నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

21, అక్టోబర్ 2014, మంగళవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు -9

భోజనాలయ్యాక మళ్ళీ గదులకు చేరుకున్నాం.

'వీళ్ళందరూ మరుగున పడిన మాణిక్యాలన్నగారు.మిమ్మల్ని తప్ప చలాన్ని సరిగ్గా అర్ధం చేసుకున్న వారిని నేనింతవరకూ చూడలేదు.' అన్నాడు చరణ్.

'లేదు చరణ్.చాలామంది ఉన్నారు.మనకు పరిచయం లేదంతే.' అన్నాను.

'నాన్నగారు కూడా అంతే అన్నగారు.' అన్నాడు చరణ్.

నాన్నగారంటే జిల్లెళ్ళమూడి అమ్మగారి భర్త.ఆయన్ను అందరూ నాన్నగారని గౌరవంగా పిలుస్తారు.

'ఆయనెంత నిరాడంబరుడో తెలుసా అన్నగారు?చెబితే తప్ప ఆయన ఫలానా అని ఎవరికీ తెలిసేది కాదు.ఆయనకేమాత్రం గర్వంగానీ పటాటోపంగానీ లేదు.అందరిలో ఒకడుగానే ఉండేవాడు గాని ఏమాత్రం ప్రత్యేకత చూపేవాడు కాడు.కోరుకునేవాడూ కాదు.అందరూ అమ్మకే విలువిచ్చేవారు. ఆయన్నెవరూ పెద్దగా పట్టించుకునేవారు కారు.కానీ ఆయనేమీ అనుకునేవాడు కాదు.మంచి స్నేహశీలి.అందరితో కలిసిపోయేవాడు.అందరితో కలిసి సాయంత్రం పూట షటిల్ ఆడేవాడు.

ఒక్కోసారి ఆశ్రమం బయట బంకు దగ్గర మౌనంగా ఒక సాధారణమైన మనిషిలాగా కూచుని ఉండేవాడు. ఏమాత్రం గౌరవం కోరుకునేవాడు కాదు.అసలు ఆయన మనసులోని సంఘర్షణను ఎవరూ పట్టించుకోలేదు. అరవైఏళ్ళ క్రితం ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో,పూజలూ వ్రతాలూ మడీ ఆచారమూ ఉన్న కుటుంబంలోకి అమ్మ అడుగుపెట్టి,అవేవీ పాటించకుండా,అన్ని కులాలవారూ ఇంటికి రావడం,ఇంట్లో తిరగడం,వాళ్లకు అమ్మే వంటచేసి 'వీరందరూ నా బిడ్దలంటూ' వారికి వడ్డించి తినిపించడం, సాంప్రదాయ విరుద్ధ భావాలను ఆచరించడం,అర్ధంకాని వేదాంతాన్ని సులభమైన మాటల్లో చెప్పడం,చివరకు తన సంసారమే ఒక ఆశ్రమంగా మారడం,తను అందరు భక్తులలో ఒకడుగా మిగిలిపోవడం,ఇదంతా జీర్ణించుకోవాలంటే ఒక భర్తకు ఎంత మానసిక సంఘర్షణ ఉంటుందో ఎవరూ ఊహించలేదు.' అన్నాడు.

'అవును నిజమే?' అన్నాను.

'నిజమన్నగారు.అసలు చెప్పాలంటే,నాన్నగారూ హైమక్కయ్యా మరుగున పడిన వ్యక్తిత్వాలు.వారి మనస్సులలో ఏముందో ఎవ్వరూ రికార్డ్ చెయ్యలేదు. అందరూ అమ్మకే భజన చేశారు,జేజేలు కొట్టారు,వీళ్ళ కోరికల కోసం అమ్మను పొగిడారు,వీళ్ళ పాండిత్యం చూపించుకోవడం కోసం అమ్మమీద పద్యాలూ పుస్తకాలూ వ్రాశారు.అంతేగాని,నాన్నగారిని ఇంటర్వ్యూ చేద్దామని గాని, హైమక్కయ్యను ఇంటర్వ్యూ చేద్దామని గాని ఎవరికీ తోచలేదు.ఇక్కడే మనకూ ఫారినర్స్ కూ చాలా తేడా ఉందని నాకనిపిస్తుందన్నగారు.

