నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

16, ఆగస్టు 2014, శనివారం

అశ్వత్థామ-ఇప్పటికీ సజీవంగా ఉన్నాడా?

తన పరమగురువైన పరశురాముని ఉపదేశంతో పునీతుడై సాధనను ప్రారంభం చేశాడు అశ్వత్థామ.

అతడు స్వతహాగా ఋషిపుత్రుడు గనుకా,అస్త్ర సముపార్జన కోసం గతంలో కఠినమైన నియమాలను పాటించినవాడు గనుకా సాధన అనేది అతనికి కొత్తకాదు.అస్త్రమంత్రములు సిద్ధించాలంటే ఆయా మంత్రదేవతా సాక్షాత్కారాలను పొందాలి.దానికి బ్రహ్మచర్య పూరితమైన సాధన చాలా అవసరం.అవి అంత ఆషామాషీగా సిద్ధించే శక్తులు కావు.అవన్నీ అశ్వత్థామకు తెలుసు.ఋషిపుత్రునకు తపస్సూ సాధనా వంశపారంపర్యంగా రక్తంలోనే వస్తాయి.

పన్నెండు సంవత్సరాలు గనుక బ్రహ్మచర్యనిష్టను పాటించి సాధన గావిస్తే మనిషి శరీరంలో 'మేధానాడి' అనే ఒక క్రొత్త నాడి ఉద్భవిస్తుంది.ఆ నాడీ సహాయంతో సమస్తమైన జ్ఞానాన్నీ ఒక్క క్షణంలో గ్రహించడం సాధ్యమౌతుంది.ఈ నాడి శరీరంలో ఉద్భవించనిదే ఎట్టివారికైనా భగవదనుభూతి సాధ్యం కాదు. 

ఈ విషయాన్ని శ్రీరామకృష్ణులు చాలాసార్లు చెప్పినారు. వివేకానంద, బ్రహ్మానంద,శివానందాది ఆయన శిష్యులు అందరూ ఈ సూత్రాన్ని పాటించి సాధన గావించిన ఘనులే.

శ్లో||మేధాసి దేవి విదితాఖిల శాస్త్రసారా
దుర్గాసి దుర్గ భవసాగర నౌరసంగా
శ్రీ: కైటభారి హృదయైక కృతాధివాసా
గౌరీ త్వమేవ శశిమౌళి కృత ప్రతిష్టా

అంటుంది మార్కండేయ పురాణాంతర్గతమైన 'దేవీమాహాత్మ్యం'.

ఆ||అఖిల శాస్త్రతతుల నవలీలగా జూచు
మహిమ నొసగునట్టి మేధ వీవు
భయము గొల్పు నట్టి భవసాగరం బెల్ల
దాట జేయగల్గు దుర్గ వీవు

ఆ||కైటభాంతకునకు కైదోడు వైనిల్చి
సర్వసృష్టి నడపు సిరివి నీవు
చంద్రశేఖరునకు సగభాగమై యొప్పి
గరిమనంద జేయు గౌరి వీవు

(అమ్మా!అఖిల శాస్త్రముల సారమునూ ఆకళింపు జేసుకొనగలిగే శక్తినిచ్చే మేధవైన సరస్వతివి నీవే.దాటశక్యముగాని భవసాగరమును భద్రముగా దాటించే దుర్గవు నీవే.మధుకైటభులనే రాక్షసులను సంహరించిన మహావిష్ణువు హృదయంలో కొలువై ఉన్న 'శ్రీ' యనబడే లక్ష్మివి నీవే.శశిమౌళి యగు పరమేశ్వరుని యందు సగభాగమవై నిలచియున్న గౌరివీ నీవే)

సాధనాఫలంగా అటువంటి మేధానాడి సాధకునిలో ఉద్భవించడం వల్లనే అతడు అతీతములైన శక్తులను పొందగలుగుతాడు.అప్పుడే లలితా రహస్య నామములలో చెప్పబడిన-

'మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంధి విభేదినీ
మణిపూరాంతరుదితా విష్ణుగ్రంధి విభేదినీ
ఆజ్ఞా చక్రాంతరాళస్థా రుద్రగ్రంధి విభేదినీ'

అనిన మూడుగ్రంధులనూ భేదించగలిగే సామర్ధ్యం అతనికి సంప్రాప్తిస్తుంది.

అశ్వత్థామ కూడా పరమగురు ప్రణీతమైన శ్రీవిద్యా అంతర్యాగసాధనలో మునిగి ప్రతి పన్నెండేండ్లకూ ఆయన చెప్పినట్లుగా ఒక్కొక్క గ్రంధిని భేదించుకుంటూ ముప్పై ఆరెండ్ల కఠోరసాధనలో తన దీక్షను పూర్తి గావించాడు.

