Pages - Menu

Pages

26, అక్టోబర్ 2014, ఆదివారం

దయ్యాలు లేవూ?-3

ముందుగా నీవడిగిన ప్రశ్నకు వివరంగా జవాబు చెబుతా.

'మా రూంలో ఇంత మంచి వాతావరణం ఉంటేకూడా ఆ ఆత్మ ఎలా రాగలిగింది?' అని కదా నీవడిగావు?ఊరకే పటాలు పెట్టి పూజలు చేసినంత మాత్రాన శక్తి రాదమ్మా.దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది.ఆ పూజలూ అవీ చాలావరకూ మన ఆత్మసంతృప్తి కోసం మాత్రమే చేస్తాము.నిజమైన శక్తిని సంపాదించే పద్ధతులు వేరేగా ఉంటాయి.అవి గురూపదేశం ద్వారా తెలుసుకొని ఆచరించాలి.

పైగా,కొన్ని ఆత్మలు బ్రతికి ఉన్న రోజులలో పూజలూ అవీ బాగానే చేసి ఉంటాయి.వాటికీ భక్తి ఉంటుంది.కనుక దేవుళ్ళ పటాలు ఉన్న గదులలోకి కూడా కొన్ని ఆత్మలు చక్కగా రాగలవు.

ఇంకొక విషయం ఏమంటే,ఆత్మ మీ రూంకి రాలేదు.ఆ ప్రదేశంలో అది ఎప్పటినుంచో ఉన్నదని నీవే చెబుతున్నావు.మీరే అవి ఉన్న చోటికి వెళ్ళారు.అవి మీరున్నచోటికి రాలేదు.దానింటికే మీరు వెళ్ళారు.

మరి మేము చేసిన ప్రక్రియవల్ల అది ఎందుకు వెళ్ళిపోయిందని నీకు అనుమానం రావచ్చు.ఆ సమయంలో మీరు పడుతున్న బాధను చూచి,నీకు రక్షణగా ఉన్న ఏదో శక్తి నీకా సమయంలో అండగా నిలబడి సాయం చేసింది. ఆ సాయాన్ని స్వీకరించే వాతావరణాన్ని మీరు మీ రూంలో కల్పించారు. అందుకే ఆ ఆత్మ అక్కడనుంచి వెళ్ళిపోయింది.ఒక్క మీరు చేసిన ప్రక్రియ మాత్రమే దానికి చాలదు.మీకు తెలియని ఒక శక్తి ఏదో మీకు ఆ సమయంలో బయటనుంచి సాయం చేసింది.పైగా ఆ ఆత్మ హానికరమైనది కాదు.హాని చేసే ఆత్మలు అలా ఉండవు.' అన్నాను.

'ఓ! అదా సంగతి!!నాకూ అదే అనుమానం వచ్చింది.ఊరకే హనుమాన్ చాలీసా ప్లే చేసి మంత్రజపం చేస్తేనే అది వెళ్లిపోయిందా?ఇదెలా సంభవం?అని నాకూ అనిపించింది.ఇంతకీ ఎవరా శక్తి?నీవేనా?' అడిగింది మా అమ్మాయి.

'అసలైన విషయాలు అంత త్వరగా చెప్పనని నీకు తెలుసుగా.నేను కావచ్చు.కాకపోవచ్చు.' అన్నాను నవ్వుతూ.

'నీతో వచ్చిన సమస్య ఇదే నాన్నా.అసలు విషయం తప్ప అన్నీ చెబుతావు.' అన్నది.

'అన్నీ చెప్పడానికి సమయం సందర్భం రావాలమ్మా.అవి వచ్చినపుడు అన్నీ చెబుతాను.ఇన్నేళ్ళ నా రీసెర్చిని మీకు కాక ఇంకెవరికి చెబుతాను?' ప్రశ్నించాను.

'సరే నాన్నా.ప్రేతాత్మలతో డీల్ చేసే విధానాలు చెప్పు.' అడిగింది.

చెప్పడం ప్రారంభించాను.

'వాటితో డీల్ చెయ్యాలంటే స్థూలంగా మూడు మార్గాలున్నాయమ్మా.

ఒకటి-వస్తువుల సహాయంతో.

శక్తితో నింపబడిన కొన్ని వస్తువులను మన వద్ద ఉంచుకోవడం ద్వారా ప్రేతాత్మల ప్రభావం నుంచి మనం రక్షించుకోవచ్చు. తాయెత్తులు,ఒంటిమీద ధరించే యంత్రాలు,జాతిరాళ్ళు,కొన్ని మూలికలు, సిద్ధక్షేత్రాలలో పూజకు వాడిన కుంకుమ మొదలైన పూజా ద్రవ్యాలు, మహనీయుల చేత మంత్రపూతం గావించబడిన జపమాలలు, రుద్రాక్షలు, నిర్మాల్యం మొదలైన వస్తువులు మన దగ్గర ఉంచుకోవడం ఒక పద్ధతి.

