Pages - Menu

Pages

5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

రోహిణీ శకట భేదనం-5(శనీశ్వరుని కర్మక్షాళనా విధానాలు)

రోహిణీ శకట భేదనాన్ని గతంలోని కాలవ్యవధిలో గమనించడం ద్వారా మనకు ఒక విషయం అర్ధమైంది.పురాణాలలో చెప్పబడిన ఈ విషయం నిజమే.శనీశ్వరుడు రోహిణీ నక్షత్రాన్ని స్పర్శించిన ప్రతిసారీ ప్రపంచవ్యాప్తంగా అనేక ఉపద్రవాలూ దుర్ఘటనలూ జరిగాయి.

దీనికి కారణం ఉన్నది.

రోహిణీ నక్షత్రానికి అధిపతి ప్రజాపతి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రజలను సృష్టించేది ఆయన గనుకా ప్రజలు ఈ నక్షత్రంతో సూచింప బడుతున్నారు గనుకా,ఈ నక్షత్రాన్ని శనీశ్వరుడు పీడించినప్పుడు(అంటే దీనిమీద సంచరించినప్పుడు) ప్రజలకు వినాశం జరగడం తార్కికమే. ఎందుకంటే శనీశ్వరుడు కర్మకారకుడు.కర్మను పెంచేదీ తుంచేదీ కూడా ఆయనే.

అంతే కాదు.తనకున్న 27 మంది భార్యలలో(నక్షత్రాలలో) చంద్రునికి రోహిణీ నక్షత్రం అంటేనే అత్యంత ఇష్టం అని పురాణాలు అంటాయి.దీని వెనుక గల గూడార్ధాలను,యోగ తంత్రపరమైన అర్దాలనూ మళ్ళీ ఇంకోసారి (చెప్పాలి అనిపిస్తే) వివరిస్తాను.ప్రస్తుతానికి మాత్రం రోహిణీ నక్షత్రానికి ఉన్న ప్రత్యేకతను అర్ధం చేసుకుంటే చాలు.

కనుక అధర్మాచరణలతో అహంకారాలతో విర్రవీగుతున్న వారిని శిక్షించే పనిని శనీశ్వరుడు రోహిణీ నక్షత్రాన్ని స్పర్శించిన లేదా చూచిన ప్రతిసారీ చేస్తున్నాడు.రాహువు కుజుడు మొదలైన మిగతా గ్రహాలు కూడా ఇదే పనిని చేస్తున్నాయి.ఆయనకు సహాయపడుతున్నాయి.

సృష్టిలో ఒక లాజిక్ ఉన్నది.గ్రహాల నడకలో ఒక లాజిక్ ఉన్నది.మనిషి జీవితంలో కూడా ఒక లాజిక్ ఉన్నది.

సృష్టిలోని లాజిక్ ను 'ఋతమ్' అని వేదం పిలిచింది.మనిషి జీవితంలోని లాజిక్ ను 'కర్మ' అని చెప్పింది.గ్రహాల నడకలను 'దశలు'గా జ్యోతిశ్శాస్త్రం దర్శించింది.సృష్టిలోని సమస్తగోళాలూ ఒక క్రమంలో నడుస్తున్నాయి.అవి క్రమం తప్పితే విధ్వంసం జరుగుతుంది.అలాగే మనిషి జీవితం కూడా ఒక క్రమంలో నడిస్తే బాగుంటుంది.ఆ క్రమాన్ని తప్పితే కష్టాలు మొదలౌతాయి. విశ్వంలోనూ మనిషి జీవితంలోనూ ఉన్న ఈ క్రమాన్నీ సమతుల్యతనూ అర్ధం చేసుకునే ప్రయత్నాన్ని మహర్షులు చేశారు.

ప్రాచీనమైన ఈ పరిశోధనలోనుంచి కొన్ని శాస్త్రాలు పుట్టినవి.

సృష్టిలో ఉన్న లాజిక్ నూ,మనిషి జీవితంలో ఉన్న లాజిక్ నూ దర్శించేవే జ్యోతిష్యం,వేదాంతం,యోగం,తంత్రం మొదలైనవి.ఇవన్నీ ప్రాచీన విజ్ఞానఖనులు.వీటిని అర్ధం చేసుకోవడం వల్లా ఆచరించడం వల్లా మనిషి జీవితం పరిపూర్ణం అవుతుంది.సార్ధకం అవుతుంది.అత్యంతమైన ఆత్మసంతృప్తితో జీవితం అప్పుడు నడుస్తుంది.