ఒక్కొక్క గ్రంధి భేదింపబడినప్పుడు అతనిలోని ఒక్కొక్క శరీరమూ పరిశుద్ధం కాసాగింది.రాశిచక్రంలో బృహస్పతి మూడు ఆవృత్తులు గడచేసరికి అతడు కృష్ణశాపం నుండి విముక్తుడయ్యాడు.శ్రీవిద్యా సాధనాబలంతో జగన్మాతృ కటాక్షాన్ని పొంది మహర్షిగా రూపుదిద్దుకున్నాడు.

భారద్వాజ గోత్రాన్ని పునీతం గావించాడు.

ఆ సాధనా విధానంలో ఆయన ఏయే అంతరిక కష్టాలను ఎదుర్కొన్నాడు?ఏ విధంగా ఆ సాధనలో ఉత్తీర్ణుడయ్యాడు?అనేవి మనకు అప్రస్తుతాలు.తన సాధనను జయప్రదంగా పూర్తిగావించి జగన్మాతను మెప్పించి సిద్ధిని అందుకున్నాడన్న విషయం మాత్రమే మనకు ప్రస్తుతం అవసరం.

ఈలోపల సరిగ్గా 36 ఏండ్లకు పరశురాముడు చెప్పినట్లుగా ముసలం పుట్టి యాదవనాశనం జరగడమూ ఆ తదుపరి కృష్ణనిర్యాణమూ జరిగిపోయాయి. పాండవులు తమ రాజ్యాన్ని పరీక్షిత్తుకు అప్పజెప్పి తాము హిమాలయాల దిశగా ప్రయాణం సాగిస్తూ దారిలో ప్రయాగ తీర్ధాన్ని చేరుకున్నారు.

అక్కడ దుర్వాసమహర్షి ఆశ్రమంలో వారు పరశురామ దుర్వాసుల సమక్షంలో శాంతుడై కూర్చుని ఉన్న అశ్వత్థామను చూచారు.

అతనిలో మునుపటి ఉద్రేకస్వభావం లేదు.మునుపటి క్రౌర్యంలేదు.పరమ శాంతమూర్తిగా బ్రహ్మతేజస్విగా వారికి అతడు దర్శనమిచ్చాడు.పాండవులు కూడా అప్పటికి అతని మీద ఉన్న క్రోధాన్ని విసర్జించారు.కాలం అనేది ఎంతటి గాయాన్నైనా మాన్పివేస్తుంది కదా!!

పాండవులు మహర్షులవద్ద సెలవు తీసుకుని హిమాలయాల దిశగా సాగిపోయారు.ఆ తర్వాత వారేమయ్యారో ఎవరికీ తెలియదు.

పురాణయుగం అంతరించింది.

నవీన కలియుగం ప్రవేశించింది.

ఎక్కడ చూచినా అధర్మం మళ్ళీ పెచ్చు మీరసాగింది.

ఋషులు అదృశ్యులైనారు.

చిరంజీవులు ఇంతకు ముందులాగా అందరికీ కన్పించడం మానివేశారు.

కానీ వారు ఇప్పటికీ ఉన్నారు.మన పవిత్ర భారతభూమిలో వారి వారి స్థానాల్లో వారు ఇప్పటికీ సంచరిస్తూ మన మధ్యనే అజ్ఞాతంగా ఉన్నారు.

ఆంజనేయస్వామిని దేహంతో చూచినవారు ఇప్పటికీ కొందరున్నారు. తులసీదాసు ఆయన దర్శనాన్ని పొందినాడు.శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యుడైన బ్రహ్మానందస్వామి హనుమంతుని సజీవంగా దర్శించిన మహనీయుడు.ఈ ఘట్టాన్ని పురస్కరించుకునే ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరామకృష్ణ మఠాలలో ఏకాదశి రోజున రామనామ పారాయణ గావిస్తారు.

కాశీక్షేత్రంలో వ్యాస భగవానుని దర్శనాన్ని పొందినవారు ఇప్పటికీ కొందరున్నారు.

పశ్చిమ కనుమలలో పరశురాముని దర్శనభాగ్యాన్ని పొందినవారున్నారు.

శ్రీరంగపట్టణంలో విభీషణుని దర్శించిన వారున్నారు.

కుర్తాళం అడవులలో అగస్త్యమహర్షిని చూచినవారు ఇప్పటికీ ఉన్నారు.

వీరందరూ ఇప్పటికీ అవే దేహాలతో సజీవులుగా ఉన్నారు.ఇది మనం నమ్మలేని సత్యం.

