నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

14, డిసెంబర్ 2014, ఆదివారం

లక్ష్మీగణపతి హోమం

మొన్నీ మధ్యన ఒక గ్రూపువాళ్ళు నా దగ్గరకు వచ్చి కలిశారు.

అదీ ఇదీ మాట్లాడాక,వచ్చిన విషయం చెప్పారు.

'మేము ఫలానా రోజున సామూహిక లక్ష్మీగణపతి హోమం చేస్తున్నాం.మీ పేరు కూడా చేర్చుకుందామని వచ్చాం.'-అన్నారు.

వాళ్ళ ముఖాలలోకి తేరిపార చూచాను.

బొట్లు పెట్టుకుని ఉన్నారుగాని,ఒక్కడి ముఖంలోనూ తేజస్సుగానీ వర్చస్సుగానీ లేదు.దొంగల ముఖాలలాగా ఉన్నాయి.

వీళ్ళకు జ్ఞానభిక్ష పెట్టక తప్పదనుకున్నా.

'లక్ష్మీ గణపతియా? అదేంటి? లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య కదా? లక్ష్మీ గణపతి ఎక్కడనుంచి వచ్చాడు?ఆయన పుట్టు పూర్వోత్తరాలెంటి?ఎప్పుడూ వినలేదే?' అడిగాను ఏమీ తెలీనట్లు.

నా అజ్ఞానానికి వాళ్ళ లీడర్ చిరునవ్వు నవ్వాడు.

'పెద్దవారు మీరు కూడా అలా అంటే ఎలా సార్?కోరికలు తీరడానికి లక్ష్మీ గణపతి హోమాన్ని మించింది లేదు' అన్నాడు.

'ఓరి మీ కోరికలు పాడుగాను.ఎవడిని కదిలించినా కోరికలు కోరికలు అంటూ చస్తున్నారు' అనుకున్నా లోలోపల.

వీడికి ఇలా కాదు జవాబు చెప్పాల్సింది అని రూటు మార్చా.

'మీకూ చూడబోతే ఒక ఏభై ఏళ్ళు ఉన్నట్టు కనిపిస్తున్నాయి.మీరూ పెద్దవారే కదా.మరి మీకు ఇంకా కోరికలేమిటి?అంత తీరని కోరికలు మీకు ఇంకా ఏం మిగిలున్నాయి?'అడిగాను.

చెప్పగానే ఎగిరి గంతేసి "నా పేరు కూడా వ్రాసుకోండి" అనకుండా వాదన పెట్టుకున్నందుకు వారి ముఖాలలో చికాకూ అసహనమూ ప్రత్యక్షమయ్యాయి.

'ఏవో ఒకటి ఉంటాయి కదా సార్.కోరికలో బాధ్యతలో.'అన్నాడు.

'అవి తీరాలంటే హోమాలు చేస్తే తీరుతాయా?లేక ఆ మార్గంలో ప్రయత్నం చేస్తే తీరుతాయా?' అడిగాను.

'పొద్దున్నే అనవసరంగా వీడి దగ్గరికి ఎందుకొచ్చాంరా దేవుడా?' అన్న ఫీలింగ్ వాళ్ళ ముఖాలలో కనిపించింది.

'ఇంతకీ లక్ష్మీగణపతి పుట్టు పూర్వోత్తరాల గురించి నా సందేహం మీరు తీర్చనే లేదు?' అడిగాను.

'పోదాం పదండి సార్.ఈయన ఇచ్చేటట్లు లేడు' అన్నాడు వాళ్ళ గ్రూపులో ఒక వ్యక్తి అసహనంగా.

'ఉండు బాబు.అప్పుడే ఒక నిర్ణయానికి రాకు.ఇవ్వనని నేను చెప్పలేదు కదా. కానీ విషయం ఏమిటో తెలుసుకోకుండా మీరడిగిన వెంటనే ఎలా ఇస్తాను?నేనూ ఒక లక్ష రూపాయలు అడుగుతాను.నీవు వెంటనే ఇచ్చేస్తావా?' అడిగాను.

వాళ్లకు బాగా కోపం వచ్చేసిందని వాళ్ళ ముఖాలు చూస్తూనే తెలుస్తున్నది.

'ఆయన ఒక దేవత' అన్నాడొకడు.

'ఏమిటో ఆయన ప్రత్యేకత?'- అన్నాను ప్రాస కలుపుతూ.

