Pages - Menu

Pages

3, ఆగస్టు 2014, ఆదివారం

అశ్వత్థామ-ఏది ధర్మం? ఏదధర్మం?

'అందరం కలసి ఇదే రాత్రిపూట వెళ్ళి పాండవ శిబిరాలమీద పడి అందర్నీ చంపేద్దాం' అనిన అశ్వత్థామతో కృపాచార్యుడు సాలోచనగా ఇలా అంటాడు.

'వద్దు అశ్వద్దామా.ఇది ధర్మం కాదు.రాత్రిపూట యుద్ధం చెయ్యకూడదు అన్నది కురుక్షేత్ర సంగ్రామ నియమం.ఆ నియమాన్ని మనం విధిగా పాటించాలి.పైగా నిద్రపోతున్న వారూ చనిపోయినవారూ సమానులే. నిద్రపోయేవాడు కూడా శవంలా పడి ఉంటాడు.కనుక అతన్ని చంపితే శవాన్ని మళ్ళీ చంపినట్లే.అది మహా పాతకం.

చిన్నపిల్లలనూ,స్త్రీలనూ,నిద్రపోతున్నవారినీ,ఆయుధాలు విసర్జించినవారినీ, నిరాయుధులనూ,శరణు కోరి నమస్కారం పెట్టినవారినీ ఆయుధధారి అయినవాడు చంపకూడదు.అది ధర్మవిరుద్ధం.కనుక ఈ పని మానుకో.నీకు అంతగా పగ తీరకపోతే,తెల్లవారిన తరువాత మనం ముగ్గురం వెళ్ళి వాళ్ళతో తలపడదాము.అప్పుడు వారో మనమో తేలిపోతుంది.ఈ పని మాత్రం వద్దు. ఇది ధర్మం కాదు.'

దానికి అశ్వత్థామ ఇలా అన్నాడు.

'నిజమే.నీవు చెప్పిన ధర్మాలు నాకు కూడా తెలుసు.కానీ దీనికేమంటావు?నా తండ్రిని ఆ నీచుడు దృష్టద్యుమ్నుడు సంహరించినపుడు ఆయన నిరాయుధుడే కదా.పైగా నేను చనిపోయానని అందరూ కూడబలుక్కుని అబద్దం చెప్పి ఆయన్ను నమ్మించారు.ఇది ధర్మమేనా?పైగా ఈపని చేసినది ఎవరు?ఎన్నడూ అబద్దం చెప్పడని పేరు పొందిన ధర్మరాజు.మరి వారు చేసినది ధర్మమే నంటావా?

నా మరణవార్త విని, అది నిజమే అనుకొని, అస్త్రసన్యాసం చేసి యుద్ధభూమిలో ధ్యాననిష్టుడై నేలమీద కూర్చుని ఉన్న మా తండ్రిని కిరాతకంగా తల నరికేశాడు ఆ నీచుడు దృష్టద్యుమ్నుడు.ఇదంతా దగ్గరుండి చేయించాడు ఆ కిరాతకుడు కృష్ణుడు.అది ధర్మమేనా?

అంతెందుకు?పితామహుడైన భీష్ముని చంపినది ధర్మంతోనా? అధర్మంతోనా?నీవే చెప్పు?శిఖండిని అడ్డు పెట్టుకుని వెనుకనుంచి అర్జునుడు బాణం వేసి ఆయన్ను నేలకూల్చడం ధర్మమేనా?ఇది ఏ రకమైన ధర్మం?నీవే చెప్పు.వింటాను.

మహావీరుడైన కర్ణుని ఎలా చంపినారో చెప్పు?అది ధర్మమేనా?నేలమీద ఉన్న నిరాయుధుని పైన,రధాన్ని అధిరోహించి ఉన్నవాడు అస్త్ర ప్రయోగం చెయ్యవచ్చని ఏ యుద్ధనీతి చెబుతున్నదో నాకు కాస్త వివరించు.కొద్ది సేపు ఆగమనీ,తాను రధచక్రాన్ని బయటకు లాగి రధాన్ని అధిరోహించిన తర్వాత యుద్ధం చెయ్యమనీ కర్ణుడు కోరినాడు.అతడు నిజమైన యోధుడు.ఒక వీరుడు ఎలా ప్రవర్తిస్తాడో కర్ణుడు అలాగే ప్రవర్తించాడు.కాని అర్జునుడు ఏమి చేసినాడు?అచ్చమైన పిరికిపందలాగా ప్రవర్తించాడు.నిరాయుధుడైన కర్ణుడిపైన అస్త్రప్రయోగం చేసి  అతనిని నేలకూల్చాడు.ఇది ఎలా ధర్మం అవుతుందో నీవే చెప్పు?