మరి అశ్వత్థామ ఇప్పటికీ సజీవంగా ఉన్నాడా?

ఉన్నాడు.

కృష్ణశాపానికి గురైన తర్వాత అశ్వత్థామ గురించి మహాభారతంలో ఎక్కడా పెద్దగా కనిపించదు.వ్యాసమునీంద్రుడు అశ్వత్థామను అక్కడే వదలి ముందుకు వెళ్ళిపోతాడు.ఆ తర్వాత ఆయన ఏమయ్యాడో ఎక్కడా కనిపించదు.ఆ వివరాలు మనకు దొరకవు.జిజ్ఞాసువులైన వారి పరిశీలనకూ పరిశోధనకూ పనికి వచ్చేవిధంగా అనేక 'త్రెడ్స్' ను అసంపూర్తిగా అలా వదిలేశాడు వ్యాసమునీంద్రుడు.

నిజానికి అశ్వత్థామ మనం అనుకున్నంత దుర్మార్గుడేనా?అని ఆలోచిస్తే కాదని తేలుతుంది.మహాభారతం లోని అందరిలాగే తన ధర్మం తాను ఆచరించాడు.తద్వారా శాపానికి గురయ్యాడు.అది కూడా ఘోరమైన శాపానికి గురయ్యాడు.

ఈ విషయమై వ్యాసమహర్షి తర్వాత ఎందఱో కవులు ఆలోచించారు. ఆరాటపడ్డారు.ఎందుకంటే,అశ్వత్థామ చిరంజీవి.ఆయన ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు.కనుక ఆయనను దర్శించగలిగితే ఆ తర్వాత ఏమి జరిగిందో ఆయనే చెబుతాడు.

కన్నడ రాష్ట్రంలోనూ ఒరిస్సాలోనూ ఈ విధంగా ఆరాటపడిన కవులు ఇద్దరున్నారు.

అలా ఆరాటపడిన వారిలో ఒకడు కుమార వ్యాసుడనబడే కన్నడకవి. ఆయన 15 శతాబ్దంలో రెండవ దేవరాయల కాలంలో కర్నాటరాష్ట్రంలో ఉన్నట్లు చరిత్రకారులు భావిస్తున్నారు.ఆయన మహాభారతాన్ని కన్నడంలో రచించాడు.

దానినే కుమారవ్యాస భారతం అంటారు.

అది వ్రాయడానికి ముందు అసలైన సరియైన భారతాన్ని వ్రాయాలన్న తపనతో ఆయన గదగ్  లో ఇప్పటికీ ఉన్న వీరనారాయణస్వామి ఆలయంలో ఉంటూ మహావిష్ణువును తదేకనిష్టతో ప్రార్ధించాడు.అప్పుడు ఆయన స్వప్నంలో నారాయణుడు దర్శనం ఇచ్చి కొన్ని కొండగుర్తులు చెప్పి ఆశ్వత్తామను ఎలా గుర్తించాలో సూచనలిచ్చాడు.ఆ సూచనల ఆధారంగా ఒకరోజు కుమారవ్యాసుడు అశ్వత్థామను గుర్తించి ఆయన పాదాలపైబడి ప్రార్ధించగా ఆయన వరంవల్ల అసలైన మహాభారతాన్ని వ్రాయగలిగాడు. అయితే ఈ రహస్యాన్ని భీమ దుర్యోధనుల గదాయుద్ధ ఘట్టం వ్రాస్తున్న సందర్భంలో తన భార్యకు వెల్లడించిన ఫలితంగా అక్కడితో ఆయనకు స్ఫురణ ఆగిపోయింది.ఇది ఒక గాధ.

కనుక అశ్వత్థామ ఇప్పటికీ జీవించి ఉన్నది నిజమే అని ఒక ఆధారం దొరికింది.

ఒరియా ఆదికవి సరళదాసు రచించిన ఒరియా భారతం రెండవ రుజువు.

మనకు తెలుగుభాషలో ఆదికవి నన్నయ ఉన్నట్లే ఒరియాలో ఆదికవి సరళదాసు ఉన్నాడు.ఆయనకూడా దాదాపు 15 శతాబ్దం వాడే.ఆయన కూడా ఒరియా భాషలో మహాభారతం వ్రాశాడు.దానిలో ఆయన ఇంకా కొన్ని వివరాలిచ్చాడు.

