Pages - Menu

Pages

8, సెప్టెంబర్ 2014, సోమవారం

యుగ సిద్ధాంతం-1 (మనుస్మృతి)

మన పురాణాల ప్రకారం యుగాలు నాలుగని మన అందరికీ తెలుసు.

అవి-కృతయుగం,త్రేతాయుగం,ద్వాపరయుగం,కలియుగం.

కానీ మన పురాణాలలోని యుగాల లెక్కలలో చాలా గందరగోళాలున్నాయి. మన పురాణాలలో చెప్పబడిన ప్రకారం అవి కోటానుకోట్ల సంవత్సరాల నిడివిని కలిగి ఉన్నాయి.ఒ క్క కలియుగమే 4,32,000 సంవత్సరాల కాలం ఉంటుందని ప్రస్తుతం నమ్ముతున్నారు. మిగతా యుగాలు దీనికి 2,3,4  రెట్లు ఉంటాయి. అంటే,

కృతయుగం -   17,28,000 
త్రేతాయుగం -  12,96,000
ద్వాపరయుగం- 8,64,000
కలియుగం-        4,32,000
---------------------------------------
   ఒక మహాయుగం    43,20,000 సంవత్సరాలు
---------------------------------------
ఇది తార్కికమూ కాదు.సంభవమూ కాదు.ఎందుకంటే 4,32,000 సంవత్సరాల పాటు భూమిమీద కలియుగం ఉండి, దాని లక్షణాలైన అధర్మమూ అన్యాయమూ అలాగే విచ్చలవిడిగా రాజ్యం ఏలుతూ ఉంటే,ఆ కలియుగం అయిపోయేసరికి ఈ భూమ్మీద మానవులనేవారు ఒక్కరు కూడా మిగలరు.మానవులే కాదు,జంతువులూ పక్షులూ చెట్లూ కూడా మిగలవు.అన్నింటినీ మనిషి స్వాహా చేసేసి తను కూడా దురాశా రాక్షసి నోటిలో పడి ఆహుతి అయిపోతాడు.

అదీగాక మహాభారతం ద్వాపర యుగంలో జరిగిందని మనకు తెలుసు.ఆ కాలం BC 3000 అంటున్నారు.అంటే నేటికి 5000 సంవత్సరాలు అయింది.పోనీ ఈ లెక్కలూ పురాణాలూ అన్నీ ఎవరో బ్రాహ్మణులు సృష్టించిన కట్టుకధలు ,అనుకున్నా కూడా,మహాభారత యుద్ధం తరువాత కొంతకాలానికి సముద్రంలో మునిగి పోయిందని చెప్పబడుతున్న ద్వారకా నగరం గుజరాత్ తీరంలో మన కళ్ళెదురుగానే సముద్రగర్భంలో కనిపిస్తున్నది.ఆ నగరపు కట్టడాలలోనూ వాటిలో వాడిన రాళ్ళు,చెక్కలు మొదలైన వాటిలోనూ అనేక పొరలు(layers) ఉన్నాయనీ వాటి వయస్సులు 2000 BC నుంచీ 12000 BC వరకూ ఉన్నాయనీ పరిశోధకులు అంటున్నారు.

ఒకవేళ పురాణాలు కట్టుకధలు అనుకున్నా కూడా,సముద్ర గర్భంలో కనిపిస్తున్న ద్వారకానగరాన్ని ఎవరూ కాదనలేరు.మహాభారతం  నిజంగా జరిగిందనీ,శీ కృష్ణుడు శరీరంతో ఈ భూమి మీద తిరిగినది నిజమే అనీ వేల సంవత్సరాలుగా సముద్రంలో నిలిచి ఉన్న ద్వారకా నగరం తిరుగులేని రుజువును చూపిస్తున్నది.

మరి మహాభారతం 3000 BC లో జరిగి ఉంటే,అప్పుడు ద్వాపరయుగం జరుగుతూ ఉంటే,ఈ కాస్తలోనే కలియుగం ఎలా వస్తుంది?మన లెక్కల ప్రకారం ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు ఉండాలి కదా? 

కనుక ఎక్కడో ఈ లెక్కలలో ఏదో పొరపాటు దొర్లిందనేది స్పష్టం.