ఫారినర్స్ ఏదైనా రీసెర్చి చేస్తే చాలా పక్కాగా చేస్తారు.ఎంతో దానికోసం శ్రమిస్తారు.తిరుగుతారు.విషయ సేకరణ చేస్తారు.చక్కటి ప్లానింగ్ తో వాళ్ళు పనిచేస్తారు.వాళ్ళేగనక ఇక్కడ ఉండి ఉంటే,ఈపాటికి అసలు ఎన్నో డాక్యుమెంటరీలు వచ్చి ఉండేవి.ఎన్నో సమగ్రమైన జీవిత చరిత్రలు వచ్చి ఉండేవి.

మన గొర్రెలకు ఆ యాంగిల్ ఉండదు.వీళ్ళకు ఎంతసేపూ 'నీకు దైవత్వం వచ్చిందికదా ఇక మా కోర్కెలు తీర్చు' అంటూ వెంటపడటమే తప్ప అసలు ఆ వ్యక్తి మనసులో ఏముంది? వాళ్ళ చుట్టూ క్లోజ్ గా తిరిగిన వారి అనుభవాలు ఏమిటి? వాళ్ళ భావాలు ఏమిటి? అనే విషయాలు పట్టవు.భావితరాల కోసం వాటిని రికార్డ్ చేసి పెట్టాలన్న ఆలోచన వీళ్ళకు రాదు.ఎంతసేపూ వీళ్ళ రిలేషన్ 'ఒన్-టు-ఒన్' ఉంటుందన్నగారు.ఆ రకంగా చూస్తే భక్తులందరూ పచ్చి స్వార్ధపరులే.ఎంతసేపూ అమ్మదగ్గర అప్పనంగా సాధ్యమైనంత లాక్కుందామని చూచినవారేగాని,అమ్మ చరిత్రనూ,అమ్మ కుటుంబసభ్యుల మానసిక భావాలనూ విచారించి వాటిని రికార్డ్ చెయ్యాలన్న ఆలోచన ఎవరికీ రాకపోవడం శోచనీయం.అసలు మన భారతీయులది చాలా చీప్ మెంటాలిటీ అన్నగారు.

ఈ చీప్ మెంటాలిటీ వల్ల ఎంతోమంది మహనీయుల జీవిత ఘట్టాలు ఎన్నో మరుగున పడిపోయాయన్నగారు.అమ్మ ఎలాగూ ఒక మేగ్నేట్ అయిపొయింది.ఆమెను మనం అడిగేదేముంది?కానీ నాన్నగారూ హైమక్కయ్యా అలా కాదు.వాళ్ళు ఇనుపముక్కలు.ఆ ఇనుప ముక్కలు, మేగ్నేట్ దగ్గర ఎలాంటి భావసంఘర్షణకు లోనయ్యాయి.ఎంత మధన పడ్డాయి?లోపల్లోపల ఎలా మార్పు చెందాయి?చివరకు ఏమయ్యాయి? అన్న విషయాలు ఎవరూ పట్టించుకోలేదు.

మేగ్నేట్ కి ఏంబాధ ఉందన్నగారు?ఉన్న సంఘర్షణ అంతా ఇనుపముక్కలో ఉంటుంది.అది కూడా మేగ్నేట్ అయ్యేదాకా దానికి నిత్యమూ సంఘర్షణే. అందుకే వాటి చరిత్ర మనం వ్రాయాలి.వాటి అంతరిక సంఘర్షణను మనం పరిశీలించాలి.అదెవ్వరూ చెయ్యలేదు.

