుగ్రహం వల్లనే మానవుని దేహంలో జీవం ఉంటున్నది.ఆ బృహస్పతి రాశిచక్రాన్ని పన్నెండేళ్ళకొకసారి చుట్టి వస్తాడు.

రాశిచక్రం మనిషి దేహంలోనే అంతర్గతంగా ఉన్నది.కనుక పన్నెండేళ్ళలో మనిషిలో జీవం కూడా దేహంలో ఒక సూక్ష్మ పరిభ్రమణం పూర్తిగావిస్తుంది.నీ శాపం మూడువేల ఏళ్ళుగా కృష్ణుడు నిర్దేశించాడు.నేను దానిని 36 ఏళ్ళుగా మార్పు చేస్తున్నాను.

ఒక వెయ్యి సంవత్సరాలు ఉండే నీ శాపసమయం ఈ సాధనాబలం వల్ల పన్నెండేళ్ళలో జరిగే ఒక బృహస్పతి ఆవృత్తిలో నశించిపోతుంది.అంటే 36 సంవత్సరాలు నీవు చెయ్యబోయే ఈ తపస్సులో నీ మూడు శరీరాలూ శుద్ధి అయిపోతాయి.అలాగే నీ మూడువేల సంవత్సరాల శాపం కూడా ఈ 36 ఏళ్ళలో బృహస్పతి యొక్క మూడు ఆవృత్తులలో కుదించబడి పూర్తి అవుతుంది.ఇదే ఈ సాధనా మహత్యం.

అలాగే ఇంకొక్క విషయం కూడా విను.

శ్రీకృష్ణుడు ఇంకా 36 ఏండ్లు మాత్రమే,అంటే బృహస్పతి రాశిచక్రాన్ని మూడు ఆవృత్తులు గావించేటంత వరకే ఈ భూమిపైన ఉంటాడు.ఆ తదుపరి శరీరత్యాగం గావిస్తాడు.ఆయన వెళ్ళిపోయిన మరుక్షణం పాండవులు శక్తిహీనులౌతారు.వారి శక్తియుక్తులు అప్పుడు ఎందుకూ పనిచెయ్యవు. కనుక వారూ అప్పుడు ఈ ప్రపంచం నుండి నిష్క్రమిస్తారు.ఆ సమయానికి నీ సాధన కూడా పూర్తి అవుతుంది.

అప్పటికి నీ శాపం నిన్ను విడచి పోతుంది.

కృష్ణనిర్యాణం నాటికి ఆయన శాపాన్ని నీవు కడిగి వేసుకుంటావు.పాండవుల స్వర్గారోహణ ప్రయాణ సమయంలో వారిని మనం ప్రయాగతీర్ధంలో కలుసుకుంటాము.

ఇదంతా ముందు ముందు జరగడం నీ కళ్ళతో నీవే చూస్తావు.

ఇదే నేను నీకిస్తున్న వరం.

ఇదంతా ఎందుకు చేస్తున్నానని నీకు ఆలోచన వస్తుందేమో?

అదీ చెబుతాను.విను.

నీ తండ్రి నా ప్రియశిష్యుడు.నా ఆయుధాలను నా తర్వాత ఆయనే వాడినాడు.ఆ ఆయుధాలను నేను సాక్షాత్తూ పరమశివుని వద్దనుంచి పొందినాను.కనుక మీ తండ్రి మీదున్న వాత్సల్యంతో నేను నిన్ను రక్షించ బూనుకున్నాను.అదీగాక నీవు ఈ కార్యంలో నిమిత్త మాత్రుడవని నాకు తెలుసు.ఈ పనిని చేసినది నీవు కాదు.నిన్ను ఆవహించిన రుద్రశక్తి నీ రూపేణా ఇంతమందిని సంహరించి భూభారం తగ్గించింది.

'మరి ఈ శిక్ష నాకెందుకు?'- అని నీకు అనుమానం కలుగుతుందేమో?విను.