కురుక్షేత్రంలో పాండవులు చేసినది అంతా అధర్మమే.అలా చేసే,వారు మనపైన గెలుస్తూ వచ్చారు.మనతో ధర్మయుద్ధం చేస్తే వారు ఎన్నటికీ గెలవలేరు.వారు చేసినది ధర్మయుద్ధం కానేకాదు.

ఈరోజు పగటిపూట సుయోధనుని ఎలా నేలకూల్చారు?దీనికి నీవేమి జవాబు చెబుతావు? గదాయుద్ధపు నియమాలు నీకు తెలియనివి కావు కదా.గదాయుద్ధంలో వీరుడైనవాడు ఎదుటి వీరుని నాభి క్రింది భాగంలో కొట్టరాదు.ఇది యుద్ధ ధర్మం.మరి భీముడు సుయోధనునిపై గదాప్రహారం చేసినది ఎక్కడ?తొడల మీద కొట్టవచ్చునా?ఇది ధర్మమా?దీనిని దగ్గరుండి చేయించినది ఎవరు? మళ్ళీ ఆ మోసగాడు కృష్ణుడే.

రాక్షసుడైన ఘటోత్కచుని రాత్రిపూట మనమీదకు ఉసిగొల్పడం యుద్ధ న్యాయమా?పాండవులు ధర్మాన్ని ఎక్కడ అనుసరించారో నాకు చెప్పు?వారు చేసినది అంతా అధర్మయుద్ధమే.

కనుక నేను మాత్రం ఎందుకు ధర్మాన్ని అనుసరించాలి?ధర్మం అనేది రెండువైపులా ఉండాలి.అప్పుడే అది ధర్మయుద్ధం అవుతుంది.వారికి లేని ధర్మం నాకు మాత్రం ఎందుకు?

పగతో నిండినవాడు మానవుడు కాదు.వాడు రాక్షసుడే.ప్రస్తుతం నేనూ రాక్షసుడినే.ప్రస్తుతం నాది రాక్షసధర్మం.రాత్రి పూట దాడి చెయ్యడం రాక్షసులకు న్యాయమే.అది వారి ధర్మం.రాత్రిపూట వారికి బలం వెయ్యింతలు అవుతుంది.అప్పుడు విజ్రుమ్భించడమే వారి ధర్మం.నేను ప్రస్తుతం బ్రహ్మరాక్షసుడిని.కనుక నేను చెయ్యబోయే పని తప్పు కాదు.

కాకులు పగటి పూట తిరుగుతాయి.అప్పుడు వాటికి కళ్ళు కనబడతాయి.కనుక ఆ సమయంలో అవి బలవంతులుగా ఉంటాయి. గుడ్లగూబ పగటి పూట తిరగలేదు.ఎందుకంటే ఆ సమయంలో దానికి కళ్ళు కనబడవు.అది రాత్రించరి.నిశాసమయమే దానికి బలం ఉంటుంది.కనుక రాత్రి పూట సంచరించడమూ దాడి చెయ్యడమే దానికి ధర్మం.నా ధర్మం కూడా అంతే.

మీకు ఇష్టమైతే నాతో రండి.లేదా ఇక్కడే ఉండండి.నేను మాత్రం ఆగను. ఈరాత్రికి ఆ పాండవులను అందరినీ చంపుతాను.నా తండ్రి వధకు ప్రతీకారం తీర్చుకుంటాను.సుయోధనుని కిరాతకంగా అధర్మంగా నేలకూల్చినందుకు వారు మూల్యం చెల్లించక తప్పదు.' అన్నాడు అశ్వత్థామ.

అతని ఆవేదనను అర్ధం చేసుకున్నాడు కృపాచార్యుడు.

'నీవు చెబుతున్నది సమంజసమే అశ్వద్ధామా.కాని ఒక్క విషయం విను. మానవుడైనవాడు ఏ పనిని సాధించాలన్నా రెండువిషయాలు కలవాలి. అప్పుడే అది విజయవంతం అవుతుంది.ఒకటి మానవ ప్రయత్నం.రెండవది దైవానుగ్రహం.