ఆ పొరపాటును సవరించి,ఈ లెక్కలను ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం ఎందఱో చేశారు.వారిలో కొంతవరకూ సఫలీకృతుడు అయినది స్వామి యుక్తేశ్వర్ గిరిగారు.పరమహంస యోగానందగారి గురువుగా, క్రియాయోగ సంప్రదాయపు గురువులలో ఒకరుగా ఈయన లోకానికి సుపరిచితుడే. ఆయన వ్రాసిన The Holy Science అనే పుస్తకం ఉపోద్ఘాతంలో దీనిని గురించిన వివరణను ఆయన ఇచ్చారు.

ఒక క్రియాయోగ సాంప్రదాయపు గురువుగానే ఆయన అందరికీ తెలుసు. కానీ ఆయన ఒక గొప్ప జ్యోతిష్యపండితుడన్న విషయం చాలామందికి తెలియదు.ఒక మనిషి చేతిని క్షణకాలంపాటు చూచి, ఆ మనిషి జాతకంలోని లగ్నం ఏమిటో జాతకచక్రం అవసరం లేకుండానే ఆయన ఖచ్చితంగా గుర్తించగలిగేవారు.

ఆయన చేసిన విశ్లేషణకు ఆధారంగా 'మనుస్మృతి' మొదటి అధ్యాయం నుంచి ఈ క్రింది శ్లోకాలను ఆయన ఉదాహరించారు.

శ్లో||చత్వార్యాహు: సహస్రాణి వర్షాణామ్ తు కృతం యుగమ్
తస్య తావచ్చతీ సంధ్యాం సంధ్యాంశ్చ తధావిధ:
ఇతరేషు ససంధ్యేషు ససంధ్యాంశేషు చ త్రిషు
ఏకాపాయేన వర్తన్తే సహస్రాణి శతానిచ
యదేతత్ పరిసంఖ్యాతమాదావేవ చతుర్యుగమ్
ఏతద్ ద్వాదశ సాహస్రం దేవానాం యుగముచ్యతే
దైవికానాం యుగానాంతు సహస్రం పరిసంఖ్యయా
బ్రహ్మమేక మహజ్ఞేయం తావతీ రాత్రిరేవచ

(నాల్గువేల సంవత్సరాలు కృతయుగం అనబడుతుంది.అన్ని వందల సంవత్సరాలు ఇరుసంధ్యలుంటాయి.మిగిలిన మూడు యుగాలూ కూడా అలాగే ఉంటాయి.అలా వచ్చిన మొత్తం 12,000 సంవత్సరాలు ఒక దైవయుగం అనబడుతుంది.అటువంటి దైవయుగములు ఒక వెయ్యి జరిగితే అది బ్రహ్మదేవునికి ఒక పగలు అవుతుంది.రాత్రి కూడా అదే ప్రమాణం కలిగినట్టిది)

(మనుస్మృతి 1:69-72)

దీనిప్రకారం:--

కృతయుగం -4000 సం.
దీని ముందు వెనుకల సంధికాలం -400+400=800 సం.
మొత్తం -4800 సం.

త్రేతాయుగం-3000 సం.
సంధికాలం-300+300=600 సం.
మొత్తం-3600 సం.

ద్వాపర యుగం-2000 సం.
సంధికాలం-200+200=400 సం.
మొత్తం-2400 సం.

కలియుగం-1000 సం.
సంధికాలం-100+100=200 సం.
మొత్తం-1200 సం.

కనుక ఒక మహాయుగం నిడివి
=4800+3600+2400+1200
=1200(4+3+2+1)
=1200x10
=12,000 సంవత్సరాలు

ఇక్కడ కొంత ఖగోళ గణితం ఉపయోగిద్దాం.దీని గురించిన ప్రాధమిక అవగాహన కొంత ఉన్నవారికి ఈ పదాలు అర్ధమౌతాయి.లేకుంటే ముందు ఆ పదాలను అర్ధం చేసుకుని ఆ  తర్వాత ఇది చదివితే సరిగ్గా అర్ధమౌతుంది.