ఇవన్నీ ఉబుసుపోని హాబీలు కావు.ఏమీ తోచక చెప్పుకునే పిచ్చి మాటలూ కబుర్లూ కావు.ఇవి జీవితాన్ని నడిపించే దిక్సూచులు.వీటిని అనుసరిస్తూ జీవితాన్ని చక్కదిద్దుకోవడమే జీవనవేదం.

శనీశ్వరుడు వృషభంలో మనం ప్రస్తుతం పరిశీలిస్తున్న ప్రాంతంలో ఉన్న సంవత్సరాన్ని 0 సంవత్సరం అనుకుంటే,

వృషభం-0 సం.
సింహం-7.5 సం.
వృశ్చికం-14 సం.
మీనం-24 సం.

దాదాపు కొంచం అటూఇటూగా ఆయా ఎనిమిది సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుర్ఘటనలు ఉంటాయి.అయితే,ఆయా రాశులను బట్టి ఆయా ఫలితాలులో స్వల్పమైన తేడాలు ఉంటున్నాయి.అవేంటో ఇప్పుడు గమనిద్దాం.
  • వృషభం భూతత్వరాశి గనుకా,రోహిణీ శకటంలో శనీశ్వరుడు ఏదో విధంగా ఈ రాశిని చూస్తున్నాడు గనుకా భూకంపాలు ప్రతిసారీ జరుగుతున్నాయి.
  • సింహం అగ్నితత్వ రాశిగనుక,ఆ సమయంలో అగ్ని ప్రమాదాలూ దానికి వ్యతిరేకమైన జలప్రమాదాలూ ఎక్కువగా జరిగాయి.
  • వృశ్చికం జల తత్వరాశి గనుక,ఆ సమయంలో రసాయన, జలయాన ప్రమాదాలూ తుఫాన్లూ వరదలూ ఎక్కువగా వచ్చాయి.
  • మీనం కూడా జలతత్వ రాశేగనుక ఆ సమయంలో కూడా నీరు,పెట్రోల్ మొదలైన ద్రవాలకు సంబంధించిన ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి.
మనిషి మనుగడకు కారణాలు పంచమహాభూతాలు.మనిషిని అంతం చేసేవి కూడా అవే.కనుక రోహిణీ శకటం సమయంలో భూమి,నీరు,అగ్ని, వాయువులకు చెందిన ప్రమాదాలు విస్తృతంగా జరుగుతున్నాయి. మనుషులను అంతం చేస్తున్నాయి.ఆకాశం సర్వవ్యాపకం గనుక అన్నింటికీ ఆధారంగా ఉండనే ఉంటుంది.

ఆయా సమయాలలో కూడా మనుష్యులు అందరూ చనిపోరు.ఎవరి సామూహిక కర్మ అయితే తీవ్రంగా ఉండి,పరిపక్వానికి వచ్చి ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ ప్రమాదాలలో భయంకరంగా చనిపోతున్నారు.మిగతా వారికి ఏమీ అవదు.ఆ ప్రమాదాలు కూడా ఏదో శక్తి కావాలని ఎంచుకున్నట్లుగా అలాంటి మనుష్యులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోనే జరుగుతాయి.మిగతా ప్రాంతాలలో జరగవు.ఇదే సృష్టిలోని విచిత్రం.

సృష్టిలోని న్యాయం ఇదే.ఎవరెవరి తప్పులకు తగినట్లు వారివారికి శిక్షలు పడటం ఇక్కడ తప్పదు.దైవన్యాయాన్ని తప్పుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.

మన గ్రంధాలలో నిత్య,నైమిత్తిక,మహా ప్రళయాలని రకాలున్నాయి.

మహాప్రళయం అనేది ఎప్పుడో కొన్ని కోటానుకోట్ల సంవత్సరాలకు కల్పాంతంలో గాని రాదు.

