నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

2, అక్టోబర్ 2014, గురువారం

స్వచ్ఛ భారత్ అభియాన్ -Clean India Campaign

ప్రధాని నరేంద్ర మోడీ మొదలుపెట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నా వంతుగా నేను ఈరోజు పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్ ను శుభ్రపరచడం జరిగింది.

మన ప్రధానమంత్రి ఆలోచన చాలా మంచిది మరియు ఉన్నతమైనది.ఇదే ఆలోచన నాకు కనీసం ముప్పై ఏళ్ళనుంచి ఉన్నది.ఇతర దేశాలున్నట్లు మనంకూడా శుభ్రంగా ఎందుకుండలేం?ఈ దరిద్రపు లిట్టరింగ్ అనేది ఎప్పుడు మన దేశాన్ని వదలి పోతుంది?అని నేనెప్పుడూ అనుకునేవాడిని.మన ప్రజల అశుభ్రపు లేకి అలవాట్లూ చెప్పినా వినని మూర్ఖపు మనస్తత్వాలూ చూస్తె బాధ అనిపించేది.

మన వాళ్ళలో పరిశుభ్రత చాలా తక్కువ.దానిని నేర్పాలంటే ఇలాంటి ప్రభుత్వ ఉద్యమం ఒక్కటే మార్గం.చెప్పినా వినని వారికి అంతిమంగా జరిమానా వెయ్యడమే మార్గం.మొదట్లో తిట్టుకున్నా నిదానంగా అలవాటు పడతారు.క్రమంగా శుభ్రత అనేది ఒక అలవాటుగా మారుతుంది.సమయం పట్టినప్పటికీ ఓపికగా దీనిని నేర్పడం ఒక్కటే దారి.

నేనా స్టేషన్లో ఉన్నపుడే సికింద్రాబాద్ నుంచి వచ్చే జన్మభూమి ఎక్స్ ప్రెస్ వచ్చి ఆగింది.సెలవలు కదా,చాలామంది చదువుకునే అబ్బాయిలూ అమ్మాయిలూ దిగారు.వాళ్ళు తింటున్న బిస్కెట్ పాకెట్ల కవర్లూ ఇంకా ఏవేవో కవర్లూ వాటర్ బాటిళ్ళూ నడుస్తూ అలా పక్కకు పడేస్తూ వెళ్ళిపోతున్నారు. వాటిని ఎవరు తీస్తారు అన్న ఆలోచనా,ఎదురుగా డస్ట్ బిన్లున్నాయి వాటిల్లో వెయ్యాలన్న ఆలోచనా వారిలో ఎక్కడా కనపడలేదు.మళ్ళీ అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లూ టాబ్లెట్లూ కనిపిస్తున్నాయి.అందరినీ ఆపి ఒకచోటికి చేర్చి "చదువుకునే వాళ్ళు మీకే పబ్లిక్ ప్లేస్ లో లిట్టరింగ్ చెయ్యకూడదని తెలీకపోతే ఎలా?" అంటూ సివిక్ సెన్స్ గురించి వాళ్లకు క్లాస్ చెప్పాను.

వాళ్ళు పారేసిన చెత్త వాళ్ళ చేతే తీయించి డస్ట్ బిన్లలో వేయించాను.

మన విద్యార్ధులు కాలేజీలలో ఎన్నో స్కిల్స్ నేర్చుకుంటున్నారు గాని పబ్లిక్ ప్లేస్ లో ఎలా ప్రవర్తించాలి?పరిశుభ్రతను ఎలా పాటించాలి?అన్న విషయాలు మాత్రం నేర్చుకోవడం లేదు.వారికి ఎవరూ నేర్పడమూ లేదు.స్కూళ్ళలో కాలేజీలలో ముందుగా సివిక్ సెన్స్ అనేదాన్ని విద్యార్ధులకు నేర్పాలి. పిల్లలకు చెప్పేముందు పెద్దవాళ్ళు దానిని పాటించాలి.

ఇదంతా ఇప్పుడు ప్రధానమంత్రిగారు చెప్పారని నేను చెయ్యడం లేదు.ఎన్నో ఏళ్ళనుంచి నా వంతుగా నాకు ఎదురైన ప్రతిచోటా సివిక్ సెన్స్ పరంగా అనేక కోణాలలో పబ్లిక్ ఎవర్ నెస్ పెంచే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను.

ఉదాహరణకు-ఉదయం పిడుగురాళ్ళ వెళదామని శబరి ఎక్స్ ప్రెస్ ఏసీ త్రీ టయర్ కోచ్ లో ఎక్కాను.అందులో కేరళనుంచి హైదరాబాద్ వెళుతున్న ఒక విద్యార్ధి బృందం ఉన్నది.ప్రతివాళ్ళ దగ్గరా ఉన్న స్మార్ట్ ఫోన్స్ లోనుంచి పెద్దగా పాటలూ వెస్టర్న్ మ్యూజిక్కూ మోగిపోతున్నది.ఒక పబ్బు వాతావరణం లాగా ఉన్నది.ఎవరు ఏమి వింటున్నారో ఆ సంగీతం వింటున్నవాళ్లకు కూడా అర్ధం అవుతోందో లేదో నాకు అనుమానం వచ్చింది.వెంటనే కోచ్ కండక్టర్ ను పిలిచి -'యియర్ ఫోన్స్ పెట్టుకుని ఎవరికి వారు శబ్దం అనేది బయటకు రాకుండా వినమని' వాళ్లకు చెప్పించాను.

విద్యార్ధులు గనుక అందరూ వెంటనే చెప్పిన మాటను విన్నారు.యియర్ ఫోన్స్ లేని వాళ్ళను మ్యూజిక్ ఆపమని చెప్పాను.మన సరదా పక్కవాళ్ళకు ఇబ్బంది కలగకూడదన్న విషయం వారికి నేను చెప్పవలసి వచ్చింది.మళ్ళీ వాళ్ళతోబాటు గ్రూప్ ఇంచార్జ్ గా ఒక టీచర్ ప్రయాణిస్తున్నది.ఆమె ఏమీ మాట్లాడటం లేదు.వాళ్ళతో కూచుని ఆ గోలను ఆస్వాదిస్తున్నది.అదీ మన టీచర్ల పరిస్థితి.

కొన్ని నెలలక్రితం మేము నలుగురం కలసి కోటప్పకొండ విష్ణుశిఖరం మీద సోకాల్డ్ భక్తులు పడేసిన చెత్తా చెదారం శుభ్రం చేశాము.ఆ వివరం కావలసిన వారు ఈ క్రింది లింక్ చూడండి.













పిడుగురాళ్ళ స్టేషన్లో ఈ కార్యక్రమం సందర్భంగా బాగుపడిన స్టేషన్ పరిసరాలు












ఈ కార్యక్రమంలో భాగంగా ఊరకే పరిసరాలూ వీధులూ శుభ్రం చెయ్యడమే కాకుండా మన మనస్సులూ వ్యక్తిత్వాలూ ప్రవర్తనలూ కూడా శుభ్రం చేసుకుంటే ఇంకా బాగుంటుందని నా సూచన.ఎందుకంటే యోగంలోని రెండవ మెట్టైన "నియమం" లో శౌచం అనేది చాలా ముఖ్యమైనది.అంతరిక బాహ్య శౌచాలను సాధిస్తే మనిషి చాలావరకూ ఆధ్యాత్మికంగా ఎదిగినట్లే.

మన చుట్టుపక్కల అంతా శుభ్రం చేసుకుని,మనస్సులలో మాత్రం మురికి ఉంచుకుంటే ఉపయోగం ఏముంది?