'చెప్పాం కదా సార్.కోరికలు తీరుతాయని.' అన్నాడు ఇంకొకడు.

అలా అంటూ నాకొక ఫోటో చూపించారు.

'ఇంతకు ముందు చేసిన హోమంలో ఫోటో తీస్తే మంటల్లో వినాయకుడి ఆకారం ఎంత స్పష్టంగా పడిందో చూడండి.'అని చెప్పారు.

వాళ్ళ మొహం మీదే నవ్వాను.

'హోమజ్వాలలో వినాయకుడి రూపం ఒక సెకన్ పాటు కనిపిస్తే మీకేం ఒరిగింది?' అడిగాను.

జవాబు లేదు.

'మీరు ఎన్నాళ్ళ నుంచి ఈ హోమం చేస్తున్నారు?' అడిగాను.

'అయిదేళ్ళ నుంచి వరుసగా చేస్తున్నాం' అన్నాడు లీడర్.

'మరి మీమీ కోరికలు అన్నీ తీరాయా? నిజంగా చెప్పండి.ఒకవేళ తీరితే ఇంకా మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నారు?' అడిగాను.

'లోకకల్యాణం కోసం చేస్తున్నాం.' అన్నాడొకడు.

'లోకానికి కల్యాణం ఒక్కటేనా శోభనం కూడా మీరే చేస్తారా?' అని అందామని నోటిదాకా వచ్చి ఆగిపోయింది.

'మీరేం అనుకోకపోతే ఒకమాట చెప్తాను' అన్నాను.

వాళ్ళు ప్రశ్నార్ధకంగా చూస్తున్నారు.

'మీ ఇల్లెక్కడ' అడిగాను ఆ లీడర్ని.

'అరండల్ పేట' అన్నాడు.

'రైల్వే స్టేషన్ మీ దగ్గరలోనే ఉన్నది కదా' అడిగాను.

'అవును' అన్నాడు.

'గత వారం రోజులుగా ఒక దిక్కులేని ఆడది ఒంటిమీద చీర కూడా సరిగ్గా లేకుండా స్టేషన్ పరిసరాలలో తిరుగుతున్నది.గమనించారా మీలో ఎవరైనా?' అడిగాను.

వాళ్ళు ముఖముఖాలు చూచుకున్నారు.

'మీకు నిజంగా లోకకల్యాణం చెయ్యాలని ఉంటే,అలాంటి దిక్కులేని వాళ్లకి సాయం చెయ్యండి.చలికాలం కదా మీరు దుప్పట్లు కప్పుకుని వెచ్చగా ఇంట్లో పడుకుంటున్నారు.ఆ ఆడది ఒంటిమీద బట్టలు కూడా సరిగ్గా లేకుండా ఈ చలిలో దోమలతో కుట్టించుకుంటూ ఆరుబయట తెల్లవార్లూ ఎలా ఉంటున్నదో ఆలోచించారా?మీరు బాగా తిని రోజుకు పదిసార్లు టీలో కాఫీలో తాగుతారు. ఆమెకు అసలు తిండి ఉందో లేదో ఎన్నాళ్ళ నుంచీ అలా పస్తుంటున్నదో ఆలోచించారా?మీకు నిజంగా లోకానికి మేలు చెయ్యాలని ఉంటె అలాంటి వారికి సాయం చెయ్యండి.అంతేగాని ఇలాంటి పిచ్చిపిచ్చి హోమాలు కాదు.

మీ హోమానికి అయ్యే ఖర్చుతో ఒక బీదవిద్యార్ధి చదువుకు సాయం చెయ్యండి. లేదా ఆకలితో ఉన్న ఒక దీనుడికి ఒక పూట అన్నం పెట్టండి.లేదా ఇంకా మీకు ఓపికుంటే అతని బ్రతుకు తెరువుకు మార్గం చూపండి.దేవుడు నిజంగా సంతోషిస్తాడు.' అన్నాను సీరియస్ గా.

'అది వారివారి ఖర్మ.మనమే చేస్తాం?' అన్నాడొకడు.

'మీ కోరికలు తీరకపోవడం కూడా మీ ఖర్మే అని దేవుడూ అనుకోవచ్చుగా.మీ హోమాలకు ఆశపడి మీకెందుకు ఆయన సాయం చెయ్యాలి?' అడిగాను.

అందరూ లేచి నిలబడ్డారు.