నిత్యప్రళయం అనేది ప్రతిరోజూ జరుగుతూనే ఉంటుంది.ఎందఱో ఎన్నో రకాలుగా అనేక ప్రమాదాలలోగాని,విచిత్రరోగాలతో గాని,ఘోరాలలో గాని ప్రతిరోజూ చనిపోతూనే ఉంటారు.ఇది నిత్యప్రళయం.

కొన్నికొన్ని సమయాలలో జరిగే ప్రత్యేక ఘోరవిపత్తుల వల్ల సామూహిక దుర్మరణాలు జరగడం నైమిత్తిక ప్రళయం.దీనిగురించే నేనిప్పుడు పరిశోధన చేశాను.కొన్ని తిరుగులేని సూత్రాలు కనుక్కున్నాను.

గ్రహములు రాశిచక్రంలో సంచరించే సమయంలో మనుష్యుల కర్మలకు తగినట్లు వారివారికి ఆయా ఫలితాలు అందిస్తూ ప్రయాణం సాగిస్తారు.మంచికి మంచి,చెడుకు చెడు జరుగుతూ మానవ జీవితయానం సాగుతూ ఉంటుంది.తెలివైనవారు ఈ క్రమాన్ని దర్శించి వారిని వారు మార్చుకుని ధర్మానుసారం జీవితాలను దిద్దుకుంటారు.వారి కర్మ బాగుపడుతుంది. అహంతో విర్రవీగుతూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుండే వారికి కర్మ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది.వారి సమయం వచ్చినప్పుడు ఆయా ఫలితాలు ఎలా ఉంటాయో అనుభవించేటప్పుడు అర్ధమౌతుంది. అప్పుడు ఎంత ఏడిచి మొత్తుకున్నా ఏమీ ఫలితం ఉండదు.

కర్మ పెంచుకునేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది.ఉత్సాహంగా ఉంటుంది.ఎందుకంటే అనుకున్న వన్నీ అనుకున్నట్లు అయిపోతూ ఉంటాయి.కానీ ఆ క్రమంలో పెరుగుతున్న కర్మ గురించి తెలియదు.కానీ అది పక్వానికి వచ్చి అనుభవకాలం మొదలయినప్పుడు దాని బాధ ఏమిటో తెలుస్తుంది.

ఆ సమయాలలో ప్రతి మనిషీ ఇలా అనుకుంటాడు.

'నేనెవ్వరికీ హాని చెయ్యలేదు.ఏ పాపమూ చెయ్యలేదు.నాకెందుకీ శిక్ష?నేనేం తప్పు చేసానని నన్ను దేవుడు ఇలా శిక్షిస్తున్నాడు?'

ఏ పాపమూ చెయ్యకపోతే ఏ శిక్షా పడదు.శిక్ష పడిందీ అంటే పాపం చేసినట్లే లెక్క.అది ఎలాంటి పాపమో మనకు తెలియక పోవచ్చు,మనం మర్చిపోయి ఉండవచ్చు,లేదా దానిని పాపంగా గుర్తించేటంత బుద్ధి మనకు లేకపోవచ్చు.మనకు బుద్ధి లేనంత మాత్రాన ప్రకృతి బుద్ధి లేనిది కాదు.దానికి బుద్ధీ జ్ఞానమూ బాగానే ఉన్నాయి.మనం చేసిన చేస్తున్న పనులు ప్రకృతిలో చక్కగా రికార్డ్ అవుతున్నాయి.వాటికి తగిన శిక్షలు కూడా సమయం వచ్చినపుడు చక్కగా అమలు అవుతాయి.

ఆ సమయం రావడం అనేదే 'శనీశ్వరుని' అధీనంలో ఉంటుంది.ఆయన రాశిచక్రంలో చేసే ప్రయాణంలో జీవులకు ఎవరెవరి కర్మానుసారం వారికి ఆయా శిక్షలు వేస్తూ ఉంటాడు.ఆయనకేమీ పక్షపాతం లేదు.వీటిని ఎవరూ తప్పించుకోలేరు.

