Pages - Menu

Pages

12, ఆగస్టు 2014, మంగళవారం

రాబిన్ విలియమ్స్ జాతకం - ఒక విశ్లేషణ


అమెరికన్ నటుడు రాబిన్ విలియమ్స్ నిన్న చనిపోయాడు.ఇదీ పౌర్ణమి ప్రభావమే.

అతను నా అభిమాన నటులలో ఒకరు.

'JUMANJI' సినిమా చూచినవారికి అతను బాగా గుర్తుంటాడు.



'WHAT DREAMS MAY COME' కూడా అతను నటించిన ఇంకొక మంచి సినిమా.ఇందులో అతని మౌన భావప్రకటన నాకు బాగా నచ్చింది.

NIGHT AT THE MUSEUM అనేది ఇంకొక సినిమా.

అతని సినిమాలు నేను ఎక్కువ చూడలేదు.ఈ మూడూ చూచానని గుర్తుంది. వీటిల్లో అతని నటన నాకు బాగా నచ్చింది.

ఎక్కువ డైలాగ్స్ లేకుండా, ముఖంలోనే భావాలను పలికించే అతని నటన నాకు బాగా నచ్చుతుంది.

అతని ముఖంలో ఏదో ఒకరకమైన నిరాశా,చిన్నపిల్లలకుండే అమాయకత్వమూ కనిపిస్తాయి.బహుశా అవే అతని వ్యక్తిత్వంలోని ఆకర్షణలని నా ఊహ.అతను నవ్వితే కూడా చిన్న పిల్లవాడు అమాయకంగా మనస్ఫూర్తిగా నవ్వినట్లే ఉంటుంది.

ఈ లక్షణాలు బుధునికి సూచికలు.ఇతని జాతకంలో ఆత్మకారకుడు కూడా బుధుడే అంటే చదువరులకు ఆశ్చర్యం కలుగుతుంది.

ఇతని జాతకాన్ని ఇప్పుడు కొంచం చూద్దాం.

నా వీరాభిమానులు(విమర్శకులు) అనేటట్లు ఇప్పుడు రాబిన్ విలియమ్స్ చనిపోయాడు గనుక అతని జాతకాన్ని మనం నిరభ్యంతరంగా చూడవచ్చు. ఎందుకు?దానికి కూడా నేనే సమాధానం చెప్తాను.చనిపోయినవారు మాట్లాడరు గనుక.కానీ వారిగురించి మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.అదీ సంగతి.

Dead men never speak.But we have to speak about them very carefully.

రాబిన్ విలియమ్స్ 21-7-1951 మధ్యాన్నం 1-34 కి చికాగో ఇల్లినాయ్ స్టేట్ లో పుట్టినట్లు రికార్డ్ దొరుకుతున్నది.ఆ సమయానికి గల గ్రహస్థితి పైన ఇచ్చాను.

ఆషాఢ బహుళ చతుర్ధి శనివారం రోజున రాహువుదైన శతభిషా నక్షత్రంలో గురుహోరలో ఇతను జన్మించాడు.

తులాలగ్నాదిపతి శుక్రుడు లాభ బాధకస్థానంలో కేతువుతో ఒకే నక్షత్ర పాదంలో ఉండటం వల్ల --బాధ భరించలేక తనంతట తాను ఈలోకంనుంచి నిష్క్రమిస్తాడని సూచన ఉన్నది.ఇతని జీవితంలో ఉన్న కార్మిక్ సిగ్నేచర్స్ లో ఇది మొదటిది. 

11-8-2014 న చనిపోయాడు.ఆ సమయానికి ఇతనికి కేతు/బుధ/కేతుదశ జరుగుతున్నది.

బుధుడు రాహునక్షత్రంలో ఉన్నాడు.కేతువు దశ జరుగుతున్నది.ఈయన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని అంటున్నారు.కనుక ఈ దుర్మరణం ప్రస్తుతపు రాహుకేతువుల ప్రభావమే అని నేనంటే ఏమీ అభ్యంతరం ఉండదనుకుంటాను.