దైవం అనుకూలించకుండా ఉత్త మానవప్రయత్నం ఒక్కటే ఏమీ చెయ్యలేదు. పైగా నీవు తలపెట్టిన కార్యం సామాన్యమైనది కాదు.మహావీరులైన పాండవులనూ వారి సైన్యాన్నీ నీవు ఒక్కడవే ఎదుర్కొన సాహసిస్తున్నావు. కనుక నీ ఈ ప్రయత్నంలో నీకు దైవసహాయం తప్పనిసరిగా అవసరం అవుతుంది.లేకుంటే నీవు విఫలుడవు అవుతావు.ఆ దిశగా ఆలోచించు.' అన్నాడు.

ఎంతో విలువైన విషయాన్ని కృపాచార్యుడు ఆ సమయంలో చెప్పినాడు.

మానవులు అంతా తమ స్వశక్తి వల్లనే జరుగుతున్నదని భ్రమిస్తారు.కాలం కలసి వస్తూ అన్నీ అనుకున్నట్లు జరుగుతూ ఉన్నపుడు అది తమ తెలివే అనీ,తమ బలమే అనీ భావిస్తారు.అది నిజం కాదు.కాలం కలసి రావడానికి వారి పూర్వకర్మ కారణం అవుతున్నది.పూర్వ పుణ్యబలం వల్ల మానవుడు అనుకున్నదానికి సాధించగలుగుతున్నాడు.కానీ అంతమాత్రం చేత అహంకార పరవశుడై,గర్వపూరితుడైతే అతడు త్వరలోనే భ్రష్టుడౌతాడు. ఎందుకంటే, దైవానుగ్రహం లేనిదే మానవుడు ఎందుకూ కొరగాడు.ఈ విషయాన్ని విస్మరించిన మరుక్షణం,అతని పూర్వపుణ్యబలం అయిపోయిన మరుక్షణం,అతడు పడే పాట్లు భయంకరంగా ఉంటాయి.

జీవితంలో అనుకూల దశలు అయిపోయి ప్రతికూల దశలు మొదలైనప్పుడు మనం పడే పాట్లు ఎలా ఉంటాయో,మన అహంకారాలూ గర్వాలూ అప్పుడెక్కడికి పోతాయో ఆ దేవుడికే ఎరుక.కాలం అనుకూలించనిదే ఎంతటివారైనా ఏమీ చెయ్యలేరు.కాలస్వరూపమైన మహాకాళి అనుకూలిస్తూ ఉన్నంతవరకే ఎవరి నృత్యాలైనా,ఎవరి ప్రగల్భాలైనా.

అశ్వత్థామ ఆలోచించాడు.

'నిజమే.నీవు చెప్పినది నిజమే.ప్రస్తుతం నాకు నా బలం ఒక్కటే చాలదు. నాకు దైవబలం కావాలి.అందుకోసం ఇప్పుడే నా ఇష్టదైవం అయిన పరమశివుని ప్రార్దిస్తాను.' అంటూ అక్కడే అరణ్యమధ్యంలో పద్మాసనం వేసుకుని ధ్యాననిష్టుడైనాడు.

అశ్వత్థామ వేదవేదాంగ పారంగతుడు.క్షత్రియ ధర్మాన్ని పాటించినప్పటికీ స్వతహాగా బ్రాహ్మణ పుత్రుడు అవడం వల్ల అతడు వేదమును ఎరిగినవాడు.

వేదములలో ఉన్న ఋక్కులతో ఆ నిశిరాత్రిలో ఆ మహారణ్య మధ్యంలో రుద్రుని ఆవాహనం చేశాడు అశ్వత్థామ.పరమశివుడు త్వరగా ప్రత్యక్షం కాలేదు.ఎంతోసేపు అశ్వత్థామ ప్రయత్నం చేశాడు.కాని ముక్కంటి కనికరించడం లేదు.గంటలు గడుస్తున్నాయి.అశ్వత్థామ విసిగిపోయాడు. తెల్లవారేలోపు తన పగ చల్లారకుండా ఉంటె తాను బ్రతికి ఉండటం అనవసరం అనుకున్నాడు.ఇలా జీవచ్చవంలా బ్రతికి ఉండేకంటే వెంటనే ప్రాణత్యాగం చెయ్యడం మంచిదనుకున్నాడు.వెంటనే ఒక హోమగుండాన్ని వెలిగించాడు.

అతను చెయ్యబోతున్న కార్యాన్ని ఆ అరణ్యంలో ఉన్న జంతువులూ అక్కడ కనబడకుండా దాక్కుని ఉన్న పిశాచాలూ భూతాలూ భయపడుతూ చూస్తున్నాయి.