యుద్ధానికి వెళుతూ కవచం ధరించి వెళ్ళడం వంటిది ఇది.మనలో శక్తి లేనప్పుడు బయటి వస్తువుల సహాయం తీసుకోవాలి.ఇది అధమమార్గం. ఎందుకంటే ఈ విధానంలో మనకు వాటినుంచి రక్షణ ఉంటుంది.అంతేగాని వాటిని మనమేమీ చెయ్యలేము.వాటిని మార్చలేము.వాటికి విముక్తిని కలిగించలేము.ఆ వస్తువులు మనవద్ద ఉన్నంతవరకూ మనకు రక్షణ ఉంటుంది.అంతే.

రెండు-ఉపాసనా బలంతో.

నీకు నిజమైన ఉపాసనా బలం ఉన్నపుడు ఆ బలంతో వాటిని ఎదుర్కోవచ్చు.దానికి కొంత తంత్రమూ కొంత క్రియా కలాపమూ ఉంటుంది.మంత్ర-తంత్ర విధానంలో వాటిని నిగ్రహించి పాలద్రోలవచ్చు.ఇందులో వాటిని అక్కడనుంచి వెళ్ళగొట్టటమే ఉంటుంది గాని అసలు వాటి బాధ ఏమిటి?అవి అక్కడ ఎందుకున్నాయి?మొదలైన సమస్యలు పరిష్కారం కావు.వాటిని పరిష్కారం చేసే శక్తి ఈ స్థాయిలో వారికి ఉండదు.యుద్ధానికి వెళుతూ కవచంతో బాటు కత్తీ డాలూ ధరించి వెళ్ళడం వంటిది ఈ స్థాయి.ఇందులో,నిన్ను నీవు రక్షించుకుంటూ ఎదుటి శక్తిని ఎదుర్కొనే శక్తి నీకుంటుంది.కానీ వాటి బాధలు ఏమిటో గమనించి ఆ బాధలను తీర్చేశక్తి నీలో ఉండదు.వాటిని అక్కడనుంచి బలవంతాన వెళ్ళగొట్టగలుగుతావు.అంతే.దానివల్ల నీకు మళ్ళీ కొంత పాపఖర్మ చుట్టుకుంటుంది.ఆ వలయంలో నీవూ చిక్కుకుంటావు.

ఇందులో మళ్ళీ రకరకాల సబ్ గ్రూపులున్నాయి.లోకంలో ఉండే మంత్రగాళ్ళూ,నిజమైన ఉపాసకులూ,నకిలీ ఉపాసకులూ అందరూ ఈ స్థాయిలోనే ఉంటారు.వారి విధానాలలో ఎన్నో తేడాలు ఉంటాయి.వారు టాప్ చేసే శక్తులలో కూడా రకరకాలైన తేడాలుంటాయి.ప్రాణికశక్తులను అదుపులో ఉంచుకుని ప్రక్రియలు చేసేవారు కొందరైతే,దైవశక్తిని కొద్దిగా సాధించి దానితో చేసేవారు ఇంకొందరు.వారు చేసే విధానాన్ని బట్టి వారు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవచ్చు.

మూడు-అత్యున్నత ఆధ్యాత్మికశక్తితో

నిజమైన ఆధ్యాత్మిక శక్తి నీలో ఉన్నప్పుడు నీ సంకల్పబలంతోనే వాటిని అక్కడనుంచి పంపించేయవచ్చు. ఊరకే నీవు సంకల్పించిన వెంటనే ఈ అద్భుతం జరుగుతుంది.అయితే అది నీ సంకల్పం కాదు.దైవంతో నీవు అనుసంధానం అయ్యి ఉండాలి.నీవు పిలిస్తే దైవం వెంటనే పలకాలి.నీవు కోరినది దైవం చెయ్యాలి.అంతటి చనువు నీకూ దైవానికీ మధ్యన ఉండాలి.అప్పుడు మాత్రమే ఈ స్థాయికి చెందిన ప్రక్రియ సాధ్యమౌతుంది.

నిరాయుధుడుగా యుద్ధానికి వెళ్ళే మహావీరుని వంటి స్థాయి ఇది.ఈ స్థాయిలో ఉన్నవారికి ఏ ఆయుధమూ అవసరం లేదు.ఏ కవచమూ అవసరం లేదు.వారి సంకల్పమే అమోఘమైన శక్తిగా పనిచేస్తుంది.అదే అత్యున్నతమైన ఆయుధం.

