Pages - Menu

Pages

18, అక్టోబర్ 2014, శనివారం

జిల్లెళ్ళమూడి స్మృతులు-8

"మా నాన్నగారు ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ అమ్మ చలం గురించి అడిగేది. సౌరిస్ గురించి అడిగేది.

'వాడెలా ఉన్నాడురా?' అనేది.

ఎవరి గురించి అడుగుతోందో అమ్మకూ మా నాన్నగారికీ మాత్రమే తెలిసేది. ఇతరులకు అర్ధమయ్యేది కాదు.వాళ్లిద్దరంటే అమ్మకు ప్రత్యేక అభిమానం ఉన్నదన్నగారు." అన్నాడు చరణ్.

వింటున్న నేను సాలోచనగా చూచాను.

'తమ్ముడూ.ఒక మనిషిని లోకం చూచే తీరులో మహనీయులు చూడరు. లోకం అంచనా వేసే తీరులో వారు అంచనా వెయ్యరు.ఒక మనిషిని మహనీయులు అంచనా వేసే తీరు వేరుగా ఉంటుంది.వారి దృష్టికోణం కూడా వేరుగా ఉంటుంది.లోకం ఏ విషయాలను ముఖ్యం కాదు అనుకుంటుందో అవే మహనీయుల దృష్టిలో అసలైన విషయాలు.లోకం అతిముఖ్యం అనుకునే విషయాలు వారి దృష్టిలో గడ్డిపోచలు.ఈ విషయం ఇంతకు ముందుకూడా చాలాసార్లు చెప్పాను కదా.' అన్నాను.

అవునన్నట్లు తలాడించాడు చరణ్.

'చలంగారి కళ్ళు చూచావా తమ్ముడూ?ఆయన కళ్ళను చూస్తే ఆయన స్థాయి ఏమిటో తెలుస్తుంది,తెలుసుకోగలిగితే.' అన్నాను.

చరణ్ మదన్ మౌనంగా చూస్తున్నారు.

'తమ్ముడూ ఒక విషయం చెప్పు.అసలు 'చలం' అనే పదం సరియైనదేనా?లేక 'అచలం' అనే పదం సరియైనదా?'

చరణ్ నవ్వాడు.

'అచలమే కరెక్ట్ కదా అన్నగారు?' అన్నాడు.

'అవును.కానీ చలం అనేమాట కూడా తప్పుకాదు తమ్ముడూ.చలం అనేది చలించే జగత్తును సూచిస్తుంది.అచలం అనేది చలించని పరబ్రహ్మతత్త్వాన్ని సూచిస్తుంది.చలం అంటే త్రిగుణాత్మికయైన శక్తి.అచలం అంటే త్రిగుణాతీతుడై నిశ్చలుడైన శివుడు.చలం లేకుండా అచలం ఎలా ఉంటుంది?అచలం లేని చలం ఎలా ఉంటుంది?రెండూ పరస్పర అవినాభావస్థితులే.

ఈ జన్మలో ఆయనకంతా చలనమే సరిపోయింది.ఎప్పుడూ చలిస్తూ,చలించే మనస్సును అదుపులో ఉంచుకోలేక,కోరికలనూ కామాన్నీ అదుపు చెయ్యలేక,కుళ్ళులోకం నచ్చక,నానా సంఘర్షణా నరకమూ అనుభవించాడు చలంగారు.తన మనస్సుతోనూ తనచుట్టూ ఉన్న లోకంతోనూ నిరంతర యుద్ధమే ఆయనకు జన్మంతా సరిపోయింది.వచ్చే జన్మలోనే ఈ చాంచల్యం పోయి అచలత్వాన్ని ఆయన రుచి చూడగలుగుతాడు.ఈ జన్మలో మంచి పునాది పడింది.అది వచ్చే జన్మలో సాఫల్యతను కలిగిస్తుంది.అదే మాలపిచ్చమ్మగారు ఆయనతో చెప్పింది.చలంగారు చాలా ఉత్తముడు తమ్ముడూ.మనం నేడు చూస్తున్న అనేకమంది కంటే ఆయన ఎంతో గొప్పవాడు.' అన్నాను.

చరణూ మదనూ మౌనంగా వింటున్నారు.

