Pages - Menu

Pages

17, నవంబర్ 2014, సోమవారం

కొన్ని మార్షల్ ఆర్ట్స్ ఫోటోలు-4

Creeping like a snake
Tai Chi Pose
1986 -Guntakal
30 ఏళ్ళ క్రితం గుంతకల్ లో నేను మార్షల్ ఆర్ట్స్ స్కూల్ నడిపే రోజుల్లో నాకు కాశీ అని ఒక శిష్యుడు ఉండేవాడు.మెయిన్ రోడ్డులోనే అతనికి ఒక ఫోటో స్టూడియో ఉండేది.

ఆ ఫోటో స్టూడియో వెనుకగా ఉన్న ఒక రూం లో ముఖ్యమైన శిష్యులతో నేను సీక్రెట్ ఫైటింగ్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేసేవాడిని.

జెనరల్ ప్రాక్టీస్ కోసం రైల్వే హైస్కూల్ గ్రౌండ్లో సాయంత్రం చీకటిపడిన తర్వాతనుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకూ అందరం చేరేవాళ్ళం.అందరిలో అభ్యాసం చెయ్యలేని కొన్ని సీక్రెట్ టెక్నిక్స్ ప్రాక్టీస్ కోసం ఫోటోస్టూడియో వెనుక ఉన్న రూంకి వారంలో రెండు మూడురోజులు చేరేవాళ్ళం.

ఆ స్టూడియోలో సరదాగా తీసినదే ఈ ఫోటో.

ఇది 'తాయ్ చి' విద్యలో "క్రీపింగ్ లైక్ ఎ స్నేక్" అనే టెక్నిక్.దీనినే 'స్నేక్ క్రీప్స్ లో' అని కూడా పిలుస్తారు.దీనికి చాలా ఫైటింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి.దీని అభ్యాసం వల్ల మంచి flexibility వస్తుంది.ఒళ్ళు ఎటు కావాలంటే అటు వంగుతుంది.దీనికి తోడుగా 'చక్రాసనం', కలారిపాయట్టు లోని 'మైప్పత్తు' అనే అభ్యాసాలు తోడైతే పాము మెలికలు తిరిగినట్లు శరీరాన్ని ఎటు కావాలంటే అటు వంచవచ్చు.

కాశీ నాకు పరిచయం కావడం కూడా విచిత్రంగా జరిగింది.అప్పట్లో ఆ ఊరిలో చంద్రావతమ్మ గారని ఒక మ్యూజిక్ టీచర్ ఉండేవారు.ఆమె సొంతూరు నంద్యాల.ఆమె గాత్రం చాలా అద్భుతంగా ఉండేది.అంతేగాక ఆమె వయోలిన్ అద్భుతంగా వాయించేవారు.వాయిద్యాలలో 'తబలా'  అంటే నాకు చాలా ఇష్టం.అందుకని తబలా నేర్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెదుకుతూ,ఒక సెకండ్ హ్యాండ్ తబలా ఆమె దగ్గర అమ్మకానికి ఉన్నదంటే ఆమె ఇల్లు వెదుక్కుంటూ వెళ్లాను.

గుంతకల్ లో అప్పట్లో ఏమీ దొరికేవి కావు.ఏదైనా కావాలంటే ఇటు కర్నూల్ గాని అటు బళ్ళారి గాని పోయి కొనుక్కోవాలి.అలా ఆమె నాకు పరిచయం అయ్యారు.మ్యూజిక్ షాపులో తబలా కొనాలంటే సరిపోయే డబ్బులు నా దగ్గర అప్పుడు లేవు.నా దగ్గర డబ్బులు లేకుంటే సర్దుకునేవాడిని గాని,నా స్టూడెంట్స్ దగ్గర ఏనాడూ ఫీజు తీసుకునేవాడిని కాదు.అప్పట్లో గుంతకల్ స్కూల్లో ఏభై మంది స్టూడెంట్స్ ఉండేవారు.

క్రమేణా మా అమ్మగారూ ఆవిడా మంచి స్నేహితులయ్యారు.సాయంత్రాలలో వాళ్ళిద్దరూ కలసి కూర్చుని త్యాగరాజ కృతులు అద్భుతంగా ఆలపించేవారు. నేనేమో నా వచ్చీరాని తబలా బిట్స్ తో సహకరించేవాడిని.తబలా అపశ్రుతులు దొర్లినా పాపం వాళ్ళిద్దరూ ఏమీ అనేవారు కారు.ఆమె దగ్గర ఒక తబలాతో బాటు ఒక హార్మోనియం కూడా అమ్మకానికి దొరికింది.అప్పట్లో కొన్నాళ్ళు తబలా వాయించడం నేర్చుకున్నాను.ఆ తర్వాత ఆ ఊరు ఒదిలి వచ్చేటప్పుడు అవి రెండూ ఆమెకే ఇచ్చేశాను.

వాళ్ళ ఇంటిలోనే నాకు కాశీ పరిచయం అయ్యాడు.

అతనికి మార్షల్ఆర్ట్స్ నేర్చుకోవాలని చాలా కుతూహలం ఉండేది.నేను స్కూల్ నడుపుతున్నానని తెలిసి అందులో చేరాడు.అతని ప్రెండ్ తిరుమలేష్ అని ఒకతను ఉండేవాడు.అతనిది పాత గుంతకల్.అతను కర్రసాములో మంచి స్పెషలిస్ట్.అతనికి నేను మార్షల్ ఆర్ట్స్ నేర్పేటట్లు,అతను నాకు కర్రసాము నేర్పేటట్లు ఒప్పందం కుదిరింది.

ఆ విధంగా సెకండ్ హ్యాండ్ తబలా కోసం వెదుకులాట,నాకొక మంచి మ్యూజిక్ టీచర్ని ఫేమిలీ ఫ్రెండ్ గా పరిచయం చెయ్యడమే గాక,ఒక మంచి శిష్యుడినిచ్చింది.అంతేగాక కర్రసాము నేర్చుకునే అవకాశాన్ని కూడా కలిగించింది.

ఆ విధంగా కాశీ ఫోటో స్టూడియో మాకందరికీ ఒక అడ్డాగా మారింది.ఒకరోజున ప్రాక్టీస్ సెషన్ అయిన తర్వాత అక్కడ తీసినదే ఈ ఫోటో.