వీళ్ళు కోటలో ఉండి యుద్ధం చేశారు.అమ్మకు కోటా లేదు.యుద్ధమూ లేదు. ఆమె యుద్ధం పరిసమాప్తం అయ్యింది.కోటను వదలి ఆరుబయట ఆకాశంలో ఆమె హాయిగా విహరిస్తున్నది.కానీ వీళ్ళ యుద్ధం సమాప్తం కాలేదు.వీళ్లేమో కాసేపు కోటలో ఉండి యుద్ధం చేశారు కాసేపు కోట బయటకు వచ్చి యుద్ధం చేశారు.అసలైన బాధా సంఘర్షణా వీళ్ళు పడ్డారు. దానిని మనవాళ్ళు రికార్డ్ చెయ్యకుండా గాలికి ఒదిలేశారు.

నాన్నగారు అజాత శత్రువన్నగారు.అలాంటి అజాతశత్రువును ఈ భక్తులు పట్టించుకోలేదు.ఆయన భావాలను రికార్డ్ చెయ్యలేదు.అమ్మ ప్రాపకంకోసం ఆరాటపడిన ఘనులు నాన్నను వదిలేశారు.ఎందుకంటే వాళ్ళకొచ్చే లాభాలూ ఉపయోగాలూ అన్నీ అమ్మ దగ్గరే ఉన్నాయి.నాన్న దగ్గర ఏమీలేవు.ఆయనకేమీ శక్తులు లేవు.ఆయన మనలాంటి మామూలు మనిషే.అందుకని ఆయన్ను పట్టించుకోలేదు.చూచారా మనుషుల స్వార్ధం ఎంత దరిద్రంగా ఉంటుందో?' అన్నాడు చరణ్ బాధగా.

అతనివైపు చూచాను.భావావేశంలో బాగా ఇన్వాల్వ్ అయిపోయాడేమో అతని కళ్ళలో నీళ్ళు ధారగా కారిపోతున్నాయి.అతన్ని చూచి నాకూ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.మదన్ మా ఇద్దరివైపూ వింతగా చూస్తున్నాడు.'ఎప్పుడో పోయిన మనుషులను,అందులో వీళ్ళకు ఏమీ సంబంధం లేనివాళ్ళను తలచుకొని వీళ్ళేమిటిలా ఏడుస్తున్నారు?'- అనుకున్నాడో ఏమో నాకు తెలియదు.

చరణ్ ఆలోచన హైమక్కయ్య మీదకు మళ్ళింది.

'అన్నగారు.అక్కయ్య ఎంత ప్రేమమూర్తో మీకు తెలుసా?ఆశ్రమానికి వచ్చినవారు వెళ్లిపోతుంటే తను ఏడిచేది.వాళ్ళను వదల్లేక మెయిన్ రోడ్డువరకూ తనూ వాళ్ళతో నడిచి వచ్చేది.వాళ్ళేవరో ఎక్కడివారో తనకేమీ తెలియదు.వాళ్ళు అమ్మ భక్తులు కనుక వాళ్ళు తనకు అన్నదమ్ములే అక్కాచెల్లెళ్ళే అన్నభావం అక్కయ్యది.అక్కయ్యది చాలా స్వచ్చమైన మనస్తత్వం అన్నగారు.మూర్తీభవించిన ప్రేమస్వరూపిణి హైమక్కయ్య. అటువంటి తల్లి కడుపున పుట్టిన బిడ్డ అలా ఉండక ఇంకెలా ఉంటుంది?

కనీసం అక్కయ్య మనస్సులో అమ్మ గురించిన భావాలేమిటి?తనలో తాను పడిన మానసిక వేదన ఏమిటి? అనే విషయాలు ఎవ్వరూ రికార్డ్ చెయ్యలేదు.' అన్నాడు చరణ్.