పెద్దగొంతుతో రుద్రసూక్తాన్ని స్వరసహితంగా పఠిస్తూ,రుద్రుని స్మరిస్తూ, భగభగ మండే నిలువెత్తు మంటలతో కూడిన హోమగుండం లోకి అమాంతం దూకబోయాడు అశ్వత్థామ.సరిగ్గా అదేక్షణంలో ఆ మంటల మధ్యన పరమేశ్వరుడు తన దివ్యమైన రూపంతో దిక్కులన్నింటినీ తన తేజస్సుతో వెలిగిస్తూ ప్రత్యక్షమైనాడు.

'ఆగు అశ్వత్థామా.ప్రాణత్యాగం చెయ్యకు.నీవు చిరంజీవివని మరువకు.నీవు తలపెట్టిన పని సామాన్యమైనది కాదు.వేలమంది మహాయోధులతో నీవు ఒక్కడివే తలపడబోతున్నావు.నీ సంకల్పశుద్ధిని పరీక్షించాలని ఇంతవరకూ ఆగాను.ప్రాణత్యాగానికే సిద్ధపడ్డావు.నీ దీక్షకు మెచ్చాను.ఇదిగో రుద్రఖడ్గం. దీనిని తీసుకో.దీనిని చేత ధరిస్తే నీవు అజేయుడవవుతావు.అంతే కాదు. ఇదుగో నా రుద్రాంశ నీలో ప్రవేశిస్తున్నది.ఇప్పుడు నీవూ రుద్రుడవే.నీవు ప్రస్తుతం అడుగు పెట్టినచోట ప్రళయవిధ్వంసం జరుగుతుంది.ఏ శక్తీ నిన్ను ఆపలేదు.కాని ఒక్క విషయం విను.నీవు ఎవరినైనా చంపగలవు గాని శ్రీకృష్ణుని ఏమీ చెయ్యలేవు.అతడూ నేనూ ఒక్కరమే.ఆయన లీల నీకు అర్ధం కాదు.మహాభారత సంగ్రామం ఆయన సంకల్పమే.సరే అదలా ఉంచు. ప్రస్తుతం నీ కార్యం మీద నీవు బయలుదేరు.నా ఆశీస్సులు నీతో ఉంటాయి.' అంటూ తన రుద్రతత్వాన్ని ఆశ్వద్దామలో ఆవహింప చేశాడు పరమేశ్వరుడు.

అసలే అశ్వద్ధామ మహాకోపంతో రగిలిపోతున్నాడు.దానికి తోడు రుద్రతత్త్వం తనలో ఆవహించి,రుద్రఖడ్గం చేత ధరించేసరికి ప్రళయకాల రుద్రుడే అయిపోయాడు.అతన్ని అతని రౌద్రాన్నీ చూస్తున్న కృపాచార్యుడికీ కృతవర్మకూ భయంతో పై ప్రాణాలు పైనే పోతున్నట్లు అనిపించాయి.

'చెప్పండి మీరు నాతో వస్తున్నారా లేదా?' గద్దించాడు అశ్వద్ధామ.

'నిన్ను ఒక్కడినే శత్రుమధ్యంలోకి పంపి మేమిక్కడ ఉండలేము.అది ధర్మం కాదు.చావో బ్రతుకో అందరం కలిసే ఉందాం.మేమూ నీతోనే వస్తున్నాం.నీవు తలపెట్టిన ఈ పనిలో మా చేతనైన సహాయం మేమూ చేస్తాం.' అన్నారు వారు.

ఆ రాత్రి అశ్వత్థామను కాళికాశక్తి ఆవహించింది.రుద్రతత్వమూ కాళీతత్వమూ ఒక్కటే.ఆ శక్తికి ఎదురు అనేది ఉండడానికి ఈ సృష్టి మొత్తంలో అవకాశమే లేదు.ప్రపంచంలో ఏ శక్తి అయినా సరే రుద్రశక్తి ముందూ కాళికాశక్తి ముందూ తలవంచి తప్పుకోవలసిందే.లేదా అంతం అయిపోవలసిందే.మరో మాట మాట్లాడటానికే అవకాశం ఉండదు.

రుద్రఖడ్గాన్ని చేత ధరించి,కృపాచార్యుడూ కృతవర్మా వెంటరాగా పాండవ శిబిరాలవైపు ఆ మహానిశీధిలో అతివేగంగా బయలుదేరాడు రుద్రశక్తితో నిండి భయంకరంగా కనిపిస్తున్న అశ్వద్దామ.

(ఇంకా ఉన్నది)