నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

28, నవంబర్ 2014, శుక్రవారం

ప్రాణామృత ధారణలో...


  జీవంలేని రాతిశిల్పం
గుడిలో వెలుగై కదిలిస్తుంది
ప్రాణంలేని తీగరాగం
మదిలో జ్వాలను రగిలిస్తుంది

మాటరాని మూగమనసు
మనిషి బ్రతుకును నడిపిస్తుంది
పాడలేని పిచ్చిగుండె
స్వర తంత్రులను తడిపేస్తుంది

ఉందో లేదో తెలియని గమ్యం
ఊర్ధ్వలోకాలకు తెరతీస్తుంది
అందీ అందని నీ సాంగత్యం
ఆనందపు బాధను మిగులుస్తుంది

అందని ఆకాశం కోసం
?ఆరాటమేగా జీవితం
స్పందించే నెచ్చెలి స్నేహం
 !ఆస్వాదనేగా అమృతం

అమూల్యములౌ నిధులకు
ఆకారం ఉండబోదు
సాగుణ్యాత్మల మధ్యన
ఆకాశం అడ్డుకాదు

మాటలాడు నోటికేమొ
భావం దరిజేరరాదు
మూగగుండె లోగిలిలో
ముగ్ధత్వం వీడిపోదు

మౌనాస్వాదనలో వెలిగే
మధురవేదనే సత్యం
ప్రాణామృత ధారణలో
...పలుకు మౌనమే నిత్యం