'అవును తమ్ముడూ.ఇది క్షమించరాని ఘోరం.మహనీయులకందరికీ ఇది జరిగింది.శ్రీరామకృష్ణుని జీవితంలో జరిగిన విషయాలలో ఒక 25 శాతం మాత్రమే మనకు తెలుసు.అంతవరకే రికార్డ్ చెయ్యబడినాయి.మిగతా చాలా విషయాలూ సంఘటనలూ గాలిలో కలసిపోయాయి.అక్కడ దాకా ఎందుకు? ఆయన బోధనలు కూడా అంతే.ఆయన చెప్పిన అసలైన బోధనలు చాలావరకూ గాలిలో కలసిపోయాయి.'కధామృతం' లో మహేంద్రనాధ గుప్త రికార్డ్ చేసిన విషయాలు చాలా స్వల్పం.శ్రీరామకృష్ణుని చివరి నాలుగు సంవత్సరాలే మనకు రికార్డ్ లో దొరుకుతున్నాయి.అసలు కధ అంతా అంతకు ముందే నలభై సంవత్సరాలలో జరిగిపోయింది.అదంతా మరుగున పడిపోయింది.ఈ విధంగా అందరు మహనీయులకూ తీరని అన్యాయం జరిగింది.నిజానికి వాళ్ళకు కాదు అన్యాయం జరిగింది.మనకు.' అన్నాను.

'దానికి కారణం ఏమై ఉంటుందన్నగారు?' అడిగాడు చరణ్.

'ఏముంది తమ్ముడూ.చాలా సింపుల్.ఒక కారణం ఏమంటే-మనుషుల స్వార్ధం.ఈ భక్తులకు మహనీయులిచ్చే వరాలే ముఖ్యంగాని వాళ్ళ మనసులో ఏముందో ఎవరికీ పట్టదు.అందుకే వారి జీవితంలో విషయాలు రికార్డ్ చెయ్యాలని ఎవరూ అనుకోరు,ఎవరో కొందరు తప్ప.

ఇక,రెండో కారణం ఏమంటే,నీవు చెప్పినట్లు విదేశీయులకున్నంత విషయ సేకరణా,పరిశోధనా,విశ్లేషణా పరిజ్ఞానమూ,దూరదృష్టీ,దీక్షా మనకు ఉండవు. మూడో కారణం,మనకు ఒక సంఘటనాత్మకమైన ఆలోచన తక్కువ.ఒక మహనీయుడు మనలో పుడితే ఆయన్ను రోడ్డుమీద కూచోబెట్టి,ఎదురుగా ఒక హుండీ పెట్టి,అడుక్కుంటూ భజన చెయ్యడం ఒక్కటే మనకు తెలిసిన విద్య.ఆయన ఆలోచనలనూ,బోధలనూ సరిగ్గా రికార్డ్ చేసిపెట్టి,వాటిని క్రోడీకరించి,దానిని ఒక ప్రపంచవ్యాప్త ఉద్యమంగా మార్చే ప్రణాళికాబద్దమైన కృషి మనలో ఉండదు.ఇవే కారణాలు. ఇంకేమున్నాయి?' అన్నాను.

బాధగా నిట్టూర్చాడు చరణ్.

'పద తమ్ముడూ.ఒక్కసారి అప్పారావుగారి వద్దకు పోయి వద్దాం.' అంటూ లేచాను.

త్రిలోక అప్పారావుగారు అమ్మబిడ్డలలో ఒకరు.ఎప్పటినుంచో ఆయన అమ్మ భక్తుడు.సామాన్యంగా అమ్మ బిడ్డలలో ఇతరములైన సాధనలు కనిపించవు.అమ్మంటే అచంచలమైన విశ్వాసమూ నమ్మకమూ నిశ్చింతతో కూడిన జీవితమూ తప్ప వారిలో పెద్దగా ఇతరములైన సాధనలు ఏమీ ఉండవు.కానీ అప్పారావుగారి వంటి కొందరు మాత్రం యోగసాధనలు చేసి, కొన్ని స్థితులను అందుకున్నవారు ఉన్నారు.

ఆయన ప్రస్తుతం బిజినెస్ నుండి రిటైరై జిల్లెళ్ళమూడిలోనే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నారు.