'తమ్ముడూ.ఇంకో సంగతి చెప్పనా?చలం సినిమాలకు కూడా మాటలు వ్రాశాడు.' అన్నాను.

'ఏ సినిమాకన్నగారు' అడిగాడు చరణ్.

'1938 లో వచ్చిన 'మాలపిల్ల' సినిమాకి కధా మాటలూ ఆయనే వ్రాశాడు.ఆ సినిమాలో చలం యొక్క సంఘ సంస్కరణా భావాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ సినిమా టైటిల్స్ చూస్తే story and dialogues-Gudipati Venkata Chelam B.A L.T అని పడుతుంది.ఆయన వ్రాసే డైలాగ్స్ ఎంత క్లుప్తంగా ఎంత భావయుక్తంగా ఉంటాయంటే,ఆయన శైలిలోని మాధుర్యం సినిమావాళ్లకి మింగుడు పడలేదు.ఆయనకీ సినిమావాళ్ళ కుళ్ళూ కుట్రలూ నచ్చలేదు.తన వ్యక్తిత్వం చంపుకుని వాళ్ళు చెప్పిన రీతిలో వ్రాయాలంటే తనకు కుదరదనీ తన రీతిలోనే తను వ్రాస్తాననీ మొండిపట్టు పట్టాడు.డబ్బుకి జీవితంలో ఆయనెప్పుడూ విలువనివ్వలేదు. ప్రేమకీ, స్వచ్చతకీ, భావుకతకీ, స్వేచ్చకీ విలువిచ్చాడు.ఊరకే మాటలు చెప్పడం కాదు వాటిని జీవితంలో ఆచరించాడు.అదీ కృత్రిమంగా,ఇష్టం లేకపోయినా,దేనినో బలవంతాన ఆచరిస్తున్నట్లు కాదు.స్వభావపూర్వకంగా సహజంగా ఆచరించాడు.అలాంటి మనిషికి,కుళ్ళిపోయిన సినిమా ఫీల్డ్ ఎలా నచ్చుతుంది?అందుకే ఆయనక్కడ ఇమడలేకపోయాడు.

ఆ సినిమా అంతా చలంగారి శైలి ప్రతిమాటలోనూ మనకు కనిపిస్తుంది.ఆ సినిమాలో ఒక సీన్ చెప్తా విను.

గోవిందరాజుల సుబ్బారావుగారు ఒక పడక్కుర్చీలో కూచుని ఉంటారు. వెంకటసుబ్బయ్య పక్కనే కూర్చుని నాగరాజు మాలపిల్లను తీసుకుని కలకత్తా వెళ్ళిపోయి చేసిన మంచిపని గురించి పొగుడుతూ నిజమైన అస్పృశ్యులు ఎవరో వివరిస్తూ పెద్ద లెక్చరిస్తాడు.అంతా విని గోవిందరాజుల సుబ్బారావుగారు అతని గడ్డం పుణికి 'నువ్వూ నీ ఆలోచనా!!' అని క్లుప్తంగా సమాధానమిస్తాడు.ఎదుటి వ్యక్తి గంటసేపు మాట్లాడితే ఇంకొక పాత్ర నోటినుంచి వచ్చే జవాబు అది!

ఇంకో డైలాగ్ విను.ఆ సినిమాలో హీరో బ్రాహ్మణుడు.హీరోయిన్ మాలపిల్ల.ఇద్దరి మధ్యనా ప్రేమ ఉంటుంది.హీరో ఉద్దేశ్యాన్ని అనుమానించి అతని మనస్సు నొప్పించానని ఒక సీన్లో హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. రెండేరెండు ముక్కల్లో గొప్ప భావాన్ని చలం పలికించాడు. 'మం..చివారే!నొ..ప్పించానే!'-అని తన చెల్లెలితో హీరోయిన్ కాంచనమాల దీనంగా అంటుంది.అంతే!!

అదీ చలంగారి శైలి.ఉదాత్తమైన భావుకత లేనిదే చలం అర్ధంకాడు.ఆ సినిమాలో అన్నీ ఆలోచింపచేసే సంభాషణలే.ఆ రకంగా క్లుప్తంగా భావస్ఫోరకంగా డైలాగ్స్ వ్రాయడం ఇప్పటివారికి ఎన్ని జన్మలెత్తినా రాదు.' అన్నాను.