ఈ స్థాయిలో మనం ప్రక్రియను చేస్తే,ఆ ఆత్మ పడే బాధను మనం తొలగించి దానిని ఉన్నత లోకాలకు పంపగలుగుతాము.ఈ భూవాతావరణపు ఊగిసలాటనుంచి దానికి విముక్తి కల్గించి జననమరణ చక్రంలో మళ్ళీ దానిని ప్రవేశ పెట్టగలుగుతాము.వాటిని అక్కడనుంచి పారద్రోలడమే గాక వాటి సమస్యనుంచి వాటికి విముక్తి కలిగించి ఉన్నతమైన గతులను సృష్టిక్రమంలో వాటికి కలిగించే ప్రక్రియ ఇది.మహాయోగులూ సిద్ధులూ అయినవారు మాత్రమే దీనిని చెయ్యగలరు.

మద్రాస్ మెరీనా బీచ్ లో ఒకసారి స్వామి వివేకానంద నడుస్తున్నపుడు ఆయనకొక స్పిరిట్ (పిశాచం) కనిపించి తనకు విముక్తి ప్రసాదించమని ప్రార్ధించింది.

'నేను సర్వసంగ పరిత్యాగిని.నీకు నేనేమివ్వగలను?' అని ఆయన ప్రశ్నించారు.

'నీ చేత్తో ఏదిచ్చినా నాకు ఈ పిశాచజన్మ నుంచి విముక్తి లభిస్తుంది' అని అది జవాబిచ్చింది.

వెంటనే స్వామి ఒక గుప్పెడు ఇసుకను చేతిలోకి తీసుకుని శ్రీరామకృష్ణులను తన మనస్సులో స్మరిస్తూ దాని వైపు ధారగా విడచిపెట్టారు.మరుక్షణమే ఆ పిశాచరూపం దానికి వీడిపోయి ఉత్తమలోకాలవైపు ఆ జీవి సాగిపోయింది.ఇది వివేకానందస్వామి మద్రాస్ లో ఉన్నప్పుడు జరిగిన సంఘటన.

అవతార పురుషుడైన శ్రీరామకృష్ణుని కటాక్షం తనపైన పుష్కలంగా ఉన్నది గనుకా,తను పిలిస్తే ఆయన వెంటనే పలుకుతారు గనుకా,వివేకానందులు ఆ పనిని అంత సులభంగా చెయ్యగలిగారు.మహాసిద్ధులైన వారి సంకల్పానికి అంతటి శక్తి ఉంటుంది.

ఏ కారణమూ ఏ బాధా ఏ తీరని కోరికా లేకుండా ఎవరూ ప్రేతాత్మలుగా మారరు.ఆ ప్రేతాత్మ పడే అవస్థ వెనుక తీరని కోరికలూ,కసీ,కోపమూ ఉంటాయి.ఆ నెగటివ్ వైబ్రేషన్స్ ను డిజాల్వ్ చెయ్యగలిగే శక్తి నీకు ఉంటే అప్పుడు మాత్రమే ఈ స్థాయికి చెందిన విధానం నీకు సాధ్యమౌతుంది.ఇది చెప్పుకున్నంత ఆషామాషీ వ్యవహారం కాదు.ఘనీభవించిన నెగటివ్ శక్తులతో చెలగాటం.తేడా వస్తే ఫలితాలు దారుణంగా ఉంటాయి.

ఇవమ్మా వీటిలోని మూడు స్థాయిలు.

ఇవిగాక,యూనివర్సల్ ఈవిల్ ఫోర్సెస్ కొన్ని ఉంటాయి.వీటిని డెమన్స్ అనీ రాక్షసులనీ పిలవవచ్చు.ఇవి చాలా భయంకరమైన దుష్టశక్తులు.వీటి ప్రభావం గ్లోబల్ లెవల్లో ఉంటుంది.వాటిని సామాన్యమానవుడు ఎవడూ టాకిల్ చెయ్యలేడు.మనిషి అంటే వీటికి ఒక వడియంతో సమానం.అందుకే ఇవి మనుషుల జోలికి రావు.మనిషనేవాడు వాటి కళ్ళకు ఆనడు.

పెద్దపెద్ద గ్లోబల్ కార్యకలాపాలలో మాత్రమే ఇవి పాలుపంచుకుంటాయి. జనసమూహాలమీదా,దేశాలమీదా,కులాలమీదా,గ్రూపులమీదా మాత్రమే ఇవి పనిచేస్తాయి.వాటిని టాకిల్ చెయ్యడం ఒక్క అవతారపురుషుల వల్ల మాత్రమే సాధ్యమౌతుంది. మహాయోగులు కూడా ఈపని చెయ్యలేరు.వీటిముందు వారి శక్తి కూడా చాలదు.ఇవి యూనివర్సల్ డార్క్ ఫోర్సెస్.వాటి గురించి మళ్ళీ ఇంకోసారి సందర్భం వచ్చినపుడు వివరంగా చెబుతాలే.' అన్నాను.