మేం వెళ్లేసరికి అప్పారావు గారు,ఆయన చుట్టూ ఇంకొందరు కూచుని ఉన్నారు.ఆయనేదో చెబుతుంటే వారు వింటున్నారు.నడుస్తున్న సంభాషణనుబట్టి 'ప్రకృతి-పురుషుడు-పురుషోత్తముడు' అనే భగవద్గీతలో చెప్పబడిన విషయాలను ఆయన వివరిస్తున్నారని నాకర్ధమైంది.

నమస్కారాలూ కుశలప్రశ్నలూ అయ్యాక పక్కనే కడుతున్న ఇంకొక అపార్ట్ మెంటూ కొన్ని ఖాళీగా ఉన్న సైట్లూ చూచి మళ్ళీ ఆయన గదికి వచ్చాము.
  
మమ్మల్ని కూచోబెట్టి పండ్లముక్కలు కోసి తినమని ఇచ్చారాయన.అమ్మ భక్తులలో ఇదొక విచిత్రమైన ప్రేమతత్వం కనిపిస్తుంది.మీ కులమూ గోత్రమూ వారడుగరు.మీరూ అమ్మబిడ్డ అంతే.అదొక్కటే వారికి అవసరమైనది.ఇక మీమీద అమితమైన ప్రేమను కురిపిస్తారు.దానికి కారణం అంటూ ఉండదు. మిమ్మల్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులలాగా ట్రీట్ చేస్తారు.అంతే.

అమ్మ అరుణాచలం వెళ్ళిన సంఘటన గురించి అప్పారావు గారు ఆయనకు తెలిసిన విషయాలు చెప్పారు.

"డాక్టర్ బేర్ అని ఒక యూరోపియన్ డాక్టర్ ఉండేవారు.అమ్మ చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆయనకు అమ్మంటే చాలా ప్రీతి ఉండేది.ఆయన అరుణాచలంలో ఒక ఆస్పత్రి కట్టిస్తూ ఆరేళ్ళ వయస్సున్న అమ్మను అక్కడకు తీసుకెళ్ళాడు. అప్పుడు అమ్మ రమణాశ్రమానికి మొదటిసారిగా వెళ్ళింది.చాలా ఏళ్ళ తర్వాత చలంగారి కోసం రెండోసారి వెళ్ళింది.

మొదటిసారి అమ్మ అక్కడకు వెళ్ళినపుడు అమ్మకు ఆరేళ్ళు.అక్కడ ఒక బండమీద అమ్మ కూచుని ఉన్నది.అపుడు రమణమహర్షి కొండ దిగి ఆశ్రమంలోకి వస్తున్నారు.అమ్మను చూచిన ఆయన గబగబా ముందుకు వచ్చి సంభ్రమంగా-'మాతృశ్రీ వచ్చావామ్మా?'అన్నారు.అమ్మను మొదటిసారిగా 'మాతృశ్రీ' అని పిలిచినది రమణమహర్షియే." అన్నారు అప్పారావుగారు.

ఈ లోపల చరణ్ ఏం చేస్తున్నాడా? అని చూచాను.

అప్పారావుగారి పుస్తకాల కప్ బోర్డ్ లోనుంచి ఏవేవో పుస్తకాలు తీసి చూస్తున్నాడు చరణ్.అలా చూస్తూ ఒక పుస్తకాన్ని చేత్తో పట్టుకుని-"అన్నగారు ఈ పుస్తకం చూడండి"- అంటూ ఒక పాతకాలపు బ్రౌన్ రంగు పుస్తకాన్ని నాకిచ్చాడు.అదేమిటా అని చూచాను.

'భగవద్గీత' by చలం- అని ఉన్నది.

చరణ్ వైపు చూచాను.అతని ముఖం వెలిగిపోతున్నది.

'చూచారా అన్నగారు.పొద్దున్నే మనం చలంగారు వ్రాసిన భగవద్గీత గురించి మాట్లాడుకున్నాం కదా.ఇప్పుడా పుస్తకం ప్రింట్ కూడా లేదుకదా అదెక్కడ దొరుకుతుందా?అని అనుకున్నాను.సాయంత్రానికి ఈ మారుమూల పల్లెటూళ్ళో ఇక్కడే మనకు దొరికింది.చూడండి.అమ్మ చేసే పనులు ఇలాగే ఉంటాయి.' అన్నాడు.