చరణ్ కాసేపు మౌనంగా ఉన్నాడు.

'డెబ్భైతొమ్మిదిలో చలంగారు చనిపోయిన సంగతి రేడియోలో చెప్పారు. అమ్మకు తెలిసి అప్పుడే వచ్చిన మా నాన్నగారిని అడిగింది-'వాడు పోయాడుటరా.' అని.అమ్మకు దూరాన ఏం జరుగుతున్నదో తెలుసు.కానీ తెలీనట్లు మనల్ని అడుగుతుంది.' అన్నాడు.

ఇవి మామూలే గనుక నేనేమీ మాట్లాడలేదు.

'పదండి భోజనం చేసివద్దాం.వదినగారు రండి.' అంటూ చరణ్ లేచాడు.అందరం లేచి కాళ్ళూ చేతులూ కడుక్కుని అన్నపూర్ణాలయానికి బయలుదేరాం.

మెట్లు దిగుతూ ఉండగా మదన్ భార్య ఒక సందేహాన్ని వెలిబుచ్చింది.

'భరద్వాజ మాస్టారు ఇక్కడ చాలా ఏళ్ళు ఉన్నారట కదా అన్నయ్యా?' అన్నది.

'అవునమ్మా.' అన్నాను.

'నేను ఆయన పుస్తకాలు చదువుతానండి' అన్నది.

'మంచిదమ్మా' అన్నాను.

'ఆయన అమ్మ దగ్గరే అన్నేళ్ళు ఉండి మరి ఇంకా ఎవరెవరో మహనీయులంటూ దేశమంతా ఎందుకు తిరిగారో? మీరేమో అమ్మని మించిన వాళ్ళు లేరని అంటున్నారు. నాకిది అర్ధం కావడం లేదు' అన్నది.

ఆమె సాయిబాబా భక్తురాలని నాకు తెలుసు.మదన్ ఒకటి రెండుసార్లు మాతో వచ్చాడు గాని ఆమె ఇక్కడికి రావడం ఇదే మొదలు.



ఆ అమ్మాయి పరిస్థితి నాకర్ధమైంది.

ఆమెకు జవాబు చెబుదామని ఆగాను.నాతో బాటు నడుస్తున్న వాళ్ళూ ఆగారు.పక్కనే ఒక దానిమ్మచెట్టు ఉన్నది.దానికున్న పూలు ఎర్రగా చాలా బాగున్నాయి.

ఒక పూవును చూపిస్తూ ఇలా చెప్పాను.

'ఈ పువ్వు చూచావామ్మా.దాని రంగు చూడు.చెయ్యి తిరిగిన చిత్రకారుడు కూడా ఇలాంటి కలర్ మిక్సింగ్ తీసుకురాలేడు.ఇదెంత అద్భుతమో చూడు. ముదురాకుపచ్చని ఆకుల కాంట్రాస్ట్ లో ఆ ఎర్రనిపువ్వు ఎంత అందంగా ఉందో చూడు.ప్రకృతిలో ఇలాంటి అద్భుతాలు అడుగడుక్కూ ఉంటాయి.ఈ అద్భుతాలను చూడలేని మనం ఏవేవో నకిలీ అద్భుతాల కోసం ఎగబడుతూ ఉంటాము.భరద్వాజగారికి జరిగింది కూడా ఇదే.

సహజస్థితి యొక్క మహత్యం అందరూ గ్రహించలేరు.దానిని గ్రహించాలంటే నీవు కూడా అత్యంత సహజస్థితిలో నిర్మలంగా నిష్కల్మషంగా రెండేళ్ళ పసిపిల్లలా ఉండగలగాలి.అప్పుడే నీవు అమ్మలాంటి వారి స్థాయి ఏమిటో చూచాయగా గ్రహించగలుగుతావు.కృత్రిమమైన వాటికోసం వెదుకుతూ ఉన్నంతవరకూ నీవు వారి సహజస్థితిని గ్రహించలేవు.నీవు వారితోనే నివసించవచ్చు.వారి పక్కనే ఏళ్ళ తరబడి అంటిపెట్టుకుని ఉండవచ్చు.కానీ మానసికంగా వారికీ నీకూ మధ్యన ఒక అగాధం ఉంటుంది.ఆ అగాధాన్ని నీవు దాటలేవు.నీ దృష్టి ఎదురుగా కనిపిస్తున్న దానిమీద కాకుండా ఎక్కడో ఉండటమే దానికి కారణం.