నీ స్థూలదేహం ద్వారా ఈ కర్మ జరిగింది గనుక నీదేహానికి ఈ శాపం తప్పదు.దీని వెనుక ఉన్న కర్మరహస్యం నీకు ప్రస్తుతం అర్ధంకాదు.ఈ యుద్ధంలో వీరందరూ ఇలా చావడానికి వీరి ఎన్నో జన్మల సామూహిక కర్మయే కారణం.ఆ కర్మకారణాలు చెట్టువేర్లవలె భూమిలో కనబడకుండా ఉన్నవి.పైన పాకుతున్న తీగలవలె మీ కర్మలు ఎన్నో జన్మలుగా ఎన్నో రకాలుగా పెనవేసుకుని ఉన్నాయి.

జన్మజన్మలుగా పోగుపడుతూ వస్తున్న మీమీ కర్మల ఫలమే ఇదంతా.

ఇదిగో మహత్తరమైన పంచదశీ మంత్రరాజాన్ని నీకిప్పుడు శక్తి సహితంగా ధారాదత్తం చేస్తున్నాను.దీనిని పూర్వం ఎందఱో ఉపాసించారు.మహాసిద్ధిని పొందినారు.ఇప్పుడు నీవూ దీనిని స్వీకరించు.జగజ్జనని కృపను సాధించు.

సాధించగలిగినావా,అమ్మకరుణ చేత ఇప్పుడు నీవు అనుభవిస్తున్న కృష్ణశాపం పటాపంచలు అవుతుంది.

ఈ సమస్త ప్రపంచాలన్నీ 'శ్రీ' అన్న ఒక్క శక్తి వల్లనే నడుస్తున్నాయి.ఆ శక్తి కరుణ వల్లనే బ్రహ్మ సృష్టి గావిస్తున్నాడు.నేను రక్షిస్తున్నాను.రుద్రుడు నశింపజేస్తున్నాడు.

ఈ ఆద్యాశక్తి మా భృగువంశంలో నిత్యమూ కొలువై ఉంటుంది. మా మూలపురుషుడైన భృగుమహర్షి చేసిన మహాతపస్సుకు ఫలితంగా ఆయనకు తనయగా ఆమె మా వంశంలో జన్మించింది.అందుకే ఆమెను 'భార్గవి' అంటారు.

భృగువంశాన్నే 'శ్రీవత్స' గోత్రం అని కూడా అంటారు.మా గోత్రంలో ఈ 'శ్రీ' అనబడే శక్తి నిత్యమూ కొలువై ఉంటుంది.మేమందరమూ ఆమె బిడ్డలమే.అందుకనే మేము 'శ్రీవత్సల' మయ్యాము.అందువల్లనే శ్రీవిద్యా పరాయణులైన మహర్షులకు ఈ గోత్రం పెట్టింది పేరు.మా గోత్రంలో అటువంటి వారు ప్రతితరంలోనూ జన్మిస్తూనే ఉంటారు.ఇది అమ్మ మాకిచ్చిన వరం.ఈ శక్తి అనుగ్రహంతో సాధించలేని పని ముల్లోకాలలోనూ లేదని గ్రహించు నాయనా.

అంతేకాదు అదే శక్తి ఇంకొక రూపంలో నా తల్లియైన రేణుకాదేవిగా మళ్ళీ మా ఇంట అడుగుపెట్టింది.దశమహావిద్యలలో ఒక అద్భుతశక్తియైన 'ఛిన్నమస్తిక' యే నా తల్లి రేణుకాదేవి. ఆయమ్మ అనుగ్రహంతో కుండలినీ యోగసిద్ధి అనేది అత్యంత చిరకాలంలో సాధకునికి కలుగుతుంది.సమస్త యోగులకూ సిద్ధిదాయిని యైన సుషుమ్నా పధగామిని కుండలిని నా తల్లి రేణుక.

తాను దప్ప ఇంకొకరు లేని పరిపూర్ణమైన ఏకైకస్థితిలోనుంచి తనను తాను రెండుగా ఖండించుకుని ఈ సమస్తసృష్టిగా తానె రూపుదాల్చిన శక్తియే ఛిన్నమస్తిక.నా తల్లియైన రేణుకాదేవిగా తన మానవ అవతారంలో కూడా తన శిరస్సు ఖండింపబడి తిరిగి పునర్జీవితురాలైనది ఆ తల్లి.