అప్పారావుగారు మమ్మల్ని గమనిస్తూ ఒకే మాట అన్నాడు.

'Chalam is a realized soul అండి.నాకు ఆయన వ్యక్తిగతంగా తెలుసు. ఆయన అరుణాచలంలో ఉన్నప్పుడు నేను చాలాసార్లు అక్కడకు వెళ్లాను.ఆయన్ను కలిశాను.'

'అవునా?' చరణూ నేనూ ఒకేసారి అన్నాం.

'అవును.చలంగారితో నా పరిచయం ఈనాటిది కాదు.నేను అరుణాచలం వెళ్ళిన ప్రతిసారీ చలంగారిని కలవకుండా వచ్చేవాడిని కాను.నాకు సౌరిస్ గారు కూడా బాగా తెలుసు.Chalam is a realized soul అందులో ఏమీ అనుమానం లేదు.

చలంగారు పోయిన కొత్తలో ఒకసారి నేను అరుణాచలం వెళ్లాను.ఆరోజున చలంగారి మాసికం.భోజనం చేసి వెళ్ళమని సౌరిస్ గారు అన్నారు.అక్కడే ఆరోజున భోజనం చేశాను.

మీకొక విషయం చెబుతాను వినండి.ఆరేళ్ళ పిల్లగా అమ్మ ఏ బండరాయి మీద అయితే కూచున్నదో అదేచోట రమణమహర్షి తన తల్లిని సమాధి చేసి 'మాతృభూతేశ్వరాలయం' కట్టించారు.' అన్నారు అప్పారావుగారు.

ఈ మాటవిని మేమంతా ఆశ్చర్యపోయాం.దీనిని బట్టి రమణమహర్షి అమ్మను ఎంతగా గౌరవించారో మనం అర్ధం చేసుకోవచ్చు.తన సొంతతల్లితో సమానమైన స్థానాన్ని ఆయన జిల్లెళ్ళమూడి అమ్మగారికిచ్చారు.

అప్పారావుగారు కొనసాగించారు.

నేనొక రోజున అమ్మను ఇలా అడిగాను."అమ్మా! 'అంతా అదే' అని నీవెప్పుడూ అంటావుకదా.అలా అని మనం అనుకోవడమా లేక అలా అనిపించడమా? ఏది కరెక్టమ్మా?'

ఆయన ఈ విషయం చెబుతూ ఉండగానే నాకు జవాబు లోలోపల స్ఫురించింది.

మనం అనుకోవడం సాధనదశ.అదే అనిపించడం పరిపక్వదశ.మనం అనుకోవడం ముఖ్యం కాదు.అది కృత్రిమం.దానంతట అదే అనిపించాలి.అది సిద్ధదశ.మనం అనుకుంటున్నామంటే అక్కడ ఘర్షణ ఉన్నది.అదే అనిపిస్తుంటే ఘర్షణ లేదు.సహజానుభవమే అక్కడ ఉన్నది.

ఆలోచనలో ఉన్న నాకు అప్పారావుగారి స్వరం వినిపించి ఈలోకంలోకి తెచ్చింది.

'అప్పుడు అమ్మ ఏమన్నదో తెలుసా? 'ముందు అనుకో నాన్నా తర్వాత అనిపిస్తుంది' అని ఒక చిన్న మాటలో తేల్చేసింది.

ఆ మాట వింటూనే మా గుండెలు ఉప్పొంగిపోయాయి.అబ్బా ఎంత బాగా చెప్పింది అమ్మ అని చాలా ఆనందం కలిగింది.