ఏలినాటి శని 7.5 సంవత్సరాలు,అర్ధాష్టమ శని 2.5 సంవత్సరాలు,అష్టమ శని ఇంకొక 2.5 సంవత్సరాలు వెరసి 12.5 సంవత్సరాల కాలం ఆయన అధీనంలో ఉంటుంది.లగ్నమూ చంద్రలగ్నమూ వేర్వేరు అయితే దీనికి మళ్ళీ ఇంకొక 12.5 సంవత్సరాల కాలం కలుస్తుంది.సూర్య లగ్నం నుంచి ఇంకొక 12.5 కలుస్తుంది.వెరసి 30 ఏళ్ళ కాలవ్యవధిలో మన కర్మ ఇంకా పూర్తి కానే కాదు.ఈలోపల రోహిణీ శకట సమయం వస్తుంది.దానికి 8 ఏళ్ళ సమయం ఉన్నది.ఈ రకంగా చూస్తె మనిషి జీవితం మొత్తం శనిభగవానుని చేతులలోనే గడుస్తున్నది.ముగుస్తున్నదని చెప్పవచ్చు.

కర్మ చెయ్యడమూ దాని ఫలం అనుభవించడమే జీవన సారాంశం.క్లుప్తంగా చెప్పాలంటే ఇంతకంటే మనిషి జీవితంలో ఇంకేమీ లేదు.

శనీశ్వరుడు రాశిచక్రాన్ని చుట్టి వస్తూ,రోహిణీ నక్షత్రాన్ని స్పర్శిస్తున్న లేదా చూస్తున్న సమయాలలో మిగతా కర్మగ్రహాలైన రాహువు,కుజుడు కూడా రోహిణీ నక్షత్రాన్ని స్పర్శించడమో లేక దానిని వీక్షించడమో చేస్తే,అప్పుడు అది Compounding effect అవుతుంది.ఆ సమయంలో లోకులు పడే బాధలు పరమ భయంకరంగా ఉంటాయి.అంటే అలాంటి కర్మలు చేసుకున్న వారికి ఆయా సమయాలలో ఆయా కర్మలకు తగిన శిక్షలు పడతాయి.అవి "దృఢకర్మ" సమయాలు.వాటిని తప్పించడం ఎవరికీ వీలు కాదు.

అలాంటి సమయాలు మన పరిశీలనలో ఎప్పుడు వచ్చాయో గమనిద్దాం.

వృషభంలో శనీశ్వరుని స్థితిలో గమనింపబడిన సూత్రాలు:

  • 2002 లో శనిరాహువులు వృషభ రాశిలో కలసి ఉన్నారు.
  • 1972 లో శని వృషభంలో ఉన్న సమయంలో రాహువు మకరంలో ఉండి తన పంచమ దృష్టితో వృషభరాశిని వీక్షించాడు.
  • 1942 లో శని కుజులు వృషభరాశిలో కలిసి ఉన్నారు.
  • 1912 డిసెంబర్ ప్రాంతంలో శని వృషభంలో ఉన్నాడు.కుజుడు వృశ్చికం నుంచి తన సప్తమ దృష్టితో శనిని వీక్షించాడు.
  • 1883 జూలై లో శని కుజులు ఇద్దరూ వృషభ రాశిలో కలసి ఉన్నారు.
  • 1854 లో శని రాహువులు కలసి వృషభ రాశిలో ఉన్నారు.అదే సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలలలో అయితే కుజుడు తులా వృశ్చిక రాశులలో ఉంటూ వీరిద్దరినీ తన అష్టమ సప్తమ దృష్టులతో వీక్షిస్తున్నాడు.
  • 1824 ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నెలలలో వృషభంలో ఉన్న శనిని,తులా వృశ్చిక రాశులలో సంచరించిన కుజుడు వీక్షించాడు.ఫిబ్రవరి 1825 లో కుజుడు కుంభరాశిలో ఉంటూ తన చతుర్ధ దృష్టితో శనిని వీక్షించాడు.

ఈ పరిశీలనను బట్టి అర్ధమైన విషయాలు:

సూత్రం 1:--

శనీశ్వరుడు వృషభరాశిలో ఉండే 2.5 ఏళ్ళలో కుజుడు దాదాపు రెండు లేదా మూడు సార్లు ఆయనను స్పర్సిస్తాడు.అలాగే తన 4,7,8 దృష్టులతో కనీసం మూడునుంచి అయిదు సార్లు ఆయన్ను చూస్తాడు.ఆయా నెలలలో ఖచ్చితమైన ప్రపంచవ్యాప్త దుర్ఘటనలు జరిగాయి.ఇక ముందు కూడా జరుగుతాయి.