మనకు తెలిసిన లెక్కల ప్రకారం,సరాసరిగా ఒక 24,000 సంవత్సరాల కాలంలో విషువు (Equinox) ఖగోళంఒక ఆవృత్తి చలనాన్ని పూర్తి చేస్తుంది.కనుక ఒక విషువత్ ఆవృత్తి జరిగే సమయానికి రెండు మహాయుగాలు అయిపోతాయి.ఇవి ఒక ఆరోహణా యుగం,ఇంకొక అవరోహణా యుగంగా ఉంటాయి.

ఖగోళంలో విషువద్బిందువు (Equinoctial point) తన తిర్యక్చలనంలో (retrograde motion) భాగంగా 0 డిగ్రీ మేషం నుంచి 180 డిగ్రీ వరకూ వెనక్కు జారడాన్ని అవరోహణా యుగంగానూ, తిరిగి అక్కడనుంచి మేషం 0 వరకూ ప్రయాణించడాన్ని ఆరోహణా యుగంగానూ భావించాలి.అవరోహణకు 12000 సంవత్సరాల కాలం పడితే మళ్ళీ ఆరోహణకు ఇంకొక 12000 సంవత్సరాల కాలం పడుతుంది.మొత్తం 24000 సంవత్సరాల కాలాన్ని ఒక మహాయుగం అనుకుందాం.

మనకు తెలిసిన నవీన మంచుయుగం 12,500 BC -10,500 BC మధ్యలో ముగిసింది.దీనికి సైన్స్ పరమైన ఆధారాలున్నాయి.

11,501 BC లో మంచుయుగం అయిపోయి మళ్ళీ జీవం భూమిమీద కదలాడటం మొదలయ్యే సమయానికి సరిగ్గా శరద్విషువత్ (Autumnal equinox) మేషం 0 లో ఉన్నదని ఆయన ప్రతిపాదించారు.అక్కడ నుంచి యుగాలు ప్రారంభం అయ్యాయనీ, అప్పటినుంచి 12000 సంవత్సరాలకు,అంటే 500 AD సమయానికి ఒక అవరోహణా మహాయుగం అయిపొయిందనీ.అక్కడనుంచి ఆరోహణా మహాయుగ ప్రమాణమైన మరొక్క 12,000 సంవత్సరాల కాలం మొదలైందనీ ఆయన వ్రాశారు.

ఆ క్రమంలో 1700 AD కి ఆరోహణా కలియుగపు 1200  సంవత్సరాల కాలం అయిపోయి అప్పటినుంచీ 2400 సంవత్సరాల నిడివి గల ఆరోహణా ద్వాపర యుగంలో మనం అడుగు పెట్టామని ఆయన సిద్ధాంతీకరించారు.దానికి రుజువులుగా ఆయన అనేక సంఘటనలను చూపించారు.

ఆయన శిష్యుడైన పరమహంస యోగానందగారు ఆ పుస్తకానికి ముందు మాట వ్రాస్తూ సంతకం చేసిన తేదీని 249 Dwapara(AD 1949) అన్నారు.

అంటే నేటికి,అంటే,2014 AD కి మనం ప్రస్తుతం ద్వాపరయుగం 314 వ సంవత్సరంలో ఉన్నామన్న మాట.

ఇదంతా నిజమే అయితే,మనం ప్రస్తుతం చదువుతున్న 'కలియుగే ప్రధమే పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే..." ఆదిగా గల నిత్యసంకల్పం అంతా శుద్ధ తప్పై కూచుంటుంది.అంటే ప్రస్తుతం ప్రతి దేవాలయంలోనూ,ప్రతి ద్విజుడూ ప్రతిరోజూ చేస్తున్న సంధ్యావందనం లోనూ చదువుతున్న సంకల్పం అంతా తప్పుల తడిక అన్నమాట.

అవునా?

అయితే,స్వామి యుక్తేశ్వర్ గిరిగారు చెప్పినది అంతా నిజమేనా? ఆయన క్రియాయోగపు గురువులలో ఒకరు. గొప్ప యోగి అయిన ఆయన చెప్పినది తప్పెలా అవుతుంది?ఆయన అబద్దం ఎందుకు చెబుతారు?

అయితే మనవాళ్ళు ప్రతిరోజూ చదివే సంకల్పం అంతా తప్పేనా?

అన్న అనుమానాలు మనందరికీ కలగడం సహజం.