చంద్రలగ్నం నుంచి గమనిస్తే--
  • చంద్రుడు రాహువుతో కలసి ఉన్నాడు.ఇలాంటి జాతకులకు ఏదో ఒక వ్యసనం ఉంటుంది.ఇతను కూడా కొన్నాళ్ళు డ్రగ్స్ కీ కొన్నాళ్ళు త్రాగుడికీ అలవాటు పడి తేరుకుని మళ్ళీ వాటి ఉచ్చులో పడ్డాడు.
  • లగ్నాధిపతి అయిన శుక్రునితో కేతువు మారకస్తానంలో ఉండటం చూడవచ్చు.కేతువు దశలోనే కేతువు విదశలోనే మరణం జరిగింది. అదికూడా దుర్మరణం.రాహుకేతువులు దుర్మరణాలకు కారకులని నేను ఎప్పుడూ చెప్పేది ఇక్కడ నిజం కావడం స్పష్టంగా చూడవచ్చు.
  • బుధుడు రోగస్తానంలో రాహునక్షత్రంలో ఉండటం గమనించాలి.అంటే దీర్ఘ వ్యాధిని సూచిస్తున్నాడు.అదికూడా మారకుడైన రవితో కలసి రోగస్తానంలో ఉన్నాడు.తనకున్న శ్వాసకోశ వ్యాధి ఇంక నయం కాదన్న నిరాశతో ఇతను ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు.గ్రహ ప్రభావం ఎంత ఖచ్చితంగా మనిషి మీద ఉంటుందో గమనించండి.
  • కేతు/బుధ/కేతువు అంటే తీవ్రమైన నిరాశలోకి మనిషిని నెట్టివేసే దశ.గత కొంతకాలం నుంచీ ఇతను తీవ్రమైన డిప్రెషన్ లో ఉన్నాడని ఇతని సన్నిహితులు చెబుతున్నారు.ఇంతకంటే భారతీయ జ్యోతిష్యానికి ఇంకొక ఋజువు అవసరం లేదు.
  • లగ్నం సినిమా నటులనూ కళాకారులనూ సూచించే 'తులా' అయింది. అధిపతి శుక్రుడు లాభస్తానంలో కేతువుతో కలసి ఉండటం గమనార్హం.అందుకే సినిమా రంగంలో రాణించాడు.కానీ కేతు దశ చివరిలో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆత్మహత్యా జాతకాలలో ఉంటుందని నేను ఎప్పుడూ చెప్పే జైమినీమహర్షి సూత్రం ఈ జాతకంలో ఉందా లేదా చూద్దామా?

లగ్నానికి తృతీయాన్ని మారకుడైన కుజుడు రాహునక్షత్రంలో ఉంటూ తొమ్మిదో ఇంటినుంచి చూస్తున్నాడు.ఆ కుజుడిని శనీశ్వరుడు దశమ దృష్టితో చూస్తున్నాడు.కనుక శని,రాహు,కుజుల సంబంధం చక్కగా ఇక్కడ కనిపిస్తున్నదా లేదా?నేను ఎప్పటినుంచో వ్రాస్తున్న శపితయోగానికే రాబిన్ విలియమ్స్ బలైపోయాడన్నది పై కాంబినేషన్ స్పష్టంగా చూపిస్తున్నది. గమనించండి.

లగ్నారూడం నుంచి మళ్ళీ తృతీయంలో కేతువున్నాడు.రాహువు చూస్తున్నాడు.ఇంతకంటే ఋజువేం కావాలి?

చూచారా ఎంత కరెక్ట్ గా ఈ ఆత్మహత్యాసూత్రం మళ్ళీ ఈ జాతకంలో కూడా ప్రతిఫలించిందో? వేల సంవత్సరాల క్రితమే ఇలాంటి సూత్రాలను కనిపెట్టి క్రోడీకరించిన మహర్షి జైమినికి ప్రణామాలు అర్పిద్దామా?

నవాంశలో శనిచంద్రుల కలయిక డిప్రెషన్ కు సూచిక.రాహుకుజబుధులు కలసి ఉండటం అందులో బుధుడు ఆత్మకారకుడు కావడం దేనిని సూచిస్తున్నదో తెలుసా?

డిప్రెషన్ తో కూడిన స్థితిలో ఒక అకస్మాత్తు నిర్ణయం తీసుకోని జీవితాన్ని విషాదాంతం చేసుకుంటాడని కనిపిస్తున్నది.

అదేగా జరిగింది??

ఇకపోతే,నిన్నటి మరణకాల గ్రహస్థితికీ జననకాల గ్రహస్థితికీ పోలికలు చూద్దామా?
  • జననకాల బుధుడూ మరణకాల బుధుడూ ఖచ్చితంగా ఒకే ప్రదేశంలో ఉన్నారు.
  • జననకాల లగ్నం ప్రస్తుతం గోచార కుజ శనుల మధ్యన బందీ అయ్యి ఉన్నది.అంటే శపితయోగం చేత బంధింపబడి ఉన్నది.
  • జననకాల చంద్రుడూ మరణకాల చంద్రుడూ ఇద్దరూ కుంభరాశిలోనే ఉన్నారు.
  • జీవకారకుడైన జననకాల గురువు మీద గోచార కేతువు సంచరిస్తూ మరణాన్ని సూచిస్తున్నాడు.ఇది తిరుగులేని నాడీజ్యోతిష్యసూత్రం.
  • కర్మకారకుడైన జననకాల శనిమీద గోచార రాహువు సంచరిస్తున్నాడు.ఇదీ నాడీజ్యోతిష్యసూత్రమే.
ఒక్క విషయాన్ని గతంలో ఎన్నోసార్లు చెప్పాను.దీనిని ఎన్ని సార్లైనా చెబుతాను.ఎందుకంటే సత్యాన్ని ఎన్నిమార్లైనా ఎలుగెత్తి చాటవచ్చు. అందులో తప్పులేదు.

జాతకం అనేది జీవితాన్ని ఖచ్చితంగా స్పష్టంగా ప్రతిఫలిస్తుంది.ఇది తిరుగులేని నిజం.ఎన్ని వేల జాతకాలు చూచినా ఇదే విషయం స్పష్టంగా దర్శనిస్తుంది.

చివరలో ఒక కొసమెరుపు.

చనిపోయిన వారి జాతకాలే నేను చూస్తానని నమ్మేవారు వారి జాతకాలను చూడమని నన్ను అడగకండి.ఆ తర్వాత మీకు ఏదైనా జరిగితే దానికి నేను బాద్యుడిని కాను.