అలాగే ఆయా సమయాల్లో రాహువు కూడా ఏదో ఒక విధంగా శనిని వీక్షించడమో ఆయనతో కలసి ఉండటమో చేస్తాడు.అలాంటప్పుడు కూడా ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయి.

సూత్రం 2:--

ఇదే విధమైన పరిస్థితి శనీశ్వరుడు వృశ్చికంలో ఉంటూ తన సప్తమ దృష్టితో వృషభాన్ని వీక్షించినప్పుడు కూడా కలుగుతుంది.ఆయా సమయాలలో కూడా ఈ సంఘటనలు జరిగాయి.

సూత్రం 3:--

శనీశ్వరుడు సింహ రాశిలో సంచరించే 2.5 సంవత్సరాల కాలంలో ఆయనతో బాటు కుజ రాహువుల పరస్పర స్థితి దృష్టులు రోహిణీ నక్షత్రం మీద పడిన సమయాలలో కూడా విపరీతమైన దుర్ఘటనలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి.

సూత్రం 4:--

అదే విధంగా శనీశ్వరుడు మీనరాశిలో సంచరించే 2.5 సంవత్సరాలలో కూడా కుజ రాహువుల పరస్పర స్థితి దృష్టులు వృషభరాశి మీద పడిన సమయంలో కూడా ప్రపంచవ్యాప్త దుర్ఘటనలు జరిగాయి.

కనుక పై నాలుగు సూత్రాల పరిశీలనను బట్టి ఒక మూలసూత్రాన్ని మనం క్రోడీకరించవచ్చు.

ముఖ్య సూత్రం:--

వృషభరాశి మీద శని,రాహు,కుజులలో ఎవరో ఒకరుగాని,ఇద్దరు గాని,లేక ముగ్గురూ గాని,పరస్పర సంచారం గాని, దృష్టిగానీ వచ్చిన సమయం జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా భయంకర నష్టాలూ దుర్ఘటనలూ జరిగి జనం వేలల్లో లక్షల్లో చనిపోతారు.తీవ్రమైన ఆస్తినష్టం జరుగుతుంది. ఇది తిరుగులేని జ్యోతిష్యసూత్రం.

దీనికి మూలం రామాయణ,మహాభారతాల్లో చెప్పబడిన 'రోహిణీ శకట భేదనం' అనబడే సూచన.

ఈ సూత్రానికి ఆధారాలుగా గత నాలుగు పోస్ట్ లలో వ్రాయబడిన ప్రపంచవ్యాప్త దుర్ఘటనలే ప్రబల సాక్ష్యాలు.ఆయా సాక్ష్యాలూ దుర్ఘటనలూ ప్రతిరోజూ జరిగే చిల్లర మల్లర సంఘటనలు కావు.ప్రతి ముప్పై ఏళ్ళ కొకసారి సైక్లిక్ గా జరుగుతున్నఅతితీవ్రమైన దుర్ఘటనలు.గత 300 ఏళ్ళలో వచ్చిన దాదాపు 28 టైం స్లాట్స్ లో లెక్కలేనన్ని సార్లు ఈ సూత్రం రుజువౌతూ వచ్చింది.వాటిల్లో ఒక pattern ఉన్నది.ఒక cyclic repetition ఉన్నది.ఆ pattern ని నేను ఈ పరిశోధనలో పట్టుకోగలిగాను.

ఈ 5 పోస్ట్ లలో నా పరిశోధనను మీ ముందు ఉంచాను.

మనకు లభించిన పై సూత్రాల ఆధారంగా 2015-16 లో రాబోతున్న రోహిణీ శకట భేదన సమయంలో ఏయే నెలలు ముఖ్యంగా అతి ప్రమాదకరములో చూద్దామా?

