Pages - Menu

Pages

30, అక్టోబర్ 2014, గురువారం

పురచ్చితలైవి డా|| జయలలిత జాతకం-ఒక పరిశీలన-2

చెన్నై నుంచి ఇంకొక మిత్రుడు ఇచ్చిన వివరాల ప్రకారం డా||జయలలిత అసలైన జనన సమయం మధ్యాన్నం 14.34 hours.ఇది చాలా ఖచ్చితమైన జననసమయం అని ఆయన చెబుతున్నారు.కనుక దీనిని కూడా పరిశీలించవలసిన అవసరం ఉన్నది.

ఆ సమయానికి వేసిన జాతకచక్రం ఇక్కడ ఇచ్చాను.

రెండుగంటల సమయం తేడాలో ఒక్కొక్కసారి పెద్దగా తేడాలు రావుగాని ఒక్కొక్కసారి రెండు నిముషాల తేడా కూడా చాలా మార్పులు తీసుకొస్తుంది.ముఖ్యంగా దశలు మారిపోతాయి. భావాలూ వాటి రీడింగ్సూ పూర్తిగా మారిపోతాయి.అందుకని జీవిత వివరాలను కొంచం లోతుగా పరిశీలిద్దాం.

ఈ సమయానికి మిధున లగ్నం అయి కూచుంది.వివాహమూ సంతానమూ మొదలైన వ్యక్తిగత భావాలను పరిశీలిస్తే మొదటి జాతకంకంటే ప్రస్తుత జాతకమే ఎక్కువ సరిగ్గా సరిపోతున్నది.

ఈ జాతకానికి గురువు ఉభయ కేంద్రాధిపత్యదోషి.సప్తమంలో ఉంటూ కళత్ర భావాన్ని పాడుచేస్తున్నాడు.సంతాన కారకుడు కూడా ఈయనే కావడంతో ఈ రెండు భావాలూ దెబ్బతిన్నాయి.దానికి తోడు పంచమంలో కేతువువల్ల పుత్రదోషం సూచింపబడుతున్నది.కనుక వివాహభావమూ సంతాన భావమూ రెండూ పాడైపోయాయి.

అయితే పంచమాధిపతి శుక్రుడు దశమంలో ఉచ్ఛస్థితి వల్ల తనకు సంతానం లేకపోయినా లక్షలాది తమిళుల చేత 'అమ్మా' అని ప్రేమగా పిలిపించుకునే యోగం పట్టింది.సప్తమంలో గురువు వల్ల మధ్యవయస్సు నుంచి లావెక్కే శరీరతత్వం సూచితం అవుతున్నది.తృతీయంలో కుజచంద్రులవల్ల మంచి వాగ్దాటీ,ఉపన్యాస పటిమా కనిపిస్తున్నాయి.లాభంలోని రాహువు వల్ల కుట్రలతో కూడిన రాజకీయజీవిత లాభం కనిపిస్తున్నది.దశమోచ్చ శుక్రునివల్ల సినిమారంగంలో ప్రతిభ కనిపిస్తున్నది.

ఇప్పుడు కొన్ని ఇతర వివరాలు చూద్దాం.

ఈమె తాతగారు మైసూరు మహారాజుగారి సంస్థానంలో ఆస్థానవైద్యునిగా ఉండేవారు.వృషభ లగ్నం అనుకుంటే దశమాత్ దశమం వృశ్చికం అవుతుంది.కుజుడు చతుర్దంలో ఉంటూ దశమాన్ని చూస్తున్నాడు.కనుక తాతగారికి సర్జన్ వృత్తి సరిపోతున్నది.అదే మిధున లగ్నం అయితే తాతగారి స్థానంలో గురువున్నాడు గనుక ఆయన మెడికల్ సర్జన్ ను సూచించడు గనుక సరిపోలేదు.కాకపోతే ఒక ఉన్నతాధికారిని సూచిస్తున్నాడు.

ఈమెకు రెండేళ్ళ వయస్సున్నప్పుడు తండ్రి చనిపోయాడు.వృషభ లగ్న జాతకం ప్రకారం కేతువు/శనిలో ఇది జరిగింది.సరిపోయింది.మిధున లగ్న జాతకం అయితే ఇది సరిపోవడం లేదు.కానీ గోచార రీత్యా అప్పుడు శని కన్యా రాశిలో సంచరించాడు గనుక చతుర్ధ శనిసంచారం తండ్రి మరణాన్ని సూచిస్తుంది గనుక గోచారరీత్యా ఇది సరిపోయింది.అంటే ఒక పాయింట్ వృషభ లగ్నజాతకాన్ని సూచిస్తే ఇంకొక పాయింట్ మిధున లగ్నజాతకాన్ని సూచిస్తున్నది.కనుక ఇంకా జాతక వివరాలను పరిశీలించాలి.

తాతగారు సంపాదించిన మంచి ఆస్తిని తండ్రి తగలేశాడని ఆమే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.మిధున లగ్నం అయితేనే దశమంలో ఉన్న ఉచ్ఛశుక్రునివల్ల తండ్రికి ఉండే విలాసాలూ అతి ఖర్చులూ సరిపోతాయి.అదే వృషభ లగ్నం అయితే తండ్రికి ఈ అలవాట్లు ఉండే అవకాశం లేదు.కనుక మిధున లగ్నమే కరెక్ట్ అని తెలుస్తున్నది.