'అర్ధమైంది నాన్నా.మరి,ఆ ఆత్మల్లో కూడా తేడాలుంటాయి కదా.' అడిగింది తను.

'అవునమ్మా.అన్ని ఆత్మలూ ఒకేలా ఉండవు.వాటిల్లో కూడా కొన్ని దుష్టాత్మలుంటాయి.వాటితో డీల్ చెయ్యడం చాలా కష్టం.మనుషుల్లో దుర్మార్గులున్నట్లే వాటిలోనూ ఉంటాయి.మనుషులేగా దయ్యాలయ్యేది?బతికున్నపుడు ఎలా ఉంటాడో దయ్యమైన తర్వాతా అలాగే ఉంటాడు.తేడా ఏమీ ఉండదు.వీటిని మార్చాలంటే చాలా కష్టం.లొంగవు.మారవు.మొండిగా ఉంటాయి.అలా ఉండటమే వాటికిష్టం.ఆ స్థితినుంచి మారాలని వాటికనిపించదు.మార్చాలని మనం ప్రయత్నిస్తే మనల్ని ఎటాక్ చెయ్యడానికి కూడా వెనుకాడవు.

కొన్ని మిస్చీవస్ ఆత్మలుంటాయి.అవి చెప్పేవి ఏదీ నిజం కాదు.అబద్దాలు చెప్పి నిన్ను తప్పుదోవ పట్టించి ఆనందించడం వాటికొక సరదా.నువ్వు కంగారు పడుతుంటే అవి ఆనందంతో ఎగురుతూ ఉంటాయి.మనుషులలో మోసగాళ్ళున్నట్లే వాటిలోనూ ఉంటాయి.నిన్ను విమర్శించడం,శల్యసారధ్యం చెయ్యాలని చూడటం,'నన్ను వదిలించడం నీవల్ల కాదని' హేళన చెయ్యడం వాటికి సరదా.ఆ స్థితి వాటికీ ఆనందంగా ఉంటుంది గనుక మారాలని వాటికీ తోచదు.కనుక ఎదురు తిరుగుతాయి.

కొన్ని అమాయక ఆత్మలుంటాయి.బ్రతికున్నపుడు వాటికి అన్యాయం జరిగి ఉంటుంది.ఆ ఉక్రోషం ఎటూ పోదు.మార్గం కనపడదు.అందుకని అవి దిగాలుగా ఏడుస్తూ తిరుగుతూ ఉంటాయి.ఎవరైనా తమకు సహాయం చేస్తే బాగుండునని వెదుకుతూ ఉంటాయి.వీటికి సాయం చెయ్యడం తేలిక.కానీ దానికి తగిన శక్తి మనలో ఉండాలి.ఇలాంటి వాటికి సాయం చెయ్యడం మనకు కూడా మంచిదే.ఎందుకంటే ఒక అమాయక ప్రాణికి సహాయం చేసినందువల్ల మనకు కూడా మంచి జరుగుతుంది.

ఈ మూడురకాల ఆత్మల్లో దేనితో డీల్ చేసినా ఒక్క విషయం నీవు గుర్తుంచుకోవాలి.ప్రాధమికంగా ఇదంతా ఇతరుల కర్మతో చెలగాటం ఆడటం. బుద్ధిలేక ఇతర్లు చేసుకున్న కర్మలో నీవు జోక్యం చేసుకోవడం అని మర్చిపోకు.కారణం లేకుండా నీ అనవసరమైన ఉత్సుకతతో నీవు వాటిలో తలదూరిస్తే నీకు బొప్పి కట్టడం ఖాయం.' అన్నాను.

'పనికిమాలిన లోకుల బాధలు తీర్చాలని నాకేమీ లేదులే నాన్నా.లోకమంతా స్వార్ధమయమే.మంచివాళ్ళు భూతద్దంతో వెదికినా ప్రస్తుతం ఎక్కడా దొరకడం లేదు.ఇతరుల గోల మనకెందుకు?ఊరకే తెలుసుకుందామని అడిగాను.' అన్నది.

'మంచిదమ్మా! నీ సాధన తీవ్రతరం చెయ్యి.అదే నిన్ను ఎల్లవేళలా రక్షిస్తుంది. అదే సమయంలో నీకు సహాయం చేసి ఆ ఆత్మను పారద్రోలిన శక్తి ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి.'-అన్నాను నవ్వుతూ.

'చేస్తాలే.తప్పుతుందా?నీవెలాగూ చెప్పవుగా?' అంది.

'నాది ఐ.ఐ.టీ టీచింగమ్మా.ఆన్సర్ నా అంతట నేను చెప్పను.కొన్నికొన్ని హింట్స్ మాత్రమే నేనిస్తాను.ఆన్సర్ నీ అంతట నీవే తెలుసుకునేటట్లు చెయ్యడమే నా విధానం' అన్నాను.

(సశేషం)