  • నవంబర్ 3,2014 న శనీశ్వరుడు వృశ్చికరాశిలో అడుగు పెట్టబోతున్నాడు. అప్పటినుంచి 2.5 సంవత్సరాల కాలం అక్కడే ఉంటాడు.ఆ సమయంలో ప్రజలకు మళ్ళీ మూడబోతున్నది.
  • ఫిబ్రవరి 2015 లో కుజుడు కుంభరాశిలో సంచరిస్తూ తన చతుర్ధ దృష్టితో వృషభంలో ఉన్న రోహిణీ నక్షత్రాన్ని వీక్షిస్తాడు.
  • ఏప్రిల్ 2015 లో కుజుడు మేషరాశిలో సంచరిస్తూ తన అష్టమదృష్టితో శనిని వీక్షిస్తాడు.
  • మే,జూన్  2015 నెలలలో మళ్ళీ కుజుడు వృషభరాశిలో సరాసరి రోహిణీ నక్షత్రం పైనే సంచరిస్తూ శనిని తన సప్తమ దృష్టితో వీక్షిస్తాడు.
  • అక్టోబర్ 2015 లో కుజుడు సింహరాశిలో సంచరిస్తూ శనిని తన చతుర్ధ దృష్టితో వీక్షిస్తాడు.
  • నవంబర్ 2015 లో కన్యారాశిలో కుజ రాహువులు కలుస్తారు.
  • మార్చి-సెప్టెంబర్ 2016 ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమైన కాలం. ఎందుకంటే,ఒకటిన్నర నెల వ్యవధిలో రాశి మారే కుజుడు,ఆసమయంలో మాత్రం దాదాపు ఆరునెలల కాలం స్తంభన,వక్ర స్థితులలోకి ప్రవేశిస్తూ వృశ్చికంలో ఉన్న శనీశ్వరునితో కలసి ఉండబోతున్నాడు.ఆ సమయంలో వారిద్దరి భయంకరమైన సప్తమదృష్టి వృషభం మీద పడుతున్నది.కన్యారాశిలో ఉన్న రాహువు యొక్క పంచమదృష్టి కూడా ఆ సమయంలో వృషభం మీద పడుతున్నది.కనుక ఇదొక భయంకరమైన Compounding effect ను సృష్టించబోతున్నది.కాబట్టి ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా భయంకర దుర్ఘటనలు ఖచ్చితంగా జరుగబోతున్నాయని నేను ఈరోజు(ఒకటిన్నర సంవత్సరం ముందుగా) చెబుతున్నాను.కావలసిన వారు వ్రాసి పెట్టుకోండి.అవి జరిగినప్పుడు మళ్ళీ గుర్తు చేస్తాను.
  • మళ్ళీ జనవరి 2017 లో కుజుడు కుంభంలో సంచరిస్తూ తన చతుర్ధ దృష్టితో వృషభరాశిని వీక్షిస్తాడు.
  • జనవరి 26,2017 న శనీశ్వరుడు వృశ్చిక రాశిని వదలి ధనూరాశిలోకి ప్రవేశించడంతో ప్రపంచ కర్మ ప్రక్షాళనా కార్యక్రమం ఒక అంకం అప్పటికి ముగుస్తుంది.

కనుక స్థూలంగా చూస్తే నవంబర్ 2014 నుంచి జనవరి 2017 వరకూ ప్రపంచానికి గడ్డుకాలమే అని స్పష్టంగా చెప్పవచ్చు.దానికి సూచికగా మళ్ళీ ఇస్లాం తీవ్రవాదం తలెత్తుతున్న సూచనలు అప్పుడే కనిపిస్తున్నాయి చూచారా?

ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో మళ్ళీ పైన సూచించిన నెలలు అత్యంత ప్రమాదకర సంఘటనలు జరిగే సమయాలు.అవి జరిగినప్పుడు వాటిని గురించి మళ్ళీ గుర్తు చేస్తుకుందాం.

అంతవరకూ శని,కుజ,రాహుగ్రహాల అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటూ,కొత్తగా చెడుకర్మ పెంచుకోకుండా ఉంటూ,ఇప్పటికే ఉన్న గత చెడుకర్మను ప్రక్షాళనం చేసుకుంటూ జాగ్రత్తగా ఉండమని అందరికీ నా సూచన.

(సంపూర్ణం)