ఆ వివరాల ప్రకారం-తమ స్వర్గారోహణ క్రమంలో ఉన్న పాండవులు ప్రయాగతీర్ధంలోని ఆశ్రమంలో పరశురామ దూర్వాసమహర్షులతో కలసి ఉన్న అశ్వత్తామను కలుస్తారు.అశ్వత్థామ అప్పటికే కృష్ణశాపంనుంచి విముక్తుడై ఉంటాడు.పరమతేజస్విగా మారి యుంటాడు.అప్పటికి భారతయుద్ధం జరిగి 40 ఏళ్ళ లోపే అవుతుంది.

ఇది సరళదాసుగారి అనుభవం. లేదా ఆయనకు కలిగిన దర్శనం అయి ఉంటుంది.

నాకు మార్మికంగా తెలిసిన వివరాలతో సరళదాసు ఒరియా భారతంలో రచించిన వివరాలు సరిపోతున్నాయి.

ఇకపోతే,అశ్వత్తామను చూచినట్లుగా అనేక సందర్భాలలో అనేకమంది వ్రాసిన వ్రాతలున్నాయి.వాటిని మనం నమ్మినా నమ్మకపోయినా కొన్ని ప్రామాణిక గ్రంధాలను నమ్మవచ్చు.వాటిలో 'పృధ్వీరాజ్ రాసో' ఒకటి.

దీనిని చాంద్ బర్దాయ్ అనే కవి వ్రాశాడు.క్రీ.శ.1170 ప్రాంతంలో పృధ్వీరాజ్ చౌహాన్ డిల్లీ ప్రాంతాన్ని పరిపాలించాడు.ఆ సమయంలో చాంద్ బర్దాయ్ ఆయన యొక్క ఆస్థానకవిగా ఉన్నాడు.కనుక పృధ్వీరాజచరిత్రను ఆయన వ్రాశాడు.ఆ పుస్తకం ఇప్పటికీ దొరుకుతున్నది.

దాదాపు తొమ్మిదివందల సంవత్సరాల క్రితం వ్రాయబడిన ఈ పుస్తకంలో పృధ్వీరాజ్ చౌహాన్ అడవులలో సంచరిస్తూ ఉన్నపుడు అతను అశ్వత్తామను ఎలా కలుసుకున్నదీ వివరం వ్రాయబడి ఉన్నది.

మిగతా కధలను మనం నమ్మినా నమ్మకపోయినా దీనిని నమ్మవచ్చు. ఎందుకంటే ఇది చారిత్రిక గ్రంధం గనుక.పృధ్వీరాజ్ చౌహానే మరుజన్మలో అక్బర్ గా పుట్టాడని ఒక నమ్మకం ఉన్నది.ఆ సంగతి మళ్ళీ ఇంకోసారి చూద్దాం.

ఇకపోతే,వ్యాసమహాభారతం ప్రకారం --'త్రీణి వర్ష సహస్రాణి' అన్న కృష్ణ శాపాన్ని మనం చూస్తే,మూడువేల ఏండ్ల కాలమే అశ్వత్థామకు శాపం ఉన్నది.ఆ తర్వాత అతను దానినుంచి సహజంగానే విముక్తుడు కావాలి. 

ఇప్పుడు మహాభారత కాలాన్ని ఒక్కసారి గమనిద్దాం.

కలియుగం అనేది 3102 BC లో మొదలైందని కొందరు అంటారు.కానీ అది నిజం కాకపోవచ్చు.డాక్టర్ వర్తక్ పరిశోధన ప్రకారం మహాభారత యుద్ధం అనేది 16-10-5561 BC న మొదలై 2-11-5561 BC రోజున ముగిసిందని ఆయన ఖచ్చితమైన తేదీలతో సహా నిరూపించాడు.యాదవులలో ముసలం పుట్టి వారంతా కొట్టుకుని చనిపోయినది 5525 BC అనేది ఆయన పరిశోధన.ఇది వాస్తవానికి దగ్గరగా ఉంటున్నది.

ఎందుకంటే,నవగ్రహాలే గాక,మనం ఇప్పుడు కనుక్కున్నామని చెప్పుకునే యురేనస్ నెప్ట్యూన్ ప్లూటో లు కూడా వ్యాసమహర్షికి తెలుసనీ ఆయన వాటి పోజిషన్స్ ను ఖచ్చితంగా ఎలా రికార్డ్ చేసి పెట్టాడో ఆయన భారతంలోని శ్లోకాలను ఉటంకిస్తూ రుజువు చేస్తూ వివరించాడు.ఈ పన్నెండు గ్రహాలూ, వ్యాసమహర్షి మహాభారతంలో రికార్డ్ చేసి పెట్టిన గ్రహస్థితులతో ఎలా సరిపోతున్నాయో ఆయన వివరించిన పరిశోధనా వ్యాసం ఇక్కడ చూడండి.