ప్రేమమయి,ఆనందమయి అయిన అమ్మను పక్కనే ఉంచుకుని భరద్వాజగారు, 'ఆనందమయీ మా' అనీ 'చీరాల అవధూత' అనీ 'చివటం అమ్మ' అనీ ఇంకా ఎవరెవరో అవధూతలనీ ఎక్కడెక్కడో వెదుకుతూ ఉండేవాడు.ఏం చేస్తాం?దూరపు కొండలు నునుపు అని సామెత ఊరకే రాలేదు.

ఆయనకు అద్భుతాలు కావాలి.అంటే గాల్లోంచి బూడిద తియ్యటం ఇలాంటివన్నమాట.అమ్మేమో 'నీ చుట్టూ ఉన్న సృష్టిని మించిన అద్భుతం ఇంకెక్కడుంది నాన్నా?'అనేది.ఉదయిస్తున్న సూర్యుడిని చూపిస్తూ"చూడు ఎంత అద్భుతమో?' అనేది.ఆమాట నిజమే.అయితే దానిని ఆస్వాదించే పరిపక్వదృష్టి మనకుండాలి.అప్పుడు సృష్టిలో అణువణువునా నీకు అద్భుతాలు గోచరిస్తాయి.ఆ దృష్టి లేకపోతే పిల్లని చంకలో పెట్టుకుని ఊరంతా వెదికినట్లు అవుతుంది.అలాంటప్పుడు గాల్లోంచి వస్తువులు తియ్యడమూ నోట్లోంచి రాళ్ళు ఉయ్యడమే అద్భుతాలౌతాయి.ఆయనకు జరిగింది అదే.'

'ఉదాహరణకు దత్తాత్రేయుని సంగతి చూడు.ఆయన అత్యంత సహజమైన వాడు.త్రిగుణాతీత సహజస్థితే దత్తతత్త్వం.కానీ నేటి ఆయన భక్తులకేమో అసహజమైన అద్భుతాలు కావాలి.అలాంటి చీప్ అద్భుతాలను ఆశించని ఆయన భక్తుణ్ణి ఒక్కడిని నేడు చూపించు.సహజంలోనుంచి అసహజాన్ని ఆశించేవారికి ఏమని చెప్పగలం?

మనకు చేతనైనది ఇంతే.ఎంతో ఉన్నతమైన అతీతమైన దానిని మన రొచ్చులోకి లాగడం ఒక్కటే మనకు తెలుసు.మన మనస్సులో గురువులం కావాలనీ, జనాన్ని చుట్టూ పోగేసుకోవాలనీ కోరికలున్నంతవరకూ ఇలాంటివి తప్పవు.అదీ విషయం.' అన్నాను. 

ఆమెకు నా మాటలు నచ్చలేదని ఆమెవైపు చూస్తే అర్ధమైంది.చాలామంది పరిస్థితి అంతే.వాళ్ళ నమ్మకాలను దెబ్బతీసే సత్యాలను వాళ్ళు అంత సులభంగా ఒప్పుకోలేరు.అహంకారాన్ని పక్కన పెట్టగలిగిన సత్యప్రేమ లేనిదే సత్యాన్ని అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.

మనకు వ్యక్తి ముఖ్యం అయినప్పుడు సత్యం దూరమౌతుంది.మన అహమే మనకు ముఖ్యమైనప్పుడు భగవంతుడు దూరమౌతాడు.

మాటల్లోనే భోజనశాలకు వచ్చేశాము.అప్పటికే ఒక బంతి నడుస్తున్నది. అందుకని మేమంతా కాసేపు వేచి చూచి తర్వాత బంతిలో కూచున్నాము.

ముద్దపప్పు,చింతకాయపచ్చడి,వంకాయకూర మూడూ నాకిష్టమైన వంటకాలే వడ్డించారు.అమ్మను తలచుకుంటూ భోజనం కానిచ్చి మళ్ళీ గదులకు బయలుదేరాము.

(ఇంకా ఉన్నది)