'సార్.మీకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వనని డైరెక్ట్ గా చెప్పండి.ఈ డొంక తిరుగుడు మాటలెందుకు?' అన్నాడొకడు సీరియస్ గా.

వాళ్ళ పౌరుషం చూచి నాకు చచ్చే నవ్వొచ్చింది.

'దీన్నే వీరముష్టి అంటారు.అడుక్కుండే వాళ్లకి అంత బలుపు ఉండకూడదు.' అన్నా నేనూ సీరియస్ గానే.

'పోదాంపదండి సార్.లక్ష్మీగణపతి గురించి ఈయనలాంటి వాళ్ళకెలా తెలుస్తుంది?' అన్నాడొక పిలకాయన నిర్లక్ష్యంగా చూస్తూ.

'బాబూ నీ వయసెంత?' అడిగాను పిలకని.

'నలభై ఒకటి' అన్నాడు.

"నీకు ఇంకా లాగూ సరిగ్గా కట్టుకోవడం రాకముందే నాకు లక్ష్మీగణపతి మంత్రానుష్టాన విధానం తెలుసు.ప్రపంచంలో నీతోనే అన్నీ పుట్టాయని అనుకోకు.అనుష్టానవిధానమే కాదు,కామ్యకర్మలలో ప్రయోగ ఉపసంహార విధానాలు కూడా తెలుసు." అంటూ "ఓం నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్య ప్రదాయినే..."అనే లక్ష్మీగణపతి శ్లోకం చదివాను.

వాళ్ళు బిత్తరపోయారు.

'మరి తెలిసి ఎందుకు మమ్మల్ని అడిగారు?పరీక్షా?' అన్నాడు వాళ్ళ లీడర్.

'పరీక్షేమీ లేదు.మీకు నిజంగా తెలుసో లేదో తెలుసుకుందామని అడిగాను. మీకు తెలీదని తెలిసిపోయింది.మీకే తెలీనిదాన్ని పట్టుకుని ఇంకొకరి దగ్గరకు మీరెలా వచ్చారు?' నేనూ ఎదురు ప్రశ్నించాను.

వాళ్ళందరూ మూకుమ్మడిగా నా గదిలోనుంచి బయటకు వెళ్ళిపోయారు.

లోకం అంతా ఇలాంటి దొంగలతో నిండి ఉన్నది.

ఏదో ఒక దేవతని పట్టుకోవడం,గుడో గోపురమో హోమమో ఏదో ఒక ప్రాజెక్ట్ పెట్టుకుని ఇక జనాల భయాన్నీ ఆశనీ ఆసరాగా తీసుకుని వాళ్ళను రెలిజియస్ బ్లాక్ మెయిల్ చేస్తూ పబ్బం గడుపుకునే ఇలాంటి వెధవలు ఎంతో మంది మన చుట్టూ ఉన్నారు.

చుట్టూ ఉన్న దీనుల బాధలు పట్టని మనం,మన బాధలు మాత్రం తీర్చమని దేవుడిని అడుగుతాం.దేవుడికి కూడా లంచం ఇవ్వబోతాం.ఆయనతో వ్యాపారం మొదలుపెడతాం.దేవుడేం పిచ్చివాడా మన దొంగపూజలకూ ట్రిక్కులకూ కరిగిపోవడానికి?నీ సాటిమనిషి బాధ నీకు పట్టనప్పుడు నీ బాధను దేవుడెందుకు పట్టించుకుంటాడు?

సాటి మనిషిలో దైవాన్ని చూడమని వివేకానందస్వామి అన్నారు.అదే అత్యుత్తమమైన పూజ అని ఆయన చెప్పారు.మనం ఆయన్ను మరచిపోయాం.ఆయనేం చెప్పారో మరచిపోయాం.సాటి మనిషిలో దైవాన్ని చూడలేని వాడు హోమగుండంలో పూజల్లో రాతి విగ్రహాలలో ఏం చూడగలడు?

ప్రసిద్ధ దేవాలయాలలో దర్శన సమయంలో పక్క మనిషిని చేతులతో కాళ్ళతో తోసేస్తూ తొక్కుతూ గర్భగుడిలోని విగ్రహాన్ని చూడాలని ఎగబడే అర్భకుల వంటి వారే వీళ్ళు కూడా.

మానవత్వమే లేనివారికి దైవం గురించి మాట్లాడే హక్కెక్కడిది?