రెండు జాతకాలూ ఈమెపైన ఇంకొక సంతానం ఉన్నట్లు సూచిస్తున్నాయి. ఈమెకొక అన్నయ్య ఉన్నాడు.ఆయన పేరు జయకుమార్.ఆయన 1990 లో చనిపోయాడు.వృషభలగ్నం అయితే ఒక అక్క ఉన్నట్లు కనిపిస్తున్నది.ఇది కరెక్ట్ కాదు.అదే మిధునలగ్నం అయితే అన్నయ్య ఉన్నట్లు కనిపిస్తున్నది.వృషభలగ్నం గనుక అయితే కుజ/గురుదశ సరిపోవడం లేదు.మిధునలగ్నం అయితే 1990 లో కుజ/గురువుగాని కుజ/శనిగాని జరిగింది. రెండూ సరిగ్గా సరిపోతున్నాయి.కనుక మిధునలగ్న జాతకమే కరెక్ట్ అని అనిపిస్తున్నది.

తండ్రి చనిపోయిన తరువాత ఈమె తల్లి బెంగుళూరుకు వెళ్ళిపోయి అక్కడనుంచి సినిమా రంగంలో అడుగుపెట్టింది.ఆమె సోదరి అప్పటికే సినిమాలలో ఉన్నది.ఈ వివరం బట్టి చూడగా,1951 లో మొదలైన శుక్రదశలో తల్లి సినిమానటి కావాలంటే కూతురుది మిధున లగ్నమే అయ్యి ఉండాలి. వృషభ లగ్నం అయితే ఇది సాధ్యం కాదు.కనుక మిధున లగ్నమే కరెక్ట్ అని ఇక్కడ కూడా అనిపిస్తున్నది.

ఆమెకు 15 ఏళ్ళున్నప్పుడు (1962-63) మొదటిసారి సినిమాలలో నటించిందని మనకు తెలుసు.ఈ సమయం ప్రకారం కూడా అప్పుడు శుక్ర/గురు దశే జరిగింది.అయితే ఖచ్చితమైన తేదీలు ఉంటే విదశ మొదలైన ఇతర లెవల్స్ చూడవచ్చు.

1971 లో నవమ రవిదశ మొదలవ్వగానే ఆమెకు అవార్డులు రావడం మొదలైనట్లు కనిపిస్తున్నది.1973 లో ఫిలిం ఫేర్ ఉత్తమ నటి అవార్డ్ వచ్చినపుడు ఆమెకు రవి/రాహువు గాని రవి/గురువు గాని నడిచింది.అంటే భాగ్యభావం వికాసం చెందటం అప్పుడు మొదలైందన్నమాట.

1982లో ఈమె రాజకీయ రంగప్రవేశం చేసినప్పుడు చంద్ర/శనిదశ జరిగింది. మిధునలగ్న జాతకం ప్రకారం లాభాదిపతితో కూడిన చంద్రుడూ,వృత్తి కారకుడైన శనీ ఈమెకా యోగాన్నిచ్చారని అనుకోవాలి.

1984 లో రాజ్యసభకు నామినేట్ చెయ్యబడినప్పుడు ఆమెకు చంద్ర/బుధ దశ జరిగింది.బుధుడు రవితో కూడి నవమంలో ఉన్నాడు.సరిపోయింది.

1987 లో మొదలైన కుజదశ ఆమెకు మళ్ళీ రాజకీయ వైభవాన్ని కట్టబెట్టింది.తిరిగి 1991 లో కుజ/బుధ దశలో ఆమె ఎన్నికలలో గెలిచి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యింది.బుధుడు మళ్ళీ ఆమెను నిలబెట్టాడు.

ఒక ఫుల్ టర్మ్ చేసిన తర్వాత 1996 లో ఆమె అధికారం కోల్పోయి పదవి నుంచి దిగిపోవలసి వచ్చింది.దానికి కారణం 1994 లో మొదలైన రాహు మహాదశ.

2000-2002 మధ్యలో జరిగిన రాహు/శని శపిత యోగదశ జరిగింది.2011 లో రాహు/చంద్ర లేదా రాహు/కుజదశలో పదవి మళ్ళీ వరించిన సంఘటన ప్రకారం లాభరాహువునుంచి చూస్తే వృషభలగ్నం కంటే మిధునలగ్నమే ఎక్కువగా సరిపోతున్నది.

2014 లో గురు/శనిదశలో ఆమె అక్రమ ఆస్తుల కేసులో జైలుకెళ్ళడం ద్వారా పదవిని మళ్ళీ కోల్పోవలసి వచ్చింది.నవంబర్ 2004 లో రాహు/బుధదశ జరిగినప్పుడు కంచి శంకరాచార్య జయేంద్ర సరస్వతిని అరెస్ట్ చేయించిన సంఘటన కూడా నవమరాహువు దృష్ట్యా మిధునలగ్నానికే బాగా సరిపోతున్నది.

ఈ పరిశీలనను బట్టి చూస్తే,ఇప్పటివరకూ చూచిన ఎక్కువ పాయింట్లు వృషభ లగ్నంకంటే మిధునలగ్నాన్నే ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉన్నందున,జనన సమయం 14.34 hours కరెక్ట్ అని అనిపిస్తున్నది.