అప్పారావుగారి కోసం వారి మిత్రులు ముందుగదిలో ఎదురుచూస్తున్నారు. మేమొచ్చేసరికి అక్కడ చర్చ జరుగుతున్నది.అది మధ్యలో ఆగిపోయింది.ఇంకా ఎక్కువ సేపు ఉండి వారిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదని,వారివద్ద సెలవు తీసుకుని,అమ్మకు నమస్కారం చేసుకుని బయలుదేరాము.

అప్పటికే చీకటి పడిపోయింది.ఆ చీకట్లో కారు జిల్లెల్లమూడిని వదలి రోడ్డెక్కి పెదనందిపాడు వైపు పోతున్నది.రోడ్డుకిరువైపులా చెట్లు మౌనధ్యానంలో ఉన్న యోగులలా నిలబడి ఉన్నాయి.వాతావరణం చడీచప్పుడూ లేకుండా ప్రశాంతంగా ఉంది.

'ఎంత విచిత్రమో చూడండి అన్నగారు! చలంగారి భగవద్గీత గురించి మీరు చెప్పడమూ,కొన్ని గంటలు కూడా గడవకముందే ఆ పుస్తకం ఆ మారుమూల పల్లెలో మన చేతికి రావడమూ?' అన్నాడు చరణ్ డ్రైవ్ చేస్తూ.

'అంతే కాదు తమ్ముడూ.చలంగారిని బూతు రచయితగా కాకుండా సక్రమంగా అర్ధం చేసుకున్న ఇంకొక వ్యక్తికూడా అక్కడే కనిపించారు చూడు.' అన్నాను.

'అవునన్నగారు.అమ్మ చేసే పనులు ఇలాగే ఉంటాయి.ఇవే అసలైన అద్భుతాలన్నగారు.ఇంతకంటే అద్భుతాలు ఇంకెక్కడుంటాయి?అమ్మ చేసే అద్భుతాలు జీవితంలో చాలా సహజంగా జరిగినట్లు జరుగుతాయి.అవి అద్భుతాలని మనకనిపించదు.అంత సహజంగా అవి జరుగుతాయి.' అన్నాడు చరణ్.

'సరేగాని చరణ్.పొద్దున్న మనకు కనిపించిన ఆ పండితునికీ అప్పారావుగారికీ తేడా గమనించావా?ఆయనేమో మనల్ని గుర్తించికూడా గుర్తించనట్లు ముఖం తిప్పుకున్నాడు.ఈయనేమో మనమెవరో ఆయనకు తెలీకపోయినా తన బెడ్రూమ్ లో కూచోబెట్టి పండ్లూఫలాలూ పెట్టి ఆప్యాయత కురిపించాడు.ఆ తేడా గమనించావా?' అడిగాను.

'గమనించానన్నగారు.అదే ఉత్త పండితులకూ సాధకులకూ ఉన్న తేడా అని నాకూ అనిపించింది.పండితుల దగ్గర విషయం ఉండవచ్చు.కాని వారి గుండెలలో ప్రేమ ఉండదు.అదే తేడా.'అన్నాడు చరణ్.

అమ్మతత్వాన్ని ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే 'ఎల్లలెరుగని ప్రేమ' అని చెప్పచ్చు తమ్ముడూ.' అన్నాను.

చరణ్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

'అవునన్నగారు.ఇలాంటి పుస్తకపండితులకు అమ్మతత్త్వం ఎలా అర్ధమౌతుందన్నగారు?వారికి తెలిసింది గణవిభజన మాత్రమే.కానీ ప్రేమసాధనలో కణవిభజన జరుగుతుంది.మన శరీరాలలోని కణాలే మారిపోతాయి.గణవిభజనకూ కణవిభజనకూ ఎంత భేదం ఉన్నదన్నగారు?గ్రామర్ పట్టుకుని వేళ్ళాడే పండితులకూ సాధకులకూ అంత తేడా ఉన్నది.' అన్నాడు చరణ్.

నాకు భలే ఆనందం అనిపించింది.చరణ్ నోటివెంట ఒక్కొక్కసారి ఇలాంటి భలేమాటలు పలుకుతాయి.

'చరణ్.నాదొక సందేహం.చెబుతావా?' అడిగాను.