పాపం గానీ పుణ్యం గానీ సత్కర్మ గానీ దుష్కర్మ గానీ ఇవన్నీ మానవులకు పెద్దపెద్ద కొండలవలె దాటశక్యం కాకుండా ఉంటాయి.కానీ జగజ్జనని దృష్టిలో ఇవన్నీ చాలా స్వల్పమైనవి.ఆమె సంకల్పిస్తే మంచిని చెడుగా క్షణంలో మార్చగలదు.పాపాన్ని పుణ్యంగా క్షణంలో మార్చగలదు.

ఇదంతా ఆమెకు ఒక్క క్షణపు ఆట.ఈ సృష్టిలోని లెక్కలేనన్ని బ్రహ్మాండాలలోని ఒక బ్రహ్మాండంలో నీవు నివసిస్తున్న భూమండలం ఒక ధూళికణం.ఆ ధూళికణంలో నివసిస్తున్న కోటానుకోట్ల జీవరాశులలో మానవుడు ఎన్నో వంతు?అతను చేసే పాపం ఎన్నో వంతు? అమ్మ అనుగ్రహిస్తే నీ పాపం ఎంతటిది? ఆలోచించు.

జగజ్జనని లీలను మేమే అర్ధం చేసుకోలేము.ఇక నీవెంత?

కనుక నీ సాధన మొదలుపెట్టు.నీ కర్మ నీ చేతిలో ఉన్నది.నీ సాధనతో దానిని జయించు.

ఇంకొక్క రహస్యాన్ని చెబుతాను విను.

శ్రీవిద్యలో మూడు గ్రంధులు(ముడులు) ఉంటాయి.ఆ మూడు ముడులే నీ స్థూల సూక్ష్మ కారణములనబడే మూడు దేహములు.మానవుని కర్మ ఈ మూడు ముడులలోనే ఉంటుంది.తద్వారా అతన్ని బంధించి ఉంచుతుంది.ఆ మూడు ముడులను విప్పడమే గ్రంధిభేదనక్రియ.

సామాన్యంగా ఈ మూడు ముడులూ మనిషిని వదలాలంటే కొన్ని కోట్ల జన్మలు అతను ఎత్తవలసి ఉంటుంది.అదికూడా,ప్రతి జన్మలోనూ అధోగతికి పోకుండా ఊర్ధ్వగతికి పోయే సత్కర్మలు చేసుకుంటూ ఉంటేనే అది సాధ్యం అవుతుంది.తెలివిలేక మధ్యలో దుష్కర్మలు చేసుకుంటే పైకీ క్రిందకూ ఊగులాటే అవుతుంది మనిషి ప్రయాణం.

గ్రంధిభేదనమనే ఈ మహాకార్యాన్ని నీవు సాధించగలిగినావా నీ త్రిదేహములనూ నీవు ఒక్క జన్మలోనే ప్రక్షాళన గావించ గలుగుతావు.అప్పుడే నీ శాపకర్మ నిన్ను వదలి పోతుంది.ఇందులో ఒక్కొక్క గ్రంధిని భేదించడానికి నీకు పన్నెండు సంవత్సరాల కాలం ఇస్తున్నాను.

పన్నెండు సంవత్సరాల కఠోరమైన బ్రహ్మచర్య దీక్షను అవలంబించి తపోమయ జీవితాన్ని గడపినవాడే జగజ్జననియైన ఆద్యాశక్తిని దర్శించగలడు.నీవు అలాంటి మూడు పన్నెండ్లు ముప్పైఆరు సంవత్సరాల పాటు నీ సాధనను కొనసాగించు.

నీ త్రిదేహములనూ ప్రక్షాళన గావించుకొని శాప విముక్తుడవు కా.

ఇదే నీ శాపవిమోచనా మార్గం.

అంటూ సాంగోపాంగంగా పంచదశీ మంత్రోపదేశం గావించి శ్రీవిద్యోపాసనా విధానమును ఉపదేశించి అశ్వత్థామను శ్రీవిద్యాదీక్షితుని చేసినాడు పరశురాముడు.

(ఇంకా ఉన్నది)