Pages - Menu

Pages

9, నవంబర్ 2014, ఆదివారం

నాలో కలసిపో...

'నా హృదయం ఒక బండరాయి' - అన్నాను.

'దానిక్రింద ఉన్న అగాథ జలప్రవాహం నీకు తెలియదు'-అన్నాడు.

'ప్రేమంటే నాకు తెలియదు'-అన్నాను.

'ప్రేమ లేకపోతే నీవు లేవు'- అన్నాడు.

'నాకు కనిపించడం లేదెందుకు?' అన్నాను.

'కళ్ళు తెరువు.కనిపిస్తాయి' అన్నాడు.

'నాకు అనిపించడం లేదెందుకు?' అన్నాను.

'హృదయపు వాకిలి తెరువు.అనిపిస్తుంది'- అన్నాడు.

'నీవు చెప్పేది అబద్దమా నిజమా?' అనుమానంతో అడిగాను.

'అబద్ధం కూడా నిజమే' అంటూ నవ్వాడు.

'రాలేను' అన్నాను.

'రానక్కరలేదు' అన్నాడు.

'బంధాలు వదలడం లేదు' అన్నాను.

'అవి నిన్ను వదలడం లేదా?వాటిని నీవు వదలడం లేదా?' అడిగాడు.

'నేనెవర్ని?' అడిగాను.

'నేనే నీవు'-అన్నాడు.

'ఎలా తెలుసుకోవడం?' అడిగాను.

'నాలో కలసిపో.'అన్నాడు.