'చెప్పండన్నగారు.'

'అమ్మభక్తులలో ప్రేమ కనిపించేమాట నిజమే.కానీ మనం కూడా అమ్మ భక్తులమే అని తెలిస్తే మాత్రమె ఆ ప్రేమను మనమీద కురిపిస్తారు. ఒక కరుడుగట్టిన ముస్లిం తీవ్రవాది కూడా సాటి ముస్లింమీద ప్రేమ బాగానే కురిపిస్తాడు.ఒక క్రిష్టియన్ ఇంకొక క్రిష్టియన్ను బాగానే ఆదరిస్తాడు.అదేం పెద్ద గొప్పకాదు.కానీ వారూవీరూ అని తేడా లేకుండా అందరిమీదా ఆ ప్రేమను చూపగలిగినప్పుడే అది నిజమైన ప్రేమ అవుతుందని నా భావన.అమ్మ భక్తులు అలా ఉండగలుగుతున్నారా?ఎందుకంటే వాళ్ళతో నాకు పెద్దగా పరిచయాలు లేవు.నీకు బాగా తెలుసు కదా.చెప్పు.' అడిగాను.

నవ్వాడు చరణ్.

'ఎలా ఉంటుందన్నగారు?ఎక్కడైనా పరిస్థితి ఒకలాగే ఉంటుంది.కానీ మీరు చెప్పినరకం మనుషులు-అంటే ఎక్కడైనా ఎవరితోనైనా ఒకే రకమైన ప్రేమతో ఉండే మనుషులు- కూడా ఉన్నారు.కానీ వారు మైనారిటీ వర్గం.ఎక్కువమంది మాత్రం ఆ ప్రేమను అంతవరకే చూపిస్తారు.నిత్యజీవితంలో అది కనపడదు.

చాలామంది అమ్మ సాహిత్యం చదివారు.అమ్మ మాటలను చిలకలాగా వల్లిస్తారు.కానీ ఆచరణలో కనపడదన్నగారు.అమ్మను ఆసరాగా చేసుకొని లౌకికంగా ఎదగాలని అలాంటివాళ్ళు చూస్తారు.వాళ్ళు వేస్ట్ మనుషులు. వీరంతా అసలును వదిలేసి వడ్డీని పట్టుకుని వేళ్ళాడే వడ్డీ వ్యాపారస్తులు. వీరికి లౌకికానందం మాత్రమే కావాలి.అలౌకికానందం అక్కర్లేదు.అలౌకికంలో కూడా లౌకికాన్ని వెదికే రకాలు ఈ మనుషులంతా.' అన్నాడు చరణ్ సాలోచనగా.

అతను చెబుతున్నది సత్యమే.కాదని నేనెలా అనగలను?

మనుషుల మనస్తత్వాలు ఏ కులమైనా ఏ మతమైనా ఏ దేశమైనా ఏ కల్ట్ అయినా ఎక్కడైనా ఒకే రకంగా ఉంటాయి.లౌకికానందాన్ని కోరేవారు ఎందఱో అయితే అలౌకికానందాన్ని కోరేవారు ఎక్కడో కొందరు మాత్రమే ఉంటారు.వారు ఊరకే పుస్తకాలు చదివి ఊరుకోరు.వాటిని జీవితంలో ఆచరించాలని తపిస్తారు.ఇతరులకు మాటలు చెప్పి గొప్ప కావాలని వారికుండదు.తాము గ్రహించినదానిని జీవితంలో ఎలా ఆచరించాలా అనే నిరంతరమూ వారు తపిస్తారు.ఆ తర్వాతే ఇతరులకు చెప్పడం.ముందు ఆచరణ.తర్వాత అవసరమైతే బోధన.ఇదే అసలైన సాధకుల మార్గం.

అందరం మౌనంగా ఎవరి ఆలోచనలలో వారున్నాం.

చిక్కటి చీకటిని చీల్చుకుంటూ కారు గుంటూరు వైపు సాగిపోతున్నది.