కనుక మహాభారత యుద్ధం అనేది 3100 BC లో జరిగినా లేక డా|| వర్తక్ గారన్నట్లు BC 5561 లో జరిగినా కూడా దానితర్వాత 3000 ఏళ్ళకు అంటే 100 BC నాటికి గానీ లేదా 2561 BC నాటికి గానీ అశ్వత్థామ శాపం పరిసమాప్తి అయ్యి ఉండాలి.

మరి ఇదే నిజమైతే 1100 AD లో పృధ్వీరాజ్ చౌహాన్ కు అడవిలో అశ్వత్థామ అనేక రోగబాధలతో కనిపించడం నిజం కావడానికి వీల్లేదు."పృధ్వీరాజ్ రాసో" అనేది పూర్తిగా చారిత్రిక గ్రంధం కాదు.దానిని వ్రాసిన చాద్ బర్దాయ్ అనేకవి పృధ్వీరాజు ఆస్థానకవి గనుక కొన్ని అతిశయోక్తులతో కలగలిపి తన రాజును పొగుడుతూ దానిని వ్రాసి ఉండవచ్చు.

దానిలో కొన్ని కల్పితాలు కూడా ఉన్నాయన్నది చరిత్ర పరిశోధకులు ఒప్పుకున్న వాస్తవం.కనుక ఒకవేళ పృధ్వీరాజ్ అశ్వత్థామను దర్శించినా కూడా అప్పటికే ఆయన శాపవిమోచనాన్ని పొంది ఉండటంవల్ల ఆయన మామూలు రూపాన్నే చూచి ఉండవచ్చు.అంతేగాని ఆయన రోగిష్టిగా ఉన్న రూపంతో 1100 AD లో కనిపించడం అసంభవం.

అలాగే ఉత్తరభారతదేశంలోనూ పశ్చిమ తీరంలోనూ మధ్య ప్రదేశ్ లోనూ చాలా చోట్ల అశ్వత్థామ ఇప్పటికీ సంచరిస్తున్నాడన్న వార్తలలో నిజం ఉన్నది. కాకుంటే ఆయన ఇంకా శాప ప్రభావంతో ఒంటినిండా గాయాలతో పుండ్లతో రోగాలతో ఇప్పటికీ ఉన్నాడన్న మాట మాత్రం వాస్తవం కాదు.

ఒరియా ఆదికవి సరళదాసు వ్రాసిన దానిలో నిజం ఉన్నది.

ఎందుకంటే,కృష్ణ శాపం తర్వాత ఆ శాపాన్నించి విమోచనం కలిగించే గురువు కోసం అశ్వత్థామ సహజంగానే వెదుకులాట సాగించి ఉంటాడు.ఈ గొడవంతా వ్యాసాశ్రమంలోనే వ్యాసుని ఎదుటనే జరిగింది కనుక ఇక అక్కడ ఉండటం ఆయనకు ఇష్టం లేకపోవచ్చు.

ఇక ఆయనకు మిగిలిన ఏకైన దిక్కు అవతార పురుషుడూ మహాఋషీ, మహాగురువూ అయిన పరశురాముడు.

పరశురాముడు అశ్వత్థామకు పరమగురువు.ఎందుకంటే ద్రోణాచార్యుడు సమస్త ఆయుధాలనూ అస్త్రశస్త్రాలనూ ఆయన వద్దనే అందుకున్నాడు. కనుక తన తండ్రికి గురువైన పరశురాముని వద్దకే అశ్వత్థామ చేరుకోవడం సమంజసంగా ఉన్నది.

ఇక్కడ నుంచి జరిగిన కధ ఏమిటో నేను వివరించాను.

అశ్వత్థామ చరిత్ర కృష్ణశాపం వరకే మనకు వ్యాసమహాభారతంలో దర్శనమిస్తుంది.ఆ తర్వాతి ఘట్టాలు ఏ గ్రంధంలోనూ ఎక్కడా మనకు కనబడవు.

అశ్వత్థామ నేటికీ అదే దేహంతో ఉన్నమాట వాస్తవమే.ఆయనకు కల్గిన కృష్ణ శాపం నుండి విముక్తుడు అయినదీ వాస్తవమే.

మరి మీకు మాత్రం ఈ వివరాలు ఎలా తెలిశాయి? అని మాత్రం నన్నడక్కండి.

కొన్నికొన్ని రహస్యాలు రహస్యాలుగా ఉంటేనే బాగుంటుంది.

అవి ఎప్పటికీ అలా ఉండవలసిందే.

(తరువాతది చివరిభాగం)